వాటిలో ఏ భాగం దెబ్బతిన్నా చూపుపోయే ప్రమాదముంది.
సైన్సు ఇంత అభివృద్ధి చెందుతున్నా కంటి వైద్యంలో ఎంతోమంది నిష్ణాతులు ఎప్పటికప్పుడు వస్తోన్నా చాలా కంటి జబ్బులకు సరియైన జవాబు లభించటం లేదు. అసలు చాలా కేసులు సరిగ్గా డయాగ్నైజ్ చెయ్యబడటం లేదు. మామూలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కూడా సరిగ్గా కరెక్టు చెయ్యబడటం లేదు. సెంటర్ కాటారాక్ట్ ఆపరేషన్లు కూడా ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని ఫెయిలయి పోతున్నాయి. చాలామంది ఐ స్పెషలిస్టుళు ఫండోస్కోపీ రిఫ్రాక్షన్ ఫలితాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. రోగం లేత దశలో వున్నప్పుడు కేసు డయాగ్నైజ్ చెయ్యబడకపోవటం వల్ల, ఆ తర్వాత రోగం ముదిరిపోయి ఫలితాలు విషమంగా వుంటున్నాయి. కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్లలో తొందరపాటు, అనుభవంతో పండిపోయిన ప్రాక్టీస్ తో చాలా బిజీగావున్న సీనియర్ డాక్టర్లు, రద్దీ ఎక్కువగా వుండటం వల్ల ఏకాగ్రతతో చూడలేకపోవడం చాలా పొరపాట్లకు దారి తీస్తోంది.
డాక్టర్ కృష్ణచైతన్య మాటల్లో ఈ ఆవేదన రంజితకు అర్థమైంది. కాని తన కొన్ని ప్రశ్నలకు అతనెందుకు విచలితుడయ్యాడో ఆమెకు బోధపడలేదు.
ఈ కళ్ళు ఏమై వుంటాయి? నగరంలోని అన్ని హాస్పిటల్స్, ఐ స్పెషలిస్ట్ ళు, చివరకు డాక్టర్లందరినీ ఎందుకంటే ఐ స్పెషలిస్టులు కాకపోయినా అనుభవంతో కొందరు డాక్టర్లు కంటి ఆపరేషన్లు చేస్తూ వుంటారు. వారినీ ఎంక్వయిరీ చేసింది. ఈ వారం పదిరోజుల్లోపల కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ జరగలేదు. ఎయిర్ లైన్సును ఎంక్వయిరీ చేసింది. మందాకిని సంఘటన జరిగాక కనుగుడ్లు ఏ విమానంలోనూ ఎక్కడకూ తీసుకెళ్ళటం జరగలేదు. విమానంలో కాకుండా కారులోగాని, రైల్లోగాని ఎవరైనా రహస్యంగా తీసుకెళితే, అది తెలుసుకోవటమసాధ్యం. అంతే కాని దేశంలో వున్న వందల, వేల కంటి ఆసుపత్రులూ, ప్రైవేటు డాక్టర్ల గురించి తెలుసుకోవటం అసాధ్యం.
రంజితకు తన పరిశోధన ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో సమస్యగానే పరిణమిస్తోంది.
* * *
బ్రెయిలీ స్కూల్.
రంజిత కారాపి లోపలకడుగు పెట్టింది.
ఐదారేళ్ళ పిల్లల దగ్గర్నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల దాకా వున్నారు.
అందులో టీచర్స్, వర్కర్స్ తప్ప మిగతావారంతా అంధులే.
పుట్టుకతో అంధత్వంవున్నవాళ్లు, మధ్యలో ఏక్సిడెంట్లవల్ల, కళ్ళ జబ్బులవల్ల అంధత్వం ప్రాప్తించినవాళ్ళు అన్నిరకాల వాళ్ళూ వున్నారు. కొత్తగా చేరినవాళ్ళు, ఎన్నో సంవత్సరాలబట్టి ట్రైనింగయి అనుభవం సంపాదించినవాళ్ళూ వున్నారు.
వాళ్ళలో చాలామంది ఎంతో శ్రద్ధాభక్తులతో చదువుకుంటున్నారు. డిగ్రీలు కూడా సాధిస్తున్నారు. ఎన్నోరకాల విద్యలు నేర్చుకుంటున్నారు. టైప్ రైటింగ్, కుట్టుమిషన్, కార్పెంటింగ్ రకరకాల మెషినరీ వర్క్- ఒకటేమిటి? కళ్ళున్న వారు చేసే పనుల్లో సగంపనులు శక్తివంతంగా చెయ్యగలిగిన వాళ్ళున్నారు. వీణ, ఫిడేలు, తబలా వంటి ఇన్ స్ట్రుమెంట్స్ చాలా చక్కగా వాయించేవాళ్ళున్నారు. అద్భుతంగా పాడగలిగిన గాయనీ గాయకులున్నారు.
రంజిత వారందరి కార్యకలాపాల్ని చాలాసేపు ఆసక్తికరంగా చూస్తూ కూర్చుంది.
ఆమె దృష్టిని ఓ ఇరవై రెండేళ్ళ యువతీ ఆకర్షించింది. లేత నీలం రంగు చీర. అదే రంగు జాకెట్ వేసుకుంది. తెల్లగా, పొడవుగా చక్కని శరీర సౌష్ఠవంతో మిలమిలలాడుతోంది. ఆమె అంధురాలు అయినా చాలా చలాకీగా అటూ ఇటూ తిరుగుతూ, ఇతర అంధులకి సాయంచేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, ఒక్కక్షణం తీరికలేకుండా వుంది. రంజిత ఆమెను చాలాసేపు ముగ్ధురాలై గమనిస్తూ వుండిపోయింది. చివరికి పలకరించింది.
"మీరు..."
"అబ్బ! ఎంత తియ్యటి గొంతు" ఆ యువతి చాలా సంతోషంతో వెంటనే కాంప్లిమెంట్ చేసింది.
"మీ గొంతు కూడా చాలా మధురంగా వుంది" అంది రంజిత.
ఆమె నవ్వింది. అందమైన పలువరుస, లేతచిగుళ్ళూ చిన్న మెరుపుని సృష్టించాయి.
"నా పేరు రంజిత. ఇక్కడ బ్యాంకిలో పనిచేస్తున్నాను."
"నా పేరు మనోజ్ఞ. ఇక్కడ..."
"అందరికీ తల్లో నాలికలా మసులుకుంటూ వుంటారు."
మనోజ్ఞ నవ్వింది.
"మీకెలా తెలుసు?"
"మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది."
"ఒకరకంగా ఇది నా ఉద్యోగం కాదు. హాబీ అని చెప్పవచ్చు. ఇంట్లో ఒక్కదాన్నీ వుంటాను గనుక ఏమీ తోచదు. చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. ఇక్కడే కొంత విద్య నేర్చుకున్నాను. ఇక్కడే వీళ్ళకి సేవచేస్తూ. కొత్తవారికి నాకునచ్చిన విద్యలు నేర్పుతూ జీవితమంతా గడిపేద్దామనుకుంటున్నాను."
"మీరెక్కడ వుంటారు?"
"దగ్గర్లోనే, అంటే రెండు మూడు ఫర్లాంగులదూరంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను."
"ఒక్కరే ఉంటున్నానన్నారు. అమ్మా, నాన్నా, అక్కలూ, చెల్లెళ్ళూ... ఎవరూ లేరా?"
మనోజ్ఞ ఓ క్షణంపాటు మాట్లాడలేదు. కళ్ళలో హావభావాలకు అవకాశం లేకపోయినా ఆమె ముఖంలో వచ్చిన మార్పు గమనించింది రంజిత.
"ఎవరూ లేరు" అంది మనోజ్ఞ కొంచమాగి నెమ్మదిగా.
"ఇంటికెలా వెళతారు? ఎవరినైనా తోడు తీసుకెడతారా?"
"ఉహు. ఒక్కదాన్నే వెళతాను."
నేలమీద తడుముకుంటూ పోవటానికి కర్రలేమయినా ఉపయోగిస్తారా?"
"ఉపయోగించను. ఇక్కణ్ణుంచి ఇంటికెళ్ళే దారి నాకు కొట్టినపిండి. ఆ రోడ్డు, సందులు, మలుపులూ నాకు బాగా అలవాటే. ఎక్కడైనా కొత్త చోటికి అవసరాన్నిబట్టి కర్రనుపయోగిస్తాను."
"ఎవరన్నా చూసుకోకుండా అడ్డువస్తే? రోడ్డుమీదకు అదాటుగా వచ్చే వాహనాలు..."