ఉపసంహారం
నేను మరణించానా?
లేదు. చుట్టూ అలికిడి తెలుస్తోంది.
ఆస్పత్రి వాసన ముక్కుపుటాలకు తగుల్తోంది. క్రమక్రమంగా జరిగింది స్ఫురణకు రాసాగింది.
నాక్కూడా తెలియకుండా జాన్ డేవిడ్ పోలీసులతో సహా నన్ను ఫాలో అయ్యాడన్నమాట! కృపానంద్ నా వెనుక ఎవరన్నా వస్తున్నారేమో అని "కొంచెం సేపు మాత్రమే" జాగురూకతతో వుంటాడని డేవిడ్ వూహించి వుంటాడు. అది సరీగ్గా కరెక్టయింది.
అయితే- దురదృష్టం మరో రూపంలో మమ్మల్ని వెంటాడింది.
....నా కోసం గురిపెట్టిన గుళ్ళు మరొకరి శరీరాన్ని ఛిద్రం చేయటంతో కృపానంద్ కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఈ లోపులో ఇన్ స్పెక్టర్ వేగంగా లోపలికి వచ్చి తన రివాల్వర్ తీయబోయాడు. శవాకారంలోవున్న జాన్ డేవిడ్ అతడిని వారిస్తూ "మెజిస్ట్రేట్ ని పిలిపించండి ఇన్ స్పెక్టర్ గారూ! నేను మరణ వాగ్మూలం ఇవ్వాలి" అన్నాడు. ఇన స్పెక్టర్ ఓ క్షణం అతడివైపు అయోమయంగా చూసి అంతలోనే తేరుకుని "నో...... మిమ్మల్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అన్నాడు కంగారుగా.
"నేనూ డాక్టర్నే ఇన్ స్పెక్టర్. ఇక నేను బ్రతకనని తెలుస్తూనే వుంది. తొందరగా మేజిస్ట్రేట్ ని పిలిపించండి" వాదించే ఓపిక లేనట్టుగా అన్నాడు.
ఇన్ స్పెక్టర్ బయటికి పరుగెత్తాడు. పోలీసులు కృపానంద్ దగ్గర పిస్తోలు స్వాధీనం చేసుకుంటున్నారు. అతడింకా అదే అచేతనావస్థలోనే వున్నట్టున్నాడు. షాక్ నుంచి తేరుకోలేదు.
తనని ఇక ఎవరూ రక్షించలేరని బహుశ అతడికి తెలిసిపోయి వుంటుంది. సాక్షులు కోర్టులో చెప్పటం వేరు, హతుడే మరణించేముందు తనని హత్యా చేసిందెవరో- జడ్జికి చెప్పటం వేరు. కేసుకిక తిరుగుండదు. అందుకే జాన్ డేవిడ్ ఆ పోలీసు అధికారిని ఆ విధంగా కోరాడని అనుకున్నాను. కృపానంద్ ని శాశ్వతంగా జైలుకి పంపటం ద్వారా నాకూ, నా కుటుంబానికీ, సుమద్యుతికీ ఇక పై ఆ శాడిస్ట్ తరపునుంచి జాన్ ఏ ప్రమదమూ లేకుండా చేయదల్చుకున్నాడనుకున్నాను.
అయితే నా అంచనా తప్పని సరీగ్గా అయిదు నిమిషాల తర్వాత తెలిసింది.
తన జీవితపు చివరిక్షణాల్లో- అతడు తన జీవితానుభవాన్నంతా క్రోడీకరించి, కొద్ది మాటల్లో చెప్పిన విధానాన్ని నేను నా జీవితాంతం మర్చిపోలేను. అతడి ఆఖరి నవలలో ఆఖరి ఛాప్టర్ ని అక్కడే పూర్తిచేసినట్టుంది. మనిషి ఎందుకు మనిషిగా బ్రతకాలో వివరించిన అతడి జీవితపు చివరి వాక్యాలు అవి.
"ఇంకొకరి విషాదమే మన ఆనందం అయితే, ఆ ఆనందమే మనకొద్దు. అంతకన్నా దౌర్భాగ్యపు స్థితి ఒకటుంది! ఏది ఆనందమో, ఏది విషాదమో తెలుసుకోలేకపోవటం. విషాదిస్తూన్నా, ఆ పరిసరాల్నీ పరిస్థితుల్నీ మార్చుకోలేకపోవటం!! అదే అసంతృప్తికి మూలకారణం!! ఈ వాచీ ఎవరిదంటే నీదంటావు. ఈ బట్టలు ఎవరివంటే నీవంటావు. ఈ శరీరం ఎవరిదంటే నీదంటావు. మూడింటికీ తేడాలేదు చూసావా? శరీరంతో సహా అన్నీ బాహ్యాలే అయినప్పుడు మరి నీ వెవరు? ఏది నీకు ఆనందాన్ని ఇస్తుంది? అది తెలుసుకోవటమే జీవితం! ప్రేమవున్న చోటే తృప్తి వుంటుంది. తృప్తి అంటే జీవితంపై నీకున్న నమ్మకం!! నీపైనా, నీ చుట్టూ వున్న వ్యక్తులపైనా నమ్మకం లేకపోవటమే నీ అసంతృప్తి పోతుంది. తార్కికంగా ఆలోచించే వీలు కలుగుతుంది. అంకిత్ తన బిడ్డే అయితే- తన కిడ్నీ ఇవ్వకుండా నీ కోసం, నీ భార్యకోసం అతను ప్రాణాలకు తెగించి ఎందుకు వెతుకుతాడన్న తర్కం తోస్తుంది. యింత చిన్న విషయం నీకు తోచకపోవటానికి కారణం ఆలోచించు, ఇకపోతే- నేను మేజిస్ట్రేట్ ని రమ్మన్నది- నీకు ఉరిశిక్ష వేయించటానికికాదు. ట్యూమర్ బాధ భరించలేక నేనే ఆత్మహత్య చేసుకున్నానని మరణ వాగ్మూలం యివ్వటానికి!..... సంవత్సరంలోగా మరణం ఎలాగూ నన్ను కబళిస్తుంది. అటువంటప్పుడు ఈ నా మరణం నిన్ను 'మనిషి'గా బ్రతికించటానికి ఉపయోగపడితే అంతకన్నా కావల్సింది ఏముంది? ఈ హత్యకు శిక్షగా, నీలోని సాడిజానికి ఉరిశిక్ష విధించుకో" ఆగి చివరగా అన్నాడు.
"నా నమ్మకాన్ని నిలబెడతావో, నా యీ చర్యని చూసి ఇంకొకసారి నవ్వుకుంటావో నీ ఇష్టం. అది చూడటానికి నేనుండను. కానీ మారతావన్న నమ్మకంతో నీ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను. చెప్పానుగా! నమ్మకమే మనిషికి తృప్తినిస్తుంది.... నా మరణం నీకు 'మనిషి' మీద నమ్మకాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను...."
ఆ తరువాత వాక్యాలు నాకు వినపడలేదు. విషప్రభావానికి నా కళ్లు మూతలు పడసాగాయి. నా స్థితి అప్పుడే గమనించిన పోలీసు నా వేపు పరుగెత్తుకు రావటమే ఆఖరిదారి నేను చూసింది.
* * *
ఇరవై నాలుగ్గంటల తర్వాత నేను కళ్ళు విప్పేసరికి మొట్టమొదట కనపడింది నా భార్య అరుంధతి.
పక్కనే సుమద్యుతి నిల్చుని వుంది.
సు.......మ.......ద్యు.......తి.
అంతే!
నా సంతోషమంతా ఆవిరైపోయింది.
సుమద్యుతి ఇక్కడే వున్నదంటే.....అంకిత్ ఆపరేషన్ జరగలేదన్నమాట.
అయిపోయింది. నేను చేసిన పనంతా వృధా అయిపోయింది. "మీరు అదృష్టవంతులు. మీ భర్తకి ఇక ఏ ప్రమాదమూలేదు" డాక్టర్ అరుంధతితో అంటున్నాడు. నేను అదృష్టవంతుణ్నా? ఆ స్థితిలో కూడా ఆ మాటలకి నవ్వొచ్చింది.
"ఆయనకి మెలకువ వచ్చింది" నర్స్ అంటోంది. అరుంధతి నా చేతిని తన చేతిలోకి తీసుకుంది.
"అం......కి.....త్....అంకిత్ ఎక్కడ?" నా గొంతు బలహీనంగా పలికిన మొదటి మాటలివి.
"పక్కగదిలో ఉన్నాడు........." డాక్టర్ మహారధి అన్నాడు"........మీరు ఇప్పుడు లేవడానికి వీల్లేదు."
ఆయన రెండో వాక్యం వినలేదు నేను. ఒక్కసారిగా రక్తప్రసరణం హెచ్చడంతో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత టెన్షన్ వచ్చింది.
"అంకిత్ కి కిడ్నీ ఎవరిచ్చారు?"
అరుంధతి సన్నగా నవ్వింది. సుమద్యుతి సంతోషంతో హసించింది.
"వాడి కన్నతండ్రి ఇచ్చాడు."
నేను నమ్మలేనట్టు చూసాను. "కృ....పా..... కృపానంద్ ఇచ్చాడా?"
"అవును. ఆయన కూడా పక్కరూమ్ లోనే ఉన్నారు. ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలట. డాక్టర్ మహారధి చాలా సంతోషంగా ఉన్నారు. కొడుకుని మొదటిసారి ఈ విధంగా......" సుమద్యుతి ఆనందంగా చెప్పుకుపోతోంది.
వినడం లేదు నేను. "జాన్......జాన్.." అనుకున్నాను ఆర్తిగా! ఒక నీటిచుక్క కంటి చివరి నుంచి జారి అంజలి ఘటించింది.
2
మనం గాలి దిక్కుని మార్చలేకపోవచ్చు. కానీ తెరచాప దిక్కుని మార్చుకోగలం.
* * *
పాతిక సంవత్సరాల తర్వాత-
"ఓరే నాయనా! కాస్త ఆగరా!" ఇక పరుగెత్తలేక ఆయాసంగా అన్నాను.
వాడు ఆగకుండా ".......సారీ గ్రాండ్ ఫా. నాన్న ముందెళ్ళి పోతున్నాడు, పట్టుకోవాలి" అంటూ పరుగెత్తసాగాడు.
ఆ మాటలు అంకిత్ వినినట్టున్నాడు. ఆగి వెనక్కి తిరిగి కొడుకుని చూసి నవ్వాడు....."ఒరేయ్ జాన్! నువ్వు నన్ను పట్టుకోగలవనే?" అంటూ.
నాలుకతో వెక్కిరించాడు నా మనవడు-ఎనిమిదేళ్ళవాడు - తండ్రిని వేగంగా దాటుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇద్దరూ ఇసుకలో పరుగెడుతున్నారు. తండ్రీ కొడుకుల్ని చూస్తూ నేను ఫిరంగి వేపు నడిచాను.
ఫిరంగి ఇప్పుడు నన్ను ఈర్ష్యగా చూస్తూంది. దాని అసూయని అణగద్రొక్కటం కోసం నేను దానిపైకి ఎక్కాను.
విధిని ఎదిరించిన ముసలిరాజు లాగ!!!
ఫిరంగిమీద నా మనవడు రాతితో చెక్కిన "తన పేరు" సాయంత్రం ఎండలో మెరుస్తోంది.
"జాన్ డేవిడ్".
(శుభం)