Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 12

                                 


    "అమ్మమ్మా! తాతయ్యా నువ్వూ మొదటిరాత్రి ఏం చేశారో మేము అదే చేశాం!" ఈ డైలాగు ఏ సినిమాలో ఎవరు, ఎవరితో, ఎప్పుడు, ఎందుకన్నారో వివరింపుము.

 

    "ఛీ ఛీ ఛీ" అంది పార్వతీదేవి సిగ్గుపడిపోయి.

 

    "పిల్లలకు ఇలాంటి డైలాగులా?"

 

    "ఏడ్చినట్లుంది!" విసుక్కున్నాడు రంగారెడ్డి, రోజూ రేడియోలో 'మంగమ్మ గారి మనవడు' సినిమాలో మనవరాలు ఇదే డైలాగ్ పాట రూపంలో అమ్మమ్మతో అనటం వినటం లేదా? పైగా ఆ పాట పదేపదే వినిపించమని శాయిరామ్, జనార్ధన్ వీళ్ళందరూ జనరంజనిలో కోరటం నేను వినలేదనుకుంటున్నారా?"

 

    ఎవరూ మాట్లాడలేదు.

 

    యాదగిరి ఇంకో ప్రశ్న చదివాడు.

 

    "వంగమాక - వంగమాక"

 

    "కొట్టమాక- తిట్టమాక- కొట్టనివ్వు- తిట్టనివ్వు"

 

    "లేత లేత చీకటీ, ముదురుతున్న ఆకలీ-
    మత్తుమత్తుగా ఏదో వత్తిడీ-
    మెత్త మెత్తగా ఏదో వత్తిడీ"

 

    ఈ పాటళు ఏయే చిత్రములలోనివి? ఈ అద్భుతమయిన సాహిత్యమును సృష్టించిన గీత రచయిత, దర్శక మహాశయులు ఎవరు? వారి పూర్వ చరిత్ర ఏమి?

 

    ఈ ప్రశ్నకు ముగ్గురు గడగడ సమాధానం చెప్పేశారు.

 

    ఆఖరి ప్రశ్న చదివాడు శాయిరామ్.

 

    "భారత దేశమునకు స్వాతంత్ర్యము ఎప్పుడు వచ్చెను? స్వాతంత్ర్యము సంపాదించుటకు పోరాడిన వారిలో ముఖ్యుల పేర్లు తెలుపుము?"

 

    ఈ ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు.

 

    "ఏమిట్రా ఇంత ఈజీ ప్రశ్నకు ఆన్సర్ తెలీదా?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి.

 

    "ఇది ఈజీ ఏమిటంకుల్? చాలా టఫ్ కొశ్చన్! మా క్లాసులో ఎవ్వరూ రాయలేకపోయారు! తెలుసా?"

 

    శాయిరామ్ విరగబడి నవ్వాడు.

 

    "ఈ మాత్రం ఆన్సర్ క్లాసులో ఎవ్వరికీ తెలీలెదా౧ పిచ్చి వెధవల్లారా? అదేదో తెలుగు సినిమా వచ్చింది చూడూ! పేరు గుర్తులేదు!

 

    అది రిలీజయిన రోజే మనకు స్వాతంత్ర్యం కూడా వచ్చింది!"

 

    అందరం ఒకరి మొఖాలొకరు చూచుకున్నాం!

 

    అందరికీ ఆ సినిమా పేరు నోట్లోనే ఆడుతోంది గానీ- గుర్తు రావటం లేదు.

 

    "మహాత్మాగాంధీ గురించి వ్రాయుము, పోనీ ఇదయినా రాశారుట్రా?" అడిగాడు గోపాల్రావ్.

 

    "ఓ! చాలా ఈజీడాడీ!" అన్నాడు చిన్నిగాడు హుషారుగా, "క్లాసులో అందరం పేజీ ఫుల్ గా రాసేశాం!"

 

    "ఏమని రాశారు?" ఆశ్చర్యంగా అడిగాను నేను.

 

    మహాత్మాగాంధీ గురించి మేమే అంతా మర్చిపోయాం! వీళ్ళకెలా గుర్తుందో తెలీటం లేదు.

 

    రమేష్ గాడు ఠక్కున చెప్పటం ప్రారంభించాడు.

 

    "మహాత్మాగాంధీ అసలు పేరు బెన్ కింగ్స్ లే! ఇతను భారతీయుడే గాని బ్రిటీష్ పౌరుడు. వీరికి "మహాత్మాగాంధీ" అనే సెంటిమెంట్ పిక్చర్ లో హీరోగా నటించినందుకుగ్గాను ఆస్కార్ అవార్డు లభించింది. వీరితోపాటు హీరోయిన్ గా నటించినామె కూడా భారతీయురాలే! ఆమె పేరు రోహిణి హట్టన్ గడి..."  

 

    "మరి డ్రాయింగ్ పరీక్ష కూడా అయింది కదూ?" అడిగింది పార్వతీదేవి.

 

    "అయిందాంటీ!" ఉత్సాహంగా చెప్పారందరూ.

 

    "ఏం బొమ్మ గీయమన్నారు?"

 

    "ఏదయినా మీ కిష్టమొచ్చిన బొమ్మ గీయమన్నారాంటీ! క్లాసులో అందరం సిల్క్ స్మిత' బొమ్మ గీసాం! అదయితే తేలిక కదాంటీ! కాస్టూమ్స్ కూడా ఎక్కువ గీయనక్కర్లేదు."

 

    అందరం ఇళ్ళకు చేరుకున్నాం మళ్ళీ.

 

    రాష్ట్ర ముఖ్యమంత్రీ, గవర్నరూ- హీరో విలన్స్ లాగా ఫైటింగ్ చేసుకొన్న సినిమా ఒకటి కమ్యూనిటి టీవీలోకి ప్రారంభమయింది.

 

    పిల్లలంతా విజిల్స్ వేసి "కొట్టూ కొడుకుని! కొట్టూ" అని అరుస్తున్నారు. సినిమా అయిపోయింది. కాసేపు మళ్ళీ ప్రధానమంత్రి నటించిన సినిమాలోని ఓ సన్నివేశం! కమ్యూనిటీ టీవీలో ప్రతి పావుగంటకూ ప్రధానమంత్రి నటించిన సినిమా సన్నివేశం ఒకటి చూపటం మామూలే!

 

    ప్రభుత్వ ఆదేశం ప్రకారం రాత్రి ఏడింటికి దేశంలోని భార్యాభర్తలు అందరూ కమ్యూనిటీ గార్డెన్ లో డ్యూయెట్ పాడుతూ పరుగెత్తి డాన్స్ చేయాలి. అంచేత, నేనూ, మా శ్రీమతి బయటకు పరుగెత్తాం- పాట కూడా మొదలయిపోయింది.

 

    పావుగంటసేపు అదే పాట.

 

    "ముక్కు మీద కోపం-"

 

    డ్యూయెట్ అయిపోయాక సినిమాల్లో సెక్స్ డాన్స్ ల కోసమే తన జీవితం ధారపోసిన 'జ్యోతిలక్ష్మి' గుడికివెళ్ళి కొబ్బరికాయ కొట్టి, దణ్ణం పెట్టుకుని ఇంటికి చేరుకున్నాం!

 

    కమ్యూనిటీ టీవీ ప్రత్యేక ప్రోగ్రాం ప్రసారం చేస్తోంది.

 

    "జంట నగరాల్లో ఇవాళ సాయంత్రం వివిధ నటీనటుల "ఫిలిం ఫాన్స్ అసోసియేషన్స్" మధ్య చెలరేగిన దారుణ హింసాకాండలో రెండువందల డెబ్బయ్ మంది వరకూ మరణించారు. పధ్నాలుగు వేల మంది గాయపడ్డారు. ఇంకో లక్ష మంది జాడ తెలీటం లేదు-

 

    అంచేత నగరంలో నిరవధికంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు స్టంట్ మాస్టర్ భీమా ప్రకటిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అదే వయసు, అదే రూపం గల ఎక్ స్ట్రాస్ ని సప్లయ్ చేసి, ఆ కుటుంబీకుల దుఃఖాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర హోంమంత్రి, సినిమా ఎక్స్ ట్రా సప్లయర్ అయిన పిచ్చేశ్వర్రావ్ తెలియజేస్తున్నారు-"


                              


                                                     *  *  *  *  *

 Previous Page Next Page