Previous Page
Next Page
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 29
"మధ్యలో ఈ ఎక్సర్ సైజులేమిటి ?" చిరాకుగా అడిగాడు కృష్ణ.
"ఆ తలుపంతేనండీ ! నలుగురయిదుగురు కలిసి నొక్కిపడితే గాని గొళ్ళెం పడదు -"
"అంటే - ఒకవేళ మనింటికి నిప్పంటుకున్నా నలుగురయిదుగురు వచ్చేవరకూ మనం ఈ గదిలోనే ఉండాలన్నమాట !"
"ఛీ ! అవేం మాటలండీ ఈ సమయంలో -" చిరుకోపంతో అందామె.
"సరే! మనం ఈ శుభ సమయాన్ని మీ ఇంటి బాగోగుల గురించి చర్చించడం ఆపి - మన కోసం ఉపయోగిద్దాం! ఇలారా ! మంచంమీద కూర్చో -"
ఆమె భుజంమీద చేయి వేసి మంచం దగ్గరకు తీసుకెళ్ళాడతను.
సరిగ్గా అదే సమయంలో __
నరసింహం రామలింగంతో పిచ్చాపాటీ మాట్లాడుతోంటే లోపల్నుంచీ అన్నపూర్ణ పిలిచింది.
"ఏమండీ ! నరసింహం అన్నయ్యగారికి ఫోన్ వచ్చింది !"
నరసింహం వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.
"హలో __"
"మావయ్యా ! నేను మురళిని."
నరసింహం ఉలిక్కిపడ్డాడు. తన అల్లుడి గొంతే అది ! కానీ మురళి శోభనం గదిలో వున్నాడు కదా !
"నీ వెధవ్వేషాలు నా దగ్గర కాదు-" అన్నాడు నరసింహం.
"అయ్యో ! నేను నిజంగా మురళీనే ! నన్నెవరో తీసుకొచ్చి హుసేన్ సాగర్ దగ్గర వదిలేశారు. ఇప్పుడే ఊళ్ళోకి పరుగెత్తుకువచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను."
నరసింహానికి భయం శరీరమంతా పాకింది. గొంతు మురళిదే ! ఏమాత్రం సందేహంలేదు.
"అదేమిట్రా - మరిక్కడ శోభనం గదిలో..."
"కొంప మునిగింది ! వాడే__ఆ దొంగ వెధవే శోభనం గదిలో దూరి ఉంటాడు. ముందు వాడిని బయటకు లాగు మావయ్యా!"
నరసింహం ఫోన్ వదిలేయటమేమిటి ? ఒక్క అంగలో పరుగెత్తి శోభనం గది తలుపులు బాదటమేమిటి కనురెప్పపాటులో జరిగిపోయింది.
"ఒరే హరీ ! బయటకు రారా ! నీ రక్తం కళ్ళ జూస్తాను." అనరవసాగాడు.
ఆ సమయంలోనే మురళీ రాధను కౌగిట్లోకి తీసుకోబోతున్నాడు.
తలుపులు విరిగేలా చప్పుడు వినిపించేసరికి ఇద్దరూ ఉలిక్కిపడి మంచం మీద నుంచీ కిందకు దూకారు.
రామలింగంతో పాటు మిగతా ఆడంగులు కూడా నరసింహం చుట్టూ మూగారు.
"ఏమిటి ? ఏం జరిగింది ?" ఆత్రుతగా అడిగాడు రామలింగం.
"కొంప మునిగిపోయిందయ్యా ! లోపలున్నవాడు మన మురళీ కాదు."
చుట్టూ వున్నవాళ్ళు అదిరిపడి అతడిని పిచ్చాడిని చూసినట్లు చూశారు.
"మన మురళీ కాకపొవటమేమిటి ?"
నరసింహాని కెలా చెప్పాలో తెలీలేదు. "కాదని నేను చెపుతున్నా కదా ! ముందు మనం తెలుపు తెరుస్తేగాని విషయం బయటపడదు" అంటూ మళ్ళీ తలుపు బాధసాగాడు.
ఈ హడావుడంతా లోపల నుంచి వింటున్న మురళీ చప్పున తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు గాని అవి తెరుచుకోవడం లేదు.
"అయ్యో ! అవి అంత తేలిగ్గా తెరుచుకోవండీ !" అంది రాధ.
మురళి చేసేది లేక వెనక్కు తిరిగి వచ్చి మంచం మీద కూలబడ్డాడు.
"ఈ రోజు విశేషం, మన విషయం తెలిసి కూడా అలా బాదుతున్నారెందుకు ?" చిరాగ్గా అన్నాడు.
ఈలోగా రామలింగం నరసింహానికి అడ్డం పడ్డాడు.
"అయ్యా - ఆ తలుపు గొళ్ళెం మనమే తీయాలండీ ! వాళ్ళెలా తీస్తారు ? లోపల గడలేదు."
నరసింహానికి కోపం ముంచుకొచ్చింది. "మరా విషయం ఇందాకట్నుంచీ చెప్పవేమయ్యా ?" అంటూ గొళ్ళెం లాగబోయాడతను. కాని అది కూడా సాధ్యం కావడంలేదు.
"అయ్యో ! లోపల ఏం చేస్తున్నాడో ఏమో ! తలుపు కూడా రావటంలేదు."
"అబ్బే ! అది అబ్బాయి డిఫెక్ట్ కాదండీ ? తలుపు గొళ్ళెందే. పెద్ద సుత్తితో కొడితే గాని రాదు" వినయంగా చెప్పాడు రామలింగం.
"నీకు మతేమన్నా ఉందటయ్యా ? త్వరగా తీసుకురా ఆ సామానేదో. లేకపోతే అవతల వాడు అమ్మాయి బ్రతుకు అమావాస్య చేసేస్తాడు" అని అరిచాడు.
రామలింగం పరుగుతో వెళ్ళి సుత్తి తీసుకొచ్చాడు.
గొళ్ళెం తీయగానే మురళీ ఆశ్చర్యంగా బయటకొచ్చాడు.
"ఏమిటి ? ఏం జరిగింది ?"
అంటూండగానే అతని చొక్కా ఛటుక్కున పట్టుకున్నాడు నరసింహం.
"ఎవరు నువ్వు ?? నిజం చెప్పు..."
మురళీకి మతి పోయినట్లయింది. "ఏమిటి మావయ్యా నువ్వు మాట్లాడేది ?" అన్నాడు విస్మయంతో.
"వెధవ్వేషాలేయకు ! రాస్కెల్ ! మావయ్యట - మావయ్యా ! ఎవడ్రా నీకు మావయ్యా ? ఇంతమందిని మోసం చేసి గదిలో దూర్తావా? ఇంతకాలానికి ఎప్పుడు దొరికిపోయావ్ !..."
Previous Page
Next Page