"ప్రేమ గురించి మీకేం తెలుసు పిల్లకుంకలూ" అన్నాడు. ముగ్గురూ మొహమొహాలు చూసుకున్నారు. రామలింగం విజృంభించేసేడు. "నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో సగటున రోజుకి ఇద్దరు అమ్మాయిలు దగ్గర్నుంచి ప్రేమలేఖలు అందుకునే వాడిని."
"ఎలా సార్ ! ఆనరరీ పోస్ట్ మాన్ పనిచేసేవారా."
"ఛత్. అమ్మాయిలు అంతలా ప్రేమించేవారన్నమాట ! అసలు ప్రేమించటం, అమ్మాయిల ప్రేమ పొందటం ఒక కళోయ్ ! అందరికీ సాధ్యం కాదు. అసలింతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఎలా పరిచయం పెరిగింది, ఆ విషయాలన్నీ చెప్పు" అన్నాడు విశాలంగా నవ్వుతూ అతడికి 'యమ' ఆనందంగా వుంది. హాస్టల్లో ఈ మూడు 'కోతుల్నీ' తన అధీనంలోకి తెచ్చుకుంటే మిగతా అందర్నీ ఒక ఆట ఆడించెయ్యొచ్చు తన ఆధీనంలోకి తెచ్చుకుంటే మిగతా అందర్నీ ఒక ఆట ఆడించెయ్యొచ్చు.
"అసలు మనవాడు ప్రేమలో పడటానికి మీరే కారణం సార్ !" అన్నాడు విన్సెంటు.
రామలింగం అదిరిపడి "నేనా" అన్నాడు.
"నిశ్చయంగా మీరే!" అని కనకారావ్ వైపు తిరిగి "చెప్పరా" అన్నాడు అసలు జరిగింది ఇది.
4
"మనదీ వుంది వెధవ లైపు... ఆ కుర్రవాళ్ళని చూడండి. స్టూడెంట్ లైఫ్ అంటే అలా వుండాలి." అమితాబ్ బచ్చనుడి నలుగురూ "బ్యాబిలర్ ఆఫ్ హార్ట్స్" మార్నింగ్ షో నుంచి వస్తున్నారు.
"నిజంగా. భలే పందెం గురూ ఆ సినిమాలో..." అన్నాడు విన్సెంటు.
"సాయంత్రం నుంచీ ప్రొద్దున్న వరకూ, లేడీస్ హాస్టల్లో ఒక రాత్రంతా గడిపి రావటం పందెం. అక్కడ జరిగిన గొడవా, వార్డెన్ పోలీసులకి ఫోన్ చేయటం. బాత్ రూముల్లో చేసింగూ, కిచెన్ లో వంకాయల గుట్ట వెనుక దాక్కోవటం - అంతా గోలగోల."
"మనం అనుకోవాలే గానీ అంతకన్నా సాహసాలే చెయ్యొచ్చు." అన్నాడు మురళి.
"ఏది నువ్వా, మొహం చూపించు."
"చేసి చూపిస్తే."
"బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను- ఇంతకీ ఏం చేస్తావు ?"
"మన ఎదురు హాస్టల్లో ఎవరో ఒక అమ్మాయిచేత - తన స్వంత డబ్బులతో ఇప్పించుకుని డ్రింకు తాగుతాను" అన్నాడు మురళి పందెం కాస్తున్నట్టు.
"మీ మరదలు ఎవరయినా వుందా గురూ?" అనుమానంగా అడిగాడు అమితాబ్ బచ్చను.
"కాదు. మీరెవర్ని చూపించినా సరే..." అంటూ సవాలు చేశాడు మురళి.
మరుసటి రోజు మధ్యాహ్నం దారి కాశారు నలుగురూ. ఎదురుగా ఒక అమ్మాయి వస్తోంది. తల భూమిలోకి వంచేసుకుని, కాళ్ళకేసి చూసుకుంటూ నడుస్తూంది. కాళ్ళకు అరచేతి మందాన పసుపు రాసింది. పెద్ద బొట్టు పెట్టింది. దుప్పటంత మందం చీరె కట్టింది. అంతా కలిపి పాతకాలం నాటి కుందనపు బొమ్మలా వుంది.
ఎండ బాగా ఎక్కువగా వుంది. వీధి నిర్మానుష్యంగా వుంది. దూరంగా ఎక్కడో కాకి అరుస్తూంది.
మురళి ముందు కెళ్ళాడు. ఆమె సమీపానికి వచ్చాక "బిరుషోమి ! బిస్తినా - కమిరిషోన్" అన్నాడు. ఆ అమ్మాయి బెదిరిపోయింది. చేతిలో పుస్తకాలు జారిపోయినంత పనైంది. ఆ పెద్ద పెద్ద కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది.
"బిరుషోమి - బిస్తినా - కమిరిషోన్" అన్నాడు మళ్ళీ.
కాలేజీలో చదువుతున్నదన్న మాటేగానీ ఆ అమ్మాయితో ఒక పరాయి పురుషుడు మాట్లాడటం అదే మొదటిసారి. పరాయి పురుషులు అంటే - కేవలం రిక్షావాడు, పాలవాడు, పేపరు కుర్రవాడు, ఒక సారెప్పుడో ఇంగ్లీషు లెక్చరరు__వీళ్ళే మాట్లాడారు అప్పటి వరకూ.
ఆమె భయంతో "ఏ ... ఏ ... ఏమిటి." అంది.
"బిరుషోమి ! కమిరీషాన్ ! మిషికీషీ" అన్నాడు మురళి.
"వాడూ యు వాంట్ ?" అంది కాస్త ధైర్యం తెచ్చుకుని ఇంగ్లీషులో.
"బిరుషోమీ."
"హిందీ జాన్తే." అని ప్రశ్నించింది.
"కమిరిషోన్."
"ఎన్న భాషప్పా ఇది ..."
"మిషికీషీ."
అప్పుడే అటు పోతున్న కనకారావు ఆగి, వాళ్ళ అవస్థ చూసి జాలి పడుతున్నట్టు "ఏమిటండీ ?" అన్నాడు.
"ఏమిటో అడుగుతున్నాడండీ ఇతను. నాకేమీ అర్ధం కావడం లేదు" అంది రాధ. కనకారావు 'ఏమిట'న్నట్టు చూశాడు.
"బిరుషోమీ ! కమిరిషోన్ ! మిషికీషీ" అన్నాడు.
"అదన్న మాట సంగతి" అన్నాడు కనకారావు అర్ధమైనట్టు. తరువాత రాధ వేపు తిరిగి, "ఇది థార్ ఎడారి ప్రాంతపు భాషండీ ! పాపం ఇతని పర్సు ఎవరో కొట్టేశారుట. ఇంటికి చేరుకోవటానికి అయిదు రూపాయలు కావాల్ట" అన్నాడు.
ఆమె జాలిగా పర్సులోంచి అయిదు నోట్లు తీసి యిస్తూ. అయిదు రూపాయల్తో పాపం అంత దూరం ఎలా వెళతారండీ ? థార్ ఎడారి అంటే చాలా దూరం కదా ?" అంది.
కనకారావు అతడి వేపు తిరిగి. "బిక హో మా మానుంగి టాన్సే " అన్నాడు.