అతడి మాటలు కాదు గానీ, అతడి చేతులు ఆమె వళ్ళు ఝల్లుమని పించేలా చేశాయి.
When I asked a moving cloud
About my friend's welfare
It shouted back aloud
"this is not fair"
..... ...... ......
Surprised I asked - "Why?"
Afterall it your buty (మేఘ సందేశం)
The cloud turned red with the sky
And it looked a beauty
It said "I am sorry,
Going in a hurry
To reach him' cause
I am in love with him too......"
అనెప్పుడో వ్రాసుకుంది అనుభవం లేకముందు. అది నిజమైంది.
"చెప్పు నీ కభ్యంతరం లేదుగా"
"ఊహూ" అంది తల వంచుకుని.
'ఎంత బాగా నటిస్తున్నావు' అనుకున్నాడు మనసులో.
"మీ తండ్రిగారు మన స్నేహానికి ఒప్పుకుంటారా" అని అడిగాడు.
ఆమె విస్మయంతో, "ఏం? ఎందుకొప్పుకోరు?" అంది.
"తన యాక్టివిటీస్ లో పాల్గొనమని మీ నాన్నగారు అడిగితే?" సంభాషణ లైన్లోకి తెస్తూ అన్నాడు.
"తన యాక్టివిటీసా?"
"మీ నాన్నగారు చేస్తున్న పనులు నాకు కొద్దిగా తెలుసు."
ఆమె తల దించుకుంది.
అతడు స్వరం చిన్నది చేసి, "అందులో తప్పులేదనుకో. డబ్బు కోసం ఏమైనా చెయ్యవచ్చు" అన్నాడు ఆమె తండ్రిని సమర్థిస్తున్నట్టు.
"డబ్బు కోసం ఏమైనా చెయ్యచ్చా.....? ప్రాణాలు కూడా తియ్యచ్చా....?" అందామె కోపంతో. అతడు చప్పున ఆమె వైపు చూశాడు.
....... సో...... సర్పభూషణరావు పనులు ఈమెకు తెలుసు. కేవలం తన ముందు ఆమె మంచితనం నిరూపిస్తూంది. అతడు తన ఇరిటేషన్ అణచుకుని, ఆమె నుంచి కూపీ లాగటానికి ప్రయత్నించాడు.
"ఏం ..... తప్పేముంది.....?? నేను ఆయన అల్లుడ్నయితే ఆయనకు తప్పకుండా సాయపడ్తాను" అన్నాడు. ఆమె అతన్నుంచి దూరంగా వెళ్ళింది. అతడొక క్షణం ఆగి, ఆమె దగ్గిరగా వెళ్ళాడు. "నువ్వు చెప్పు..... మీ పనులలో నేనేవిధంగా సాయపడగలను......?" అని అడిగాడు ప్రోత్సహిస్తున్నట్టు.
"మా పనులా......?" అర్థం కాన్నట్టు చూసింది.
"అదే...... మీ నాన్నగారు చేసే పనులు" అంటూ కుర్చీలో కూర్చున్నాడు.
"ఆయన....." అంటూ ఏదో చెప్పబోయింది. అదే సమయానికి కరెంట్ పోయింది.
నేత్రకి విపరీతమైన కోపం వచ్చింది. ఇంకొక్కక్షణంలో ఆమె చెప్పేది. లేదా తను చెప్పించేవాడు. సమయానికి కరెంట్ పోయింది. "ఊ...... ఆయన" అని రెట్టించాడు. ఆమె మాట్లాడలేదు.
చుట్టూ కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. అతడు లేచే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. ఇద్దరూ చెరో కుర్చీలో దగ్గిర దగ్గిర కూర్చుని వున్నారు. వాళ్ళ దగ్గర టీపాయ్ ఉంది.
"మీ నాన్నగారు నీతో చాలా ప్రయోగాలు చేయిస్తూ వుంటారు కదూ......?" టాపిక్ కొనసాగించబోయాడు.
"నాకు చీకటంటే భయం" అట్నుంచి వినపడింది.
"కొవ్వొత్తులు లేవు. అయినా...... నేనున్నానుగా. భయం దేనికి.....?"
సరిగ్గా అదే సమయానికి ప్రతిమ ఆ గదిలోకి ప్రవేశించింది. ఆమె వచ్చిన సమయానికి "నాకు చీకటంటే భయం" అని లేఖ అనడం, దానికి నేత్ర సమాధానం చెప్పడం జరుగుతూ వుంది. కొవ్వొత్తులు లేవు, అయినా నేనున్నాగా, భయం దేనికి అంటున్నాడు నేత్ర. ప్రతిమ నిశ్శబ్దంగా నిలబడింది.
హంసలేఖ కూడా ఆ చీకట్లో మవునంగా వుండిపోయింది. ఆమెని ఎలాగయినా నేత్ర మాట్లాడిస్తే బావుణ్ణని ప్రతిమ అనుకుంది. ఆమె కోరిక నెరవేరింది.
"అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిల్ని ఇష్టపడతారో తెలుసా?" అని అడిగాడు నేత్ర.
"ఊహు" అంది హంసలేఖ.
ప్రతిమ కూడా సమాధానం కోసం ఆ చీకట్లో ఎదురుచూస్తూ వుందని అతడికి తెలీదు. కేవలం హంసలేఖని మాటల్తో ఎంగేజి చేసి, తనంటే భయం పొగొట్టటానికే అతను మాట్లాడుతున్నాడు.
హంసలేఖ ఆసక్తిగా ఇష్టపడతారు?" అంది. ఆ ప్రశ్నలో కాస్త కొంటెతనం కూడా వుంది.
"మొగవాడు మంచి అమ్మాయంటే గౌరవం చూపిస్తాడు. తెలివైన ఆడపిల్ల నుంచి ప్రేరణ పొందుతాడు. అందమైన స్త్రీ పట్ల ఉత్సుకత చూపిస్తాడు. అర్థం చేసుకోగల అమ్మాయికి తనని అర్పించుకుంటాడు".
'ఎంత బాగా వెన్న రాస్తున్నావు నేత్రా' అనుకుంది వెనుకనుంచి ప్రతిమ. అవే పదాల్ని కాస్త అటు ఇటుగా మార్చి ఆ నాలుగు రకాల అమ్మాయిల్నీ అతను బుట్టలో పడేస్తాడని ఆమెకు తెలుసు. వారం రోజుల క్రితం స్వయంగా తనతో అన్నాడు- 'మొగవాడికి మంచి అమ్మాయంటే అనాసక్తి. తెలివైన దంటే భయం. అందం, హుషారుగా వున్నా (నీలాటి) దయితే పడి ఛస్తాడు' వగైరా.......
ప్రతిమ వళ్ళు మండిపోతోంది. కేవలం దేశంకోసం ఆ పరిస్థితిని సహిస్తోన్నట్టు ఓపిగ్గా నిలబడింది, చలిలో హిమాలయ సరిహద్దుల్ని పరిరక్షిస్తూన్న సైనికుడివలె చీకట్లో.
"నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను నేత్రా" ఆర్తిగా అన్నది హంసలేఖ.
"థాంక్స్. నన్ను నేను అర్పించుకుంటానయితే" అన్నాడు నేత్ర.
"ఎలా?" అంది అర్థంకాక.
"ఒక ముద్దు ద్వారా" తన్మయంగా అన్నాడు.
ఆమెకు భయం వేసింది. ముద్దుద్వారా "సర్వస్వం" అర్పించుకునేది స్త్రీ కదా. తనని తాను అర్పించుకొంటానంటాడేమిటి? అనుకుంది. తన మౌనాన్ని అతడు మరోలా అర్థం చేసుకుని చప్పున పెదాలమీద ముద్దు పెట్టేసుకుంటే? (ఆమెకు కడుపులోంచి పసిపిల్ల ఏడుపు వినిపించింది). చప్పున కుర్చీలోంచి లేచి నిలబడి "వెళ్తాను" అంది.