"బాగుంది. అయితే నాలాగే మీరూ ఓ 'అన్ వాంటెడ్ మ్యారేజ్' నుంచి తప్పించుకున్నారన్న మాట."
సావిత్రి నవ్వింది.
"ఇదిగోండి...ఈవ్స్ వీక్లీ...మీకోసం తెచ్చాను" వీక్లీ అందించి అక్కడే నిలబడ్డాడు.
"కూర్చోండి. నిలబడే ఉన్నారేం?"
అతను కూర్చున్నాడు. "మీరు గమనించారో లేదో, ఒంటరితనం ఉంది చూశారూ... మహా బోరింగ్ అనుకోండి. ఈ వెధవ సిటీలో మంచి కంపెనీయే దొరకదు. ఎవడికివాడు ఆఫీసవగానే ఇంటికి పరుగెత్తికెళ్ళి పెళ్ళాం ఎదురుగ్గా కూర్చోటమే..."
సావిత్రి నవ్వేసింది.
"రేపు పెళ్ళయితే మీరూ అంతేగా?"
"నోనో...అందుకే నేను వర్కింగ్ గాళ్ ని చేసుకోదల్చుకున్నాను. ఇద్దరం ఆఫీసవగానే ఎక్కడోచోట కలుసుకుని రాత్రి పదింటివరకూ తిరిగి అప్పుడు ఇల్లు చేరుకోవచ్చు. అంతేగాని ఎంతసేపూ నాలుగు గోడలమధ్య కూర్చోటం కూడా ఒక జీవితమేనా?"
సావిత్రి మళ్ళీ ఆలోచనల్లో తేలిపోయింది.
అతని అభిప్రాయం ఏమిటి? వర్కింగ్ గాళ్ ని చేసుకుంటాననటం...తనను మనసులో పెట్టుకునేనా? ఒకవేళ అతనికా ఉద్దేశ్యం ఉన్నట్లయితే తనకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది?
"మిమ్మల్నో విషయం అడగాలనుకుంటున్నాను. మీరేమీ అనుకోకపోతే..."అన్నాడతను.
"అడగండి...అనుకునేందుకేముందీ?"
"మీరు పెళ్ళెందుకు చేసుకోవటం లేదు? మీలాంటి అందమయిన అమ్మాయి 'ఊ' అనగానే కోటిమంది గెంతుకొస్తారు కదా..."
"మీరంతగా పొగడక్కరలేదులెండి" నవ్వుతూ అంది.
"పొగడ్తా! నేనింకా అసలు నిజాన్ని చాలావరకు సప్రెస్ చేశాను. నిజం చెప్పాలంటే మీ అంత అందమయిన అమ్మాయిని నేనింతవరకూ కలుసుకోలేదు..."
సావిత్రికి సిగ్గుగా ఉంది. ఆనందంగానూ ఉంది.
తనకు తెలుసు. తన అందం సాధారణమయినది కాదు. అందుకే కాలేజీ రోజుల్లోనే మదన్ తనను పెళ్ళిచేసుకోవడానికి తహ తహ లాడాడు.
తను రిజర్వ్ డ్ గా ఉండబట్టిగానీ లేకపోతే ఎంతమంది ప్రపోజ్ చేసేవారో!
మర్నాడు తెల్లవారుజామునే తలుపుతట్టిన చప్పుడవటంతో లేచి తలుపు తెరిచిందామె.
ఎదురుగ్గా విశ్వేశ్వర్రావ్ నిలబడి ఉన్నాడు.
"ఏమిటి నాన్నా...ఇంత సడన్ గా వచ్చారు... అడిగింది సావిత్రి.
"మరేం లేదమ్మా! ఇక్కడ ఫిలిం ఫెస్టివల్ కదా రేపట్నుంచీ హైద్రాబాద్ లో ఇలాంటి అవకాశం చాలా ఎక్కువగా వస్తుందని వచ్చేశాను."
సావిత్రి అతికష్టం మీద కోపం అణచుకుంది.
ఆయనక్కావలసింది అలా సరదాగా గడిపేసే జీవితమే. బరువూ బాధ్యతా ఇవేమీ అక్కరలేదు.
ఇంటిముందు ముగ్గు వేస్తోంటే శ్రీరామ్ బ్రష్ చేసుకుంటూ బయటికొచ్చాడు.
"ఎవరో గెస్ట్ వచ్చినట్లున్నారు కదండీ!"
"మా ఫాదర్..."
"ఐసీ! అయితే నేను త్వరగా వెళ్ళి మిల్క్ పాకెట్ తెచ్చిస్తాను..."
"ఎందుకులెండి__నేను తెచ్చుకుంటాను కదా?"
"ఫర్లేదండీ...ఇందులో పెద్ద ఇదేముందనీ..."
కాసేపట్లో పాల పాకెట్ తెచ్చి అందించాడతను.
సావిత్రి వంట చేస్తూంటే విశ్వేశ్వర్రావ్ దగ్గరే కూర్చుని మాట్లాడసాగాడు.
"నీదే నాకు పెద్ద వర్రీ అయిపోయిందమ్మా! మొన్నో సంబంధం చూశాను. అంతా సెటిలయిపోయిందనే అనుకున్నాము. నీ ఫోటో నచ్చిందన్నారు. ఉద్యోగమూ, వయసూ, చదువూ అన్నీ సరిపోయాయి తీరా ఆఖర్లో వద్దనేశారు. ఇద్దరు చెల్లెళ్ళకూ ముందే పెళ్ళిళ్ళు ఎందుకయ్యాయి, ఆమెకెందుకవలేదు అంటూ యక్ష ప్రశ్నలు...నేను చెప్పే ఎక్సప్లనేషన్ వాళ్ళకు నచ్చలేదు."
సావిత్రి చిరాకుగా ఉంది...తండ్రి మాటలు వినకుండా అక్కడినుంచి పారిపోవాలని వుంది. ఒకసారి రెండుసార్లో కాదు.
ఎన్నోసార్లు ఇలాంటి మాటలు చెప్పాడు. ఎన్నో సంబంధాల గురించి! అన్నీ ఆఖరి నిమిషంలో ఫెయిలయినట్టు. ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తే...
ఇద్దరికీ భోజనం వడ్డించిందామె.
"చూడమ్మా! నా దగ్గర ప్రస్తుతం డబ్బేమీ లేదు. ఓ అయిదు వందలు ఇస్తే...సీజన్ టికెట్స్ కొనుక్కుంటాను..."
సావిత్రికి కోపం ఆగలేదు.
తన పర్స్ లో నుంచి అయిదు వందలు తీసి అతనికిచ్చింది.
"నేను వెళుతున్నానమ్మా! ఏర్పాట్లన్నీ చేసుకువస్తాను. అన్నట్లు బయటే భోజనం చేస్తాను...నాకోసం వంట చేయక్కర్లేదు."
అతను వెళ్ళిపోయాడు.
సావిత్రి ఆఫీస్ కి బయల్దేరింది. శ్రీరామ్ కూడా వెనుకే వచ్చి కలుసుకున్నాడు.
"ఏదయినా పనిమీద వచ్చారా మీ ఫాదర్...? అడిగాడతను.