"ఏం చేస్తున్నావ్. ఓ...వాష్ టబ్.....షవర్....రియల్లీ ఎక్స్ లెంట్ రవీ! డబ్బు ఇంత సుఖాన్నిస్తుందని తెలీదు..... కమాన్ నువ్వూ స్నానం చెయ్యి" మెడచుట్టూ చేతులు గొలుసులా వేసింది- "బాత్ రూమ్ లో రోమాన్స్-" అర్థం లేకుండా నవ్వుతోంది. "బాగుందికదూ రవీ ఈ మొజాయిక్ ప్లోరింగ్- అరే నువ్వూ తడిసిపోయేవే- ఎంత బావున్నావ్ నువ్వు-" ఆమెకెందుకో ఆకస్మాత్తుగా ఏడుపొచ్చింది. "బావుంటం ఎందుకు? రొమాన్నెందుకు?? డబ్బెందుకు- ప్రేమ కావాలి రవీ! నాకివ్వవా? చిన్నప్పటి నుంచీ దానికోసం మొహం వాచీపోయేను. రవీ- ప్లీజ్- ప్లీజ్" నెమ్మదిగా ఆమెకి మైకం కమ్మేసింది.
* * *
"ఏన్నాళ్ళనుంచో చీకట్లో కొట్టుకుంటున్న మా బ్రతుకులకో దారి సూపించేరు. ఇంతకాలంగా మాకీమాత్రం సలహా సెప్పేవారు ఎవరూ లేకపోనారు బాబూ" అన్నాడు చంద్రయ్య.
అతడి వెనుకే కొంతమంది బెస్త యువకులు వున్నారు.
"మన జీవితాల్ని ఎవరో వచ్చి బాగచెయ్యరు చంద్రయ్యా! మనమే బాగుచేసుకోవాలి. సాధించినది నిలబెట్టుకోవాలి. అదే గొప్పదనం".
చంద్రయ్య ఏదో చెప్పబోయి తటపటాయిస్తున్నాడు. అది గమనించి, ఏమిటి చంద్రయ్యా" అన్నాడు చైతన్య.
"రేటు యాభై నుంచి డెబ్భై అయింది. మేం కలలోకూడా సూడలేని యిసయంబాబూ ఇది" ఆగి, నెమ్మదిగా అన్నాడు. "మీరేమీ అనుకోకండి బాబూ,మీరిప్పించిన లాభంలో సగం ఈ సీజన్ మొత్తం మీ కివ్వాలని అనుకొంటున్నాం".
చైతన్యకి ఒక క్షణం అతడు చెపుతున్నది అర్థంకాలేదు. కాగానే మొహం తెల్లగా పాలిపోయింది. చప్పున కుర్చీలోంచి లేచి "ఇదేమిటి?" అన్నాడు. "నేనిదంతా ఏదో లాభం ఆశించి చేసేనంటారా?"
"లేదు బాబూ లేదు. మీరొప్పుకోరనీ తెలుసు. అందుకే గంగమ్మతల్లి ముందు నిలబడి ప్రమాణం సేసేం. మీరు తీసుకోవాలి తప్పదు" అన్నాడో యువకుడు.
చైతన్యకి ఓ క్షణం నోటమాట రాలేదు. నీటిముందు నిలబడి ప్రమాణం చేసిన బెస్తవాడు ప్రాణం పోయినా మాట తిరగడు. అతనికి ఏం చేయాలో తోచలేదు. వాళ్ళ డబ్బు తీసుకొనే ప్రసక్తి మాత్రం లేదు. చాలా ఇరకాటమైన పరిస్థితి.
"ఒక్క సీజనుకే బాబూ. ఎంతోస్తది..... తీసుకోండి" అన్నాడు చంద్రయ్య. ఔతుంది! అతడు ఈ ఆలోచనలో వుండగానే శారద "పోనీ వాళ్ళ పేరుమీదే అంతవరకూ వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరికినట్టుయింది.
"అవును అలా చేద్దాం. మీరందరూ షేర్ హొల్డర్లుగా కంపెనీ ప్లోట్ చేస్తాను" అన్నాడు.
ఈ ఆలోచన వాళ్ళకీ నచ్చింది. "కానీ మీరూ లాభాలు తీసుకోవాలి.....?' అన్నాడు చంద్రయ్య.
"పడిన కష్టానికి తప్పకుండా తీసుకుంటాను".
వెనుకనుంచి ఒక యువకుడు సంచితో ముందుకు వచ్చి నేలమీద పోసేడు- నోట్లు, కాసులు.
యాభయ్ రూపాయల నుంచి డెభ్భయ్ రూపాయల వరకూ రేట్లు పెరగటం వల్ల వచ్చిన లాభం అది. రెండురోజుల తాలూకు అమ్మకం.
"ఎంతివి?"
ఇద్దరు ముగ్గురు లెక్క పెట్టసాగేరు.
"ఈ సీజను రెండు నెలలూ ఇలా తెచ్చిస్తాం బాబూ" అన్నాడు చంద్రయ్య. అతడికి చైతన్య నిజాయితీ నచ్చింది, అతడి పథకం కూడా. ఆ అభాగ్యుల మీద ఆ మాత్రం జాలి చూపించిన వాళ్ళు అంతవరకూ ఎవరూ లేరు.
"సీజను రెండు నెలలూ అంటున్నావు. ప్రతిరోజూ దొరుకుతుందేటి రొయ్య?" అన్నారెవరో.
"నిజమే దొరకవు. సీజను మొత్తంమీద రెండు మూడుసార్లు దొరుకుతాయి".
అప్పుడొచ్చిందే లాభం. మిగతా రోజులలో మామూలు భత్యంతో సంతృప్తి పడాల్సిందే. లెక్కపెట్టడం పూర్తిచేసి "తొమ్మిదొందలా, తొంభయ్ తొమ్మిది" అన్నాడు ఓ యువకుడు.
ఒక క్షణం సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం.
తొమ్మిదొందలా తొంభయ్ తొమ్మిది! రెండు రోజుల లాభం!!
"ఇంకో రూపాయి ఎయ్యండర్రా ఎయ్యవుద్దీ" అన్నారెవరో.
"నేను వేస్తాను నా షేరుగా....." అన్నాడు చైతన్య. గుప్పెట విప్పితే- అతడి చేతిలో దేవుడి ప్రాంగణంలో దొరికిన రూపాయి వుంది. దానిమీద అతడి తాలూకు రక్తం మరక కూడా అలానే వుంది.
* * *
కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ నిలబడ్డాడు చైతన్య. శారద 'టీ' తెచ్చింది.
"ఏమిటి చూస్తున్నారు?"
"వర్షాన్ని".
"చిన్న పిల్లలు చూస్తారు అలా".
"నాకు చిన్నతనం నుంచీ వర్షన్ని చూస్తే భయం" అన్నాడతను. "ఎందుకో తెలియదు..... నా జీవితంలో విషాదకరమైన సంఘటనలన్నీ వర్షం కురుస్తున్నప్పుడే జరిగేయి". ఆమె మాట్లాడలేదు.
"ఏమిటాలోచిస్తున్నావు? ఏ విషాద సంఘటనలు జరిగాయనా?"
అతడు బయటకు చూస్తూనే వున్నాడు. వర్షం ధారలుగా కురుస్తోంది.
"ఇలాటి వర్షం కురుస్తున్న రాత్రే బాబును స్వయంగా వదులుకొని బయటకొచ్చేను. ఇలాటి వర్షం కురుస్తున్న రాత్రే బాబును స్వయంగా పాతిపెట్టాను".
ఆమె చప్పున అతడి చేతిమీద చెయ్యివేసి, అలా మాట్లాడకండి ప్లీజ్" అంది.
"నా కొకటే ఆశ్చర్యం శారదా. బికారిగా వున్నప్పుడు ఇవేమీ నన్ను బాధ పెట్టలేదు. కానీ మళ్ళీ మనుషుల్లో పడగానే స్మృతులు బాధాకరం అవుతున్నాయి".
ఆమె మాటమారుస్తూ "ఏమో.....ఈ వర్షమే మీకు అదృష్టంతేవచ్చేమో....." అంది. అతడు నవ్వి, "మనకి అదృష్టం తెచ్చిన లేకపోయినా- జాలర్లకి మాత్రం తెస్తుంది ఈ వర్షం" అన్నాడు.
వర్షం వస్తే రొయ్యలు పైకి వస్తాయి. ఆగి ఆగి చిన్న జల్లులూ పడితే- మరీ! ప్రస్తుతం అలాగే కురుస్తోంది వర్షం.
రోజులు గడుస్తున్నాయి. కుంభవర్షం కురవకపోవటంతో జాలర్లకు ప్రతి రోజూ సముద్రం మీదకు వెళ్ళే వీలు చిక్కుతోంది. సముద్రం నుంచి ఒడ్డుకి కొట్టుకొచ్చే ఒక రకమైన పదార్థం కోసం రొయ్యలు ఎగబడతాయి. దానికోసమే వలస పోతాయి కూడా. ఈసారి ఆ పదార్ధం ఈ తీర ప్రాంతాల్నుంచి కదలలేదు. దాంతో వల వేసిన వాడికి ఆలస్యం అన్నట్టు రొయ్య దొరకసాగింది. దానికి తోడు సన్నజల్లులు ఆగి ఆగి కురవటంతో పని మరింత తేలికయింది.
రెండు నెలలపాటు ఉధృతంగా వుండే సీజను- నాలుగు నెలలపాటూ కొనసాగింది.
అవసరాన్ని తట్టుకోవటానికి రెండు ఐస్ ఫ్యాక్టరీలు వెలసినయ్. పీలర్లు రోజుకి ఇరవై నాలుగ్గంటలు చేసినా పని తరగటం లేదు.
ఎక్కడెక్కణ్ణుంచో వ్యాన్లు గ్రద్దల్లా వచ్చి సరుకు తీసుకుపోతున్నాయి.
పని- పని- పని-
జాలర్లు మితిమీరిన ఉత్సాహంతో సముద్రాన్ని మధిస్తున్నారు. వాళ్ళు పొదుపు చేసుకుంటున్న మూలధనం అనూహ్యంగా పెరిగిపోతోంది.
* * *
"అలాగే చేద్దాం" అన్నాడు రవి. మానేజరు తలూపి బయటకు వెళ్ళాడు. టేబుల్ మీదున్న కాగితాలు చూడసాగేడు రవి. అతడికి యిప్పుడే పనిలో సులువులు అర్థమౌతున్నాయి. ఇన్సూరెన్స్ విషయాలు.....సరుకు కొనుగోలు-అమ్మకం అన్నీ అతడే చూసుకుంటున్నాడు.
ఇంతలో పోస్ట్ వచ్చింది. జపాన్ నుంచి వచ్చిన ఓ కవరులో అతడిని కలవరపర్చే వార్తొకటి వుంది. అతడి దగ్గర నుంచి రెగ్యులర్ గా కొనుగోలు చేసే కంపెనీ వ్రాసింది. జపాన్ లో ఫ్రాన్స్ కన్స్యూమర్ సొసైటీ నిశ్చయించిన ధరకన్నా ఎక్కువయిన పక్షంలో తమ భవిష్యత్ కాంట్రాక్టులన్నీ రద్దు చేసుకోవాల్సి వుంటుందని!
అది చదివి, చాలాసేపు కుర్చీలో చలనం లేకుండా కూర్చుండిపోయేడు. ఆలోచనలు- ఎందుకొచ్చిన బాధ ఇదంతా అన్న స్మశాన వైరాగ్యం.
సాయంత్రం అయిదవుతూండగా అతనింటికి వెళ్ళేడు. ఇల్లంతా నిర్మానుష్యంగా వున్నది- మనసులో చింతనలా నిశ్శబ్దంగా.
అతడు తన గదిలోకి వెళ్ళి కోటు విప్పేడు, నిస్త్రాణగా కుర్చీలో కూర్చుండి పోయేడు. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపటికి గుమ్మం దగ్గర అలికిడయింది. అతడు కళ్ళు తెరవలేదు. టీ కప్పు చప్పుడయేలా బల్లమీద పెట్టి కిరణ్మయి వెళ్ళి పోయింది. ఆమెకు చాలా కోపంగా వుంది.
తను చేసింది తప్పే కావచ్చు. డానికి తిట్టవచ్చుగా. ఇలా నిర్లప్తతతో బాధపెట్టటం దేనికి?
అతడేమాత్రం ఆ విషయం కదిలించినా క్షమాపణ చెప్పుకోవటానికి సిద్ధంగా వుంది ఆమె. కానీ అతడి మౌనం ఆమెని రంపపుకోత కోస్తోంది.
చాలాసేపు బయట తచ్చాడి,స్త్రీ సహజమైన స్వభావంతో మళ్ళీ అతడి గదిలోకి వెళ్ళేసరికి, ఆమె పెట్టిన టీ కప్పు అలానే చల్లారిపోయి వుంది.
* * *
"మళ్ళీ వర్షం వచ్చేటట్టు వుంది. ఇప్పుడు వెళ్ళకపోతేనేం?" అంది శారద బయటకు చూస్తూ.
"లేదు అనుకున్నది అనుకున్న సమయానికి జరక్కపోతే బావోదు" అన్నాడు చైతన్య ప్రయాణానికి ఆయత్తమౌతూ. బయట సన్నగా తుంపర పడుతోంది.
"ఈ వర్షం నాలుగయిదు రోజుల దాకా తెరిపి యిచ్చేటట్టు లేదు" అందామె. చైతన్య నవ్వేడు. "ఈ వర్షమే నాకు అదృష్టాన్ని తెస్తుందేమో అని నువ్వే అన్నావ్ గా!"
ఆమె కూడా నవ్వి, "నా మాట ఎప్పుడు నిజమౌతుందని నాన్న అనే వాడు" అంది.
అతడు సూట్ కేస్ పట్టుకొని మెట్లు దిగేడు. చీకట్లు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. తూర్పు ఎర్రబడుతూంది.
అతడు మలుపు తిరిగేవరకూ చూస్తూ నిలబడిపోయింది శారద. పదహారు గంటలు ప్రయాణం చేసి అతడు రాజధాని చేరుకున్నాడు. రాత్రి విశ్రాంతి తీసుకొని ప్రొద్దున్నే పనిమీద బయలుదేరాడు. అతడికి చాలా టెన్షన్ గా వుంది.
తను సాధించాలనుకున్నది.....చిన్న విషయమేమీ కాదని అతడికి తెలుసు. ఎంత బలహీన వర్గాలకయినా... ఏమీ హామీ లేకుండా అంత పెద్ద బుణం ఇవ్వటానికి ఎవరూ ముందుకు రారని అతడికున్న బ్యాంకింగ్ అనుభవం చెబుతోంది.