"నేను వెళ్తాను." లేచింది ఇళ.
"మీ అమ్మ ఏమీ అనదు కదా!" అడిగింది వర్ధని.
"ఏమో, మాస్టారు రమ్మన్నారంటే వచ్చేశాను."
ఎంతో అమాయకంగా అంది ఇళ. ఆ ముఖం చూస్తూ ఆ నోటి నుంచి అబద్ధం రాగలదని అనుకోలేకపోయింది విదుషి.
ఆ సాయంత్రం చిచ్చు, విదుషి మళ్ళీ వెళ్ళారు బావి దగ్గరికి.
పరిసరాలన్నీ పరిశీలనగా చూస్తున్నాడు చిచ్చు.
ఉన్నట్లుండి "అదిగో మైలారమ్మ!" అన్నాడు చిచ్చు.
"ఎక్కడా? ఏదీ?" కుతూహలంగా అడిగింది విదుషి.
కొంచెం దూరంలో చెట్టుకింద వేలితో చూపించాడు.
"ఇదా?"
అక్కడ ఉన్నది ఫర్లాంగు రాయిలాంటి రాయి. బాగా పసుపు పూశారు. నల్లరంగుతో కళ్ళు దిద్దారు. పెద్ద కుంకుమ బొట్టు దిద్దారు.
"ఇదా, మైలారమ్మ?"
"అవును కావాలంటే ఎవరినైనా అడుగు?"
అక్కడ నీళ్ళు తోడుకునే వాళ్ళని అడిగింది విదుషి.
"అవును మైలారమ్మ దేవత. పేరంటాలు! నరసింవయ్య కథ సెప్తాడు." వాళ్ళలో ఒకడు సమాధానం చెప్పాడు. ఆ మాటలతో చిచ్చు మనసు ముందొక మెరుపు మెరిసింది.
4
ఇళ తన ధ్యానంలోంచి చటుక్కున లేచింది. సిగ్గుపడుతూ భయపడుతూ "అమ్మా!" అంది. అచ్యుతమ్మ వీధరుగు మీద ఇరుగు పొరుగు గృహిణులతో కబుర్లు చెప్పుకుంటూ బియ్యం ఏరుతోంది. చేట కిందపెట్టి పూజ గదిలోకి వచ్చింది. కూతుర్ని చూసి వెలవెలపోతూ "ఇంకా అక్కడే నిలబడ్డావేం? బయటికి రా?" అంది.
ఇళ పెద్దమనిషయిందనే వార్త ప్రమధపురి అంతా క్షణాలలో వ్యాపించింది.
"అయ్యయ్యో! పెద్దమనిషి అయిపోయిందా? ఇక దేవత ఇళ మీదకు రాదు!" అన్నారు అందరూ.
ఆ సాయంత్రం యోగనాథశాస్త్రి ఇల్లు బోసిపోయినట్టయింది. భక్తులు లేరు, కానుకలు లేవు, అలవాటుగా అచ్యుతమ్మ తయారుచేసి దంచిన తీర్థ ప్రసాదాలు మాత్రం అలాగే వుండిపోయాయి. కొందరు భక్తులు డబ్బు తేలేనివాళ్ళు పొలం గట్టుల మీద కాసిన కూరలు తెచ్చేవాళ్ళు.
ఆ రోజు కనీసం కూరలయినా రాలేదు.
"అన్నంలోకి ఏం వండనూ! నా తలకాయ?" అంది విసుగ్గా అచ్యుతమ్మ భర్తతో.
"కాస్త పులుసు పెట్టి వండు!" వ్యాసపీఠంలో భారతం అమర్చుకుంటూ అన్నాడాయన పరాగ్గా.
"నా తలకాయ!" మరోసారి గట్టిగా తల కొట్టుకుంది అచ్యుతమ్మ. ఆవిడ కోపం ఇళ మీదకి తిరిగింది.
"ఇప్పుడేం కొంప మునిగిపోయిందని పెద్దమనిషయి కూచున్నావే! ఇదంతా నా ఖర్మ. ఏ పూర్వ జన్మలోనో నేను చేసుకున్న పాపం!"
మరోసారి తల కొట్టుకుంది. దరిద్రం అనుభవించి ఆవిడ మనసు కూడా చితికిపోయింది.
ఉక్రోషం ఉబికి వస్తుంది, మనసు లోతుల్లోంచి. అది ఎవరిమీద చూపించలేక తన తల కొట్టుకోవటం ఆవిడకి అలవాటయిపోయింది.
ఇళ బిత్తరపోయింది.
"నాకేం తెలీదమ్మా? నేనేం చెయ్యలేదు!" అంది అమాయకంగా.
ఆ పసి ముఖం చూసి తల్లి మనసు ద్రవించింది. ఇంట్లో ఆడపిల్ల పెద్దమనిషయితే ఆనందంగా వేడుకలు జరపవలసింది పోయి ఆ పిల్లమీద విసుక్కుంటోంది.
"ఛ! ఛ! కళ్ళు తుడుచుకో! నువ్వేం చేశావ్! బంగారు తల్లివి! మనసు పాడుచేసుకోకు! అన్నింటికీ దుర్గాదేవి ఉంది మనకి."
షావుకారు నరసయ్య దుకాణంలో నువ్వు పప్పు అప్పు తెచ్చి చిమ్మిరి దంచి నలుగురు పేరంటాళ్ళకి పంపింది అచ్యుతమ్మ. ఏదో చేస్తోంది కాని ఆవిడ మనసుకి స్థిమితంగా లేదు. ఇక ఇళ మీదకి దేవత రాదు. భక్తులు రారు! కానుకలూ వుండవు. ఇన్నాళ్ళూ వచ్చిన కానుకలు పాత అప్పులు తీర్చడానికే సరిపోయాయి. ఏమీ మిగల్లేదు. ఇన్నాళ్ళకి ఇప్పుడిప్పుడు ఇల్లు కాస్త సవ్యంగా నడుస్తోందనుకుంటే ఇంతలో ఇది! నామాలయ్య భార్య పట్టు పరికిణీ, జాకెట్టు, వోణీ బహుమానంగా ఇచ్చింది ఇళకి. తన కొడుకు ఇళ వల్లే బాగయ్యాడన్న విశ్వాసం ఉంది నామాలయ్య భార్య పేరిందేవిలో.
* * * *
షావుకారు నరసయ్య దుకాణంలో అరువు దొరకటం లేదు. ఇరుగు పొరుగు చేబదుళ్ళియ్యటంలేదు. భక్తులు లేరు. కానుకలు లేవు. ఇళకి జీవితం నిశ్శబ్దంగా అంధకార బంధురంగా అయిపోయింది. చిచ్చు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు. జ్ఞానదేవ్ ఇళని మళ్ళీ బడిలో వెయ్యమని యోగనాథశాస్త్రితో చెప్పిచూశాడు. కానీ శాస్త్రి ఒప్పుకోలేదు. "ఇప్పుడింక చాడువేమిటి? పెళ్ళి చేసేస్తాను" అన్నాడు.
కానీ ఇళకి పెళ్ళిచేయడం యోగానాథశాస్త్రిలాంటి పేద పురోహితుడికి గగన కుసుమం అయిపోయింది. కొందరు "అమ్మో! ఆమె దేవత అటగదా! మాకొద్దు!" అనేశారు. దేవత పూజించటానికే కాని పెళ్ళిచేసుకోవటానికి కాదుకదా!
మరికొందరు "మీ అమ్మాయి మీదకి దేవత ఆవహించినప్పుడు ఆ పేరు చెప్పుకొని బోలెడు సంపాదించారు కదా! అదంతా కట్నంగా ఇస్తే పెళ్ళి చేసుకుంటారు" అన్నారు.
ఇంచుమించు ప్రతిరోజు యోగనాథశాస్త్రి అచ్యుతమ్మ పోట్లాడుకుంటారు.
"ఏదీ చేతకాదు. చివరికి పిల్ల పెళ్ళి చెయ్యటం కూడా చేతకాదు. ఎందుకు పనికిరాని అసమర్థుణ్ని కట్టుకుని అఘోరిస్తున్నాను" అంటుంది అచ్యుతమ్మ.
"అంతా ఆడదాని అదృష్టం! నిన్ను పెళ్ళిచేసుకున్నానో లేదో ఏలిన నాటి శని వచ్చి నా నెత్తిమీద కూచుంది. నేనేం చెయ్యగలను?" అంటాడు యోగనాథశాస్త్రి. దంపతులిద్దరూ ఇంట్లో ఇబ్బందులన్నీ మరిచిపోయి హాయిగా పోట్లాడుకుంటారు కాసేపు." ఆ అయితే ఇదంతా రాత్రి పది దాటే వరకే! ఆ తర్వాత వాళ్ళ గొంతులు అతి మెల్లగా గుసగుసలతో మరోరకం ధ్వనులతో వినిపిస్తాయి.
ఇళకి దుర్గమీద కోపం రాలేదు. మరింతగా ధ్యానం చేస్తూ కూచునేది. అయితే ఇదివరలోలాగా ఏకాగ్రంగా ధ్యానం కుదరటం లేదు.
"ఇంకా ఎందుకా ధ్యానం? లేచి కాస్త పచ్చడి నూరు! తమ్ముడు ఏడుస్తున్నట్లున్నాడు చూడు! నాన్నగారి పూజ సామానులు తోమి, సిద్ధంగా పెట్టు."
"ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అచ్యుతమ్మ. అయితే అచ్యుతమ్మ సణుక్కున్నా, తిట్టుకున్నా ఇళ లక్ష్యపెట్టదు. ధ్యానంలోంచి లేవదు. ఆమె అంతరాంతరాలలో ఎక్కడో "ఏకతార సంగీతం!" ఆ స్వర తరంగాలలో తెలుస్తూ ఏదో శ్రావ్యమైన కంఠధ్వని. ఆ ధ్వని ఏమిటో ఏం చెపుతోందో స్పష్టంగా అందుకోవాలని ఇళ ప్రయత్నం. అందటం లేదు. మనసు పొరలలో చిక్కుకుపోయి అస్పష్టంగా అయిపోతోంది.