Previous Page Next Page 
13... 14.... 15 పేజి 29

 
    "నేను మీ క్లినిక్ లో చేసేపనికి కళ్ళు అవసరంలేదని మీకు తెలుసు" అన్నాడు

    వింటూన్న మధూహ ఉలిక్కిపడింది.

    నేను మీ క్లినిక్ లో చేసేపనికి కళ్ళు అవసరంలేదని మీకు తెలుసు. చాలా పెక్యూలియర్ వాక్యం. కాంపౌండర్ కి కళ్ళ అవసరం లేకపోవటం ఏమిటి?

    ఈ లోపులో విశాల్  అన్నాడు..... "ఇన్నాళ్ళూ నువ్వు నాకు చేదోడు వాదోడుగా వుంటూ వచ్చావు. నీ గురించి నేను మర్చిపోను. ఏదో ఒకసాయం చేస్తాను."

    "నాకు ఉచిత సహాయం అవసరం లేదు. నేను చేసినపనికి జీతం ఇస్తే చాలు...."అని  ఆగి, "... ముందిచ్చినట్టుగా"  అన్నాడు. డాక్టర్ విశాల్ క్షణం ఆగి, "ముందంటే నువ్వు చాలా ఉపయోగపడేవాడివి. నేను లేనప్పుడు ఆపరేషన్లు కూడా చేసేవాడివి. కానీ ఇప్పుడలా కాదుగా. ఆ ఒక్కపనికి తప్ప ఇంకదేనికీ ఉపయోగపడవు" అన్నాడు.

    వింటూన్న మధూహ ఉలిక్కిపడింది.

    ఆ ఒక్కపనికి తప్ప!

    ఏమిటది?

    ఆమె ఆలోచనల్లో వుండగానే వారి సంభాషణ కొనసాగటం వినిపించింది.

    "అది మాత్రం తక్కువ పనా?" రాజు అంటున్నాడు.

    "ఆ పనికోసం బయటవాళ్ళకిచ్చిన రేటు నీకూ ఇస్తాను. నీకు వీలున్నప్పుడు వచ్చి వెళ్తుండు. లేదా నాకవసరం వచ్చినప్పుడు పిలిపిస్తాను....."

    బయటవాళ్ళకిచ్చిన రేటు.

    అంటే......రహస్యమైన వ్యవహారం కాదు. బహుశ చట్టవిరుద్ధమైంది. కూడా కాకపోవచ్చు.

    "ఆ డబ్బు నాకు సరిపోదు. నెలకి వెయ్యి చొప్పున ఏమి సరిపోతుంది?"

    డాక్టర్ విశాల్ నవ్వు వినిపించింది. "వెయ్యేం ఖర్మ? నువ్వు తల్చుకుంటే మూడువేలు కూడా సంపాదించవచ్చు. రోజుకి వం....ద....చొప్పున."

    "చెప్పటానికి సులభం. అదెంత కష్టమైనపనో అనుభవిస్తే తెలుస్తుంది" కోపంగా అన్నాడు రాజు.

    "ఇంతకీ నన్నేం చెయ్యమంటావు?"

    "ఎవరో కళ్ళ స్పెషలిస్ట్ వస్తున్నాడట. నాకో రెండురోజుల్లోగ పదిహేను వేలు కావాలి."

    "ఇదేమీ గవర్నమెంటు ఆఫీసు కాదు. ఫ్యాక్టరీ అంతకన్నా కాదు, కంపన్సేషన్లూ, గ్రాట్యుయిటీలు ఇవ్వటానికి...."

    "నేను భిక్షం అడగటంలేదు. న్యాయంగా నాకు రావలసిన వాటా అది."

    "అవును. నీదే. కానీ మైండ్ మాగ్నో థెరపీ ఆలోచన మాత్రం నాది! రాష్ట్రంలో హిప్నాటిస్టు చాలామంది అయిపోయారనీ, వారినుంచి పోటీ తట్టుకోవటం కోసం హిప్నో.....థెరపీని, మాగ్నో థెరపీగా మార్చాను. అప్పటినుంచీ జనం ఎలా వస్తున్నారో చూసావుగా"

    "రాజులేచి, "నేను వెళ్తూన్నాను. రేపు సాయంత్రానికి మీరు నాకు పదిహేను వేలు పంపించాలి" అన్నాడు అదే ఆఖరి మాట అన్నట్టు.

    "పంపకపోతే?"

    "మీరు చేసిన పని 'ఒక్కటి' బయటపడితే చాలు. జనం మిమ్మల్ని కుక్కనికొట్టినట్టు కొడతారు. పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు."

    డాక్టరు  మాట్లాడలేదు. రాజు లేచి గుమ్మందగ్గిరకి వెళ్ళాడు. అక్కడ ఆగి  అన్నాడు. "లాయర్ శంకరాన్ని చేసినట్టు నన్నూ చేయటానికి ప్రయత్నం చేయకండి. మీరు చేసినదేమిటో కవర్లో వ్రాసి పెట్టి వుంచాను. నా మరణానంతరం బయటపడేట్టుగా" అని బయటకు నడిచాడు.

    మధూహ తన కుర్చీలోంచి చప్పున లేచి గబగబా నడుస్తూ క్లినిక్ చుట్టూ తిరిగి, తన యధాస్థానంలోకి వచ్చింది. అప్పటికి రాజు తడుముకుంటూ అక్కడికి చేరుకున్నాడు.

    అతడితో కలిసి ఇంటివైపు వస్తూండగా "ఏమన్నాడు డాక్టరు?" అని అడిగింది ఏమీ  తెలియనట్టుగా.

    "అనటానికి ఏముంది? బాగా బెదిరించాలే. ఇచ్చి తీరుతాడు."

    "ఏమని బెదిరించావు?"

    "అవన్నీ అడక్కు."

    మధూహ నిరాశ చెందింది. ఈ విసుగూ కోపంలోనైనా అతడు ఏమైనా చెపుతాడేమోనని ఆశించింది.

    ఏ....దో వుంది. చాలా నిగూఢమైన రహస్యం! లేకపోతే డాక్టర్ విశాల్ లాటివాడు బెదరడు.

    ఏమిటది?

    ఏ రహస్యాన్ని- ఒక డాక్టరూ, కంపౌండరూ ఇంతకాలం పంచుకుంటూ వచ్చారు?

                                                                    4

    "అటువంటి వాడిని నువ్వెలా ప్రేమించగలిగావు?" ప్రహసిత్ అడిగాడు. మధూహ సమాధానం చెప్పలేదు.

    "నాకు తెలిసినంతలో నువ్వు చాలా విచక్షణాజ్ఞానం వున్నదానివి. రాజుకీ డాక్టర్ విశాల్ కీ మధ్య జరిగిన సంభాషణ వింటూంటే అతడిమీద నాకు సదభిప్రాయం కలగటంలేదు."

    "నాకూ కలగటం లేదు......" విషాదంగా నవ్వింది మధూహ. "......ఈ క్షణం వరకూ నేనిదే ఆలోచిస్తున్నాను. నేనింకా అతన్ని ప్రేమిస్తున్నానా? లేక ఇదంతా అతడిమీద జాలా? అదీకాకపోతే అతడిని ప్రేమించినందుకు అతడిని మార్చటానికి చేస్తున్న ఆఖరి ప్రయత్నమా? ఇటువంటి అనుభవం గతంలో ఒకరికి వచ్చివుంటుంది. ఆమెని అడిగితే చెపుతుంది......"

    "ఎవరిని?"

    'రావణుడి భార్య మండోదరిని" అంటూ నవ్వింది. ఆమెలో మునపటంత విషాదం లేదు. ప్రహసిత్ కూడా నవ్వేడు. ఆమె అంది.... "ప్రస్తుతం నాలాటి వాళ్ళు చాలామంది వున్నారు. నేను కాలేజీలో చాలా తెలివైనదాన్నే. మీరు  అన్నట్టు మంచి మార్కులే వచ్చేవి. కానీ ఇప్పుడున్న లోకజ్ఞానం అప్పుడు లేదు. ఇంటర్మీడియెట్ చదివే వయసున్నది చూసారూ......అది చాలా భయంకరమైనది. మనచుట్టూ తిరిగే కుర్రాడిని ముందు'నో' అనటం....అతడు  దిగులుగా వుంటే, కొంతకాలానికి 'ఓ.కే.' అనటం.....అంతా సినిమాల ప్రభావం" ఆమె ఆగి, తిరిగి చెప్పటం ప్రారంభించింది. "అలాగే నేనూ ప్రేమలో పడ్డాను. రాజు నావెనుకే తిరిగేవాడు. హీరోయిన్ ముందే ఒప్పుకోకూడదుగా. నేనూ అలాగే 'నో' అన్నాను. మణికట్టు క్రిందిభాగాన '10.....45' గురువారం' అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఏమిటని అడిగాను. నన్ను చూసిన మొదటి  క్షణం, గంటలూ నిముషాలతో సహా గుర్తుండడం కోసం అలా ముద్రించుకున్నానన్నాడు. కరిగిపోయాను.....హీరోయిను ఏదో  ఒకటైమ్ లో కరిగిపోవాలికదా. అయితే ఈ వ్యవహారంలో నన్ను మోసంచేయాలన్న ఆలోచన కూడా అతడి కేమీలేదు. సిన్సియర్ గానే పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ  వయసులో కుర్రవాళ్ళు అంత సిన్సియర్ గానే వుంటారనుకుంటాను. ఆ విధంగా ఇద్దరం ప్రేమలోపడ్డాము" ఆమె గతంలోకి జారుకుంది. "నేను గ్రాడ్యుయేషన్ లో చేరాను. అతడు ఇంటర్మీడియట్ తో ఆపుచేసాడు. అది మొదటిదెబ్బ. సాధారణంగా ఇంటర్మీడియట్ స్థాయిలో మొదట ప్రేమలో పడ్డ అమ్మాయిలు, గ్రాడ్యుయేషన్ కొచ్చేసరికి ఆ కుర్రవాడిని వదిలేస్తారు. కానీ రాజుని నేను అలా వదలలేకపోయాను. బలహీనతల్ని కూడా ప్రేమించటం నేర్చుకోవాలి అవి మనస్ఫూర్తిగా నమ్మినదాన్ని...' అంటూ ఆపి, కొనసాగించింది.

    "అతడికి డబ్బుపట్ల సంతృప్తి లేదు. అలాగే విలువలపట్ల నమ్మకంలేదు. ఏ విధంగానైనా సరే సమాజంలో గుర్తింపు పొందాలి, డబ్బు సంపాదించాలి అన్నదే అతడి ధ్యేయం. నేను డానికి పూర్తిగా వ్యతిరేకిని......"

    ప్రహసిత్ ఆమె మాటలను అడ్డుతగులుతూ "ఈ ప్రపంచంలో ఎంతోమంది మగవాళ్ళు ఎన్నో అడ్డదారుల్లో డబ్బు సంపాదిస్తున్నారు. వారి భార్యలందరూ వారిని ఖండించటంలేదే. పైగా తమ మొగుళ్ళ సంపాదన చూసుకుని మురిసిపోతున్నారు. మధూ! ఒక్క విషయం గమనించు! ప్రస్తుతం సమాజంలో అవతలివారిని మోసం చేయటం కూడా ఆమోదయోగ్యమైన జీవనవిధానంగా మారిపోయింది" అన్నాడు.

    "మిగతా వారి సంగతి నాకు తెలీదు. నాకు మాత్రం ఆత్మ అనేది ఒకటుంది. నా కళ్ళలో ఇప్పటికీ మామయ్యే కదులుతున్నాడు. కేన్సర్ తో చనిపోయిన మా అత్తమ్మే కనపడుతూంది. కష్టార్జితమంతా పోగుచేసుకుని, రోగం నాయమవుతుందన్న ఆశతో వచ్చే వందలాది పేషెంట్లకి ఆశచూపించి వారి కష్టన్నంతా కొల్లగొట్టి తింటే.....దానివల్ల ఏదైనా సంతృప్తి మిగులుతుందా? అటువంటి వ్యక్తికి భార్యగా నేనుండగలనా?"

    "పోనీలే. ఇప్పుడిక ఆ సమస్య లేదుగా. అతడే నీ మీద ఆధారపడి వుంటాడు."

    "నేను చెప్పేది మా ఇద్దరి గురించికాదు. అటువంటివాడిని ఎలా ప్రేమించావు అని అడిగారు కదా! డానికి సమాధానం చెపుతున్నాను. పదిహేనేళ్ళ వయసులో ఏ గమ్యాన్ని ఆశించి నేను ప్రేమలో పడ్డానా అని ఆలోచిస్తూంటే ఇప్పుడు నవ్వూ, దుఃఖమూ కలుగుతున్నాయి."

    "నేను నీ వాదనతో ఏకీభావించను. ప్రేమ అనేది అవతలి వారి గురించి అన్నీ తెలిసిన తరువాతే కలుగుతుంది అన్న వాదన నిజం కాదు. మొదటి చూపులోనే కలగొచ్చు....."

    "రెండో చూపులో పోవచ్చు."

    "నీకు నాప్రేమ మీద చాలా చిన్నచూపు వున్నట్టుందే."

    అతడికి కోపం వచ్చిందని గ్రహించి కూడా ఆమె  తన వాదనని ఆపుచేయలేదు. "మీ వుదాహరణే తీసుకోండి. లక్ష్మిని మొదటిచూపులోనే ప్రేమించారు. కానీ ఆమెకి వివాహం అయిందని మీకు తెలీదు. అంటే......మీరు ప్రేమించిన వ్యక్తి మొట్టమొదటి అనర్హతే మీకు తెలీదన్నమాట."

    "నేను ఆ అనర్హత వల్ల ఆమెని ప్రేమించటం మనలేదే."

    "మీరొక హైపొతెటికల్ క్యారెక్టర్. అంతే! నిజజీవితంలో అది సాధ్యంకాదు. పల్లెలో ఒక కుర్రాడిని ప్రేమించి, పట్నానికి ఎమ్ సెట్  వ్రాయటానికొచ్చి ఆ వాతావరణంలో రిచ్ నెస్ గమనించి మనసు మార్చుకున్న అమ్మాయిలు కొందరు నాకు తెలుసు."

    అప్పటికి ప్రహసిత్ నవ్వేడు. "మరి నిజమైన ప్రేమంటే ఎలా మొదలవుతుందంటావ్?"

    "జీరోబేస్ లో మొదలవ్వాలి. శరీరాకర్షణని అధిగమించాలి. మిగతా ఆకర్షణ, తళుకులాన్నీ పోవాలి. వ్యక్తిత్వాలూ, శరీరాలూ ఫర్వెక్టుగా వైబ్రేట్ అవ్వాలి. గమ్యం తెలిసుండాలి. అప్పుడు ప్రేమ ప్రా.....రం.....భం అవుతుందని నా వుద్దేశ్యం."

    ప్రహసిత్ మరింత బిగ్గరగా నవ్వుతూ "ఇంపాజిబుల్.....ఇంపాజిబుల్" అన్నాడు.

    ఆమె అదే ఆవేశంతో, "ఏం ఎందుక్కాదు? ఎందుకు ఇంపాజిబుల్?" అని అడిగింది.

    "నువ్వు చెప్పేదే నిజమయితే ప్రతిజంతా రెండు మూడేళ్ళు కలిసి కాపురం చేస్తేనే కానీ ప్రేమ ప్రారంభమవదు."

    "నేనూ రాజూ అనుకున్నట్టు తొలి ఆకర్షణనే ప్రేమ అనుకోవటంకన్నా అదే మంచిది కదా! అంతవరకూ ఎందుకు? మీరు లక్ష్మిని మనసా వాచా కర్మణా ప్రేమించానన్నారు. నిజంగా లక్ష్మి మీభార్య అయివుంటే.....సంవత్సరం తిరిగేసరికల్లా ప్రేమంతా కరిగిపోయి వుండేది."

    ఆకస్మాత్తుగా అక్కడ వెంట్రుక కదిలితే వినపడేటంత నిశ్శబ్దం వ్యాపించింది. ప్రహసిత్ స్థబ్దుడై చూసాడు. తను నోరుజారానని మధూహకి అర్థమైంది. అయినా ఆమె తన వాదనలో వెనక్కీ తగ్గదల్చుకోలేదు. "అవును ప్రహసిత్ బాబూ! లక్ష్మిది మీరందరూ అనుకునేటంత ఆదర్శమైన దాంపత్యం కాదు. ఇంతవరకూ వచ్చాక మీదగ్గిర దాచేదేముంది?.....లక్ష్మి వ్రాసేది తన కథే..... అయితే చాలామంది మధ్యతరగతి స్త్రీలలాగే ఆమె తన సంసారం గురించి బయటపడదు. చాలా గుంభనంగా వుంటుంది. మొన్నమొన్నటి వరకూ నాకూ తెలీదు."

 Previous Page Next Page