Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 28


    నరసింహం వడివడిగా బయటకెళ్ళాడు.

    మురళీ కిటికీదగ్గర దిగాలుగా నిలబడి వున్నాడు.

    "మురళీ" అని పిలిచాడు. "హరికృష్ణ నీ తమ్ముడా ?"

    "అవును."

    "నీలాగానే వుంటాడా ?"

    "మేమిద్దరం కవలలం ? కేవలం రెండు గంటలు ఆలస్యంగా పుట్టటం వలన వాడు తమ్ముడయ్యాడు" అని చప్పున ఏదో స్పురించినట్లు, "అయితే, నా తమ్ముడే నా స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడా ?" అన్నాడు.

    నరసింహం మాట్లాడలేదు.

    ఏదో తెలీని భయంతో ఇద్దరూ ఒకళ్ళ మొఖంలోకి ఒకళ్ళు చూచుకున్నారు.

    "మావయ్యా ! ఈ విషయమంతా పోలీసులకు రిపోర్టు చేస్తే, 'ఇంపెర్సనేషన్' కింద వాడిని అరెస్ట్ చేయించవచ్చుగా?"

    "వద్దు వద్దు" కహ్మ్గారుగా అన్నాడు నరసింహం.

    తనలో తనే ఓ నిర్ణయానికొచ్చినట్లు, "వాడి అంతు తేలుస్తాను. ఈ క్షణం నుంచే నేను రంగంలోకి దిగుతాను. నువ్వు నిశ్చింతగా వుండు" అంటూ మురళీ భుజంమీద చేయి వేశాడు. "అన్నట్లు నీకు - నీకు మాత్రమే తెలిసిన గుర్తులు ఏమన్నా వున్నాయా ? అంటే - మూడో కంటికి తెలియనివి ?"

    "గుర్తులా -" అని ఓ క్షణం ఆలోచించి "ఆ - నడుముమీద ఒక పుట్టుమచ్చ వుంది మావయ్యా! దీని గురించి ఇంకెవరికీ తెలీదు" అంటూ దాన్ని చూపించాడు.

    "గుడ్ ! మిగతా విషయాలు నేను చూసుకుంటాన్లే" అన్నాడు నరసింహం.

   
                                                            *    *    *


    మంగళవాయిద్యాలతో పెళ్ళిపందిరంతా హడావుడిగా వుంది.

    మురళి ప్రక్కనే పీటలమీదకు రాధను తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

    మంగళసూత్రధారణ సమయం దగ్గర పడిపోతున్న కొద్దీ నరసింహంలో భయం పెరిగిపోతోంది.

    హఠాత్తుగా అతనికేదో అనుమానం వచ్చింది.

    వడివడిగా వేదికమీదకెక్కి మురళీ చెవిదగ్గరకు వంగాడు.

    "ఒరేయ్ ! నువ్వు మురళీవే కదూ ?"

    "అదేంటి మావయ్యా !"

    "మరేం లేదులే ! ఆఖరిసారి కన్ ఫర్మ్ చేసుకుందామని."

    మురళి బిత్తరపోయి చూశాడు.

    ఎప్పుడూ ఇంతగా బెదిరిపోని నరసింహం ఇలా అయిపోవటం విస్మయంతో గమనించాడు.

    అన్యమనస్కంగానే మూడుముళ్ళూ వేశాడు.

    మొత్తానికి పెళ్ళి జరిగిపోయింది.

    నరసింహం హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

   
        ఇక్కణ్ణుంచే అసలు కథ ప్రారంభమయింది.            

           
                               11


    శోభనం గదంతా కలియజూచాడు మురళీకృష్ణ.

    సినిమాల్లో శోభనం గదిలా లేదది. పాడు పడిపోయినట్లుంది. గది మధ్యలో ఓ పాత పందిరిమంచం, ఓ పక్క టేబులూ, కుర్చీ వున్నాయ్. టేబుల్ మీద రకరకాల స్వీట్లు హాట్లు ! గోడలకు అంతకు ముందు సంవత్సరం కాలెండర్లు ! మురళీకృష్ణ చిరాకేసుకొచ్చింది.

    ఇదే సినిమాల్లో అయితే గదంతా పూలదండలతో - అగరొత్తుల మేఘాలతో - సువాసన పరిమళాలతో - మత్తెక్కిపోతూ వుంటుంది.

    గది గోడలవంక చూశాడతను. అక్కడక్కడ పగుళ్ళిచ్చి భయంకరంగా కనబడుతున్నాయ్. పైన సీలింగ్ పొగచూరి పోయినట్లుంది.

    మురళీకృష్ణ మరోసారి విసుక్కున్నాడు రామలింగం మీద. తన శోభనం ఈ గదిలోనే జరగాలని పట్టుబట్టాడతను. ఆ గదిలోనే తరతరాల నుంచీ శోభనాలు జరుగుతున్నాయట. ఆ గది వాళ్ళ వంశాలకు అచ్చివచ్చిందట. అంచేత ఆ గదినిగాని ఆ పట్టిమంచాన్ని గాని  మార్చటానికి వీల్లేదని ఖండితంగా చెప్పేశాడు.

    "ఒకవేళ ఇంటిని - పట్టిమంచాన్ని మార్చాలని నేను నిరాహార దీక్ష ప్రారంభిస్తే ?" అడిగాడు మురళి.

    "అలాంటి పరిస్థితే వస్తే -అల్లుడినే మార్చిపారేయ్ గాని, వాటిని మాత్రం మార్చవద్దని మా బావగారు పదేపదే చెప్పారు" అన్నాడు రామలింగం.

    అంచేత తను మూడురాత్రులూ నిశ్శబ్దంగా ఈ సమాధిలాంటి గదిలో గడపాల్సిందే !

    గది తలుపు పెద్ద ఫ్యాక్టరీ తలుపు తెరుచుకున్నట్లు వింత శబ్దాలతో తెరుచుకుంది.

    రాధ లోపలికొచ్చి నిలబడగానే బయటనుండి తలుపు లాగి గొళ్ళెం పెట్టటానికి ప్రయత్నించసాగారు ఆడంగులు. కాని ఎంత ప్రయత్నించినా అది గొళ్ళెం పడటం లేదు.

    "రావయ్యా కృషుడూ ! నీ బలప్రదర్శన ఈ తలుపుమీద కూడా చూపించు" అందొకామె.

    అందరూ నవ్వేశారు.

    చేసేదిలేక కృష్ణా రాధాకూడా కలిసి బలమంతా ఉపయోగించి తలుపుని తోసి పట్టుకున్నాక బయట గొళ్ళెం పడింది.  

 Previous Page Next Page