అక్కడవున్న శ్రోతలకి కూడా సిరిచందన స్థితి అర్థంచేసుకుంటే హృదయం ద్రవించింది. మరొకవైపు ఉక్రోషం, కసిపెరగసాగాయి. అది ఎంత దారుణమైనా స్థితో అందరూ ఊహించగలరు!
చేతుల కట్టేయటం.....నోటికి ప్లాస్టర్ వేయటం..... ఒకరు కాపలా ఉండటం..... ఇలాంటి కష్టాలేమీ లేకుండా, కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఒక బురదగుంటలో దాచి, ఆ వ్యక్తి ద్వారానే పోలీసులకి కాంటాక్ట్ ఏర్పాటు చేయటం చరిత్రలో అంతకుముందోసారి జరిగింది. ఒకే ఒకసారి......
కమీషనర్ ఆ వైర్ లెస్ సెట్ దగ్గిరే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ మరొక అయిదు నిమిషాల తర్వాత వైర్ లెస్ నుంచి వార్తా వచ్చింది. "అంకుల్! నేను".
"మీ నాన్నగారు ఇక్కడే వున్నారు మాట్లాడతావా?"
విష్ణువర్థనరావు చప్పున వైర్ లెస్ సెట్ ముందుకు లాక్కొని "అమ్మా సిరీ, ఎలా ఉన్నావ్? ఎక్కడ ఉన్నావ్? ఏం చేస్తున్నావ్?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
అట్నుంచి సిరిచందన "ఇక్కడంతా చీకటిగా ఉంది నాన్నా, లైటార్పివేశాను. ఫాన్ కూడా ఆర్పేశాను. అన్నిటినీ వాడితే బ్యాటరీ ఎక్కువకాలం రాదు. నేనెక్కడున్నానో నాకు తెలియదు. నేను మళ్ళీ గంట తర్వాత మీ కాంటాక్ట్ లోకి వస్తాను...... బ్రతికుంటే" అని స్విచ్ ఆఫ్ చేసింది.
అశ్వత్ధామ పిడికిలి బిగించి కసిగా అరచేతిలో కొట్టుకున్నయు. అతనికి ఏం చేయాలో తోచలేదు.
వన్- వె -ట్రాఫిక్ -వైర్ లెస్ కాబట్టి అవతలివ్యక్తి ఎక్కణ్ణుంచి మాట్లాడుతున్నాడో తెలుసుకోవటం కూడా కష్టమే. ఒకవేళ తెలుసుకోగలిగినా ఈ నాలుగైదు గంటల్లో కష్టం.
అతడికి నిశ్చయంగా తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సిరిచందన ఆ శవపేటికలో నాలుగైదు గంటలకంటే ఎక్కువ సేపు బ్రతకదని. ఆ టైమ్ కి ఒక వ్యక్తి లోపలి ప్రవేశించాడు.
"నమస్తే" అన్నాడు చేతులు జోడిస్తూ. కమీషనర్ విసుగ్గా "ఏం కావాలి?" అని అడిగాడు. ఆ సమయంలో ఆ అగంతకుడి ప్రవేశం కమీషనర్ కి విసుగు కలిగించటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
"నేను ఈ వీధి చివర కిరాణా షాప్ ఓనర్ని సార్"
"అయితే?"
"ఇప్పుడే ఒక ఫోనొచ్చింది. ఎవరో మీకొక విషయం చెప్పమని ఫోన్ చేశారు" అశ్వత్ధామ చప్పున కుర్చీలోంచి లేస్తూ "ఏమని?" అనడిగాడు ఉద్వేగంగా.
"పోలీస్ కమీషనర్ ఆఫీసుకి ఎదురుగా ఉన్న పోస్టుబాక్స్ లో ఒక కాగితం వుంటుంది. అది చదవమని కమీషనర్ గారికి చెప్పు, అన్నాడు. నాకు మొదట్లో ఎవరో ఆకతాయివాడు ఫోన్ చేశాడు అనిపించింది సర్, కానీ ఇది చెప్తే మంచిదేమో అనిపించి వచ్చాను."
"చాలా మంచిపని చేశావ్" భుజం తడుతూ అన్నాడు కమీషనర్. ఆయన మరి ఆలస్యం చేయలేదు, గబగబా బైటికి వచ్చాడు. బయట వున్న కమీషనర్ సిబ్బంది ఆశ్చర్యంగా ఆయనకేసి చూస్తున్నారు, ఆయన రోడ్డు క్రాస్ చేసి అవతలివైపు వున్న పోస్టుబాక్స్ దగ్గిరకి వెళ్ళాడు. పోస్టల్ బాక్స్ కి వున్న తాళాన్ని బ్రద్ధలు కొట్టటం చట్టరీత్యాం సమంజసం కాదని ఆయనకు తెలుసు. కాని ఆయన అవేమీ ఆలోచించే స్టేజీలో లేడు. క్షణం గడుస్తున్న కొద్దీ అక్కడ సిరిచందన మృత్యుముఖానికి దగ్గరగా వెళుతూంది. సిబ్బందితో ఆ తాళాన్ని బ్రద్ధలు కొట్టమని చెప్పాడు.
సిబ్బంది పోస్టుబాక్స్ తెరుస్తూ వుండగా ఆయన ఆలోచనలు 'రకరకాలుగా సాగాయి. కిడ్నాపర్స్ ఎక్కడా బయటపడకుండా ఒక్కొక్క ఎత్తు వేసుకురావటం ఆయనకీ ఆశ్చర్యం అనిపించింది.
ఈ లోపులో పోస్టుబాక్స్ లోంచి కాగితాన్ని బయటికి తీశారు సిబ్బంది. తెల్లకాగితం మీద క్లుప్తంగా వ్రాయబడి వుంది.
"సాయంత్రం ఐదింటికి గోదావరి ఎక్స్ ప్రెస్ లో కుడివైపు కూర్చొని ఒక వ్యక్తి బయలుదేరాలి. ఎక్కడో ఒకచోట పొలాల మధ్య ఎర్రజెండా కనబడుతుంది. వెంటనే కంపార్ట్ మెంట్ లోంచి బ్రీఫ్ కేస్ లు బయటికి విసిరేయాలి. ఆ తరువాత అరగంటకి మీ అమ్మాయి ఎక్కడ బంధించపడి వుందో తిరిగి చెప్పటం జరుగుతుంది." అంతే. ఆ నాలుగైదు వాక్యాలే ఉన్నాయి.
కమీషనర్ ఆ కాగితాన్ని పట్టుకొని తిరిగి తన ఆఫీసులోకి వచ్చాడు. గోదావరి ఎక్స్ ప్రెస్ అంటే మరొక మూడు గంటలు. ఆయన పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఎవరిమీదో తెలియని కసి..........
మూడు గంటలపాటు సిరిచందన ఆ శవపేటికలో వుండాలి అన్న ఆలోచనే ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మరోవైపు విష్ణువర్థనరావుని పట్టుకోవటం కష్టమవుతోంది.
ఆయన బి.పి. ట్రీట్ చేయటానికొచ్చిన డాక్టరుతో రహస్యంగా ఆయనకి సెడెటివ్ ఇమ్మని సలహా యిచ్చాడు అశ్వత్దామ. ఆ విధంగానే ఆయనకి ఇంజక్షన్ ఇవ్వబడింది. విష్ణువర్థనరావు నిదురలోకి జారుకున్నాడు.
అశ్వత్ధామ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు బిగించి, కిడ్నాప్ చేసిన వ్యక్తిని అహర్నిశలూ కనిపెట్టే అవసరం లేకుండా ఒక పేటికలోపడేయటం, టెలిఫోన్ లో డైరెక్టుగా మాట్లాడకుండా టేప్ రికార్డర్ ద్వారా సూచనలివ్వడం, పోస్టుబాక్స్ లో ఉత్తారాన్ని పడేసి తీసుకోమనటం, అన్నిటికన్నా ముఖ్యంగా పోలీసుల వలకి చిక్కకుండా నడుస్తున్న ట్రైన్ లోంచి బ్రీఫ్ కేస్ లు బయటికి విసిరేయమనటం....... ఖాన్ అంత గొప్ప ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎలా అయ్యాడో ఇప్పుడర్థమవుతోంది అశ్వత్ధామకి. ఆయన ఆలోచనలో ఉండాగానే మళ్ళీ వైర్ లెస్ లో సిరిచందన కంఠం వినిపడింది. ఆయన చప్పున వంగి "హలో" అన్నాడు.
"ఏమైందంకుల్?"
"అయిపోయిందమ్మా! ఇంకా కేవలం మూడు గంటలు మాత్రమే. కిడ్నాపర్స్ తమకి బంగారం ఎలా అందచేయాలో చెప్పారు. ఆరుగంటల ప్రాంతంలో వాళ్ళకి బంగారం అందచేయబడుతుంది. తర్వాత అరగంటలో నువ్వెక్కడున్నావో మాకు చెపుతామన్నారు."
"ఇంకా మూడు గంటలు!" అంది అట్నుంచి సిరిచందన. ఆమె కంఠం నిస్సహాయమైన ఏడుపు జీర..... ఆ అమ్మాయి అతికష్టంమీద తన టెన్షన్ ని బయట పడనివ్వకుండా ఆపుకుంటుందని అర్థమవుతుంది.
"నువ్వేం కంగారుపడకు సిరిచందనా. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం ముఖ్యం. సరిగ్గా మూడు గంటలపాటు ఫ్యాను, లైటు వేసుకుని లోపలే ఉండు. మేం వచ్చేస్తాం" ధైర్యం చెప్పాడు అశ్వత్ధామ. అట్నుంచి ఏం సమాధానం వినబడలేదు...... "హలో....హలో ......" సిరిచందన అంతకుముందే వైర్ లెస్ ఆఫ్ చేసిందని అర్థమైంది. అలా ఆపు చేయటానికి కారణం కూడా అశ్వత్దామకి తెలుసు.
బ్యాటరీ మరో మూడు గంటలపాటు ఖర్చుకాకుండా వుంచుకోవాలి అంటే వైర్ లెస్ ఉపయోగించడం మానెయ్యాలి!
అటువంటి పరిస్థితిలో కూడా ఆయన మనసులోని ఆమెని అభినందించకుండా ఉండలేకపోయాడు.
ఆమె ఫాన్ ఆపుచేసింది.
పేటిక లోపల బాగా వేడిగా ఉన్నట్లు అనిపించింది. ఆమెకి ఆశ్చర్యం కూడా వేసింది. చుట్టూ నీళ్ళు. మధ్యలో పెట్టె ఉన్నాకూడా లోపల ఇంత వేడిగా ఉండటం.
తనకి నిద్ర వస్తున్నట్టు అనిపించింది ఆమెకి. నిద్ర!
ఆమెకు సంతోషంగా అనిపించింది. ఈ పరిస్థితిలో నిద్ర పోటానికన్నా కావలసింది ఇంకేముందు?
ఆమె నిద్ర పోవటానికి ప్రయత్నించింది. కానీ అది అంత సులభం కాలేదు. ఒక రకమైన నాసియా ఫీలింగ్ అంతే.
కమీషనర్ చెప్పిన లెక్క ప్రకారం మరొకమూడు గంటలు...... ఆ తరువాత ఇంకొక గంట తనెక్కడున్నదో తెలుసుకోవటానికి పడుతుందనుకున్నా మొత్తం నాలుగు గంటలు...... అంటే రెండొందల నలభై నిమిషాలు..... అంటే పధ్నాలుగు వేల నాలుగు వందల సెకన్లు.
ఆమె లెక్కపెట్టటం మొదలు పెట్టింది.
ఒకటి.... రెండు .... మూడు ...... నాలుగు...... అయిదు ........ ఆరు.........
ఒక్కొక్క అంకెకి ఉజ్జాయింపుగా ఒక్కొక్క సెకను పడుతుంది అనుకుంటూ ఆమె సమయాన్ని అంచనా వేయసాగింది.
పదివేలు...... పదివేల ఒకటి...... రెండు...... మూడు......
గమ్యం దగ్గిర పడుతున్న కొద్దీ ఆమెలో రిలీఫ్ గా అనిపించసాగింది. దాదాపు తను బయటపడ్డాను అన్నా భావన ఆమెకి బాగా సంతృప్తినిచ్చింది. అదీగాక ఈ కౌంటింగ్ వల్ల టైమ్ కరెక్ట్ గా తెలుస్తుంది. మరో రకంగా అది ఒక కాలక్షేపంగా కూడా అనిపించింది.
పధ్నాలుగు వేల మూడు వందల ఎనభై...... తొంభై...... పధ్నాలుగు వేల నాలుగు వందలు.
ఆమె లెక్కపెట్టటం ఆపుచేసింది. సరిగ్గా నాలుగు గంటలు గడిచాయి అన్న నిర్ధారణ అయిన తర్వాత ఆమె దూరంనుంచి వినబడబోయే అడుగుల కోసం ఊపిరి బిగపట్టింది.
హెలూసినేషన్ తప్ప మరేమీలేదు. నాలుగ్గంటలు గడిచి వుండకపోవచ్చు. లేదా ఆరుగంటలు గడిచి వుండవచ్చు. బయటి నుంచి ఏ శబ్దమూ వినబడలేదు.
బయట శబ్దాలేవీ లోపలికి వినబడవని ఈ తరువాత ఆమెకి జ్ఞాపకం వచ్చింది. పెట్టెని ఎవరైనా కదుపుతున్నారేమో అని జాగ్రత్తగా కదలకుండా వుండిపోయింది. అటువంటి జాడాలేమీ లేవు.
తను తప్పు లెక్క బెట్టానేమో అనుకుంది. మళ్ళీ పన్నెండు వేలనుంచీ లెక్కబెట్టటం మొదలు పెట్టింది.
దాదాపు మరొక గంట. బయట ఏ అలికిడీ లేదు.
అప్పుడు వచ్చిందామెకు అనుమానం- తను మరణానికి చేరువవుతున్నానని.
అప్పటికి ఆమె శవపేటికలో బంధింపబడి ఎనిమిది గంటలయ్యిందని ఆమెకు తెలీదు.
7
గోదావరి ఎక్స్ ప్రెస్ వేగంగా వెళుతోంది. ఇంజన్ నుంచి మూడో కంపార్టుమెంటులో కుడివైపున కూర్చుని వున్నాడు రవితేజ. అతని పక్కనే రెండు బ్రీఫ్ కేసులున్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు కూపే అది. అందులో అతను తప్ప మరెవరూ లేరు.
పోలీస్ ఎస్కార్టు కూడా ఏం లేదు. కిడ్నాపర్ బంధించటానికి ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు పోలీసాఫీసార్లు.
అది అసాధ్యం కూడా.
ఏ పాయింట్ దగ్గర ఎర్రజెండా కనబడుతుందో, ఎక్కడ బ్రీఫ్ కేసులు విసిరేయాలో..... ఆ పాయింట్ దగ్గర పోలీసుల్ని నియమించటం అసాధ్యం. ట్రాక్ అంతా పోలీసుల్ని నిలబెట్టడం కూడా సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల అలాంటి వ్యూహమేమీ పన్నలేదు. వెళ్తున్న రైల్లోంచి బ్రీఫ్ కేసులు విసిరేసిన తర్వాత, ఎంత సేపటికి కిడ్నాపర్ అక్కడికొచ్చి వాటిని తీసుకుంటాడో తెలుసుకోవటం కూడా కష్టమే. పోలీసాఫీసర్లు కిడ్నాపర్ చెప్పినట్టే చేయతాన్నికి నిశ్చయించుకున్నారు. దాని పర్యవసానమే ఈ ప్రయాణం. రైలు వేగంగా వెళుతోంది. రవితేజ కిటికీలోంచి కన్నార్పకుండా చూస్తున్నాడు.