సావిత్రికి అర్ధంకాలేదు.
"వారపత్రికలుంటే ఆశ్చర్యమేముంది?"
"బాగుంది అవి ఎలాంటి వారపత్రికలనుకున్నారు? అంతా సెక్స్ మయం! నాలుగు సీరియల్స్ లో రెండింటినిండా బూతు" ఉంటుంది. డాక్టర్ సమాధానాలు కూడా మొత్తం స్త్రీ, పురుష సంబంధం గురించే, కథల్లో ఒకటి పూర్తి సెక్స్ కామసూత్రాల గురించి డిస్కషన్__క్విజ్...హారిబుల్ స్టఫ్ అనుకోండి..."
"ఇద్దరూ బస్ స్టాప్ కి వచ్చేశారు."
"నేనా అమ్మాయినేమీ తప్పుపట్టటంలేదు, కానీ హిపోక్రసీ..."
బస్ వచ్చింది.
"ఓ కే...సాయంత్రం కలుసుకుంటాను" అనేసి బస్ ఎక్కాడతను.
సాయంత్రం ఎంత త్వరగా అవుతుందా అని ఎదురుచూస్తూ గడిపిందామె.
కోఠీలో మామూలుగా హోటల్లో కెళుతుంటే అతను మెట్ల దగ్గరే కనిపించాడు.
"మీరు వస్తారనే ఎదుర్చూస్తున్నాను" అన్నాడు నవ్వుతూ.
ఇద్దరూ ఓ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అతను మాట్లాడటం మొదలుపెట్టాడు మళ్ళీ ఉత్సాహంగా, హుందాగా__
అతని మాటలు వింటున్నా మధ్య మధ్యలో ఆలోచనలు తన గురించే దూసుకొస్తున్నాయి. ఎందుకు అంత ప్రోత్సహిస్తోంది తను! ఎందుకు పరిచయాన్ని పెంచుకుంటోంది? అతని గురించి ఏమీ తెలీకుండానే, తెలుసుకోకుండానే ఎందుకు చొరవ తీసుకుంటోంది?
హోటల్ నుంచి బయటికొచ్చేప్పుడు వెనక్కు చూసిందామె! తను కూర్చునే కార్నర్ సీట్ ఖాళీగా బోసిగా మిగిలిపోయింది.
దానిముందు టేబుల్ దగ్గర ఆ యువతీ యువకుడు తదేకంగా ఒకరివంక ఒకరు చూసుకుంటూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. ఉండుండి ఆమె చేతిని తన చేతితో స్పృశిస్తున్నాడతను.
బస్ లో ఇల్లు చేరుకున్నారు.
తను వంట చేసుకుంటూంటే మోహన్రావ్ వచ్చాడు. సావిత్రికి అతనిని చూడగానే ఎక్కడలేని చిరాకూ వచ్చింది.
"ఏమిటి?" అంది గడపలోనే నిలబడి.
"మీరెలా వున్నారో చూద్దామని! మీకు మామీద లేకపోయినా మీ మంచి చెడ్డలు తెలుసుకోవటం నా డ్యూటీ!"
"నా సంగతి ఎవరూ ఏమీ పట్టించుకోనక్కరలేదు.
"సరే_అలాగంటే ఇంక ఇక్కడికొచ్చే అవసరమే ఉండదు" అంటూ వెడ్డింగ్ కార్డు తీసి ఆమెకిచ్చాడు.
"ఎల్లుండి నా మ్యారేజ్! అమ్మాయి గ్రాడ్యుయేట్. జాబ్ చేస్తోంది...కట్నం కూడా ఇస్తున్నారు..." గర్వంగా చెప్పాడతను.
సావిత్రి కార్డు తీసుకుని చూసింది.
"హారతి, బి.కామ్" అని వుంది. ఆ అమ్మాయి పేరు.
"నేను గతిలేక మీ వెంబడి పడ్డాననుకున్నారు మీరు..."
"అవన్నీ నాకనవసరమయిన విషయాలు" కోపంగా అందామె.
"మంచినీళ్ళిస్తావా?" అడిగాడతను.
సావిత్రి లోపలికెళ్ళింది. అతను ఇంట్లోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
మంచినీళ్ళు తాగాక సావిత్రి సమీపంగా వచ్చి హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. సావిత్రి నిర్ఘాంతపోయింది__అతనంత ధైర్యం చేస్తాడని ఆమె ఊహించలేదు.
"సావిత్రీ! ఇప్పటికయినా మించిపోయింది లేదు__ మీరు 'ఊ' అంటే మిమ్మల్నే చేసుకుంటాను." ఆవేశంగా అన్నాడు.
అతని చెంప ఛెళ్ళుమంది. ఒక్కసారిగా విదిలించుకుని దూరంగా జరిగిందామె.
"మర్యాదగా ఇక్కడి నుంచి వెళతావా లేదా అంది కోపంగా.
సరిగ్గా అప్పుడే శ్రీరామ్ లోపలికి రాబోతూ దృశ్యం చూసి గడపలోనే ఆగిపోయాడు.
"సారీ! తర్వాత వస్తాను" అంటూ వెనక్కు తిరగబోయాడు. మోహన్రావ్ చకచక నడుస్తూ బయటికెళ్ళిపోయాడు.
"రండి! సమయానికి వచ్చారు. లేకపోతే వాడు ఓ పట్టాన వెళ్ళేవాడు కాదు" అంది సావిత్రి.
"అదేమిటి! అతను మీ బంధువు కాదా?"
"పేరుకి బంధువే! ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు బుద్ధి మారిపోతుంది..."
"ఎందుకు? అతనేమయినా..."
"అవును! గట్టిగానే బుద్ధి చెప్పాను లెండి...మరోసారి ఎలాంటి సాహసాలూ చేయకుండా."
"మీకేమవుతాడు?"
"మామయ్య కొడుకు. ఇక్కడకు రాకముందు వాళ్ళింట్లోనే ఉండేదాన్ని! ఉట్టి తాగుబోతు...ఉద్యోగము లేదు, చదువూ లేదు. నన్ను పెళ్ళి చేసుకుంటానని వెంటపడుతుంటేనే వాళ్ళింటి నుంచి వచ్చేశాను."