Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 26

 

    మయూర కాఫీ కప్పుతో ముందు గదిలోకి వెళ్తూ కనిపించింది.
    "ఎవరికి కాఫీ?" అన్నాడు కర్కశంగా.
    మయూర మాట్లాడలేదు. ఆ కాఫీ యతికని అర్ధమయిపోయింది వేణుకి.
    "లోపలకు నడు! అడ్డమైన వెధవలకి నువ్వు కాఫీ అందించనక్కరాలేదు. పని మనిషి ఇస్తుంది" కసురుకున్నట్లు అన్నాడు వేణు.
    ఈ మాటలన్నీ యతికి విన్పిస్తున్నాయి. వినిపిస్తున్నాయని వెనుకు తెలుసు!  వినపడాలనే అంటున్నాడు. మయూర కొంచెం సేపు బొమ్మలా నిలబడిపోయింది. తరువాత ముందుకే అడుగులు వేసింది. మయూర చెంప చెళ్ళుమనేలా కొట్టాడు వేణు. మయూర చేతిలో కాఫీ కప్పు యెగిరి కింద పడి ముక్కలయింది. "అబ్బా!" అని అరిచింది మయూర. వంటింట్లోంచి కమల, ముందు గదిలోంచి యతి ఒక్కసారే లోపలికి వచ్చారు.
    "అరరే! ఎంత దెబ్బ" అంటూ మయూర దగ్గరగా రాబోయాడు యతి. సింహంలా వచ్చి అడ్డు నిలిచాడు వేణు.
    "మిస్టర్ యతి ! మీరు అనవసరంగా మా యింటి విషయాల్లో కలిగించుకోకండి. మీ పనులు మీరు చూసుకోండి!"
    చీదరించుకొంటున్నట్లు , పురుగును విదిలిస్తున్నట్లు అన్నాడు. కమలమ్మ తెల్లబోయి నిలబడింది. ప్రభాకర్ ఇంట్లో లేడు. ప్రభాకర్ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ.
    కళ్ళలో రగులుతోన్న పౌరుషంతో, ఏమో చెయ్యలేని అసహయత్వంతో మయూరను ప్రేమగా, దీనంగా బాధగా చూసే యతిని చూస్తోంటే వేణుకి పైశాచికానందం కలిగింది.
    "ఇంకా నిలబడ్డావేం? లోపలికి నడు!" అని కసిరాడుమయూరని . కమలమ్మ కంగారు పడిపోయింది.
    "అయ్యయ్యో ! ఏమిట్రా ఇది? మయూరా , ఏమిటి తల్లి ఇదీ? వాడొక తిక్క మనిషై పోయాడు. ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవరికీ అర్ధం కాదు. నువ్వు లోపలికి పదమ్మా! రా! పడుకో!" అని మయూర చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. యతి, వేణు ఇద్దరే మిగిలారు.
    వేణు యతి ముఖంలోకి చూసి గర్వంగా నవ్వాడు. "దిక్కులేక మాయింట్లో పడి వున్నావు. నామీదే పెత్తనం చేలాయించాలని చూడకు" అన్నాడు. యతి అభిమానం తీవ్రంగా గాయపడింది. అతడు ఆక్షణంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడే! కానీ, మయూర దీనమైన ముఖం అతడికి కాళ్ళు అడనీయటం లేదు.
    మయూరలో కళ్ళూ, ముక్కూ, నోరు, కాళ్ళు చేతులూ  అన్నీ ఉన్నాయి. అంతే! కాని వీటన్నిటికి మించినది మనిషిని మనిషిగా నిలిపేది ఆ చైతన్యమేదో మయూరలో నశించిపోయింది. ఆ గాజు చుపులకును యాంత్రికమైన ఆ కదలికలను చూసి యతి మనసు చెదిరిపోయింది. ఇంత దారుణంగా గాయపడిందా మయూర! మయూర వేణుని ఏనాటికి ప్రేమించలేదని యతికి తెలుసు! కాని లోక సమన్యంగా సర్దుకు పోయిందేమో అనుకున్నాడు. లేదు! ఆ సున్నితమైన హృదయం అమానుషంగా ముక్కలుగా తరగబడింది. తిరిగి మయూరను మాములు మనిషిగా చెయ్యాలి! తన దానిని చేసుకోలేక పోయినా ఫరవాలేదు. మయూర మనిషిలా జీవిస్తే చాలు! తాను అక్కడ ఉండటం వల్ల  మయూరకు మరింత హాని కలుగుతుందా! అనే ఆలోచన రాకపోలేదు యతికి. కాని, యతికి మంచినీళ్ళు, కాఫీ, అదిస్తున్నప్పుడూ , భోజనం వడ్డించేటప్పుడూ ఆ గాజు చూపుల్లో లేలగా కదిలే సంతృప్తి తాను అక్కడ ఉండటమే అవసరమని తోసింప చేసింది యతికి.
    యతి ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే కాఫీ కప్పుతో ఎదురుగా నిలిచింది మయూర. వెళ్ళ చారలతో ఎర్రగా కందిపోయిన బుగ్గలు, పొడికళ్ళు , బక్కచిక్కి పోయి తూలిపోతున్న శరీరము, చేతిలో ముందుకు చాచి పట్టుకున్న కాఫీ కప్పు.
    "మయూరా!" బాధగా అన్నాడు.
    "కాఫీ తీసుకో!" శాంతంగా అంది.
    "నేను వెళ్ళి పోదామనుకుంటున్నాను."
    యతి మాటలకు మయూర కళ్ళు చిత్రంగా కదిలి రెపరెపలాడాయి.
    "ఇప్పుడు నువ్వు కర్తవ్య దీక్షా బద్దుడువై వెళ్ళిపోవడం కుదరదు. కర్తవ్య దీక్షాబద్దుడవై ఉండిపోవలసిందే! ఏ చికాకులేదురైనా-------" అనేసి కాఫీ కప్పు అతని కందించేసి వెళ్ళిపోయింది.
    తెల్లబోయాడు యతి. మయూర ఈ మాత్రం అలోచిస్తోందా? తను, ప్రభాకర్ గారు ఏం ఆలోచించుకొంటున్నారో మయూరకు తెలుసా?
    ప్రభాకర్ తో పరిచయం పెరిగాక యతికి తానెంతటి పొరపాటు మార్గాన్ని అనుసరిస్తున్నాడో బాగా తెలిసి వచ్చింది. వెంకటయ్యను గురించి, మిసెస్ జ్వాలాకుమారిని  గురించి ప్రభాకర్ చెప్పిన విషయాలు అతని స్వానుభవానతో చాలా వరకు సరిపోయాయి.
    వెంకటయ్య మొదటినుంచీ రాజకీయాలలో బాగా చురుకుగా పాల్గొంటున్న వ్యక్తీ. అనేకమంది రాజకీయ నాయకుల లాగానే , అతని దృష్టి కూడా పదవుల బంగారు సింహాసనం పైనే కాని, ఆ సింహాసనాలు అందరికీ అందవు కదా! అతనికి అందలేదు. అందలేదనే అక్కసుకొద్దీ ఇలా ఆందోళనలతో సింహాసనం మీద ఉన్నవాళ్ళని చికాకు పెడుతున్నాడు అంతే!
    ఇక జ్వాలాకుమారి - ఆవిడగారికి వీడల పట్ల సానుభూతి ఉన్నమాట నిజమే!  బీదల పట్ల సానుభూతి కంటే గొప్ప వాళ్ళ మీద కసి మరింత ఎక్కువ. అందుకు కారణం ఆవిడ ఒకప్పుడు అతి మాములు మధ్యతరగతి కుటుంబం నుంచి రావటమే! జీవితంలో పైకి రావటానికి అష్టకష్టాలు పడటమే! అయితే, ఆవిడకి గొప్పవాళ్ళ మీద వున్న కసి, అధికారంలో వున్నవాళ్ళను , అంతస్తులో ఉన్నవాళ్ళనీ, కాకాలు పట్టడానికీ, వాళ్ళ అనుగ్రహం సంపాదించడానికి అడ్డు రాదు. ఆవిడకి తన హోదా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోవడంలో వున్న ఆసక్తి, దేశంలో లేనివాళ్ళందరి అంతస్థు పెంచడంలో లేదు. అయితే దేశంలో బీదల దౌర్భాగ్యానికి కేపిటలిస్తులే కారణమంటూ చాలా ఉద్రేకంగా కత్తులు దూస్తుంది. ఆ కేపిటలిస్టుల పట్ల అంతకసి నిజంగానే ఆమెకు ఉందనటానికి ఏమి సందేహం లేదు.
    "ఇలాంటి స్వార్ధపరుల నాయకత్వంలో మనం సాధించేదేముందీ? మనకు కూడా ఏదైనా బావుకోవాలనే ఉంటె తప్ప అన్నాడు ప్రభాకర్.
    'అంతేకాదు - అతనికి తాను సాధించిన ఉద్యమంలో కూడా నమ్మకం నశించిపోయింది. పాలకవర్గంలో అవినీతి పెరిగిపోతోందని, దానిని ఎదుర్కోవాలని, నడుం కట్టాం. ఎందరో ఈ వుద్యమంలో దూకారు. ప్రాణాలకు తెగించి పోరాడం. కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని అన్నిటిని మరచిపోయి, ఈ ఉద్యమంలో మునిగిపోయాను. చివరకు సాధించాను. ప్రభుత్వం చేతులు మారింది. అయినా ఏం మిగిలింది ఒకనాడు గద్దెల మీద ఏ విధంగా ప్రవర్తించేవారో, ఈ నాడూ అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు అదే స్వార్ధం - అదే అవినీతి. అవే కుళ్ళు రాజకీయాలు! కధ గిర్రున తిరిగి మొదటి కొచ్చినట్లయింది. ఇప్పుడు మళ్ళీ మరొక వుద్యమం అవసరమేమో! ఎన్ని ఉద్యమాలు నడిపినా ఫలితమింతే. ఇది కాదు మార్చడం. మనం జాతిని చైతన్య వంతం చేయాలి. విద్య వ్యాప్తి కలిగించాలి. మనం ఏదో వాళ్ళకు భోదించడం కాదు. వాళ్ళంతట వాళ్ళే మన మార్గంలో ఆలోచించే లాగ చెయ్యాలి. ఇదొక్కటే విముక్తి మార్గం"
    ప్రభాకర్ మాటలు యతికి చాలా నచ్చాయి. ప్రభాకర్ అధ్వర్యంలో ఉత్సాహవంతులైన యువకులు చాలా మంది వున్నారు. వాళ్ళు గ్రూప్స్ గా విడిపోయి, ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గ్రామాన్ని చేపట్టి, ఆ గ్రామంలో వెనుకబడ్డ వారందరినీ జాగృతం చెయ్యటమే తమ కర్తవ్యంగా దీక్ష వహించారు. ఈ యువకులలో ఎవరూ తమ తమ చదువులు అశ్రద్ధ చేయాకూడదనేది ప్రభాకర్ విధించే షరతులలో మొదటిది!
    ఆ వారాంతంలో మరో ఇద్దరితో కలిసి యతి కూడా గ్రామాలకు వెళ్లి రావటానికి నిశ్చయించుకొన్నాడు.
    మయూరకు కూడా ఈ విషయాలన్నీ తెలియటం, ఈ స్థితిలో కూడా "కర్తవ్య దీక్ష" ను గురించి హెచ్చరించటమే యతికి ఆశ్చర్యం!

    
                                                                 20

    "ఇప్పుడెందుకు వంట చేస్తున్నావ్?" వంటింట్లోంచి వేణు కేక గట్టిగా వినిపించింది. రాత్రి పది గంటల సమయంలో. ప్రభాకర్ ఇంట్లో లేడు. ప్రభాకర్ ఇంట్లో లేని సమయంలోనే వేణు గొంతు గట్టిగా వినిపిస్తుంది.

 Previous Page Next Page