Previous Page Next Page 
పర్ణశాల పేజి 31


    అతడి మనసు దూదికన్నా తేలిగ్గా వుంది. "ఏం కావాలో చెప్పు" అన్నాడు.

    ఆమె తల అడ్డంగా వూపుతూ, "ఊహు..... ఇప్పుడు కాదు. ఏదైనా  కావాల్సొచ్చినప్పుడు అడుగుతాను" అందామె. అతడు నవ్వి "సరే" అని జరిగినదంతా తనవాళ్ళతో చెప్పటానికి లేచాడు.

    గూడెంలో ఈ వార్త పాక్కగానే అందరిలోనూ ఉత్సాహం కట్టలు తెగిప్రవహించింది. అభినందనలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేసేయి. జాలర్ల ఆనందాని కయితే అంతేలేదు.

    పదిరోజుల్లో స్థలం నిర్ణయించటం జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకల్లా ఫ్యాక్టరీ ప్రారంభం అయింది.

    అతడికి వూపిరి సలపని పని. మళ్ళీ బాధ్యతలు..... ఇంటి కొచ్చేసరికి తొమ్మిదీ, పదీ అవుతోంది. ఇంకోవైపు జపనీస్ ఫర్మ్ యిచ్చిన కొత్త బాధ్యత.

    ఒకరోజు అతనింటికొచ్చేసరికి పదకొండయింది. భోజనం చేస్తూంటే శారద అంది, "ఇలా టైమ్ కూడా చూసుకోకుండా పనిచేస్తూ వుంటే ఆరోగ్యం ఏమయ్యేను?"

    అతడు చెయ్యి కడుక్కుంటూ నవ్వి, "నాకిది అలవాటేగా" అన్నాడు.

    ఆమె  అతడి వెనకే వెళ్ళి తువ్వాలు అందిస్తూ, "నాకు ఒక అనుమానం, మీరంతా రాత్రింబవళ్ళు పనిచేస్తారుకదా. అంత డబ్బు సంపాదించి ఏం చేస్తారు" అంది.

    అలా అడిగిన తర్వాత అతడి ముఖం చూసి "ఎందుకడిగేనా?" అని ఆమె అనుకుంది. అతడు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఆ ప్రశ్న అతడి గుండెల్లో మారుమూల ఎక్కడో ప్రతిధ్వనించింది. నిజమే ఎందుకింత సంపాదించటం?

    అతడికి సమాధానం వెంటనే దొరికింది.

    తనవాళ్ళని సంతోష పెట్టటానికి, స్నేహితులలో తలెత్తుకు తిరగటానికి, భవిష్యత్తు కోసం!! ఆనందంకోసం!! అంతలోనే మళ్ళీ అనుమానం. భార్యని సుఖపెట్టడం మనిషి జీవితాశయంకాదే...... తనని "తన" గా ప్రేమించాలి భార్య అలాంటి దానికోసం ఏమీ చెయ్యకపోయినా ప్రేమిస్తూనే ఉంటుంది కదా....

    మరి స్నేహితులూ, స్టేటస్సూ వీటీకోసమా- ఇవి ప్రతిమనిషికీ వుంటాయే! కార్మికుడికి కార్మికుడి సర్కిల్- గుమాస్తాకి గుమాస్తా స్నేహితులూ, ఆ మాటకొస్తే అరిస్టోక్రసీయా స్నేహాన్ని నాశనం చేస్తుంది.

    భవిష్యత్తు కోసమా? దానికి శ్రమ ఎందుకు? తరతరాలుగా తిన్నా తరిగిపోనట్లుగా  సంపాదించటం ఎందుకు?

    ఆనందం కోసమా? ఎయిర్ కండిషన్ రూమ్ లో నిద్రపట్టక పక్కమీద అటూ ఇటూ పొర్లే భాగ్యవంతుడికన్నా, కాయకష్టం చేసేవాడు కటికనేలమీద హాయిగా నిద్రపోతున్నాడే? కావు, ఇవేవీ కారణాలు. ఈ సంపాదించటం అనేది ఒక  వ్యసనం. ఒకసారి దానికి అలవాటు పడితే- అందులో వున్న ఆనందం ఇంక దేనిలోను దొరకదు. అది చదరంగం ఆట లాటిది. అది ఆడుతూనే వుండాలి.

    కాని ఇన్ని కాంట్రాడిక్షన్ల గురించి ఆలోచించే శక్తి అతడికిప్పుడు లేదు. భవిష్యత్ గురించి ఆలోచించే శక్తి- దారుణమైన అనుభవం నిర్థాక్షిణ్యంగా చంపేసింది.

   
    ఆ అనుభవంతోనే అతనన్నాడు "లేదు శారదా- ఈ డబ్బు అనేది చాలా గొప్పది. బంధుత్వాన్ని నిలుపుతుంది. స్నేహాన్ని కలుపుతుంది. మనిషిని కాళ్ళ మీద నిలబెడుతుంది. డబ్బుని మితం లేకుండా  సంపాదించాలి. దాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడించాలి- దానికోసం  ఎంత మానసిక శాంతిని కోల్పోయినా సరే."

    చైతన్యకి సమాధానంగా శారద అన్నది- "ఈ డబ్బు మీద విజయం సాధించాలీ అంటే మితం లేకుండా  దాన్ని సంపాదించటం ఒక్కటేనా మార్గం  చైతన్యబాబూ! దాని విలువనంతా ఒక్క చిరునవ్వుతో తృణీకరించిన నిరంజన్ దాస్ దానిమీద విజయం సాధించలేదా? అతడిలో ఏ మానసిక వ్యధా లేదే.."

    చైతన్య మాట్లాడలేదు. అతడు బికారిగా  సంచరించిన రోజులలో వున్న నిశ్చింత జ్ఞాపకం వచ్చింది. మరుక్షణం  ఏమవుతుందో అన్న టెన్షన్ లేదు. అయితే  తను ఆ స్థితికి చేరుకోగలడా? లేదు.....ఆ విరక్తి తనకు రాదు.

    అతడికి అప్పటివరకూ ఒక అనుమానం వుండేది- నిరంజన్ దాస్ సర్వాన్ని వదులుకోవాలని తీసుకొన్న నిర్ణయం అర్థరహితమేమోనని. కానీ ఈ క్షణం అర్థమైంది. ఎంత గొప్ప దురాలోచనతో నిశ్చింతకోసం అతడు డబ్బుని వదులుకో గలిగాడో అర్థం చేసుకోగలిగాడు కాబట్టి, మరి తను వదులుకోగలడా? లేదు- అర్థం చేసుకోవటం వేరు. తనలాంటి వాళ్ళకి చింతలోనే దొరుకుతుంది. అనుక్షణమూ చింత లేకపోతే బ్రతకలేడు.

    అతడి ఆలోచనలని భంగపరుస్తూ, ఇక ఆలోచించకండి. మీ ఆలోచనలని రాస్తూ రాస్తూ  ఈ నవలాకారుడు కూడా  అయోమయ స్థితిలో పడిపోయేలా వున్నాడు" అంది నవ్వుతూ.

    అతడు అర్థంకాక "ఏమిటి?" అన్నాడు.

    "బ్రెక్టు చదివేరా"

    "ఏం?"

    "ఏం లేదు. ఎలియనేట్ చేస్తున్నాను" అందామె చిరునవ్వుతో.


                                                           *    *    *   

    తాము కట్టవలసిన టాక్సు  విషయం కిరణ్మయికి తెలియటం రవికి ఇష్టంలేకపోయింది.

    ఈ బాధ తన కెలాగూ తప్పుదు. అనవసరంగా ఆమెకు చెప్పి ఆమెను  కూడా  బాధపెట్టడం ఎందుకని బావించాడతడు. అయితే అతడు ఆ విపత్తునుంచి బయట పడటానికి చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. కట్టవలసిన డబ్బు కట్టకుండా అప్పీలు చేసుకోవటానికి అతడు పెట్టుకున్న దరఖాస్తును కమిషనర్ తిరస్కరించేడు. దాంతో పరిస్థితి మరింత విషమించింది.

    రవి తల్లడిల్లిపొసాగేడు.

    అతడి పరిస్థితిని గురించి తొందరలోనే అందరికీ తెలిసిపోయింది. ఈ వాణిజ్య కాలాల ప్రపంచంలో ఏ చిన్న వార్తయినా ఇట్టే పాకిపోతుంది.

    అతడి పరిస్థితిని గురించి తొందరలోనే అందరికీ తెలిసిపోయింది. ఈ వాణిజ్య కాలాల ప్రపంచంలో ఏ చిన్న వార్తయినా ఇట్టే పాకిపోతుంది.

    అతడి స్థితి తెలిసినవాళ్ళు అప్పు ఇవ్వటం మానేశారు. అప్పటికే ఇచ్చినవాళ్ళు వత్తిడి  చేయసాగారు. ఇలా అన్నివేపులనుంచి పరిస్థితులు విషమించటంతో అతడు డీలా పడిపోయాడు. ఇవి ఇలా వుండగానే ఒకరోజు అతడికి నోటీసు వచ్చింది.

    టాక్స్ కట్టని కారణంగా యింటిని వేలం వేయబోతున్నట్టు నోటిసు అది!



                                                                     20



    "కిరణ్మయీ!

    నీ భర్తగానూ నీ ఆస్థి వివరాలు చూస్తున్న మానేజర్ గానూ కూడా నేనే  నా ఓటమిని ఒప్పుకొంటున్నాను! ఇదంతా నా అసమర్థత వలనే వచ్చిందన్న నిజాన్ని కూడా నేను మర్చిపోలేను. కిరణ్మయీ! నా మీదెంతో నమ్మకం  వుంచి ఈ బాధ్యత  వప్పగించేవు. కానీ నేను దాన్ని సరిగా నిర్వహించలేకపోయాను.

    కొద్దిరోజులలో మన ఆస్థి సర్వస్వం వేలం పాటకు  రాబోతోంది. దాని నిరోధించటానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

    అన్నయ్య ఏ స్థితిలో బయటికి వెళ్ళిపోయాడో అదే పరిస్థితిలో నేనూ వెళ్ళిపోతున్నాను. అయితే నేవెళ్ళేది ఈ లోకం విడిచి. నా అసమర్థతకి ఉదాహరణంగా నువ్వు పడే కష్టాలు అనుక్షణం  చూస్తూ మానసిక  వ్యధ అనుభవించే శక్తి నాకు  లేదు.

    కిరణ్! ఇరవై  రెండేళ్ళ వరకూ  నాకు  ప్రేమంటే ఏమిటో తెలీదు. నా  జీవితంలో నువ్వు  ప్రవేశించావు. మనసా, వాచా  నిన్ను నేను ప్రేమించాను.

    ఈ డబ్బు అనేది మనమధ్య లేకపోయి వుంటే, మన  వివాహపు తొలిరోజులు ఎంత బాగా  గడిచి వుండేవి? చదివిన చదువుకి చిన్న వుద్యోగం వచ్చి వుండేది. చిన్న యిల్లు, మన సంసారం ఎంత బావుండేది? నా యీ అసమర్థతని నిరూపించటానికేమో ఈ డబ్బు అనేది  వచ్చిపడింది.

    అయిపోయింది కిరణ్! ఈ రాత్రి తెల్లవారేసరికి నేను వుండను. అద్భుతమైన నీ సౌందర్యాన్ని ఇంకొంచెంసేపు చూస్తూ కూర్చోవాలని- నీతో కొంచెంసేపు మాట్లాడాలనీ కోర్కె గుండెనిండా బలంగా వ్యాపిస్తున్నది. కానీ  అణచుకోవాలి. ఒకసారి మళ్ళీ  ఆ అనుభవం పొందితే ఈ మరణించాలన్న నా నిశ్చయం నెమ్మదిగా సడలిపోవచ్చు.

    నా మీద నీకేమయినా మంచి అభిప్రాయం ఏ మూలన్నా  కొద్దిగా వుంటే ఇక అదీ పోతుందని తెలుసు. డబ్బున్న రోజులలో నాతో అన్నీ  అనుభవించేడు- అది పోయాక నన్ను వదిలేసి తన దారి తను చూసుకొన్నాడు అని నువ్వు నన్ను తిట్టుకోవచ్చు. కానీ నేను బ్రతికివుంటే మన భవిష్యత్, ఆ హైన్యం- ఇవన్నీ తలచుకోవటానికే భయంగా వుంది. డబ్బు మనమధ్య సృష్టించిన విభేదాల్ని దారిద్ర్యం మరింత ఎక్కువ చేస్తుంది. నీ ప్రవర్తనలో నా పట్ల  కోపాన్ని ఇంతకాలం చూసేను- ఇంకా బ్రతికి వుంటే అసహ్యాన్ని చూడాలి.
   
    అదే నా కిష్టంలేదు.

                                                                                                                         -రవి"

    ఉత్తరం వ్రాయటం పూర్తిచేసి, మాడవబోతూ ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసరికి..... కిరణ్మయి!

    ఉత్తరం  అంతా చదివినట్టు ఆమె మొహం చూస్తేనే తెలుస్తోంది. అది గమనించి, "కిరణ్" అన్నాడు అతడు హీనమైన కంఠంతో. ఆమె మాట్లాడలేదు. కాసేపు అతడిని చూస్తూ వుండిపోయింది. ఆమె హృదయంలో అగ్నిపర్వతాలు బ్రద్ధలవుతున్నాయి. అంతవరకూ చూడని రవిని చూస్తోందామె.

    అమాయకంగా సరదాగా ప్రతిదానిని తేలికగా  తీసుకొనే రవినే  చూసింది ఇంతవరకూ. అతడు ఈ మధ్య పనిపట్ల శ్రద్ధ చూపిస్తున్నాడని కూడా గమనించి సంతోషించింది.

    కాని పరిస్థితి ఇప్పుడు తారుమారయింది.

    చిత్రమేమిటంటే- తాము బికార్లుగా  రోడ్డుమీద నిలబడే స్థితి వచ్చిందన్న విషయం కూడా ఆమెకి ఆ ఉత్తరం ద్వారానే తెలిసింది. అయినా ఆ విషయం ఆమెని అంతగా  బాధించలేదు. ఈ డబ్బు అనే జ్వరం ఎంత తొందరగా వదిలిపోతే అంత బావుణ్ణు అని ఆమె భావిస్తోంది.

    రవిని చూస్తూంటే ఆమెలో స్త్రీ సహజమైన కరుణ పొంగి పొరలింది. దాంతోపాటు దుఃఖం కూడా. ఎంతో ఉన్నతమైన వంశంలో పుట్టి కేవలం జాలితో అభిమానంతో తనను  వివాహమాడిన ఈ యువకుడు కేవలం తన వలననే మనశ్శాంతిని కోల్పోయాడన్న నిజం ఆమె గుండెని బ్రద్ధలు చేస్తోంది. పరస్పర విరుద్ధంకాని ఈ రెండు భావాలతో ఆమె పక్కనే కూలబడి అతడి కాళ్ళమీద తలవుంచి వెక్కి వెక్కి ఏడవసాగింది.

    రవి ఆమె తలమీద చేయి వేసి "కిరణ్" అని గొణిగేడు.

    చాలాసేపు ఇద్దరూ ఆ అచేతనమైన పరిస్థితిలో అలాగే వుండిపోయేరు. ముందు కిరణ్మయే తేరుకున్నది. పైటచెంగుతో కళ్ళు తుడుచుకుంటూ "నన్ను  క్షమించు రవీ, నిన్ను చాలా బాధపెట్టాను" అంది.

 Previous Page Next Page