Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 16


                            ముచ్చట్లు

    వివాహము మంగళాంతమైనది. ఆ నాలుగురోజులు సుబ్బారాయుడు గారు సేలం సుందరి, వెంకటస్వామి నాయుడు, టైగరు వరదాచారి, చౌడప్ప, బలరామయ్య, హరినాగభూషణం మొదలగు గొప్ప గాంధర్వ గాయకులను రప్పించినారు. ఆడపెండ్లివారు సంజీవరావు పిల్లనగ్రోవిపాట, సంగమేశ్వర శాస్త్రి వీణపాట పెట్టించినారు. ప్రసిద్ధికెక్కిన భాగవతులచే రాత్రులందు విడిదికాడ హరికథలు చెప్పించిరి.
    సదస్యమున కాంధ్రదేశములో పెన్న నుండి తెలివాహా నదివరకు గల ఘనపాఠులు, కావ్యవ్యాకరణ తీర్ధులు, ధర్మశాస్త్ర కోవిదులు, తార్కికులు, మహాపండితులెందరో విచ్చేసినారు. కవులు గాయకులూ విద్వత్ బృందములు కిక్కిరిసిపోయినారు. సుబ్బారాయుడుగారు కాసుతో మొదలిడి నూటపదహార్ల వివాహవృత్తాంతము లాంధ్రదేశ మంతట గథలుగా జెప్పికొనిరి.
    రెండువందల యేబదిమంది బ్రాహ్మణులు వంటలకు, నీరు తెచ్చుటకు, వడ్డనలకు నేర్పాటుచేయబడిరి. వంట సుబ్బయ్యగారి నలభీమపాకము జగత్ర్పసిద్ధము. ఆయన స్వయముగా మహానసాధిపత్యము వహించిరి. సమస్త పాకములలో షడ్రుచులలో నాయనిది అందెవేసిన చేయి. ఆయన వంకాయకూర వండి పోక పొత్తిలో తొమ్మిదిరోజులు నిలువవుంచి, పదవరోజున దీసినచో నప్పటికప్పుడు వండిన కూరవలె బొగ లెగయుచు రుచికరమై, చెక్కు చెదరక యుండునట. అన్నమునకు, గూరలకు చారు పులుసులకు వేరువేరు శాలలు. పిండివంటల పందిరి వేరు. పిండివంటలకు పాలఘాటు బ్రాహ్మణుల జట్టు వచ్చినది.
    స్త్రీలకు, పురుషులకు వేర్వేరు భోజనశాలలు, వడ్డనకై వేరువేరు జట్టులుండెను. సంబారములు జతనచేయుట కిరువదిమంది జమాజెట్టీ లేర్పరుచబడినారు. ఇదికాక ఘనబంధువులకు వేరు వేరు వంటలు విడిగా బచనము చేయబడును.
    పెరుగు బానలు నిలువ చేయుటకు కొన్ని గదులు. కూరగాయలకు కొన్ని గదులు. ప్రసిద్ధులు పదునైదుగురు తమలపాకు బీడాలు కట్టుచుండిరి.
    ఐదురోజులు రెండుపూటల మూడు నాలుగు పిండివంటలు, వేపుడు కూరలు, కలగల్పులు, పప్పులు, పచ్చళ్ళు, దప్పళములు_చేసిన రకములు చేయకుండ సమారాధనలు దివ్యముగ జరిగినవి.
    పెండ్లికి వచ్చిన చుట్టములకు, స్నేహితులకు, పండితులకు, నాశ్రితులకు సమస్త జనులకు నెచ్చటనేమియు కొఱత రాకుండా జమీందారుగారు వేయి కనులతో కనిపెట్టియుండిరి.
    నాల్గవనాటి రాత్రి పట్టణమంతయు నూరేగింపుటుత్సవము మహావైభవముగ జరిగినది.
    జమీందారుగారి ఊరేగింపు టేనుగుపై బంగారపుటంబారీ నమర్చి వధూవరుల నందాసీనులజేసి యూరేగించినారు. అలంకృతములగు నాలుగు మదగజములు, ఒంటెలు, ఒయ్యారపు నడకల తురగములు నాలుగు రణడోలు మేళములు, మైసూరు బ్యాండు, నౌబత్తు మేళములు, మోటారుకార్లు, చిత్ర విచిత్రములగు వేషములు, ఓడలు, బండ్లు మొదలగు వాహనములు, అయిదు వందల గ్యాసు దీపాలు, కొబ్బరికురిడీ దివిటీలు రెండువందలు, పూలచెట్లు, కాగితపు బుడ్ల దీపాల వరుసలతో, అఖండ వైభవముతో గనులపండువుగ నూరేగింపుటుత్సవము నడచినది. ఊరంతయు నూరేగింపులో నున్నది. మగపెండ్లి వారందరు మోటారుబండ్లమీద నూరేగిరి. ఆడపెండ్లివారెవ్వరును రాలేదు.
    వివాహమునకు నారాయణరావు స్నేహితులందరు నరుదెంచిరి. చాలా మందికి రాకపోకలకు ఖర్చులు నారాయణరావు పంపినాడు. ఆ యువకమండలి యంతయు పేకాటలతో, సిగరెట్ల కాల్పులతో, వివిధ వాదములతో, నవ్య కవిత్వపు సభలతో, బెండ్లి యైదుదినములు వినోదించిరి. జమీందారుగారు వారి విషయమై యాపరిచిత శ్రద్ధవహించి, వారికెప్పుడేమి కావలయునో అరయుచుండుటలో, సిగరెట్ల డబ్బా అందుబాటు చేయుటలో నేమరకయుండెను. నారాయణరావు తన మిత్రుల యవసరములకని పరమేశ్వరమూర్తి చేతిలోనిడిన నూరురూకలతో బనిలేకపోయినది. రాజారావు, పరమేశ్వరుడు, ఆలం, ఇంకను చాలామంది ఆంతరంగిక మిత్రులు కుటుంబములతో వచ్చిరి. స్నేహమండలికి వలయు సౌకర్యము లొనగూర్చుపని లక్ష్మీపతి వహించవలసి వచ్చినది. లక్ష్మీపతి యతిశ్రద్ధాళువై స్నేహబృందముచే లోటేమియు లేదనిపించినాడు.
    ప్రాణస్నేహితులు, కొంచెము దూరపుమిత్రులు, మరీ దూరపు హితులు, లోనగువారికి నారాయణరాయ లక్ష్మీపతులు దలలోని నాలుకవలె మెలంగిరి.
    ఒక స్నేహితుడు: పెండ్లికూతురు అప్సరసవలె వుందిరా!
    ఇంకొకడు: చాలా తెలివైన అమ్మాయటరా! ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు క్షుణ్ణంగా వచ్చునట. ఫిడేలు, వీణ పాటల్లో అపర శారదాదేవే అన్నారు.
    రాజా: అదిగాదోయి, నారాయణరావు అదృష్టవంతుడని అనవచ్చు నన్నమాట.
    వర: చాలా అదృష్టవంతుడని ఈ సభలో ఉపపాదన చేస్తున్నాను, సభవారు ఆమోదిస్తే ప్రకటనార్ధము పత్రికలకు పంపుతాను.
    లక్ష్మీ: జమిందారుగారి శ్రద్ధ చాలా విపరీతంగా వుందోయి.
    ఆలం: అరే లక్ష్మీపతీ! మనకి రైల్లో కనబడ్డప్పుడు ఇంత మంచివాడు అనుకోలేదు.
    రాజే: ఒరేయ్ నారాయణా! జమిందారుగారు నిన్ను పూర్తిగా ప్రేమించడం ప్రారంభించారు. ఆయన కళ్ళు నిన్ను తనివితీరా క్రోలుతున్నట్లు నీమీదే వుంటాయి.
    ఓ స్నేహితుడు: అసలు ప్రథమదృష్టి ప్రేమ వ్యాపారంలా కనబడుతూ వున్నదిరా!
    వేరొక మిత్రుడు: జమిందారు శాసనసభలో ఎప్పుడూ స్వరాజ్యపార్టీ తరఫున పనిచేస్తాడు. కాని ఆయనకు అసహాయోద్యమం ఇష్టం లేదంటారు.
    లక్ష్మీ: ఇష్టం లేకేమి ఆయన జైలుకు వెళ్ళకపోయినా, 1922 సంవత్సరంలో అందరూ జైలుకు వెళ్ళినప్పుడు శాసనసభలో అస్తమానం గవర్నమెంటును ఖైదీల విషయం ప్రశ్నలు వేస్తూనే వుండేవారు. ఒరే రాజేశ్వరుడు! మీ జస్టిసుపార్టీ పక్కలో బల్లెమై పానగల్లును దేకించేసేవాడు.
    నారా: బావా! పానగల్లును దేకించగల మగవాడు ఇంతవరకూ పుట్టలేదు. ఇక పుట్టబోడు. అతనికి అతనే సాటి. ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయంలో ఆంధ్ర రాజధాని విషయంలో అతనికి ఉన్న పట్టుదల, దీక్ష ఇంకోడికి లేదు. ఆంధ్రాభిమానం ఇంతా, అంతా అని కాదు. పైగా తనకు పార్టీ మాటేలేదు. పైకి ఏమన్నా, క్రియలో అందరియందూ బ్రాహ్మణుడయ్యేది, బ్రాహ్మణేతరుడయ్యేది సమానప్రేమ ఆయనకు.
    రాజే: నారాయణరావుకూ జై! మా పార్టీ మర్యాదంతా కాపాడావురా.
    నారా: అవునురా, స్వరాజ్య పార్టీ వాళ్లు శాసనసభలకు వెళ్ళి చేసినపని ఏమిటిరా?
    పర: ఒరే అలాంటే నేను ఒప్పుకోను. గవర్నమెంటు వారి మానస పుత్రులమానుకొని, దేశద్రోహులై దేశంకోసం మనవాళ్ళు ఖైదులకు వెళ్ళి పడరాని పాట్లు పడుతోంటే చీమైనా కుట్టకుండా, లొల్లాయికబుర్లు చెపుతూ, ఉద్యోగాల కోసం ఏడ్చి నిద్రపోతూ, కాంగ్రెసును ఛండాలపు తిట్లు తిట్టిన మహానుభావులు కాదూ ఈ జస్టిసుపార్టీ సమరథులు?

 Previous Page Next Page