Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    "దీనికి మీ సమాధానం?" అడిగాడు వేగా జడ్జీ ఆల్ఫాకేసి తిరిగి. "ఇంత పెద్ద జనాభా వున్న గ్రహవాసులమీద మీకెందుకు కనికరం లేదు."

    "లేదు. ఆ సూర్యుడినే తెచ్చుకుంటే మాకు శక్తి ఒక్కటే కాదు దొరికేది. మరిన్ని లాభాలున్నాయి." అంటూ ఆల్ఫా ఒక చిన్న సీసా లాంటిది బయటకు తీశాడు. "ఇదేమిటో మీ కందరికీ తెలుసు. ఈ మధ్య దీన్ని అన్ని గ్రహాలకు మేము శాంపిల్స్ గా పంపాం. చాలా రుచికరంగా వుందని మీరంతా మెచ్చుకున్నారు. ఆ భూమి మన ఆధీనంలోకి వస్తే ఈ  ఆహారం మన అయిదు గ్రహాల వాళ్ళకు కొన్ని వందల వేల సంవత్సరాలకు సరిపోతుంది. మా అందరికీ ప్రీతికరమయిన భోజనం అది."

    "ఏమిటిది?" అడిగాడు యశ్వంత్ అనుమానంగా.

    "మా ప్లయింగ్ సాసర్ మీ భూమికి దగ్గిరగా వచ్చినప్పుడు మీ అంతరిక్ష నౌక ఒకటి దాని సామీప్యంలోకి వచ్చింది. మేము అందులోని వ్యక్తిని హిప్నటైజ్ చేసి బయటకు లాగాం, అతని పేరు....."

    ".......రాయ్" అన్నాడు యశ్వంత్.

    "అవును. రాయ్.....!" అని అగి, నెమ్మదిగా అన్నాడు ఆల్ఫా "అతని మాంసం ఇది-"

    అనూహ్య కెవ్వున అరిచి మొహాన్ని చేతుల్తో కప్పుకుంది. వింటున్న నలుగురి శరీరాలు జలదరించాయి. యశ్వంత్ మొహం కోపంతో ఎర్రబారింది. అతికష్టంమీద తన ఆవేశాన్ని కంట్రోలు చేసుకున్నాడు. అతడి గొంతు వణికింది.

    "మా భూమిమీద అనాగరికులైన జాతి 'కానిబాల్స్'. కాని యింత విజ్ఞానాన్ని సంపాదించిన మీ గ్రహవాసులు కూడా తోటి మనుషుల ప్రాణాలు తీసి మాంసాన్ని పీక్కుతినేటంత అధమస్థితికి దిగజారే వారనుకోలేదు."

    "తోటిమనుష్యులు" అన్న పదానికి నేను ఆబ్జెక్టు చేస్తున్నాను. మనం మనుష్యులం కాదు మిలార్డ్. కొంచెం ఆలోచించి మాట్లాడమనండి యశ్వంత్ ని. ఎవరు అధమస్థితికి దిగజారినవాళ్ళు? భూమీమీద మాంసం తినడం లేదా? మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని చేతికందిన పక్షుల్ని చంపి నిల్వచేసే టిన్నుల్లో పెట్టి అమ్ముకోవడం లేదా?"

    "మా భూమిమీద మాంసాహారం తినే జనం వున్నారు నిజమే! కాని యిలా తోటి మనుష్యులను, ముఖ్యంగా బుద్ధిజీవులని చంపి తినేటంత నీచస్థితిలో లేరు. జంతువుల మాంసం మాకు ఆహారం. అది తీసుకోవటం తప్పనిసరి."

    "ఎలా తప్పనిసరి అయింది? అవి నోరులేని జీవులు. బలహీనస్థితిలో వున్నాయి. అదేగా కారణం? అలా అయితే మా వివేకం, విజ్ఞానం, ఆధునీకరణ ముందు మనుష్యులుకూడా ఎందుకూ పనికిరాణి జీవాలు. మీకు అవి జంతువులైతే, మాకు మీరు జంతువులు" అన్నాడు ఆల్ఫా.

    అక్కడ సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం ఆవరించుకుంది.

    అందరూ యశ్వంత్ వైపు చూస్తున్నారు. అతడేం సమాధానం చెపుతాడో వాయుపుత్రకి అర్థంకాలేదు.

    "మీరు మా కంటే అన్నివిధాలా అధికస్థాయిలో వున్నారు. మా కంటే విజ్ఞానవంతులు, బలవంతులు. అయినా మేము చేసే తప్పునే మీరూ చేయాలని ఎందుకనుకుంటున్నారు. ఆ వేగా గ్రహంలోనో, మరో గ్రహంలోనో మనుషులు బలహీనులయితే వాళ్ళని అలా చంపి తినగలరా మీరు. మేము జంతువులం కాము. మాకు మాట్లాడే శక్తి వుంది. భావాల్ని విశదీకరించగలిగే భాష వుంది. దయ, కరుణ లాటివి మాకూ వున్నాయి."

    యశ్వంత్ వాదన వింటున్న ఆల్ఫా నవ్వి పక్క అనుచరుడికి సైగ చేశాడు. జడ్జీల ఎదురుగా పెద్ద టీ.వీ. స్క్రీన్ లాంటిది కనిపించింది. తరువాత చిత్రం కనిపించడం మొదలయింది.

    పెద్ద బోను. దానిలో ఒక ఇరవై వరకు గండుపిల్లులున్నాయి ఒక మనిషి దగ్గరగా వచ్చాడు. అతడిని చూడగానే అవి భయంతో అటూ ఇటూ పరుగెడుతున్నాయి. అతడు బయట ఊచల్లోంచి ఒక దానితోక అందిపుచ్చుకున్నాడు. అది భయంతో గింజుకుంటూంది. సన్నటి సూదిలాంటి వస్తువుతో దాని శరీరమంతా గీరడం మొదలుపెట్టాడు. సన్నటి పొడి రాలుతోంది. ఒళ్ళంతా గీరడం అయ్యాక ఆ సూదిని దాని మర్మాంగంలోకి గుచ్చాడు. భయంకరంగా కేక పెట్టిందది. అతడు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. దాని మర్మాంగం నుంచి కారుతున్న జిగురు పదార్థాన్ని ఒక ట్యూబ్ లోకి ఎక్కిస్తున్నాడు.

    తెరమీద దృశ్యం మారింది. అనంతమైన సముద్రం స్పీడ్ బోట్లమీద మనుష్యులు తిరుగుతున్నారు. అందరి చేతుల్లోనూ పొడవాటి బల్లేం, వాటి చివర ఏదో కట్టినట్లు కనిపిస్తున్నాయి.

    వాటిని వెంటనే గుర్తుపట్టాడు యశ్వంత్. బల్లేం చివర కట్టబడ్డవి శక్తివంతమైన బాంబులు.

    స్క్రీన్ మీద తిమింగలం కనిపించింది. అంతే. అందరూ ఒక్కుమ్మడిగా దానిమీద దాడిచేశారు. శరీరం నిండా బల్లేలతో రక్తసిక్తమై అది నీటిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఒక్కో బాంబు పేలుతుంటే నిస్సహాయంగా కొట్టుకుంటూ, బాధతో విలవిల్లాడుతోంది. దాన్ని ఒడ్డుకు లాక్కుపోయి పెద్దపెద్ద కత్తులతో కోసి దాని పెగుల్లోంచి ఏదో పదార్థాన్ని తీస్తున్నారు.

    ఆ తర్వాత తెరమీద గుర్రాలు కనిపించాయి. గర్భంతోవున్న ఒక గుర్రాన్ని పట్టుకొచ్చి కర్రలతో దాని కడుపుమీద  కొట్టటం మొదలుపెట్టారు. బాధతో అది  విలవిల్లాడుతుంటే కూడా వదల్లేదు, ఆల్ఫా చెప్పటం ప్రారంభించాడు.

    "నాగరికులమని చెప్పుకునే మనుషులు చేస్తున్న పనిని చూశారు. ఆ గండుపిల్లుల్ని ఎందుకంతగా హింసించారో తెలుసా? ఆ చర్మపు పొడిని వీళ్ళు శరీరానికి రాసుకునే కాస్మెటిక్స్ వాడతారు. అలాగే తిమింగలం ప్రేవుల్లో వున్న  ఏంబర్ గ్రిన్ అనే పదార్ధం సుగంధాలను తయారు చేయడానికి వాడతారు. ఇక ఆ  గుర్రాలన్నీ గర్భిణీలు. వాటి మూత్రంతో ఎస్ట్రోజెన్ అనే పదార్ధం క్రీములకూ, లోషన్లకూ వాడడానికి పనికొస్తుంది. వాటిని వెంటనే గర్భం ధరించేలా చేసి, మూత్రం ఎక్కువగా పోయ్యడానికి మందులిచ్చి, అవసరం తీరిందనుకోగానే వాటి గర్భాల్లో శిశువులని కొట్టి కొట్టి చంపుతున్నారు. వాటికి మళ్ళీ గర్భం వచ్చేలా చేస్తున్నారు. ఇంత దారుణాన్ని మరెక్కడైనా చూశారా? కడుపుతో వున్న తల్లిని కొట్టటం? దంతాల కోసం ఏనుగుల్ని, చర్మాల కోసం సీల్ చేపల్ని చంపడం వీళ్ళ హాబీలు. చనిపోయిన తర్వాత బావోదని, బ్రతికి వుండగానే వెన్నముద్దలాంటి అమాయకమైన అందమైన కుందేలు పిల్లల చర్మాన్ని వలుస్తారు. వాటితో పర్సులు తయారుచేస్తారు. అవి పెట్టే ఆక్రందనల్ని ఆనందంతో వింటారు. ఇటువంటి మనుష్యుల మీదనా దయా, క్షమా చూపించవలసింది?"

    నిఖిల్, వాయుపుత్ర, అనూహ్య-ముగ్గురూ యశ్వంత్ నే చూస్తున్నారు. యశ్వంత్ అన్నాడు.

    "ఏ ప్రాణి అయినా పరిణామ సిద్దాంతంమీదే ఆధారపడి వుంటుంది జస్టిస్! కొందరు స్వార్థపరుల తప్పుని పూర్తి మానవాళికి అన్వయించటం తప్పు. మేము జంతువులం కాము. 'వేగా' గ్రహవాసులు 'ఆల్ఫా; గ్రహవాసులంత తెలివైనవాళ్ళు కాకపోవచ్చు. అంత మాత్రాన వీరు వారిని చంపుతాం అంటే ఇక నీతి న్యాయం ఎక్కడుంది? మనమంతా ఒక్కటే, కొంత శాస్త్రవిజ్ఞానం, బుద్ధి కుశలత తేడా! అంతే- కేవలం మేం నిస్సహాయులమని చెప్పి మమ్మల్ని బలిపెట్టకండి-"

    అల్ఫా అన్నాడు- "సరే మీరూ మేమూ ఒకటే అనుకుందాం కొన్ని అనివార్య పరిస్థితుల్లో మేము మీ కన్నా  బలహీనులమయ్యాం అనుకోండి. అప్పుడు మీరు మా మీద దాడి చెయ్యరా?"

    "చెయ్యం-" దృఢంగా అన్నాడు యశ్వంత్.

    "మరొకసారి ఆలోచించుకొని చెప్పండి చెయ్యరా?"

    "చెయ్యం."

    ఆల్ఫా చేయి సాచేడు. టీ.వీ స్క్రీన్ మీదా ఒక బొమ్మ వచ్చింది. "మిలార్డ్! తెలివిలో తమతో సమానమైన వాళ్ళమీదా, సాటి జీవుల మీద దాడి చెయ్యం అని ఈ "మనిషి" అంటున్నాడు. కొన్ని లక్షల కోట్ల కంఠాలు జైలు శిక్ష వద్దు వద్దు అంటున్న జాతి నాయకుడు యితను. దీనికి యశ్వంత్ ఏం సమాధానం చెబుతాడు?"

    యశ్వంత్ స్థాణువయ్యాడు.

    "నోరులేని జీవాన్ని హింసించటంలో తప్పులేదని, అది పరిణామ సిద్దాంతమనీ, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనీ వాదించిన ఈ మానవుడు- ఈ ఆటవిక న్యాయానికి సరియైన సమాధానం చెప్పగలిగితే, మా గ్రహవాసులు భూమిమీద దాడి చెయ్యరు. భూలోకవాసుల మాంసాన్ని భుజించరు. మనుష్యుల్ని కూడా సాటి ప్రాణులుగా గుర్తిస్తారు.... ఈ బొమ్మకు, ఈ బొమ్మ తాలూకు జాతికీ జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమనండి చాలు-"

    యశ్వంత్ ఏం మాట్లాడాలో తెలియక అలా వుండిపోయాడు.

    టీ.వీ. తెరమీద విల్సన్ మండేలా జైల్లోవున్న బొమ్మ వుంది.

    ఆల్ఫా పూర్తిచేశాడు. "అంతే మిలార్డ్. నా వాదన పూర్తయింది-"

   
                                       8

    "జడ్జీలు తమ నిర్ణయాన్ని రేపు ఉదయం చెపుతారు" అన్నాడు వేగా.

    ఎవరూ సమాధానం చెప్పలేదు.

    "మేము గెలుస్తామా?" అడిగాడు నిఖిల్ నెమ్మదిగా.

    "మా సానుభూతి మీ పట్లే వుంది నిఖిల్. కానీ ఆల్ఫావాసులు చాలా పట్టుదలగా వున్నారు. వాళ్ళ వాదనలో నిజం వుంది కూడా."

    "అవును అతని వాదన వింటూంటే కరక్టే అనిపించింది. మానవజాతి సిగ్గుతో తలవంచుకోవలసిన వాదన అది" యశ్వంత్ అన్నాడు.

    వేగా శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

    అందరూ మౌనంగా కూర్చున్నారు. ఎవరికీ మనసు మనసులో లేదు. వాయుపుత్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు సీరియస్ గా. అతడి గదిలోంచి సంగీతం వినిపిస్తోంది. వాళ్ళ జడ్జిమెంటు తెలిసిపోయినట్లుగా వుంది అందరికీ.

    "మనకి ఇక్కడే మరణం తప్పదు" అన్నాడు నిఖిల్.

    "మరణం గురించి బాధకంటే ఇంతవరకు వచ్చి యిలా ఫెయిలవడం చాలా బాధ కలిగిస్తుంది" అన్నాడు యశ్వంత్.

    గదిలోకి వెళ్ళినంత వేగంగానూ బయటకు వాయుపుత్ర వచ్చాడు. అతడి మొహం ఫ్రెష్ గా వుందిప్పుడు.

    "ఎందుకీ వైరాగ్యం? బ్రతికిన నాలుగు రోజులూ హాయిగా అనుభవిద్దాం. అందరికీ విందు భోజనం తయారు చెయ్యి అనూహ్యా. నిఖిల్ నువ్వు సహాయం చెయ్యి" అంటూ హుషారుగా పనిలో పడ్డాడు. మధ్యలో బ్రహ్మవిద్యతో ఆటలాడుతున్నాడు. గదిలో సంగీతం మారుమ్రోగుతోంది. అతడి బలవంతం మీదే అందరూ డైనింగు టేబుల్ చుట్టూ కూర్చున్నారు.

    "ఎందుకంత మౌనంగా. భోం చేస్తున్నారు? నవ్వండి, కబుర్లు చెప్పండి. ఏమిటి గురూగారు మనం బయలుదేరిన మొదటిరోజు తీసుకున్న నిర్ణయం మర్చిపోయారా?"

    "ఎలా మర్చిపోతాను. కాని సమస్య మన గురించి కాదు. పూర్తిగా విఫలమయి పోయామన్న దిగులు. మానవజాతికి మనం ఏ విధంగానూ సాయపడలేక పోతున్నామనే బాధ."   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra