"అహ! మీరు రిసెర్చ్ ఇంట్రెస్ట్ తో వచ్చినవారు. మొదట మీరు మా దగ్గరకి వచ్చి 'ఆర్కియాలిజీలో రీసెర్చ్ చేస్తున్నాను. మీతో కలిసి పనిచేస్తాను' అంటే మామూలు స్టూడెంట్ అనుకున్నాను. తీరా దేవనారాయణ్ గారి కాబోయే భార్య అని తెలిసి నన్ను నేను నమ్మలేకపోయాను. నేను గట్టిగా చెప్పగలను. మీబోటి వాళ్లకి కోపం రాదు. నేను నమ్మను.
"దేవనారాయణ్ కాబోయే భార్యనని రమ్మంటున్నారా? భయపడకండి. నేను ఇందాక బెదిరించినట్లు మీ వర్క్ పాడుచెయ్యను, వెళ్తాను"
"ఆగండి! ఆగండి!"
"దేనికి?"
బుర్ర గోక్కున్నాడు రవి "నేనేం చెప్తే మీకు బాగుంటుంది?" అని అడిగెయ్యాలని ఉంది లోలోపల. ధైర్యం చాలటం లేదు.
"ఇంత చీకట్లో ఈ అడవుల్లో పులులూ, సింహాలూ, ఏనుగులూ, గాడిదలూ అన్నీ ఉంటాయి. ఈ గ్రామాలకి నేనిదివరలో చాలాసార్లు వచ్చాను. అడవి జంతువులంటే మీకు భయం కాని, నాకేమీ భయంలేదు. వాటిని ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ రాత్రి కాకుండా తెల్లవారాక వెళ్ళమనా?"
"అహ అదికాదు"
"మరేమిటి?"
"మీ రీసెర్చ్...మీకిక్కడ కొత్త మెటీరియల్ దొరకొచ్చు. అది పాడుచేసుకోకండి."
"ఈ మాత్రం మెటీరియల్ నేనెలాగైనా సంపాదించుకోగలను. నా థీసిస్ ఇంచుమించు పూర్తయిపోయింది కూడా. ప్రస్తుతం కొత్త మెటీరియల్ కావలసింది మీకే. ఏవైనా కొత్త విషయాలు పబ్లిష్ చెయ్యవలసింది కూడా మీరే. ప్రొఫెసర్ షిప్ తో అవసరం కూడా మీకే."
బుర్ర గోక్కుంటూ "కరెక్ట్" అన్నాడు. ప్రతి సమాధానం తోచనప్పుడూ, వాదించటం అనవసరం అనుకున్నప్పుడూ, అతడు వాడే మాట అది.
"ఇక్కడి ఫొటోగ్రఫీతో పరిచయం ఉన్నదానినీ, శాసనాల మీద కొంత వర్క్ చేసినదానినీ గనుక ఇంకా మీకే నాతో అవసరం ఉంది."
అతడికి క్లూ దొరికింది "రైట్" అన్నాడు హుషారుగా.
"ఏమిటి రైట్?"
"అంటే! మీ సహకారం లేకపోతే ఇక్కడ నేనేమీ చెయ్యలేను. అంచేత నాకోసం రండి ప్లీజ్"
"అయితే వస్తాను"
వెనక్కి మళ్ళింది అనిల.
"పేద్ద నన్ను ఉద్దరిస్తున్నట్లు" లోలోపల సణుక్కున్నాడు.
"ఏమిటీ?" అడిగింది.
"వెన్నెల బాగుంది" తడుముకోకుండా చెప్పాడు.
"అరిగిపోయిన మాటలు"
"వెన్నెల వేడిగా ఉంది"
"మరీ అంత నిలవ వాసన వెయ్యటం లేదుకానీ కొత్తగా కూడా లేదు."
"వెన్నెల...వెన్నెల..."
"ఊ?"
"వెన్నెల మీకు కోపం పోయినప్పటి నా మనసులా ఉంది" నవ్వింది.
"గొప్పగా ఉన్నా లేకపోయినా, మీ సొంతం కనుక బాగుంది"
"థాంక్స్"
అనిల మళ్ళీ వచ్చినందుకు విష్ణువర్ధన్ చాలా సంతోషించాడు.
"నేనొక కథ చెప్తాను" అని మొదలుపెట్టాడు రవి.
"మనలాగే కొందరు ఇలాగే డేరాలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే ఒక దెయ్యం వచ్చిందట. వచ్చి 'మీకు ముఫ్పైవేల రూపాయలు ఇస్తాను. తీసుకుంటారా?' అందట. మీరయితే ఏం చేస్తారో ఒక్కొక్కరూ చెప్పండి"
"మీకు పుణ్యముంటుంది. ఇప్పుడు దయ్యాల కబుర్లు చెప్పకండి" అన్నారు టెక్నికల్ అసిస్టెంట్స్.
"ఛఛ! ఎన్ని రూపాయలయితే మాత్రం దెయ్యమిచ్చింది తీసుకుంటాంటండీ! డబ్బు కోసం దెయ్యాలతో స్నేహం చేస్తామా?" అన్నాడు ప్రకాశం.
"ఎవరూ ఎవరికీ రూపాయలు ఊరికే ఇవ్వరు. అంచేత మనకు రూపాయలివ్వటంలో దెయ్యం ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. అది మనని ముంచకుండా, దాన్నే మనం ముంచగలం అనుకుంటే తీసుకోవచ్చు. దెయ్యానికి అప్పోజిషన్ పార్టీ దేవుడు కనుక దెయ్యం దగ్గిర డబ్బు తీసుకుంటే దేవుడికి కోపం రావచ్చు. అప్పుడు దెయ్యం దగ్గిర తీసుకున్న ముప్ఫై వేలలో అయిదువేలు పెట్టి ప్రాయశ్చిత్తకాండ జరిపించుకుంటే పోతుంది. దేవుడికి కోపం రాదు. మనకి పాతికవేలు లాభం!"
ఆలోచించి చెప్పాడు విష్ణువర్ధన్. జెన్నిఫర్ మాట్లాడలేదు. ఆ అమ్మాయిని తన అభిప్రాయం చెప్పమని ఎవరూ అడగనూ లేదు.
"దెయ్యమే ముప్ఫై వేలిస్తే, దేవుడి ఇంకెంత ఇస్తాడో? అంచేత నేను దెయ్యం దగ్గిర తీసుకోను, దేవుడి దగ్గిరే తీసుకుంటాను" అంది అనిల.
"దేవుడు ఇస్తాడని నమ్మకమేమిటి? అది నా కథలో లేదు" అన్నాడు రవి.
"కథలో ఉండక్కర్లేదు. దెయ్యం ఉంటే దేవుడూ ఉంటాడు. దెయ్యం డబ్బులివ్వటం జరిగితే దేవుడూ తప్పకుండా ఇస్తాడు. అంతకంటే గొప్పది తేడా ఒక్కటే. దేవుడు వెలుగులో ఇస్తాడు. దెయ్యం చీకట్లో ఇస్తుంది."
"నేను లోపలికి రావచ్చా!" బయటినుంచి వినపడింది ఒక బొగ్నురు గొంతు చెవులకి కటువుగా.
"రావచ్చు" అని ఎవరూ అనకుండానే లోపలికి వచ్చింది ఒక ఆకారం. ముతక ధోవతి, మాసిన చొక్కా, జిడ్డు గొడుతున్న వొళ్ళు, చెవులకి రవ్వల అంటుజోళ్ళు, చేతి వేళ్ళకి రవ్వల ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, దానికి వెంకటేశ్వరస్వామి వారి లాకెట్.
"ఎవరు మీరు?" అనుమానంగా అడిగాడు విష్ణు.
"నన్ను శివయ్యంటారండి. సిరిమిట్టలోనూ, లచ్చింబోడులోనూ నన్నెరగనోళ్ళు లేరండి. అక్కడా ఇక్కడా నాకు దుకాణాలున్నాయండి. ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో అందరినీ కష్టంలో, సుఖంలో ఆదుకుంటానండి" అతి వినయంతో వంగి నమస్కారం చేశాడు.
వెంటనే అర్థమయింది రవికి. భూషణంగారి "కొండగాలి" నవలలో షావుకారూ, ఆనందరామం "జాగృతి" నవలలో పెంటయ్య ఆ పుస్తకాలలోంచి నడిచి వచ్చినట్లుగా ఉన్న ఆ మనిషి వడ్డీవ్యాపారి.
"ఏం కావాలి మీకు?" కాస్త గౌరవంతో అడిగాడు విష్ణు. అతడు ఇస్తున్న గౌరవం, మెరుస్తోన్న అతడి వంటిమీద రవ్వలకి.
"మీరు గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు కారని విన్నాను"
"అవును! కానీ ఎక్స్ కవేషన్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం"
"మీ అసుమంటోళ్ళు తల్చుకుంటే కానిదేముంటుంది లెండి"
సంతోషించాడు విష్ణు. "ఏ పనిమీద వచ్చారు?" మర్యాదగా అడిగాడు.
"మీలో లీడరెవరో, ఆయనతో కాస్త ప్రైవేటుగా మాట్లాడాలి!" రవి, విష్ణువర్ధన్ ఒక్కసారిగా లేచారు. ఇద్దరూ ఒక్కసారిగా కూర్చున్నారు.
తరువాత విష్ణువర్ధన్ లేచి "రవీ మీరూ రండి. ఇద్దరం మాట్లాడదాం. శివయ్య గారూ ఇక్కడ ప్రొఫెషనల్ గా రవి లీడర్. ఫైనాన్షియల్ గా నేను. అంచేత ఏ నిర్ణయమైనా ఇద్దరం తీసుకోవాలి" అన్నాడు.
రవికి అతడంటే పట్టరాని అసహ్యంగా వుంది. వెంటనే అక్కడ్నించి పొమ్మని మెడ పట్టి బయటికి గెంటాలని ఉంది. కానీ విష్ణు మాట ఎలా కాదనటం? ముగ్గురూ డేరాలకి కొంచెం దూరంగా వచ్చారు.
"చెప్పండి" అన్నాడు విష్ణు.
అటూ ఇటూ దొంగ చూపులు చూశాడు శివయ్య. అలా దొంగ చూపులు చూసేవాళ్ళని ఒక్కనాటికీ నమ్మకూడదని రవికి తెలుసు.
"మీకు తవ్వకాల్లో మంచి శిల్పాలు ఏదైనా దొరికినట్టయినా, నా చెవిన ఓ మాటేస్తే మూడో కంటివాడికి తెలీకుండా అమ్మి పెడ్తాను. మీకు మంచి ధర పలుకిద్ది ఆ పూచీ నాది"