హంసలేఖ అనుమానంగా కవర్ విప్పింది. లోపల వస్తువు చూడగానే తను చేసిన తప్పు అర్థమైంది.
"గ్రామీణులారా! మీరు మీ జీవిత భాగస్వాముల్ని ముద్దు పెట్టుకోబోయే ముందు ఈ శుభ్రమైన, స్వచ్ఛమైన, ప్లాస్టిక్ కాగితాన్ని పెదవులకు అడ్డుగా పెట్టుకోండి" అంటూ కొనసాగించింది.
* * *
ఇది ఇక్కడ జరుగుతున్న సమయానికి అక్కడ ప్రతిమ మీటింగ్ లో అంటోంది. "ఆ అమ్మాయి పేరు రేఖ. సర్పభూషణరావుకి కూతురంటే చాలా ప్రేమ. అయితే ఆ ప్రేమ సహజంగా వచ్చింది కాదు. డబ్బు వల్ల వచ్చింది. మిగతా వివరాలన్నీ ఈ ఫైల్లో వున్నాయి" అంటూ ఫైలు అందించింది.
"ఫైలు చదవడాలు అవీ నాకింటరెస్టు లేదని ముందొకసారి చెప్పాను" అంటూ మొదటి పేజీ తిప్పాడు. లోపల కవరుంది. కవరు మీద రేఖ అని రాసి వుంది. లోపలనుంచి ఫోటో తీశాడు. అది హంసలేఖ ఫోటో. ప్రతిమ నాయనమ్మ హడావుడిలో మార్చి పెట్టిన ఫోటో అది.
అతడు దానివైపే సూటిగా కన్నార్పకుండా చూశాడు.
అతడికి ఆ ఫోటో చూడగానే ఆ రోజు తోటలో ఆ అమ్మాయి సర్పభూషణరావుతో మాట్లాడడం గుర్తొచ్చింది. ఫోటోలో హంసలేఖ అమాయకంగా చూస్తూంది. ఆ కళ్ళల్లో రవ్వంత చిలిపితనం, కుతూహలం కూడా వున్నాయి.
"చాలా అమాయకంగా వున్నాయి కదూ ఆ కళ్ళు. ఆ కళ్ళని చూస్తే అసలు మోసం చేసే అమ్మాయిలా కనపడడం లేదు" అన్నాడు.
"ఎల్. ఎస్. డి. ఇంజక్షన్లు తీసుకుని తీసుకుని అలా అయ్యాయి ఆ కళ్ళు" అంది ప్రతిమ. - ఆ ఫోటో వైపు చూడకుండా.
"ఓకే! మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఈ అమ్మాయిని తండ్రితో సహా ఆ రోజే తోటలో చూశాను. నాకు గుర్తుంది" అన్నాడు.
"ఈ సాయంత్రం హోటల్ బ్రాడ్ వేలో సర్పభూషణరావు కుటుంబం ఒక పార్టీకి వస్తూంది. డానికి ఇన్విటేషన్ కూడా సంపాదించాను. ఇదిగో......" అంటూ ఆహ్వానపత్రం ఇచ్చింది. తను చెప్పిన ప్లాన్ చీఫ్ మెచ్చుకోవడం, నేత్ర అంత తొందరగా వప్పుకోవడం ఆమెకి చాలా సంతోషంగా వుంది.
నేత్ర బయటకొచ్చి అహోబిలతో "ఇదిగో...... ఈ ఫైలు రికార్డ్ రూంలో పడెయ్యి" అంటూ యిచ్చాడు.
ఆమె దాన్ని అందుకని "ఈ సాయంత్రం ....." అంది- అతడిచ్చిన వాగ్దానం గుర్తు చేస్తూ.
"సారీ అహూబిలా....... సాయంత్రం కాస్త గవర్నమెంటు వర్కుంది" అన్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ.
ఆమె దిగులుగా అతను వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయింది.
* * *
లోపల పార్టీ జరుగుతూంది. చాలా ఖరీదైన పార్టీ అది. విశాలమైన హాలు. ఇవతల వరండాలో నిలబడి వున్నారు నేత్ర, ప్రతిమ. అద్దాల్లోంచి లోపల మనుష్యులు కనబడుతున్నారు. "అదిగో...... ఆ అమ్మాయే" అంది ప్రతిమ.
"చేతిలో కోకాకోలా గ్లాస్ పట్టుకున్న అమ్మాయేగా.....?" హంసలేఖను చూస్తూ అన్నాడు నేత్ర.
"పేరుకి కోకాకోలా...... ఎవరూ చూడకుండా అందులో రమ్ కలిపి వుంటుంది" కసిగా స్వర్ణరేఖను చూస్తూ అంది ప్రతిమ.
"చూస్తుంటే నేనే నిజంగా ప్రేమలో పడేట్టు వున్నాను. అంత బాగుంది." ఓరగా ప్రతిమను చూస్తూ అన్నాడు. హంసలేఖ నిజంగా ఆ డ్రస్ లో అంత బావుంది. త్రిమూర్తుల భార్యలు ముగ్గురూ కలిసి ఆ అమ్మాయిని అలంకరించినట్టున్నారు. లక్ష్మీదేవి వాసుకి నడిగి మణుల దీప్తిని ఆ అమ్మాయి కళ్ళకి అరువిచ్చినట్టుంది. సరస్వతి భర్త నడిగి నాలుగు చేతులు అరువు తెచ్చుకుని మిగతా అలంకరణ పూర్తి చేసినట్టుంది. ఆ అమ్మాయిని చూస్తూ అతడా మాట అనడంలో తప్పులేదు.
ప్రతిమ నవ్వి "నాకా భయమేమీ లేదు. ఆ అమ్మాయి చరిత్ర తెలిసినవారెవరూ ఆవిడ్ని యిష్టపడరు" అంది తేలిగ్గా.
"సరే కుడి కాలు ముందు పెట్టి రంగంలోకి దూకనా.....?"
"బెస్టాఫ్ లక్...... నేవెళ్ళి మిగతా ఏర్పాట్లు చూస్తాను.
నేత్ర ఆశ్చర్యంగా "మిగతా ఏర్పాట్లేవిటి.....?" అన్నాడు.
"ఆ అమ్మాయి నిన్ను తొందరగా ప్రేమించే వాతావరణం కల్పించాలిగా."
"అవన్నీ నేను చూసుకోగలను. నిన్ను చూస్తుంటే శోభనం కూడా స్వయంగా ఏర్పాటు చేసేట్టున్నావ్."
దేశం కోసం ఆ మాత్రం తెంపరరీగా త్యాగం చెయ్యకపొతే ఎలా....?" అని నవ్వేసింది ప్రతిమ.
"నువ్వూ లోపలికి వస్తావా? ఆ అమ్మాయిని పరిచయం చేసుకుందాం-"
"వద్దు. నేనుంటే కథ అడ్డం తిరగొచ్చు. వెళ్ళొస్తా. బెస్టాఫ్ లక్" అనేసి ప్రతిమ వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళాక నేత్ర లోపలికి అడుగు పెట్టాడు. ఎయిర్ కండిషన్ హాల్ అది. చల్లటి గాలి రివ్వున కొడుతూంది. అమ్మాయిల్తో పరిచయాలు పెంచుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. హంసలేఖ ఒక్కతే ఒక మూల నిలబడి కోక్ తాగుతూంది. అతడు తటపటాయించకుండా వెళ్ళి "కెన్ ఐ గివ్ కంపెనీ హియర్...." అన్నాడు చేత్తో గ్లాసుతో.
ఆమె తని వైపు చూసింది. అతడి కళ్ళల్లో మాగ్నెటిక్ పవర్ వుంది. ఆమె అతనివైపు అలాగే చూస్తూ వుండిపోయింది. అతను నవ్వాడు. పైకి నవ్వాడేగాని మనసులో ఆ రోజు తోటలో శవాలుగా వ్యాన్ ఎక్కినా మనుష్యుల శరీరాలు కదలాడాయి. క్షణంలో మామూలుగా అయ్యాడు.
"నా పేరు నేత్ర. మన్మధ నేత్ర" అన్నాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి. "మన్మధనేత్ర....? పేరు గమ్మత్తుగా వుందే. ఏం చేస్తూ వుంటారు మీరు.....?" అని అడిగింది.
"సీక్రెట్ సర్వీస్....."
"ఏమిటీ.....?"
"రహస్య కార్యక్రమాలు."
ఆమె ఫకాలున నవ్వి "భలే మాట్లాడతారే మీరు....." అంది. అతడామెవైపు సూటిగా చూశాడు. చాలా ఖరీదైన స్కర్ట్ లో వున్నదామె. ప్రతిమ చెప్పినట్టు చాలా ఫాస్ట్ గర్ల్ అయి వుండాలి. కానీ...... ఆమె కళ్ళల్లో అల్లరితోపాటు ఇంకా ఇంకా ఏదో వుంది ఏమిటి?...... భావుకత్వం? అతడి సునిశితమైన దృష్టినుంచి ఆమె తాలూకు ఏ ఒక్క ఫీచరూ తప్పించుకు పోలేదు.
తన డిపార్ట్ మెంట్ తనకే పని అప్పగించిందో అతడికి కరెక్టుగా తెలుసు. ఏం చెయ్యాలో తెలుసు.
అతడు తనుగానే ఈ వ్యవహారం కొనసాగించదల్చుకున్నాడు. పేరు అబద్ధం చెప్పడంగానీ, రహస్యంగా చేయడం గానీ చెయ్యదల్చుకోలేదు. తను ఎంత దాచిన ఈ విషయం ఆమె తండ్రికి ఎలాగూ తెలుస్తుంది. దాయడం అనవసరం.