అవసరమైన దానికంటే తొందరగా తను ప్రొసీడ్ అయినట్టు నేత్ర గ్రహించాడు. ఆ అమ్మాయి తాలూకు ఒక చిత్రమైన విషయం కూడా అతడు గమనించాడు. ఆ అమ్మాయికి హుషారుంది. ఉత్సాహం వుంది. కానీ కేవలం ముద్దు విషయం వచ్చేసరికి కుదించుకుపోతుంది. టాపిక్ మార్చడంకోసం "మీరు చెప్పండి. అమ్మాయిలు ఎటువంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు?" అని అడిగాడు.
"ఏమిటి?"
"అబ్బాయిల సంగతి నేను చెప్పాను కదా- అమ్మాయిల సంగతి మీరు చెప్పండి-"
ఆమె సందిగ్ధంగా, "అమ్మాయిలు సాధారణంగా తెలివైన కుర్రవాళ్ళని ఇష్టపడతారనుకుంటాను" అంది.
అతడు వెంటనే "అయితే మీది కెమిస్ట్రీ కదా. పొటాషియం అయొడైడ్ పక్కన రెండు సల్ఫర్ పరమాణువుల్ని పెడితే ఏమవుతుంది చెప్పండి?" అని అడిగాడు.
"అవి కలవవు-" అంది చప్పున.
"సింబాలిక్ చెప్పండి."
"నాకు అర్థం కావడంలేదు."
"పొటాసియం అయొడైడ్ సింబల్ KI. దాని పక్కన రెండు సల్ఫర్ పరమాణువులు పెడితే?"
"KIS- 2 కదా" అంది సాలోచనగా.
నేత్ర తలకొట్టుకుంటూ- "మీలో రసాస్వాదన కల్గించచడం కష్టంఅనుకుంటా" అన్నాడు దిగులుగా.
"క్షమించండి. నాకు సెన్సాఫ్ హ్యూమర్ తక్కువ."
"పోన్లేండి. మీకు నచ్చే మరో సబ్జెక్టు ఏమిటి?"
"లెక్కలు"
"మార్కులు బాగా వస్తాయా?"
"తొంభై దాటుతాయి"
"ఒక బకెట్ లో సాధారణంగా ఎన్ని కిలోల నీళ్ళు పడతాయి?"
అతడు అడిగిన ప్రశ్నకు ఆమె తడబడి "నాకు తెలీదు" అంది. "బహుశ పది - పన్నెండు కిలోలు పట్టవచ్చు."
"మీరన్నట్టే పన్నెండు కిలోలనుకోండి. మీకు నచ్చిన రెండు సంఖ్యలు చెప్పండి"
"నూరు, యాభై! ఎందుకు అడుగుతున్నారు?"
"నూరు మీటర్లు పొడవు, యాభై మీటర్లు వెడల్పు వున్నా మీ ఇంటి వెనుక పెరడులో పదిహేన్నిముషాల పాటు నాలుగు మిల్లీలీటర్ల వర్షం కురిసిందనుకోండి. ఎన్ని బకెట్ల నీళ్ళు మీ పాదులకి పోస్తే దానికి సమానమవుతుంది? మీరు ముందు చెప్తారో, నేను చెప్తానో పందెం"
ఆమె చప్పున ఆలోచించి, నిముషం అయ్యాక "నో- ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పలేరు" అంది.
"1666 బకెట్లు. ఒక క్యూబిక్ సెంటీమీటరు నీటి బరువు ఒక గ్రాము వుంటుదన్న విషయం దీనికి జత పర్చుకోవాలన్న ఆలోచన రావాలి. అంతే."
ఆమె తనలో తనే లెక్కలు వేసుకుని, "నిజమే" అంది.
"బజార్లో రెండు పుచ్చకాయలు చూశారు మీరు ఒకటి రెండురూపాయలు చెప్పాడు షాపువాడు. రెండోదాని వ్యాసం మొదటిదానికన్నా రెట్టింపు వుంది. అది 6 రూపాయలు చెప్పాడు. దేన్నీ కొంటారు?"
"మొదటిదాన్ని."
"తప్పు. రెండోది ఎనిమిది రూపాయల వరకూ అయినా కొనవచ్చు."
"మైగాడ్! మీరు చాలా తెలివైన వారిలా వున్నారే" అంది. కేవలం ఆ మాటకోసమే చూస్తున్నట్టు "థాంక్స్. మీలాటి ఆడపిల్లలకు నచ్చే గుణం ఒకటి నాలో వుందని మీరు గుర్తించినందుకు" నవ్వుతూ అన్నాడు. తనని అతను ఎక్కడికి "లీడ్" చేశాడో తెలిసి, ఆమె మాట్లాడలేదు. వెనుకవున్న ప్రతిమకి విసుగ్గా వుంది. ఇతడు యాక్షన్ మానేసి సైన్సు, లెక్కలు చెబుతున్నాడు. ఇంకొంచం సేపు పొతే తత్వశాస్త్రమూ, వేదాంతమూ బోధించేటట్టున్నాడు అనుకుంది.
ఈలోపులో ఆమెకి కావల్సిన ప్రశ్న అతడు హంసలేఖని ఉద్దేశించి అడగనే అడిగాడు. "లేఖా..... డు యు లవ్ మి" అని.
హంసలేఖ మాట్లాడలేదు. తాను ప్రొసీడ్ అవకపోతే లాభం లేదనుకుంది ప్రతిమ. ఇద్దరి వెనుకా నిలబడి, ఒక చెయ్యి హంసలేఖ మీద వేసి మరోచెయ్యి నేత్రమీద వేసి నొక్కింది.
నేత్ర తన చేతిమీద చెయ్యి వేసాడేమో అనుకుని లేఖ చప్పున తన చేతిని వెనక్కి తీసుకుంది.
ఆమె తన ప్రశ్నకి సమాధానంగా చేతిమీద చెయ్యి వేసిందేమో అనుకుని "థాంక్స్" అన్నాడు నేత్ర ఆ చేతిని ప్రేమగా రాస్తూ. ప్రతిమ కూడా చెయ్యి వెనక్కి తీసేనుకుంది.
"నేను వెళ్తాను" అంది లేఖ.
"అదేమిటి.... యిప్పుడేగా వచ్చావ్......?"
"ఈ కరెంట్ యిప్పట్లో వచ్చేట్టు లేదు."
"అంతేనా....? నేనంటే భయమా.....?"
"ప్రేమలో భయమెందుకు.....?"
"ప్రేమలోనా......? అంటే...... మై గాడ్ ...... థాంక్యూ....." అన్నాడు నేత్ర. ప్రతిమ తల కొట్టుకుంది. మెరుపులా పిస్టల్ తీయడమే తప్ప, తుఫానులా ఆడపిల్లని చుట్టుముట్టడం తెలీదు ఈ మొగాడికి.
ఇద్దర్నీ మరింత దగ్గర చెయ్యవలసిన బాధ్యత తన మీద వుందనుకుంది ప్రతిమ.
నెమ్మదిగా వంగి, నేత్ర్ర చెంప మీద ముద్దు పెట్టుకుంది.
నేత్ర అదిరిపడి "థాంక్యూ...... థాంక్యూ....." అన్నాడు. ఆ అమ్మాయి ఫాస్టని తెలుసుగానీ మరి ఇంత ఫాస్ట్ అని అనుకోలేదు. మళ్ళీ ఇంకొకసారి "థాంక్స్" అన్నాడు.
"ఎందుకు అన్నిసార్లు చెబుతున్నారు.....?" ఆశ్చర్యంగా అంది లేఖ.
నేత్ర ఇబ్బందిలో పడ్డాడు. చేసిందేకాక- తిరిగి నోటితో చెప్పమంటూంది.
ఆడపిల్ల ఆవేశమొచ్చి వున్నట్టుండి విజృంభిస్తే మొగవాడు ఎంత ఇరకాటమయిన పరిస్థితిలో పడతాడో అనుభవ పూర్వకంగా తెలిసింది.
"ఎందుకు థాంక్స్ అన్నారు?" తిరిగి అడిగింది. "మీ రూమ్ కి వచ్చి నందుకా?"
"కాదు ! మొదటిది ప్రేమించానన్నందుకు. రెండోది...... అందుకు" అన్నాడు ఆగి.
"అందుకా...?? ఎందుకు....???"
"ఎందుకంటే......" అతడికేం చెప్పాలో తెలియలేదు. ఈ లోపులోప్రతిమ హంసలేఖ చేతిని తీసుకుని చప్పుడు కాకుండా ముద్దు పెట్టుకుంది.
హంసలేఖ కెవ్వున అరిచింది.
"ఏమైందేమైంది....?" కంగారుగా అన్నాడు.