Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 15

 

    "మూర్ఖుడివి నువు! నీకు అర్ధం కాదు. పోనీ, నేను చెప్పినట్లు వినవు. అసలతన్ని ఎందుకు తీసుకోచ్చావ్?" రవికి కూడా చాలా కోపం వచ్చింది. నిష్కారణంగా వేలకి వేలు డబ్బొచ్చే వృత్తి వదిలేసినందుకు.
    "అర్ధం కాకపోవటమేం? అన్నీ అర్ధమవుతూనే వున్నాయి నువు పెద్ద భక్తురాలివి అయిపోతున్నావు పరమ పతివ్రతా శిరోమణిగా మరిపోదామని చూస్తున్నావు. నీవు పూజలు చేస్తే భగవంతుడు నీ పాపాలన్నీ కడిగేస్తాడా? నరకంలో అగ్ని జ్వాలల మధ్య మడ్చాడానికి బదులుగా సరాసరి స్వర్గంలోకి తీసుకుపోతాడా? నువిప్పుడు పతివ్రతా శిరోమణిగా మారినంత మాత్రాన నీకు మొగుడోస్తాడా? నీ గతాన్ని ఎవరు మరచి పోతారు! ఇంకా సినిమా స్టార్ గా ఉంటె నాన్నా నీ సంపాదనకు ఆశపడి ఎవరో ఒకరు పెళ్ళి చేసుకుంటారు."
    వారిజ మనసు ఈవిషయానికి కుతకుత వుడికింది.
    "నరక జాలలకు భయపడి నేను భగవంతుడుని పూజించటం లేదు. నా చుట్టుపక్కల నున్న మీరంతా నా కాళ్ళ కింద పెడుతోన్న మంటలకు ఏ నరక జాలాలు సాటిరావు. "నా చుట్టూ పక్కల వారి క్షద్రతాలకు చిరాకు పడకుండా అందరినీ ప్రేమించగలిగే శక్తి నియ్యి భగవంతుడా!" అని ప్రార్ధిస్తున్నాను. లోకంలో మంచివాళ్ళు ఎందరో వున్నారు కనీసం మంచిని అర్ధం చేసుకుని గౌరవించగలిగే సంస్కారాన్నియ్యమని ప్రార్ధిస్తున్నాను. వేగిపోతున్న నామనసుకు తప్పకుండా నరకంలోకి వెళ్ళి శిక్షలన్నీ అనుభవిస్తాను ఈ లోకంలో ఇంత అనుభవించిన నాకదో లెక్కా!"
    "నువ్వన్నట్లు నాకు మొగుడు కావాలనుకుంటే సినిమా రంగంలోనే వుండేదాన్ని నాకిక ఈ జీవితంలో మొగుడు అక్కర్లేదని నిర్ణయించుకున్నాను గనుకనే పవిత్రంగా బ్రతకటానికి నిర్ణయించుకున్నాను నన్నంటిన మాలిన్యం నన్ను వదలదని తెలుసు. కానీ నిష్కారణంగా నన్ను నేను పెట్టుకుంటున్న చిత్ర హింస నుంచి విముక్తి లభించింది. అది చాలు నాకు! నేను పవిత్రురాలిని ఎవరూ అనుకోనక్కర్లేదు.
    ఒకవేళ ఎవరైనా మూర్ఖులు అనుకున్నా నేను పవిత్రురాలిని కానని నేనే చెప్పుకుంటాను. కాని, నా అన్నవయినందుకు నన్ను రక్షించడానికి మారుగా స్వార్ధం కోసం నన్ను మరింత కూపంలోకి త్రోయడానికి ప్రయత్నిస్తున్నావు . మనసన్నది వుంటే సిగ్గుపడు."  లోపలి గదిలోకి వెళ్ళిపోయి దభాలున తలుపు వేసేసుకుంది వారిజ.


                                                             -----------

    కల్యాణికి నలభై రెండేళ్ళు నిండినా ఇంకా యౌవనం ఆవిడను వదలలేదు. శంకరానికి తమలపాకుల చిలకలు చుట్టి యిస్తూ "ఒక్కసారి బెజవాడ వెళ్ళి రావాలని వుందండి" అంది. శంకరం "ఏం? గాలి అటు మళ్ళింది" అన్నాడు.
    "ఆనాడు నాకు కనీసం తాంబూల మైన యివకుండా అవమానించింది పార్వతి. ఇప్పుడొక్కసారి వెళ్లి ఆవిడను చూడాలని వుంది" శంకరం ముఖం సడలిపోయింది. "ఆవిడ ఏదో మూర్ఖంగా ప్రవర్తిస్తే చదువుకున్న దానివి నువు కూడా తిప్పి కొట్టాలా? వాళ్ళు పూర్తిగా చితికి పోయారని విన్నాను. సత్యనారాయణ గారికి తాగుడు తప్ప ఇంకేం తెలియడం లేదట! చచ్చిన పాముని ఇంకా కొట్టడం దేనికి?"
    "నేనక్కడకు వెళ్ళి పాత సంగతులు తలపోస్తాననుకున్నారా? ఆమాత్రం మానవత్వం లేదూ! ఊరికే ఒకసారి చూడాలని కుతూహలం! ఆ అహంకారం ఇప్పటికి ఏ పాళ్ళల్లో వుందో చూద్దామని ......."
    "నీ ఇష్టం - అన్నీ తెలిసిందానివి, నీకు నేను చెప్పాలా?"
    "బాగుందండీ ! మీ ఇష్టం లేకుండా నేనేం చేశాను?"
    "ఏం చెయ్యలేదు? నీ యిష్టాలే నా యిష్టాలుగా మార్చెస్తున్నావు....అంతే!" నవింది కళ్యాణి.
    "పోనీ. ఇందువల్ల మీరు నష్ట పోయిందేమిటో చెప్పండి.
    "నష్టపోయానని అంటున్నావా? ప్లీడర్ గుమస్తాని. కొడుకుని చదివించుకున్నాను. కూతురికి లక్షణంగా పెళ్ళి చేశాను. కొంత ఆస్తి కూడా సంపాదించుకున్నాను. యిదంతా మీ మంత్రంగా ఫలితమేనని మరచిపోగలనా?"
    "చాల్లెండి - పొగడ్త . మీ సహకారం లేకుండా నేనేం సాధించగలను.? ఏ సంసారంలో భార్య భర్తల మధ్య అనురాగమూ, పరస్పరం అర్ధం చేసుకోగలిగినే శక్తి వుంటాయో, ఆ సంసారం అన్నీ విధాల వృద్దిలో కొస్తుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యంలోపించినా సంసారాలు వృద్దిలోకి రావటం ఆరదు. ఈ అభివృద్ధి మన యిద్దరి కృషి ఫలితమూ!"
    "ధన్యోస్మి - నాకూ భాగం యిస్తానంటుంటే నాదెం పోయింది యిదంతా నా ప్రయోజకతమే అని మురిసి పోతాను."
    "యిదంతా మామూలే కాని, బెజవాడ ఎప్పుడేల్దాం?"
    "నీ యిష్టం రేపు వెళదాం."
    "రేపే వెళదాం."
    ఆ మరునాడే కళ్యాణి, శంకరం బయలుదేరి బెజవాడ చేరి ఒక బంధువులింట్లో దిగారు. భోజనం చేసి, ప్రయాణపు బడలిక తీర్చుకుని , ముఖం కడుక్కుని గుంటూరు నేతి చీర కట్టుకుని బయలు దేరింది కళ్యాణి.
    "ఆవిడకు నీ ఐశ్వర్యం చూపించాలని బయలు దేరుతూ ఈ నూలు చీర కట్టుకున్నావెం? నీ కొడుకు కొనిచ్చిన ధర్మవరం చీర కట్టుకో!" ఆమె మూతి ముడుచుకుంది.
    "అదిగో ! అలాంటి మాటలే అనొద్దన్నాను. నా ఐశ్వర్యం చూపించడానికి వెళ్ళడం లేదు. ఆవిడా అహంకారం ఎంతలో ఉందొ చూడటానికి వెళుతున్నాను."
    "సరే! జాగ్రత్తగా కొలిచి నాకు చెప్పు" బద్దకంగా పడుకున్నాడు శంకరం.
    "నేను సాయంత్రం వెళ్లి సత్యనారాయణ గారిని చూస్తాను - ఆయనను కలుసుకోవాలంటే ఎలాగో వుంది !" ఒక్క నోట్టుర్పుండిచాడు శంకరం.
    రిక్షాలో బయలుదేరింది కళ్యాణి.
    రిక్షాలోంఛి దిగుతోన్న కళ్యాణి ని చూసి పార్వతి నిర్ఘాంతపోయింది.
    పార్వతిని చూసి కళ్యాణి అంతే విబ్రాంతి పొందింది.
    ఇంచుమించు నవవయస్కులు కళ్యాణి , పార్వతి.
    పార్వతి ముడి ముగ్గులా తయారయింది. శరీరం వణుకుతోంది. - చర్మం ముడతలు పడిపోయింది. కళ్ళు గుంటలు పడ్డాయి.
    "కళ్యాణి! నువేనా!" సంబ్రమంగా అంది పార్వతి. వణికే శరీరంతో తూలుకుంటూ వచ్చి ఆమె రెండు చేతులు పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది.
    "నువేనా కళ్యాణి! ఎన్నాళ్ళకు చూశాను నిన్ను? కూర్చో! కూర్చో! ఒకప్పుడు పెద్ద ప్లీడర్ గారి భార్యనని గర్వంతో కూర్చునేందుకు నీకు సోఫా చూపించలేదు. ఈనాడు చూపిద్దమన్నా చిరుగు చాప తప్ప ఏం లేదు మా ఇంట్లో !" కళ్యాణి కదిలిపోయింది.
    "ఫర్వాలేదు పార్వతి! ఎక్కడయితేనేం?" అంటూనే చాప మీద కూర్చుంది.
    "మేం ఇలా చితికిపోయిన తర్వాత ఎవరూ మాకేసి కన్నెత్తి కూడా చూడలేదు. నువ్వు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు నిజంగా నీది చాలా దొడ్డ మనసు కళ్యాణి!"
    ఆప్యాయంగా అంది పార్వతి. కళ్యాణి సిగ్గుపడింది. పార్వతి పొగడ్తలకి కాదు. తన అంతరంగాన్ని తలచుకుని.
    "చాలా సంతోషం కళ్యాణి! లక్ష్మి దేవి లావున్నావు. యెంత మంది పిల్లలు? ఏం చేస్తున్నారు?" పార్వతి కంఠంలో ఆదరం, ఆనందం తొణికిసలాడాయి. ఆమె మనసు కూడా అర్ధ్రమయిపోయింది.
    "ఒక కొడుకూ, కూతురు. కూతురి పెళ్ళయి పోయింది. అల్లుడు లెక్చరర్! కొడుకు ఎగ్రికల్చర్ బి.ఎస్ సి పాసయ్యాడు. ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేక వాళ్ళ నాన్న చేత నాలుగెకరాలు పొలం కొనిపించి, ఏవేవో కొత్త పద్దతులతో సంత వ్యవసాయం సాగిస్తున్నాడు. ఉద్యోగం కంటే ఇదే దీర్ఘంగా నిట్టూర్చి అంది పార్వతి.
    "అదృష్టవంతురాలివి కళ్యాణి! నా సంగతి చూడు. పెద్దవాడు ఆగమ్మ కాకిలా తయారయ్యాడు. ముగ్గురాడ పిల్లల పెళ్ళిళ్ళు చేశాం. ఇంకా పుట్టింటి వారు అదీ, ఇదీ పెట్టలేదని అమ్మాయిలను అత్తగారు సాధిస్తూనే ఉన్నారట. రెండో కొడుకు రోగంతో చచ్చిపోయాడు. ఇంక అయిదో అమ్మాయుంది పెళ్ళికి, యెలా చేస్తామో!"
    "నాలుగో అమ్మాయి?"
    "చచ్చిపోయింది."
    పార్వతి గొంతు వణికింది దుఖంతో అనుకోని జాలిపడింది కళ్యాణి.
    "దేనికైనా పెట్టి పుట్టాలి' బాధగా అంది పార్వతి.
    'అంతా చేతులారా చేసుకుని విధిని నిందించటం దేనికి పార్వతి?"
    "చేతులారా చేసుకున్నదా?" ఆశ్చర్యంగా అంది పార్వతి.
    "ఒక రకంగా అంతే! ఏడాది కొకరు చొప్పున పిల్లల్ని కనేదానివి - నీ ఆరోగ్యం దెబ్బతింది. చికాకులూ, ఎక్కువై పోయాయి మీవారిని కాస్త కనిపెట్టి వుండే అవకాశం లేకపోయింది. అయన వ్యసనాలకు బానిస అయి పోయారు. ఇటు నువ్వు లేనిపోనీ దర్జాలకు పోయి, వున్నదంతా ఊడ్చేశావు చూడు - మూడు వేలు బేంక్ లో పడందే రామచంద్రను కనలేదు. రామచంద్రని కన్న మూడేళ్ళకి కాని సుశీలను కనలేదు. లేనీపోనీ బదాయిలకి నేను పోలేదు. నా పిల్లల్ని పోనియ్యలేదు. నేనే స్వయంగా వాళ్ళ చదువు సంధ్యలు చూసుకున్నాను వాళ్ళు పైకొచ్చారు. ఇదంతా స్వయం కృతం కాకపోతే ఏమిటీ?" దీర్ఘంగా నిట్టూర్చింది పార్వతి.

 Previous Page Next Page