Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 33


    ఆటో కదిలాక, వీడ్కోలుగా చేయి ఊపి. తన కారు స్టార్ట్ చేశాడు జానీ.
                                     10
    స్నానం చేసి వచ్చింది యశోద. భార్యాభర్తలిద్దరూ ఒకే గదిలో ఉంటున్నా ఒకరినొకరు తెలీని వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. డ్రెస్సింగ్ టేబిల్ ముందు కూర్చున్న యశోదకి ఎదురుగా సిల్వర్ ఫ్రేం లో జానీ ఫోటో కనిపించింది, ఆ ఫ్రేం వివేక్ కి యశోద ప్రెజెంట్ చేసింది.  
    దానిలో అతడి ఫోటో ఉండేది. అంతర్జాతీయంగా వక్తృత్వపు పోటీల్లో షీల్డ్ గెలుచుకున్నప్పుడు, ఆ షీల్డ్ తో సహా అతడి ఫోటో కూడా ఆ ఫ్రేంలో పెట్టి ప్రెజెంట్ చేసింది.
    ఇప్పుడు ఆ ఫ్రేంలో జానీ ఫోటో చూడగానే, రగిలిపోయింది యశోద మనసు. ఆ పని ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఊహించగలిగింది. కిటికీ ముందు నిలబడి ఇటే చూస్తున్నాడు వివేక్.
    సహనం తెచ్చి పెట్టుకుంది "సైకలాజికల్ డిఫెక్ట్ తో మధనపడుతున్న వ్యక్తి" అని పదే పదే తనను తను నచ్చజెప్పుకుని నిగ్రహం తెచ్చి పెట్టుకుంటోంది.
    "వివేక్! ఈ ఫోటో ఇక్కడ నుంచి తీసెయ్!"
    "ఏం? దానిని నేనే పెట్టాను అక్కడ. చాలా బాగుంది చూడటానికి"
    "బాగున్నమాట నిజమే! కానీ నా డ్రెస్సింగ్ టేబిల్ మీద వద్దు. కావాలంటే నీ ఆఫీస్ రూంలో డ్రాయింగ్ టేబిల్ మీద పెట్టుకో"
    "నాకోసం కాదు. నేనీ ఫోటో పెట్టింది, నీకోసం నీ సంతోషం కోసం."
    "థేంక్స్. నా సంతోషం కోసం నువ్వు ఏదైనా చెయ్యగలవా?"
    చేస్తాను. ఏదైనా చేస్తాను. నాగుండె పగిలిపోతున్నా సరే!. నా రక్తం మరిగిపోతున్నాసరే! నా తల చిట్లిపోయినా సరే! నీకోసం ఏదైనా చేస్తాను."  
    ఫక్కున నవ్వింది. పరమ గంభీరంగా, తెలుగు సినిమాల్లో ట్రాజెడీ హీరోలాగా, డైలాగులు కొడుతున్న వివేక్ తెల్లబోయి చూశాడు.
    "ఎందుకు నవ్వటం?" అన్నాడు రోషంగా.
    "ఏం లేదు.. నాకోసం, నా సంతోషం కోసం ఈ ఫోటో ఇక్కడి నుంచి తీసేద్దాం?"
    యశోద ఈ మాటలనగానే, వివేక్ కళ్లలో తళుక్కుమన్న మెరుపు యశోద దృష్టిని దాటి పోలేదు.
    "యశోదా! నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు... నేను నిన్ను ప్రేమించిన మాట.. కాదు కాదు! ప్రేమిస్తున్న మాట నిజమే! కానీ నా ప్రేమలో స్వార్థం లేదు. ఈర్ష్య లేదు. నీ ఆనందంలోనే నా అనందం చూసుకోగలిగే ప్రేమనాది."  
    "చలంగారి డైలాగులు మానెయ్..... ఈ ఫోటో తీసెయ్."
    "యశోదా! నువ్వు యేం చేసినా భరిస్తాను, కానీ నాదగ్గర దొంగ నాటకాలాడకు" అన్నాడు గంభీరంగా.
    యశోద నిగ్రహించుకుంది "నువ్వు భరించలేని మహాపరాధాలు నేనేమీ చెయ్యలేదు. నిన్ను భరించమని అడగనూ లేదు. దొంగ నాటకాలాడవలసిన అవసరం నాకు లేదు! నీ ఆస్థిపాస్తుల కోసం లేను ఇక్కడ."   
    "దొంగ నాటకాలు కాదూ! నిన్న దుర్గయ్యతో కారులో ఇంటికి వచ్చావా?"
    "ఓ! ఇదీ సంగతి! అయితే, దుర్గయ్య నా మీద నువ్వు పెట్టిన సి ఐ డి అన్నమాట! ఇదీ నీ ప్రేమ స్వరూపం."
    "షటప్! నేను దుర్గయ్యను పెట్టింది, నీకు రక్షణగా. అతడు నా దగ్గర కరాటే నేర్చుకున్నాడు డ్రైవింగ్ ట్రైనింగ్ కూడా నేనే ఇప్పించాను. మామూలుగా డ్రైవర్ కిచ్చే దానికంటే వాడికి ఎక్కువ జీతం ఇచ్చి, అతడిని నీకోసం డ్రైవర్ గా పెట్టాను."  

    "నాకు రక్షణ దేనికీ?"
    "ఒకవేళ మా నాన్నగారే నిన్ను...." నాలుక కరుచుకుని ఆగిపోయాడు.
    అర్థమయింది యశోదకి. పెళ్ళయిన కొత్తల్లో, తనకు వడ్డించిన ప్రతిదీ అతడు తిన్న తర్వాతనే తనకు పెట్టడం గుర్తొచ్చింది.   

    ప్రాణాలయినా లెక్క చేయని ప్రేమ. ఛండ శాసనుడయిన తండ్రిని సైతం ఎదిరించే ప్రేమ!
    యశోద మనసు మెత్తబడిపోయింది... సౌమ్యంగానే అంది "నన్ను గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నువ్వు దుర్గయ్యను అడగక్కరలేదు. నన్నడిగితే నేనే చెపుతాను...."

    "నేను దుర్గయ్యను ఏమి అడగలేదు. నువ్వు హోటల్ అమృతా దగ్గర కారు పంపేశావని చెప్పాడు అంతే. జానీ కూడా ఉన్నాడని అన్నాడు."
    ఏం జరిగిందో చెప్పు?.... అన్నట్లుంది మాటల ధోరణి. లోలోపల నవ్వుకుంది." జానీ అనుకోకుండా, క్రాస్ రోడ్స్ దగ్గర కలిశాడు!. అతని వెంట..."
    ఆగింది.
    "చెప్పు?"
    "అతడితో మీ నాన్నగారి నౌకరు వీరన్న కూడా ఉన్నాడు."
    "ఓ! అలాంటి వాళ్ళు జానీతో ఉండటంలో ఆశ్చర్యం లేదు."
    "మీ నాన్నగారి నౌకరు అతడు"
    "నాకు తెలుసు! కానీ, వీరన్న జానీతో కనపడటానికీ నువ్వు, జానీ హోటల్ అమృతాలో గడపటానికీ లింక్ ఏమిటో అర్థం కావటం లేదు? అతడు మీకు కాపలాగా ఉంటాడనా?"
    మెత్తబడుతున్న యశోద మనసు రాయిలా అయింది.
    "ఒకవేళ నేను జానీతో గడపదలిస్తే, మీ వీరన్నని కాపలా పెట్టుకోనక్కరలేదు. దర్జాగా అతని ఇంటికే వెళతాను."
    పాలిపోయింది వివేక్ మొహం. చూడలేకపోతుంది యశోద.
    "వెళుతున్నావా!" అని క్షీణ స్వరంతో అన్నాడు.
    "లేదు.. ఇంతవరకూ అలా అనుకోలేదు."
    "మరి! జానీతో, హోటల్ లో..."
    "హోటల్ లో, నేను అతడితో రోజుల తరబడి గడపలేదు. కనీసం ఒక రాత్రయినా లేను!. ఫ్రెండ్ తో కలిసి, హోటల్ లో కాఫీ తీసుకోవడం కూడా తప్పా నీ దృష్టిలో?" నీ "చలం డైలాగులు" అన్నీ ఈ సంకుచితత్వాన్ని కప్పడానికేనా?"

    "జానీ నీకు ఫ్రెండా?"
    "అవును!"
    "అలాంటి వాళ్లతో స్నేహం మంచిది కాదు..."          

 Previous Page Next Page