Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 12


    ఒక చేత రివాల్వర్, మరొకచేత ఎక్స్ ప్లోజిర్ డిటెక్టివ్ పట్టుకుని ఆ కంపార్ట్ మెంట్ లోకి ప్రవేశించాడు నవీన్. కంపార్ట్ మెంట్ ను కలయజూశాడు.

    పోలీస్ ఆఫీసరుకు తమ ముఖాలు కనిపించకుండా పుస్తకాలను అడ్డుపెట్టుకున్న యువజంటను సునంద గమనించింది.

    "ప్రయాణీకులందరికీ ప్రస్తుత పరిస్థితి అర్ధమయ్యే వుటుంది. ప్రతి కంపార్ట్ మెంట్ తిరిగి చెక్ చేయడానికి సమయం సరిపోదు. దయచేసి అందరూ సహకరించండి. అనుమానించదగిన వస్తువులు కాని, పదార్ధాలుకాని తారసపడితే వెనువెంటనే నాకు తెలియజేయండి." అంటూ విజ్ఞప్తి చేశాడు నవీన్. అతని అధికారిక కంఠం ఖంగుమన్నది.

    తమ ఎదుట పోలీసు ఆఫీసరును చూడగానే కొండంత అండ దొరికినట్టు దైర్యం వచ్చింది సునందకు. ఆ యువజంట గురించి చెప్పాలనుకున్నది కాని, నవీన్ వేరే బోగీలోకి అప్పటికే వెళ్ళిపోయాడు! ఆమె ఉత్సాహం నీరుగారిపోయింది. అవకాశాలు చెప్పి రావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేనందుకు ఆమె కించిత్ బాధపడింది.

    ఆమె ఎంత మౌనంగా కూర్చుందామనుకున్నా ఆలోచనలు తొందరిస్తున్నాయి. ఆలోచనలు ఆందోళనకు దారితీస్తున్నాయి. ఏమీ తోచడం లేదు....

    రైలులోకి వచ్చినప్పటి నుంచి ఆ యువజంటను ఆమె గమనిస్తూనే వస్తున్నది. వాళ్ళ ప్రవర్తన మిగిలిన వారికంటే భిన్నంగా వున్నట్టు గుర్తించగలిగింది సునంద.

    ఎలా అయినా సరే, ఈ జంట విషయం పోలీసుల దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్ళవలెననే నిశ్చయానికి వచ్చిన సునంద దిగ్గున లేచింది. పైట సర్దుకుంది.

    "ఆగు!" ఖంగుమంది యువకుని కంఠం. అదొక కంచుగంట!

    ఈపాటికే పెట్టె చివరివరకు వెళ్ళిన సునంద మంత్రించినట్టు ఠక్కున ఆగిపోయింది. వెనుదిరిగి చూసి, వణికిపోయింది. యువకుని చేత రివాల్వర్!

    "నువ్వు....నువ్వు...." తత్తరపడిపోయింది సునంద కంఠం.

    "షటప్! నోరెత్తకు, వెళ్ళి నీ సీటులో నువ్వు కూర్చో!" చింత నిప్పుల కళ్ళతో స్థిరమైన గొంతుతో కఠినంగా ఆజ్ఞాపించాడు. రివాల్వరు ఆమెకు గురిపెట్టి వుంది!

    సునంద మారుమాట్టాడకుండా చకచకా వెళ్ళి తన స్థానంలో సర్దుకుకూర్చుంది.

    యువ జంట కనుసైగలతోనే మాట్లాడుకున్నారు.

    క్షణంలో సగంలో సునంద తన వేనీటి బ్యాగ్ ను తెరచింది. చిన్న అద్దం తీసి, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంది.

    ఇంతలో సెక్యూరిటీ ఆఫీసరు ఒకరు వచ్చి ప్రయాణీకులందరికీ జాగ్రత్తలు చెప్పి, వెనుదిరిగాడు. తన డ్యూటీ ముగించుకుపోయాడు!

    పోలీస్ ఆఫీసరును గమనించిన వెంటనే యువకుడు అంతకు ముందు నుంచీ సునందకు గురిపెట్టిన వుంచిన రివాల్వరుకు పుస్తకాన్ని అడ్డుపెట్టాడు. అతని మెదడు పాదరసం!

    సునంద ముఖాన ముచ్చెమటలు పోశాయి.


                                                                 *    *    *


        కాల్వ మీద రైలు బ్రిడ్జి శిథిలావస్థలో వున్నట్టు కనిపిస్తున్నది.

    ఎప్పుడో బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో దానిని నిర్మించారు. అక్కడ రైలు వేగాన్ని తగ్గించవలెనని సౌత్ సెంట్రల్ రైల్వేవారు హెచ్చరిక బోర్డును కూడా పెట్టారు. ట్రెయిన్ డ్రయివర్లు ఆ హెచ్చరికను పాటిస్తూనేవుంటారు.  

    సూపర్ ఫాస్ట్ రైలు పేరుకు తగినట్టుగానే యమ వేగంతో వస్తున్నది.

    బ్రిడ్జి వద్ద వేగాన్ని తగ్గించి ఇరవై కిలోమీటర్లకు పరిమితం చేయవలసిన సూపర్ ఫాస్ట్ ఇంజన్ డ్రయివరు చేష్టలుడికి తన సీటులో చతికిలపడిపోయాడు.

    సాయుధు డొకడు తన రివాల్వరును డ్రయివరు తలకు బెత్తెడెడంగా వుంచాడు.

    "మిస్టర్ కమాండర్! ట్రెయిన్ వేగం తగ్గించడం మంచిది. ఈ సూపర్ ఫాస్ట్ స్పీడుకు బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం వుంది...." నవీన్ ఆతురతగా వైర్ లెస్ లో అన్నాడు.

    "నో! ఇప్పటికైనా మీ సి.ఎం.కు కనువిప్పు కలిగి, మా డిమాండ్స్ ను అంగీకరిస్తానంటేనే ఈ ప్రమాదంనుంచి మిమ్ము, ప్రయాణీకులను రక్షిస్తాను. సి.ఎం. ను మాట్లాడమని చెప్పండి!" మరొక అవకాశం ఇస్తున్నట్టు కొన్ని క్షణాలు ఆగాడు అజ్ఞాత వ్యక్తి.   

    సి.ఎం. కు చెప్పిచూశాడు. ఫలితం పూజ్యం! అనుకున్నట్టే వ్యతిరేక జవాబు వచ్చింది.

    అదే క్షణంలో సూపర్ ఫాస్ట్ కెనాల్ బ్రిడ్జిని దాటి వెళ్ళనే వెళ్ళింది!

    దానిని శతాబ్ది క్రితం నిర్మించినా, మరి పెక్కేండ్ల వరకు చెదర దనిపించింది.

    నవీన్ సంభ్రమంలో ఉండగానే అజ్ఞాత వ్యక్తి వికటాట్టహాసం వినిపించింది.

    "బ్రిడ్జి కూలిపోలేదని సంబరపడుతున్నావా ఆఫీసర్? ఇప్పుడు చూడు_నేనేం చేస్తానో!"     

 Previous Page Next Page