Previous Page Next Page 
అంకితం పేజి 36


    "నేను పాపని తీసుకుని వరంగల్ వరకూ టాక్సీలో వెళతాను. అక్కణ్నుంచి ట్రెయిన్  లో వెళతాను. బహుశా మహారధి ఆస్పత్రి దగ్గిర కూడా పోలీసులు కాపలా కాస్తూ వుండి వుండవచ్చు. బయటనుంచి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి , ఆపరేషన్ ఎక్కడ చేసేదీ......పాపని ఎక్కడికి తీసుకు రావల్సిందీ అడుగుతాను. నా ఉద్దేశ్యంలో ఈ ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరగాలి. ఒకసారి ఆపరేషన్ చేసి తన కూతురి కిడ్నీ తిరిగి తనకి అప్పగించమని కోర్టులో మళ్ళీ దావా వేస్తాడా? చూద్దాం ఏమవుతుందో...... అలాగే కానీ  జరిగితే చరిత్రలో ఇంతవరకు  కనీ వినీ ఎరగని సంచలనాత్మకు వార్త అవుతుంది అది. ఇకపోతే- శ్వేతని ఆపరేషన్ టేబిల్  వరకూ రహస్యంగా తీసుకువెళ్ళటానికి తోడ్పడినందుకు నాకూ శిక్ష పడవచ్చు. మీతోనూ,  నా భర్తతోనూ నేనుకూడా జైల్లో కూర్చుంటాను. అంకిత్ కోసం మనం ఆ మాత్రం చేయటంలో తప్పేముంది?"

    ఈసారి ఆనందభాష్పాలు జలజలా రాలలేదు- దుఃఖంతో గొంతు పూడలేదు. ఆ త్యాగానికి కళ్ళు చెమ్మగిల్లలేదు.

    ఒక అనిర్వచనీయమైన ప్రేమభావంతో మనసు పొంగింది. అన్నిటి కన్నాముఖ్యంగా, ఆమె వివరంగా ఆలోచించిన విధానానికి అబ్బురమనిపించింది. దయ......మృణాళిని..... అరుంధతి.... ఒక్కొక్క రూపంలో నాకు ఆ క్షణం దేవతల్లా కనిపించారు.

    "అసలు కృపానంద్ కి ఇంత పలుకుబడి ఎక్కణ్నుంచి వచ్చింది?" జాన్  స్వగతంగా అన్నాడు.

    "టి.వి.లో పనిచేస్తాడుగా. చాలా పరిచయాలు వుండవచ్చు. ఏ పోలీస్ కమీషనర్ నో బ్రతిమాలి వుంటాడు" అన్నాను.

    "ఇక ఆలస్యం దేనికి?" అంటూ దయ లేచింది. ఆమెతోపాటు జాన్ కూడా లేచాడు. వెనుకనుంచి వారిద్దర్నీ చూస్తూంటే నా మనసు అదోలా అనిపించింది. మృత్యువు జాన్ ని సమీపిస్తోందని అతడి భారమైన నడకవల్లే తెలుస్తోంది. పళ్ళ బిగువున బాధని అదిమిపెట్టి భారంగా నడుస్తున్నాడు. మనసులోనే ప్రార్థించాను. "......భగవంతుడా! నువ్వంటూ నిజంగా వుంటే, నా జీవితకాలపు మొత్తాన్ని తీసుకోనయినా సరే...... నా స్నేహితుడి ఆరోగ్యాన్ని మరికొద్దికాలం పొడిగించు."


                         *    *    *

    గంట తర్వాత సుమద్యుతినుంచి ఫోన్ వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ముందుగా అడిగాను. "నాతో మాట్లాడుతున్నప్పుడు వెనగ్గా వచ్చిన కృపానంద్, నిన్ను ఏమయినా హింసించాడా?"

    "అవును! మొదట అతనికి అర్థంకాలేదు. సెల్యూలర్ ఫోన్ చూసి అవాక్కయ్యాడు. అతడు దాన్ని వూహించలేదనుకుంటాను. తనకన్నా అవతలివాళ్ళు ఎక్కువ తెలివితేటల్తో ఎత్తులువేస్తే అతడు సహించలేడు. నరరూప రాక్షసుడు అవుతాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి పోలీసులు వచ్చారు. మీరే పంపారు కదూ....."

    "అవును".

    "థాంక్స్. కానీ పోలీసుల్లో అతడికి చాలా పలుకుబడి వుంది. అతడిని చూడగానే ఇన్ స్పెక్టర్ చల్లబదిపోయాడు. అయితే అది నాకు ఒకరకంగా ఉపయోగపడింది. నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం అప్పుడే తీసుకున్నాను ఆ పోలీసుల సమక్షంలోనే".

    "ఏమిటది?" ఆతృతగా అడిగాను.

    ".....కృపానంద్ నుంచి విడిపోవటం" నిర్మలంగా వున్నదా గొంతు. నేను విచలితుడినై ".....ఆ నిర్ణయాన్ని అప్పుడు తీసుకున్నావా?" అని అడిగాను."

    "అవును" అన్నాదామె. "మొత్తం ఇంతకాలం అతడు పెట్టిన నరకయాతనంతా పోలీసులకి చెప్పాను. నేను అతన్నించి విడిపోవాలనుకున్నాననీ, పోలీసుల రక్షణ నాకు కావాలనీ అడిగాను. ఇన్ స్పెక్టర్ అయోమయంలో పడ్డాడు. కృపానంద్ పలుకుబడి సామాన్యమైనదికాదు. అతడు ఏమీ చెప్పలేక పోతూంటే- గవర్నర్ వద్దకు వెళతానని బెదిరించాను. దాంతో బెదిరిపోయాడు. పోలీస్ ఎస్కార్టుతో ఆ బందిఖానా నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నేను స్వేచ్చా జీవిని....." ఆమె స్వరం హాయిగా పలికింది. నేను మాత్రం యింకా షాక్ నుంచి తేరుకోలేదు. నా స్థితి గమనించినట్టుగా ఆమె అన్నది- "ఇక మీరేమీ దిగులు చెందనవసరంలేదు. కిడ్నీ ఇచ్చి నా కొడుకుని నేను రక్షించుకుంటాను. అన్నట్టు శ్వేత ఎక్కడ?"

    "ఇప్పుడే 'దయ' ఆ పాపని తీసుకుని వరంగల్ బయల్దేరింది......" వివరించాను.

    "ఫర్వాలేదు! ఇక శ్వేత అవసరం లేదు. నేను విడిగా బయల్దేరి విశాఖపట్టణం వస్తాను. మా మావగారికి, అదే -డాక్టర్ మహారధికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన నర్సింగ్ హొమ్ లో ఆపరేషన్ అంటే కృపానంద్ మరేదయినా ప్రమాదం తల పెట్టవచ్చు. అందువల్లే స్థలం మార్చమన్నాను. ఆయన కూడా దానికి వప్పుకున్నాడు......"

    ఎందుకో తెలీదు కానీ, సమస్యన్నీ ఒక్కసారిగా దూదిపింజెల్లా ఎగిరిపోతున్నట్టు అనిపించింది. మనసు తేలికయింది. "ఎంతో ఆర్గనైజ్డ్ గా అన్ని పనులూ నిర్వరించావు సుమా! నీకు కృతజ్ఞతలు..." అంటూ అనబోతూంటే ఆమె వారించింది. "ఇదంతా మీ కోసం కాదు. నా మూర్ఖత్వంతో శాశ్వతంగా వదులుకున్న నా కొడుకుకోసం......" ఆగి అన్నది "..........శ్వేతని తీసుకుని విదేశాలకు వెళ్ళిపోదా మనుకుంటున్నాను. మళ్ళీ ఏ ఇరవై సంవత్సరాల తరువాతో వస్తాను. అంకిత్ పెళ్ళికి....." నవ్వింది.

    "సుమా....." ఆర్ద్రంగా పలికింది నా గొంతు. "ఇదంతా జరిగింది నావల్లే కదూ?"

    "కాదు..." దృఢంగా అంది. "లాస్ట్ స్ట్రా ఆన్ కెమెల్స్ బ్యాక్ అన్న సామెత తెలుసుగా. అలా జరిగింది ఈ వ్యవహారం. ఎప్పటినుంచో వున్న మధనకి అంకిత్ ఈ విధంగా పరిష్కారం చెప్పాడు. మీరూ బయల్దేరండి. మన కాంటాక్ట్ వైజాగ్ లో డాక్టర్ మహారధి. అక్కడ కలుసుకుందాం. ఈ లోపులో కృపానంద్ విషయంలో జాగ్రత్తగా వుండండి. అసలే దెబ్బతిని వున్నాడు. ఏ చాటునుంచో ఊహించని రీతిలో దెబ్బతీస్తాడు.

    "అసంభవం...." అంటూ ఫోన్ పెట్టేసాను. నా కిప్పుడు ప్రపంచంలో ఏ శక్తినయినా ఎదుర్కొనే ధైర్యం   వచ్చినట్టు అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా, న్యాయంతోపాటు చట్టం కూడా నావైపే వున్న ఫీలింగ్. శ్వేతని వెనక్కి పంపిస్తేచాలు. ఏ కేసూ లేదు. సుమస్యుతిని అంకిత్ కి కిడ్నీ ఇవ్వకుండా కోర్టు ఆపలేదు కూడా. ఏకోణంలోంచీ కృపానంద్ ఈ ఆపరేషన్ జరక్కుండా నిరోధించలేడు అనుకున్నాను స్థయిర్యంగా.

    అక్కడే కృపానంద్ తెలివితేటల గురించి నేను తప్పు అంచనా వేసింది.

                                                           15


    ఒకపని చేసి విజయం సాధించలేని మనిషి- మరో మనిషి చేసే అదే విజయానికి ప్రేక్షకుడవుతాడు.

    మేము బయల్దేరబోతోన్న అరగంట ముందు మళ్ళీ ఒకసారి ఫోన్ వచ్చింది. రిసీవర్ తీసి "హల్లో" అన్నాను. వెంటనే డిస్ కనెక్ట్ అయింది. రిసీవర్ పెట్టేస్తూ "......కృపానందే...." అన్నాను జాన్ డేవిడ్ తో. "మనం ఇంట్లోనే వున్నామని నిర్ధారించుకోవటానికి ఫోన్ చేసాడు. ఇంకో అయిదు నిముషాల్లో పోలీసులు మళ్ళీ వస్తూ వుండొచ్చు. మనం వెంటనే బయల్దేరటం మంచిది......" అంటూ లేచాను. ఇద్దరం వచ్చి కార్లో కూర్చున్నాం. అదే సమయానికి ఒక ఆటో  వచ్చి ఆగింది. అందులోంచి సుమద్యుతి దిగింది.

    ఆ సమయంలో ఆమెని అక్కడ చూసి ఆశ్చర్యపోయాము. ఆమె హడావుడిగా వచ్చి కారు ఎక్కుతూ, "త్వరగా పోనివ్వండి. మిగతా విషయాలు కార్లో చెపుతాను" అంది.

    స్టేషన్ వెళ్ళటం కోసం కారు బయల్దేరిన తరువాత ఆమె అన్నది. "హిందూ ముస్లిమ్ గొడవలు పక్క పట్టణాల్లోకి కూడా పాకాయి. కాజీపేట దగ్గిర రైళ్ళు ఆపుచేస్తున్నారు."

    కీచుమన్న బ్రేకుల శబ్దంతో కారు ఆగిపోయింది. నేను ఒక రకమైన అచేతనావస్థలో నిశ్చేష్టుడినై, వారివైపు చూసాను. రైళ్ళు ఆగిపోయాయంటే.......వరంగల్ లో దయ, శ్వేత చిక్కుబడిపోయి వుంటారు. అది ఒక పెద్ద సమస్యకాదు. అంకిత్ సుమద్యుతి కిడ్నీ దానం చేస్తానన్నది కాబట్టి.......కనీసం ఆమెనయినా విశాఖపట్టణం చేర్చాలి.

    చేతివరకూ వచ్చిన విజయం చేజారిపోయిన అనుభూతి. ఏం చెయ్యాలో తోచలేదు. విధి నామీద ఎందుకింత పగబట్టిందో అర్థంకాలేదు.

    "ఎయిర్ పోర్ట్ కి పోనీ...... జాన్ అన్నాడు. నేను అయోమయంగా అతడి వైపు చూసాను. అతడి మాటలు అర్థంకాలేదు. ఈ టైమ్ లో విశాఖపట్టణం విమానం ఎక్కడుంది? అదే మాట అన్నాను. అతను నావైపు ఓ క్షణం కన్నార్పకుండా చూసాడు. ఆ తరువాత అన్నాడు..... "నేను నీకేం చెప్పాను? నేను నా రచనల్లో ఎన్నిసార్లు వ్రాసినా నువ్వు అర్థం చేసుకోవు. కనీసం నువ్వు కూడా......నేనిదంతా మీకోసం వ్రాస్తున్నానని అనుకోవు" అన్నాడు. "మీ" అన్న పదాన్ని వత్తి పలుకుతూ.

    "ఇంతకీ ఏమిటి నువ్వు చెప్పదల్చుకున్నది?" అని అడిగాను విసుగ్గా. అతడా సమయంలో అలా గురుబోధ చేయటం నాకు నిజంగా చిరాకనిపించింది అతనన్నాడు-

    "మనకి మద్రాసు విమానం దొరకొచ్చు. లేదా రాజమండ్రిది దొరకవచ్చు. భువనేశ్వర్ డి వుండొచ్చు. ఏది దొరికినా హైద్రాబాదునుంచి బయటపడతాం కదా. ఏడీ దొరకలేదనుకో. కనీసం, ఒక ప్రయత్నం చేయలేదేమో అన్న అసంతృప్తి వుండదుకదా!"

    నేను సిగ్గుతో తలవంచుకున్నాను...... నిజమే! నేనింతదూరం ఆలోచించలేదు. "......ఐ...యామ్....సారీ" అన్నాను క్షమాపణ చెప్పుతున్నట్టు. సుమద్యుతి అతడివైపు మెచ్చుకోలుగా చూసింది. అతడెందుకు అంత మంచి రచయితలు తక్కువ! అతడన్నది కూడా నిజమే. అతడు పాఠకుల కోసం వ్రాసేది బావుందనీ, ప్రతివారూ ఆచరించాలనీ నేను   అనుకొంటూ వుంటాను. ఈ పాఠకుల్లో నేనూ ఒకణ్నని మర్చిపోతూంటాను.

    కారు విమానాశ్రయంవైపు తిప్పాను. డాక్టర్లు అంకిత్ కి పెట్టిన గడుపు ముగియ వస్తోంది. ఎంతో సమయంలేదు. టెన్షన్ తో నా గుండె ఏ క్షణమైనా ఆగిపోయేట్టూ వుంది. జాన్ సూచించినట్టు విమానం దొరుకుతేసరే. దొరక్కపోతే ఏం చెయ్యాలి అన్నదే సమస్య........!

    కార్లోనే విశాఖపట్టణం వెళ్ళాలి. మధ్యలో "రాస్తారోకో" లు అవీ ఏమైనా వున్నాయో లేదో తెలీదు. ఆలోచనలతో కారు మలుపు తిప్పాను. ఒక ఇన్ స్పెక్టర్ ఎదురొచ్చి ఆపమన్నట్టు పోలీసు చెయ్యి వూపాడు. సాధ్యమైనంతవరకూ టెన్షన్ ని అదిమిపెట్టి, మౌనంగా కూర్చున్నాను. జాన్  నావైపు జాగ్రత్త అన్నట్టు చూసాడు. సుమద్యుతి, మొహాన్ని అభావంగా వుంచటానికి ప్రయత్నిస్తోంది. ఇన్ స్పెక్టర్ వచ్చి, జాన్ అందించిన కర్ఫ్యూ పాసులు చూసి, "రైట్" అన్నాడు. రిలీఫ్ గా ఫీలయ్యాను.

    సన్నగా చినుకులు ప్రారంభం అయ్యాయి. దానికితోడు ఈదురుగాలి. మా  కారు మెయిన్ రోడ్ లోకి ప్రవేశిస్తుండగా మరో జీప్ వచ్చి ఆగింది. ముందు "పోలీసు" అని వ్రాసివున్నా నాకు ఎలాంటి భయమూ కలుగలేదు. కారు ధీమాగా ఆపాను. జాన్ మళ్ళీ పాసులు చూపాడు. అయితే వాటివైపు దృష్టి సారించకుండా "మీరొకసారి కారు దిగుతారా?" అన్నాడు. నేను జాన్ వైపు దృష్టి సారించకుండా "మీరొకసారి కారు దిగుతారా?" అన్నాడు. నేను జాన్ వైపు చూసాను. అతడు కారు దిగబోయాడు. ఇన్ స్పెక్టర్ అతడిని వారిస్తూ......."మీరుకాదు" అన్నాడు. మప్లర్ సవరించుకుంటూ నేను దిగాను. అతడు నా మొహంకేసి పరికించి చూస్తూ, జేబులోంచి చెయ్యితీసాడు.

    అప్పుడు చూశాను అతని చేతిలో నా ఫోటోని.

    ఇంకేమీ సంశయించకుండా అతడిని ఒక్కసారిగా వెనక్కితోసాను. ఊహించని ఈ చర్యకి అతడు బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయాడు. మిగతా పోలీసులు షాక్ నుంచి తేరుకుని మా దగ్గరకు పరుగెత్తుకు వచ్చే లోపులో నేను కారు ఎక్కి స్టార్ట్ చేసి, వేగంగా ముందుకు. సుమద్యుతిగానీ, జాన్ గానీ ఇది వూహించనందువల్ల బిత్తరపోయి చూస్తున్నారు.

 Previous Page Next Page