Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 15


    ఆ సాయంత్రం ఒక్కడూ అలా పామ్ బీచ్ కేసి షికారు వెళ్ళాడు. స్వచ్చంగా, అందంగా కొట్టుకువచ్చే సముద్రతరంగాలు, సూర్యాస్తమయశోణిమ సౌందర్యం అతడికి అజ్ఞాతమైన ఉత్తేజాన్నిచ్చాయి. అతను ఇసుకలో కూర్చున్నాడు ఒంటరిగా. కాస్త దూరంలో జాలరివాళ్లు చేపలు పడుతున్నారు వలవేసి. సముద్రమధ్యాన నలుసుల్లాగ రెండుమూడు పడవలు కదిలిపోతున్నాయి. నీలం కురుస్తున్నట్లు పైన ఆకాశం. వెలుగు చీకట్లలో మూసుకుపోతూ దూరంగా క్షితిజం.

 

    ప్రకృతి ఇది.

 

    సహజ జీవితమిది. నిర్మలత్వం మూర్తీభవించినట్లుంది. ఇందులో నివశించటానికి తనకు చోటులేదా? పిరికివానిగా పారిపోవాలా?

 

    "లేదు లేదు" అని సముద్ర గర్భంనుంచి ఏదో అజ్ఞాతశక్తి అరచినట్లయింది.

 

    "నా హృదయం" అనుకున్నాడు.

 

    అతని కళ్ళు వింతకాంతిలో మెరిశాయి. ముఖమంతా ఛరాలుమని రక్తం ప్రవహించినట్లయింది. శరీరమంతా కొత్త అనుభూతితో స్పందించింది.

 

    అతనికేదో తెగింపు వచ్చింది.

 

    "ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. నాలోనే దాచుకోవాలి. నేను చదువు మానకూడదు. నేను కృశించిపోకూడదు. నలిగి నశించి పోకూడదు" అని అతను దృఢనిశ్చయుడయినాడు.

 

    చీకటి తెరలు అలముకున్నాక లేచి హాస్టలువైపు దారితీశాడు.


                                       *  *  *


    తాను హాస్టలులో వుండటం చాలా ఇబ్బంది అనుకున్నాడు సుందరం. తను జబ్బు మనిషి. ప్రతి విషయంలోనూ యెంతో జాగ్రత్త తీసుకుని వుండాల్సినవాడు ఉదయం లేచినప్పటినుంచీ యెంతో కార్యక్రమం వుంటుంది. అందుకని ఊళ్ళోనే ఓ యింట్లో గది అద్దెకి తీసుకుని ఓరోజు తాను హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు రూంమేట్ కు చెప్పాడు హటాత్తుగా.

 

    "నాకు విడిగా వుండాలని వుంది. అదీగాక నాకు రోజూ బజారు పోవల్సి వస్తూంది. సాయంత్రాలు బస్సులో యూనివర్శిటీనుంచి అక్కడికి పోయి రావటం ఇబ్బందిగా వుంది. ఊళ్ళో వుంటే రోజూ ప్రొద్దున్న ఇక్కడికి బస్ లో వచ్చి సాయంత్రం వెళ్లిపోతూ వుండొచ్చు. మళ్ళీ మళ్ళీ బస్సు ఎక్కేపని వుండదు. అంతేగాక నాకు ఎప్పుడూ ఒకచోటే వుంటే యిష్టం వుండదు" అన్నాడు సుందరం.

 

    రూంమేట్ మాట్లాడలేదు.

 

    సుందరం ఊళ్ళో తీసుకున్న గదికి వచ్చి చేరాడు. అతనికి బలహీనంగా వుండటం ఏమీ తగ్గలేదు. తనకు సరిగ్గా అవసరమైన దాని కన్న రవ్వంతకూడా అలసట చెందకూడదనుకున్నాడు. మామూలుగా ఆరుగంటలకల్లా నిద్ర లేచేవాడు. కాఫీ పూర్తిగా మానేశాడు. ప్రొద్దున్నే కోడిగ్రుడ్డూ, పాలూ తీసుకునేవాడు. ఆ అన్నంకూడా హోటలునుంచి కేరియర్ తెప్పించుకునేవాడు. అత్యవసరమైతేనేగాని మంచంమీదనుంచి దిగేవాడుకాదు. బస్ స్టాండ్ దాకా రిక్షాలో వెళ్ళేవాడు. అతను నడిచేదంతా కాలేజీ పరిసరాల్లోనే.

 

    కాని ప్రాక్టికల్స్ చేస్తున్నా, థీరీక్లాస్ శ్రద్ధ వుంచి వింటున్నా చాలా శ్రమ పడాల్సి వచ్చేది. గదిలో రాత్రిళ్ళు చదువుకునేటప్పుడు యెంతో కష్టంగా వుండేది. ఓ అరగంటసేపు చదివేసరికి శక్తి అంతా వుడిగిపోయినట్లుగా నిస్త్రాణగా వుండేది. ఓపిక వున్నంతవరకే చదివి పడుకునేవాడు. మొదటి రోజుల్లో నిద్రపట్టేదికాదు. మనసు కలతగా వుండేది. మెల్లిగా అలవాటు చేసుకున్నాడు.

 

    కాని మానసికమైన సంఘర్షణ ఎక్కువగా వుండేది. ఏ కారణం చేతనయినా దినచర్యలలో ఒకింత లోపం జరిగినా, పెద్ద అపరాధం జరిగిపోయినట్లు యాతనగా వుండి, అస్థిమితంగా, యేదో అవరోధం కలిగినట్లుగా ఫీలయ్యేవాడు.

 

    మెట్లు ఎక్కేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాల్సి వచ్చేది. అతిమెల్లిగా అడుగుతీసి అడుగువేస్తున్నట్లుగా నడిచేవాడు.

 

    ఓరోజు మృదులంగా మెట్లు ఎక్కి వస్తున్నాడు. ఇంతలో పైనుండి అతని స్నేహితుడు ఒకడు దిగివస్తూ సుందరాన్ని చూసి గట్టిగా నవ్వి "ఏమిటోయ్ అంత సుతారంగా నడుస్తావ్ ఎప్పుడూనూ, పైగా క్రికెట్ ప్లేయర్ వి కూడానూ. టి.బి. పేషెంటులాగ యీ వీక్ నెస్ ఏమిటీ?" అనేశాడు.

 

    సుందరానికి గుండె ఝల్లుమంది. తన ప్రవర్తన అంత ఎబ్బెట్టుగా వున్నదా? తను జాగ్రత్తగా వున్నట్లు లోకానికి కనబడకూడదనుకున్నాడు.

 

    అప్పటినుంచీ గబగబా ఎక్కి దిగుతూండేవాడు. చూసేవాళ్లకి చాలా చలాకీగా వున్నట్లు కనిపించాలని తాపత్రయపడేవాడు. అట్లా గబగబా నడిచినప్పుడు గుండె వడివడిగా కొట్టుకునేది. ముచ్చెమటలు పోసేవి. ఇట్టే అలసిపోయేవాడు. ఓ మూలకిపోయి ఎవరూ చూడకుండా చెమట తుడుచుకొని గోడకు ఆనుకుని విశ్రాంతి తీసుకునేవాడు. తానలా తొందరపడకూడదనుకునేవాడు.

 

    కాని ఎంతకూడదనుకున్నా ఒక్కోసారి కొన్నికొన్ని తప్పించుకోవటం దుస్సాధ్యం. ఒకరోజు అతని మిత్రులంతా వచ్చి రెండురోజుల్లో జరగబోయే క్రికెట్ మేచ్ లో పాల్గొనాలన్నారు.

 

    "నాకు వంట్లో బాగులేదు ఆడలే"నన్నాడు సుందరం.

 

    "ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ వి. నువ్వు లేకపోతే ఎలాగునయ్యా మహానుభావా? మన టీమ్ విజయమంతా నీమీదనే ఆధారపడి వుంది" అన్నారు వాళ్ళు.

 

    "నన్ను క్షమించండి. నాకు శక్తి లేకపోతే ఎలా ఆడేది?" అని ఇంకా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు సుందరం.

 

    "ఏమిటి నీ వంట్లో బాగోలేనిది? బయటకు బాగానే కనిపిస్తున్నావే. అదేం లాభంలేదు. నువ్వొచ్చేదాకా మేం కదలం" అని పంతంపట్టి కూర్చున్నారు వాళ్ళు.

 

    వాళ్లు అన్నది నిజమే. శరీరాన్ని గురించి అమిత శ్రద్ధ వహించటం వలన అతనిప్పుడు బయటకు ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ముఖంలో కళ వచ్చింది. ఏ ఉపాయంచెప్పి తప్పించుకోవాలో అతనికి పాలుపోలేదు. అవతల వాళ్లు మొండికెత్తారయ్యె. చివరకు అంగీకరించక తప్పలేదు. తన పరిస్థితికి అతనికి ఏడుపు వచ్చింది. ఏమి చెయ్యగలడు? ఏమని చెప్పగలడు?

 

    క్రికెట్ మేచ్ మీదకు అడుగు పెడుతున్నంతవరకూ అతను మనసులో యమ చెరననుభవిస్తూనే వున్నాడు. డాక్టర్ మాట ఇప్పటికే తను కాదన్నాడు. విధికి ఎదురుతిరిగాడు. హడలిపోయి, ఇంటికి పరిగెత్తకుండా ధైర్యంగా నిలబడి కర్మతో పోరాడుతున్నాడు. ఒక్క నిముషం సంఘర్షణ లేకుండా లేదు. శాంతి నశించింది. అయినా తను కృతకృత్యుడౌతున్నాడు. కొంతవరకయినా సాధించగలుగుతున్నాడు. ఇప్పుడు టెంపరేచర్ రావటంలేదు. నీరసం చాలావరకూ తగ్గింది. కొంచెం వెయిట్ పెరిగినట్లుగా వుంది శరీరం. డాక్టరు సహాయంలేకుండా సొంతంగా ఇన్స్పిరేషన్ తో ముందుకు పోగలుగుతున్నాడు.

 Previous Page Next Page