Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 32


    "చీడపురుగు!" అంది చీదరగా.
    నవ్వాడు జానీ నిర్లక్ష్యంగా "వాటితో కూడా అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి!"
    ఇద్దరూ రెస్టారెంట్ సెక్షన్ లో కూర్చున్నారు.
    "ఏం చెప్పను!" అడిగాడు జానీ.
    "ఆకలి మండిపోతోంది! నీ ఇష్టం."   
    "కట్ లెట్స్! నాన్ విత్ పంజాబ్ ఛోళీ....?"
    "నాన్ విత్ పంజాబ్ ఛోళీ! అండ్ కర్రీ" ఆర్డర్ చేశాడు జానీ. వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాక "ఇప్పుడు చెప్పు! ఏం మాట్లాడాలి"    
    "మీ జగదేక వీరుడి గురించి...."
    "వాడి గురించా! నీకెందుకు? అయినా వాడి క్రెడిట్ లో బోలెడు గొప్ప లక్షణాలున్నాయి. వాటిలో నీకు ఏది కావాలి?"  
    "ఏమిటా గొప్ప లక్షణాలు?"
    వెయిటర్ ప్లేట్స్ తో వచ్చాడు. అతడు వెళ్ళే వరకూ ఆగి అన్నాడు జానీ.
    "ఖూనీలు చెయ్యగలడు. చేయించగలడు. రహస్యాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చెయ్యగలడు! కావలసిన వారికి అందమైన అమ్మాయిల ఆచూకీ అందియ్యగలడు. ఇంకా...."  
    "చాలు!.... చాలు!.... ఇలాంటి వాడితో నీకేం అవసరం? ఎవరిని ఖూనీ చేయించాలనుకుంటున్నావ్"
    "ఖూనీ కాదు. నువ్వు అసహ్యించుకోనంటే చెప్తా"
    "చెప్పు"
    "నేను చాలా మంచి వాడినని చెప్పుకోను. కానీ పరమ దుర్మార్గుడ్ని కూడా కాను. ఆడవాళ్ళ వెంటపడి వేధించి వాళ్ళని లొంగదీసుకుని మోసం చెయ్యను. కానీ వాళ్ళే నా కారు చూసి, నేను ఖర్చు పెట్టే విధానం చూసి నా వెంటపడతారు. నువ్వు నమ్మకపోవచ్చు! కావాలంటే....."
    "నమ్ముతాను. తరువాత చెప్పు!"
    "ఈ ఆడవాళ్ళలో అన్నిరకాల వాళ్ళు ఉంటారు. సరదాగా కొంత కాలం గడిపి, మరిచిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు....." "అయ్ లవ్ యూ!" అంటూ నానా గోలా చేసే వాళ్ళు! డబ్బు కావాలని పీడించే వాళ్ళు ఎట్సెట్రా! వీళ్ళు కాక మరో ప్రమాదకరమైన వర్గం వాళ్ళు ఉన్నారు.  
    వాళ్ళు ఎక్కడో ఎవరి ద్వారానో కడుపు చేయించుకుని ఆ తద్దినం నా నెత్తి మీద రుద్దాలని చూస్తారు. అలాంటి వాళ్లతోనే అవస్థ అంతా. వాళ్ళు కోర్టుల వరకూ వెళ్తామని బెదిరిస్తారు, భంగపడి ఉన్న వాళ్ళు కనుక ఎంత గొడవకైనా సిద్ధపడతారు. అలాంటి వాళ్లతో డీల్ చెయ్యటానికి వీడు అవసరం నాకు"
    "ఏం చేస్తాడు వీడు?"
    "ఆ బాపతు వాళ్ళకు తప్పకుండా, మిగిలిన కాంటాక్ట్ లు ఉంటాయి. వీడవి తెలుసుకుంటాడు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు బెదిరిస్తాడు. అక్కడితో వాళ్ళు నా జోలికి రావటం మానుకుంటారు."   
    "వీడు మా మామగారికి పాత నౌఖరు తెలుసా?"
    "తెలుసు! మాదీ, మీ మావగారిదీ ఒకటే ఊరని చెప్పాను కదా. అక్కడే తెలుసు. వీడిని ప్రస్తుతం నేను ఉపయోగించుకుంటూన్నాను! నాలాగ వీడిని ఉపయోగించుకొనేవాళ్ళు చాలామంది ఉన్నారనుకుంటాను."
    "జానీ! వీడితో నేను మాట్లాడాలి. ఎలా?"
    "ఏం మాట్లాడతావు?"
    "ఆ ఇంటి గురించీ. ముఖ్యంగా.... ముఖ్యంగా.... వివేక్ బాల్యం. అంటే! మా మావగారు యవ్వనంలో ఉండగా జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలి"
    "ఈ రీసెర్చ్ దేనికీ? సరే! నేను కనుక్కుని నీకు చెప్తాను."
    "అలా అనొద్దు! అతడు మాట్లాడే మాటల్లో ఏది ముఖ్యమో, ఏది అనవసరమో నీకు తెలియకపోవచ్చు. అతడితో నేనే మాట్లాడాలి.
    గమ్మత్తుగా ఈల వేశాడు జానీ. ఏదైనా ఆలోచన స్ఫురించినప్పుడు, అతడలా ఈల వెయ్యటం అతనికి అలవాటు.
    "ఓహ్! సైకాలజీ స్టడీ చెయ్యటానికా? పోయి, పోయి, మీ మావగారి సైకాలజీ స్టడీ చెయ్యవలసిన అవసరం ఏమొచ్చిందీ?"
    "చెప్తాను, అవసరమైనప్పుడు! అతడితో ఏకాంతంగా మాట్లాడే ఏర్పాటూ చెయ్యగలవా?"
    "అతడు ప్రమాదకరమైన మనిషి."
    "తెలుసు! అందుకే, నీ సహాయం కోరుతున్నాను....!"
    "ఒక్కటే ఉపాయం, కానీ అదెంత వరకూ మంచిదో నువ్వు ఆలోచించుకోవాలి."
    "చెప్పు!"
    "నా గెస్ట్ హౌస్ ఉంది. నాకోసం అమ్మాయిలు వచ్చే గెస్ట్ హౌస్ అది. దానిలో ఒక వరండా. బెడ్ రూం పక్క పక్కనే ఉంటుంది. నువ్వు వరండాలో అతడితో మాట్లాడుకోవచ్చును. నేను బెడ్ రూంలో ఉంటాను కాబట్టి నేను ఉన్నానంటే అతడు ఏమి చెయ్యడు!"   
    "ఈ ఉపాయం బాగానే ఉంది"
    "కానీ నీకు చెడ్డ పేరు రావచ్చును. నిష్కారణంగా...."
    "అయ్ డోంట్ కేర్....."
    "నీ ఇష్టం! నా సలహా అడిగితే, ఈ ప్రయత్నం వదిలెయ్యమంటాను. దుష్టులకి దూరంగా ఉండాలి."  
    "తెలుసు! కానీ తప్పదు, ఇది తప్ప నాకు మరో ఉపాయం లేదు."
    వెయిటర్ కాఫీ తెచ్చాడు. జానీ బిల్ చెల్లించాడు.
    "మీ ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యనా?"
    "ఒద్దు! ఆటోలో వెళ్తాను"
    జానీ ఆటో పిలిచాడు. యశోద ఆటోలో కూర్చున్నాక అన్నాడు "మా జగదేకవీరుడితో మీరు మాట్లాడే విషయం మరోసారి ఆలోచించుకుని తప్పదనుకుంటే అప్పుడు నాకు ఒక ఫోన్ చెయ్యి. వాడు నీతో మాట్లాడే ఏర్పాటూ చెయ్యటం పెద్ద కష్టం కాదు."   
    "థేంక్యూ"                             

 Previous Page Next Page