Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 30


    "ఉత్పలా-"

    ఆమె గుండె చప్పుడు ఆమెకి స్పష్టంగా వినపడుతూంది. జుట్టులోంచి చెమట ధారాపాతంగా కారుతోంది.

    కొన్ని ఆలోచన్లకి అర్థంలేదు. అటువంటి భావమే ఆమె కాక్షణం వచ్చింది. బాసింపెట్లు వేసుకుని కూర్చుని, ముక్కాలిపీటమీద పుస్తకం పెట్టుకుని, పురాణ పఠనం చేసే తండ్రి..... గోడకి అనుకుని కూర్చుని వినే తనూ, చెల్లీ, అక్కా......తండ్రి పక్కనే కూర్చున్న తల్లి, తప్పనిసరి పరిస్థితిలో కూర్చోవలసి వచ్చినందుకు కనపడుతున్న విసుగుని భక్తితో కప్పేసి, నమ్రతని నటించే తమ్ముడు..... వాడి బాధని చూసి అల్లరిగా విసుగుని భక్తితో కప్పేసి, నమ్రతని నటించే తమ్ముడు....వాడి బాధని చూసి అల్లరిగా నవ్వే చెల్లి- అంతలో మృదు గంభీరమైన తండ్రి కంఠం.... 'లావొక్కింతయు లేదు- ధైర్యము నిలోలంబయ్యే- ప్రాణముల్ ఠావుల్ తప్పెను-' ......ఆ గజేంద్రుని ఆర్తనాదమే ఈ అంబుజేంద్రికల్లోల మానసాన ఆర్తిరవమైనది.

    'అమ్మా ఉత్పలా-'

    ఆమె మరింత ముడుచుకుపోయింది. తండ్రి లోపలికి వచ్చాడు గదంతా కలియజూస్తున్నాడు.

    "ఏదీ? పక్కమీద లేదే...." అక్క కంఠం వినపడుతూంది. తల్లి బాత్ రూమ్  తలుపు తోసి చూస్తూంది. తండ్రి పెరట్లోకి నడిచాడు.

    అతడు పూజ గదిలోకి నడిచాడు. బూట్ల కాళ్ళతో ఆ గదిలోకి ప్రవేశిస్తున్న అతడిని తల్లి నివారించబోయి పోలీసు అధికారి అని గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ భావం ఆమె కళ్ళలో ఉత్పలకి స్పష్టంగా కనపడింది.

    తండ్రి పెరట్లోకి వెళ్ళాడు.

    అతడు హాల్లోకి వచ్చాడు..... "ఎక్కడికెళ్ళింది? ఎక్కడున్నా పట్టుకోవాలి".

    ఈసారి అతడి కంఠంలో మర్యాద లేకపోవటాన్ని ఉత్పల గమనించింది. అది విసుగ్గా వుంది. ఆ స్వరంలో అధికారం వుంది. అతడి చెయ్యి పాంటుజేబుమీద నిలవటాన్ని కూడా ఆమె చూసింది. దండానికి వేలాడదీసి వున్న బట్టల్ని విసురుగా  పక్కకితోసి వెనక్కి చూశాడు. కాలితో పెట్టెని తన్నాడు.

    "ఇక్కడే పడుకుని వుంది బాబూ. ఎటు వెళ్ళిందో?" పెరట్లోంచి వస్తూ తండ్రి అంటున్నాడు. అతడి చెయ్యి జేబుమీద బిగుసుకుంది.

    భగవంతుడా! రక్షించు. నా కుటుంబాన్ని ఈ కిరాతకుడి హస్తాల నుంచి తప్పించు. ఈ పొదరిల్లు నిలువునా కూలిపోకుండా మమ్మల్ని కాపాడు.

    "ఎక్కడి వెళ్తుంది? ఇక్కడే వుంటుంది వెతకండి" తన స్వంత అనుచరులకి ఆజ్ఞ ఇచ్చినట్టు గద్దించాడు.

    తమ్ముడు బట్ల పెట్టెవైపు వస్తున్నాడు. చిన్నస్వరంతో ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అతడూ ఇటే చూస్తున్నాడు "అమ్మా- ఉత్పలా" అన్న తండ్రి కంఠం మళ్ళీ వినిపించింది. తమ్ముడు వెనుదిరిగాడు.

    "పెరట్లోనే వుందేమో మళ్ళీ చూడండి" అమ్మ అంటోంది.

    "చెప్పులు ఇక్కడే వున్నాయి" చెల్లి చెబుతోంది.

    "ముందు తలుపులు వేసే వున్నాయికదే" అక్క కంఠం అది.

    ఆమెకి దుఃఖం ఉబికి వస్తోంది.

    "ఆమె ఎక్కడున్నా పట్టుకోవాలి" ఈసారి అతడి కంఠంలో రాక్షసత్వం నిజంగానే తొంగి చూసింది.

    "ఏమైనా తప్పుచేసిందా బాబూ" విశ్వేశ్వరశాస్త్రి కంఠంలో భయంతో కూడిన అనుమానం.

    "అది మీకనవసరం. ఆవిడగానీ తప్పించుకుపొయిందంటే మిమ్మల్ని అందర్నీ అరెస్ట్ చేయవలసి వస్తుంది".

    "నా కూతురు అలాంటిది కాదు నాయినా, వుండు. ఒకసారి మళ్ళీ పెరట్లో చూస్తాను-"

    ఆ ఇంటి పెరడు చాలా విశాలమైంది. ఒకవైపు ఆనపపాదు. మరొకవైపు ఎత్తైన మునగచెట్టు, ఈ శాన్య దిక్కుగా బావి , చుట్టూ చప్టా, తల్లి పెంచే తులసిచెట్టు, చెల్లికిష్టమైన ముద్దమందార చెట్టు, సంపెంగ పొద.....

    అందరూ అటు వెళ్ళారు.

    అకస్మాత్తుగా ఆ ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. అప్పటివరకు హడావుడిగా వున్న ఆ గదిగోడల మధ్య అంత నిశ్శబ్దం ఒక్కసారిగా అలుముకోవడంతో అది మరింత భయంకరంగా వుంది.

    ఆ నిశ్శబ్దంలోంచి ఆమె నెమ్మదిగా బట్టలపెట్టె చాటునుంచి బయటకు వచ్చింది.

    ఎదురుగా సింహద్వారం తలుపు - బయట ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టు. సగం తెరిచి వుంది.

    ఆమె అటు పరుగెత్తింది.

    పెరట్లోంచి మాటలు తిరిగి వినపడసాగాయి. "గోడలు ఎత్తుగా వున్నాయి. దూకి వెళ్ళలేదు" అంటున్నాడు అతడు.

    "ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఇన్ స్పెక్టర్! నా కూతురుకి అలాంటి అవసరం ఏమీ లేదు" కోపం ధ్వనించింది తండ్రి కంఠంలో.

    అందరూ లోపలికి వస్తున్నారు.

    ఆమె మరి ఆలస్యం చేయలేదు. తెరిచివున్న తలుపులగుండా బయటకు దూసుకుపోయింది. అంతవరకూ కిక్కిరిసిన బట్టలవెనుక వుందేమో, ఒక్కసారిగా చల్లగాలి ఆమెను చుట్టుముట్టింది. ఆమె ఆగలేదు. పరుగెడ్తూనే వుంది.

    తొలిపొద్దు పొడవటానికి ఇంకా చాలా సమయముంది. నగరం నిద్రలోనే వుంది. మోటార్ సైకిల్ పక్క నుంచి ఆమె పరుగెత్తింది. వెనక్కి చూడలేదు. ఇంట్లోంచి ఏదైనా పిస్తోలు చప్పుడు వినపడితే- ఆ మరణ మృదంగ నాదం తన చెవులవరకూ చేరకూడదనీ, ఆ దురదృష్టకరమైన సత్యం తనకు తెలియకూడదన్నట్టు ఆమె పరుగెత్తింది.

    పది నిమిషాల వరకూ ఆమె అలాగే పరుగెడుతూనే వుంది. ఆ తరువాత రొప్పుతూ ఆగి చుట్టూ చూసింది. చిన్న సందు అది. ఇంటి వెనుకవైపు వుంది. ఆమె మరి కొంత దూరం నడిచి తన ఇంటి దగ్గరకి వచ్చింది. పెరటివైపు వున్న  పురాతనమైన గోడ ఆమెను తన వాళ్ళనుంచి వేరు చేస్తున్నట్టు  ఎత్తుగా నిలబడి వుంది. గోడమీద పెంకులు ఆమెని పరిహసిస్తున్నట్టు వున్నాయి.

    లోపల్నుంచి ఏ అలికిడీ లేదు.

    ఆమెకి కాస్త ధైర్యం చిక్కింది.

    తిరిగి వచ్చిన దారివెంట వెనక్కి నడవటం ప్రారంభించింది. మెయిన్ రోడ్డుమీద నుంచి తన ఇంటివైపు నడక సాగించింది. మలుపు తిరగబోతూ ఆగిపోయింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. లోపల లైట్లు వెలుగుతూనే వున్నాయి. కానీ దూరంగా వీధి అవతలివైపు మొదట్లో మోటార్ సైకిల్ మీద అతడు కూర్చుని వున్నాడు. ఇప్పట్లో కదిలే ఉద్దేశ్యం లేనట్టుగా తాపీగా సిగరెట్ వెలిగించుకుంటున్నాడు.

    దూరంగా అస్పష్టంగా నీడ కదలటంతో తలెత్తి చూశాడు. ఉత్పల  వెనక్కి  తప్పుకోవాలనుకుందిగానీ అప్పటికే ఆలస్యమైంది.

    సరీగ్గా రెండు సెకన్ల తరువాత మోటార్ సైకిల్ స్టార్టయిన చప్పుడు వినిపించింది. ఆ రెండు సెకన్ల కాలంలోనూ ఆమె ఎంత దూరం పరుగెత్తగలదు?

    ఉత్పల శిలాప్రతిమలా అలా నిలబడి చూస్తూ వుంది.

    మోటార్ సైకిల్ బాణంలా దూసుకువస్తూంది.

    అదింకా రెండొందల గజాలదూరంలో వుందనగా ఈ లోకపు స్పృహలోకి వచ్చి చుట్టూ చూసింది. కుడివైపు వరుసగా ఇళ్ళున్నాయి. ఎడమవైపు మరొక చిన్నసందు వుంది.

    ఆమె ఆ సందులోకి పరుగెత్తబోయి, కాస్త లోపలికి వెళ్ళి, గిరుక్కున వెనుదిరిగి ముందు వున్న స్థానంలోకి వచ్చి మూలగా వున్న ఇంటి అరుగు ఎక్కేసింది.

    ఇదొక అద్భుతమైన వ్యూహంలా పనిచేసింది.

    మోటార్ సైకిల్ అంతవేగంగానూ ఆ సందులోకి వెళ్ళి, కొంత దూరం పయనించి కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది.

    ఆ వీథి నిర్మానుష్యంగా వుంది!

    మోటార్ సైకిల్ మీద వున్న సలీంశంకర్ తన కళ్ళని తనే నమ్మలేనట్టు కళ్ళని నులుముకొని చూశాడు. వీథిలో ఒక్క పురుగు కూడా లేదు.

    ఈ లోపులో ఉత్పల ఆ చీకట్లో బిల్లిలా గోడకి ఆనుకుని నడుస్తూ అరుగు అంచుకొచ్చింది. సలీంశంకర్ మోటార్ సైకిల్ గిర్రున వెనక్కి తిప్పి తిరిగి మొదటి సందులోకి వచ్చాడు. అతడలా వస్తూవుండగా ఆమె ఆ చీకట్లోనే గోడ అంచు వదలకుండా, ఎడమవైపున్న ఆ సందులోకి తిరిగింది. సరిగ్గా పది అడుగుల దూరంనుంచి ఒకర్నొకరు సాగిపోయినా సలీంశంకర్ గుర్తించలేదు. ఆమె తప్పించుకున్నదన్న ఇరిటేషన్ అతడిని దాదాపు పిచ్చివాణ్ని చేసింది. తిరిగి తనున్న మొదటి స్థానంలోకి వచ్చి ఇటు అటు చూడసాగాడు. ఆమె అక్కడే ఏదో ఒక ఇంటి అరుగుమీద చీకట్లో దాగివుంటుందని అతడు వూహించాడు. బ్యాగ్ లోంచి టార్చిలైట్ తీసి ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ నడవసాగాడు.

    ఉత్పల పరుగుతీయడం ప్రారంభించింది.

    అతడు తిరిగి ఆ ఎడమవైపు సందులోంచి ఇప్పట్లో రాడని తెలిసినా, ఏమో ఏ క్షణమైనా అతడికి అనుమానం రావొచ్చు. ఆ పొడవైన సందు చివరికి వెళ్ళేవరకూ ఆమె పరుగు ఆపలేదు. అక్కడికి వెళ్ళి మలుపు తిరిగాక ఆమె రొప్పుతూ ఆగింది. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే.

    ఆ తరువాత ఏం చెయ్యాలా అని ఆమె ఆలోచించింది. ఆమెకి వెంటనే గుర్తొచ్చింది శ్రీనివాసరావు. అవును, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అతనొక్కడే చెప్పగలడు. వీళ్ళు తన దగ్గరికి వచ్చారంటే, తానా వుత్తరాన్ని చదవడం వాళ్ళు చూసి వుంటారు. లేక ఎవరో చూసి వాళ్ళకి చెప్పివుంటారు. ఆ వుత్తరం గురించి అంతకుముందే శ్రీనివాసరావుని హెచ్చరించడం మంచిది!

    ఆమె చుట్టూ చూసింది. అర్థరాత్రి చాలా సేపవడంతో రిక్షాలో ప్రయాణం చెయ్యడం కూడా ప్రమాదమే. ఏ క్షణమైనా మోటార్ సైకిల్ ఎదురురావొచ్చు.

    ఆమె, ఇళ్ళ అంచునే నడవసాగింది. పది నిముషాలు పట్టింది ఆమెకి ఆ ఇల్లున్న వీథికి చేరుకునేసరికి.

    ఇంటి పరిసరాలు చేరుకొని హఠాత్తుగా ఆగిపోయింది!

    ఆ వీథినిండా జనం వున్నారు. గోలగా వుంది.

    చిన్న పిల్లల ఏడుపులు హృదయవిదారకంగా వినిపిస్తున్నాయి. పోలీసులు జనాన్ని దూరంగా తోలుతున్నారు. "మొగుడూ పెళ్ళాలిద్దర్నీ పొడిచేశార్రా" అని ఎవరో అనుకోవడం వినిపించింది.

    ఆమెకి స్పృహతప్పుతున్నట్టు అనిపించింది. కాళ్ళలో సత్తువ ఒక్కసారిగా పోయినట్టు అయింది. ఎలక్ట్రిక్ పోల్ ని పట్టుకుని అతికష్టం మీద నిలబడగల్గింది. 'మాఫియా' యొక్క ఆసలర్థం ఆమెకు మొదటిసారి పూర్తిగా అర్థమయింది. విష్ణుశర్మ వుత్తరంలో వాక్యాలు మస్తిష్కంలో గిర్రున తిరిగాయి.

    వాళ్ళు కిరాతకులు..... వాళ్ళకి తెలియనిదంటూ లేదు..... అనుకున్నది సాధిస్తారు. ఎంత రక్తపాతం జరిగినాసరే!!! తమలో చేరినది ఒక పోలీసు ఇన్ఫార్మెంట్ అని తెలిసి, అతడిగోళ్ళు వలిచి, పైజమాలో తొండల్ని వదలడం నేను కళ్ళారా చూశాను. అతడు తన రహస్యం చెప్పేవరకూ వదలక, చెప్పేక మరింత దారుణంగా చంపేశారు. అంత రాక్షసులు వాళ్ళు. ఒక్క సాక్ష్యంకూడా మిగల్చారు......

    ......ఆమెకు క్రమంగా ఒక్కటొక్కటే అర్థం కాసాగింది. ముందు, వాళ్ళు శ్రీనివాసరావు దగ్గరికి వచ్చారు. అతడి దగ్గిర ఉత్తరాన్ని తీసుకుని అతడిని చంపేశారు. దానికి ప్రత్యక్ష సాక్షి అయిన అతడి భార్యని కూడా వదిలి పెట్టలేదు. తనుకూడా ఆ వుత్తరం చదివిందన్న వార్తా వాళ్ళకి తెలిసి వుంటుంది. కాబట్టి తనని కూడా....

    భయంతో ఆమె శరీరం వణికింది.

    సలీంశంకర్ గదిలోకి వచ్చినప్పుడు బట్టల పెట్టె వెనక దాక్కున్న సమయాన కలిగిన భయంవేరు. ఆ భయంలో అదోరకమైన తెగింపు కూడావున్నది. ఇప్పుడు అదిలేదు. సమయం గడుస్తూన్న కొద్దీ మృత్యువు దగ్గిరవుతున్న విషయం స్పష్టంగా తెలుస్తూంది. ధైర్యం సన్నగిల్లుతూంది. ఆ వుత్తరంలో విషయాలన్నీ తెలుసున్న వ్యక్తి తను. తెలిసీ బ్రతికున్న వ్యక్తుల్లో చిట్టచివరిది తను!...!

 Previous Page Next Page