ఆశ్చర్యపోయాడు మచ్చల డాక్టర్. మధ్యాహ్నం తన చేతికి ఉత్తరం ఇస్తూ భాస్కర్ సరిగ్గా ఇవే మాటలన్నాడు. 'మచ్చల డాక్టర్' అని తనను అవహేళన చేసే ఈ వ్యక్తులందరికీ తనలో ఇంత నమ్మకముందా?
ఉత్తరం తెరిచి చదవటం మొదలు పెట్టాడు: "సుశీలా!
నేను నీ దయతో చదువుకున్నాను. మీ నాన్నగారి దయతో ఉద్యోగస్థుణ్ణియ్యాను. ఈ ఋణం తీర్చుకోవాలని ఈ అయిదేళ్ళుగా ప్రతిక్షణం యాతనపడుతూనే ఉన్నాను. కానీ, నిన్ను సంతృప్తిపరచగలిగే శక్తి నాకు లేదని తేలిపోయింది. నువ్వు నామీద కోపంతో, ఏకంగా చచ్చిపోయి ఆ రకంగా నన్ను సాధించాలనుకున్నావు. నాకు నీమీద కోపం లేదు. నీకూ నాకూ కూడా నరకంగా ఉన్న సంసారంలోంచి నీకు విముక్తి కలిగించి, నేను విముక్తుణ్ణవ్వాలనే వెళ్ళిపోతున్నాను. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నాకు రావలసిన ప్రోవిడెంట్ ఫండ్ వగైరా అన్నీ నీ పేరు మీదకు మార్పించాను. నేను మరొక ఉద్యోగం చూసుకున్నాక.... నిన్ను మీ నాన్నగారు ఆదుకోకపోతే, నీకు అవసరమయితే.... నెలనెలా నా జీతంలోంచి కొంత పంపిస్తాను. ఇంతటితో నా ఋణం తీరుతుందో లేదో నాకు తెలియదు. ఏమయినా, ఇంతకంటె నేను చెయ్యగలిగింది లేదు.
సుఖంగా ఉండు....
భాస్కర్...."
మచ్చల డాక్టర్ ఉత్తరం పూర్తిచేసేసరికి సుశీల తెలివితప్పి పడిపోయింది. ముఖం మీద నీళ్ళు చల్లి విసిరితే తెలివి తెచ్చుకుంది. తల గోడకేసి కొట్టుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది.
"ఇంత శిక్షవద్దు. నేను భరించలేను" అంది.
అప్పటికి ఈ గొడవ అందరికీ తెలిసిపోయింది. ఐరావతమ్మ రేవతి వచ్చారు. "ఊరుకోమ్మా, ఊరుకో!" అని ఓదార్చటానికి ప్రయత్నించింది ఐరావతమ్మ.
"నేను చావటానికి ప్రయత్నించాను. అయినా బ్రతికాను. ఇప్పుడు బ్రతికే ఉన్నాను. కానీ, చచ్చినదానినే!" అని కుమిలిపోసాగింది సుశీల.
"అన్నట్లు జ్యోత్స్న ఉందా?" అంది ఐరావతమ్మ.
ఆ మాటతో సుశీల ఏడుపు మరిచిపోయి పాలిపోయిన ముఖంతో చూపులేని కళ్ళతో చూసింది.
మాజీ తహసీల్దారుగారు కనుక్కోవటానికి వెళ్ళారు. జ్యోత్స్న లేదనీ, ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయిందనీ వర్తమానం తీసుకొచ్చారు.
కెవ్వుమని ఆర్తనాదం చేసింది సుశీల!
"ఇంతవరకూ కాస్తో కూస్తో ఆశ ఉంది. ఇప్పుడిక ఏ ఆశాలేదు." అని ఆ దుఃఖాగ్నిలో ఆజ్యం పోసింది ఐరావతమ్మ.
సరిగ్గా ఆ సమయంలో "భాస్కర్!" అన్నాడు ఏకాంబరం సంతోషంగా, సంభ్రమంగా.
"ఆఁ!" అంటూ లేచి నించుంది సుశీల! తడుముకుంటూ తడుముకుంటూ వచ్చి భాస్కర్ కాళ్ళదగ్గిర కూలబడిపోయింది.
"ఏమండీ! నన్ను క్షమించండీ! ఈ గుడ్డిదాని బ్రతుకు బజారు పాలు చెయ్యకండీ! నేను తల్లిని కాబోతున్నానండీ! ఆభమూ శుభమూ తెలియని మీ బిడ్డని దిక్కులేని వాణ్ణిగా చెయ్యకండీ!"
సుశీల తన నోటితో తను గుడ్డిదానినని ఏడుస్తోంది, భాస్కర్ భరించలేకపోయాడు. సుశీలను లేవనెత్తి "లే! ఇదంతా ఏమిటి? ఛ! కళ్ళు తుడుచుకో!" అన్నాడు. సుశీల కళ్ళు తుడుచుకుంది. కానీ, ఇంకా వెక్కిళ్లు పడుతూనే ఉంది.
మచ్చల డాక్టర్ వైపు ఇబ్బందిగా చూశాడు భాస్కర్. అతడు అందరినీ చూసి నిర్మొహమాటంగా "ఇంక సుశీలగారిని ఓదార్చవలసిన అవసరంలేదు. అందరూ బయటకు పదండి" అని అందరినీ తరిమి తనూ వెళ్ళిపోయాడు. సుశీల పక్కనే కూచుని ఆవిడ కళ్ళు తుడిచాడు భాస్కర్.
18
లక్ష్మీవారం నాడే జ్యోత్స్న అంగీకారం తీసుకుని శుక్రవారంనాడు తమ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు భాస్కర్. సుశీల శనివారం వస్తుందనే ఉద్దేశంతో సుశీల కిమ్మని మచ్చల డాక్టర్ కి ఉత్తరం ఇచ్చాడు.
రైల్వేస్టేషన్ కి చేరుకుని జ్యోత్స్న రాకకోసం ఆరాటంగా ఎదురు చూస్తోన్న భాస్కర్ కళ్ళకి జ్యోత్స్న కనిపించలేదు. ఒగరుస్తూ, ఆయాసపడుతూ వస్తూన్న సుబ్బలక్ష్మి కనిపించింది. భాస్కర్ పై ప్రాణాలు పైనపోయాయి.
"భాస్కర్ గారూ. జ్యోత్స్నగారు మీకీ ఉత్తరం ఇయ్యమన్నారు." అని గట్టిగా అరుస్తూ ఒక ఉత్తరం భాస్కర్ చేతికిచ్చి ఆయాసపడుతూ నిలబడింది సుబ్బలక్ష్మి.
"భాస్కర్:
నన్ను క్షమించు. నేను నీతో రావటంలేదు.
జ్యోత్స్న...."
ఇంతే ఉంది ఆ ఉత్తరంలో. భాస్కర్ క్రుంగిపోయాడు.
"భాస్కర్ గారూ: మీరూ జ్యోత్స్నగారూ లేచిపోదామనుకున్నారా?" నవ్వుతూ అడిగింది సుబ్బలక్ష్మి.
భాస్కర్ సుబ్బలక్ష్మిని చీదరగా చూచి ఆలోచిస్తూ నిలబడిపోయాడు.