Previous Page Next Page 
రాక్షసుడు పేజి 25


    కావలసినంత స్వేచ్చ... పెంచి పెద్దచేసి...

 

    అతడికి రోమన్ రాజులు గుర్తొచ్చారు. గోదాలోకి దింపబోయే కొన్ని రోజుల ముందునుంచీ వెన్నా నెయ్యీ పెట్టి వాళ్ళ శరీరాల్ని నిగనిగా పెంచి తరువాత వాళ్ళ పోరాటాన్ని ఆనందంగా తిలకించటం...

 

    అతడేదో అనబోయి, బంగళా దగ్గిరపడటంతో ఆపుచేశాడు.  

 

    కారు పోర్టికోలో ప్రవేశించగానే నౌకరొచ్చి పురోహితన్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. కారు అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చే లోపులో పురోహితన్ తిరిగి ఫోన్ చేశాడంటే...

 

    వాణి అతడివైపు చూసింది. ఇతడు సాధించలేనిదంటూ ఏమీ లేదు!

 

    అతడు ఫోన్ అందుకున్నాడు. అట్నుంచి పురోహితన్ కంఠం వినిపించింది.

 

    "ఫైలంతా తెప్పించి చదివేను. క్యారియర్ సంగతి తనకేమీ తెలీదనీ, విజయే ఎవరిదగ్గరో అందుకుని లోపలికి పంపించాడనీ ఒక పోలీసు తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చాడు. దానితో కేసు విజయ్ మీదకు తిరిగింది".

 

    "ఎవడా పోలీసు?"

 

    "శివరామయ్య అనీ-"

 

    అతడు వాణివైపు చూశాడు.

 

                                      *    *    *

 

    అగ్గిపెట్టెలా వరుసగా వున్న పోలీసు క్వార్టర్సు మధ్య ఇరుకు సందు మొదట్లో రోల్స్ రాయిల్స్ కారు ఆగగానే వాణి అందులోంచి దిగి క్వార్టరు నెం. 14 వైపు నడిచింది. ఇల్లు పైకి మామూలుగానే వుంది. కానీ లోపల స్టీరియో గ్రామ్ ఫోనూ అవీ వున్నాయి. డబ్బు శుభ్రతని నేర్పదనటానికి తార్కాణంగా మాసిన బట్టలూ, వస్తువులూ నేల మీద చిందర వందరగా పడివున్నాయి.

 

    శివరామయ్య పెద్ద మనవడితో ఆడుకుంటున్నాడు.

 

    "హలో"

 

    చెంపల మీదకు ఎగిరే జుట్టుతో, మెరిసే లిప్ స్టిక్ పెదవుల్తో, చిరునవ్వుతో ఇంటిముందు నిలబడ్డ ఆమెనిచూసి శివరామయ్యకు మతిపోయింది. ఎవరా అనుకున్నాడు. ఎక్కడో చూసినట్టు వుందే అనుకున్నాడు.

 

    "మీ పెద్ద మనవరాలు లేదా?"

 

    ఓహో క్లాస్ టీచరా అనుకున్నాడు. "లేదే. బైట ఎక్కడో ఆడుకుంటూంది. పిలవమంటారా... కూర్చోండి!"

 

    వాణి నవ్వుతూ కూర్చుంది.

 

    "ఏమిటి విషయం చెప్పండి?"

 

    ఎవరో లోపల్నుంచి తొంగిచూసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆమె కుర్చీ వెనక్కి ఆనుకుని అన్నది-

 

    "చాలా రోజుల క్రితం ఒక కంటి ఆస్పత్రిలో ఒక పిల్లకి కుడికన్ను ఆపరేట్ చేయబోయి ఎడమకన్ను చేయటంతో అ వార్తని సంచలనం చేసి, పత్రికలు అమ్మకాలు పెంచుకున్నాయి. అ డాక్టర్లని అందరూ పురుగులకన్నా హీనంగా చూశారు. కానీ నిజానికి తప్పు... కంటిని "మార్క్" చేసిన వాడిది. డాక్టర్లది కాదు. అలాగే మూడు సంవత్సరాల క్రితం ఒక పోలీసు స్టేషన్ లో జరిగిన రేప్ కి ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోయింది. ప్రతీవాడు భారతమాతకి అన్యాయం జరిగినట్టూ ఫీలయిపోయాడు. ఒక పచ్చి వ్యభిచారిని పవిత్ర గృహిణిగా చిత్రీకరించి ప్రజల సానుభూతితో 'వార్తని' పత్రికలు 'కథ' చేసి అమ్ముకున్నాయి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే పత్రికలవల్ల చిన్న చిన్న విషయాలు అనవసర ప్రాధాన్యత పొందుతాయని. అందువల్ల ప్రజలను వెంటనే చల్లబర్చటానికి ప్రభుత్వం తీసుకునే తొందరపాటు చర్యలవల్ల దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా నష్టపోతారని.... ఉదాహరణకి ఆ అర్థరాత్రి రేప్ కేసులో పోయింది ఇన్ స్పెక్టర్. అయితే రేప్ చేసి తప్పించుకున్నది ఒక కానిస్టేబుల్. అది మీరు".

 

    అప్పటి వరకూ మామూలుగా వింటున్న శివరామయ్య ఉలిక్కిపడ్డాడు. ఎక్కడో చరిత్రలో శిథిలమైపోయిన వార్తని ఎవరో ప్రొద్దునే చుట్టపు చూపుగా వచ్చి తవ్వి తీయటం...

 

    "మీరెవరు?" అని అడిగాడు.

 

    ఆమె దానికి సమాధానం చెప్పకుండా అన్నది. "రెండు రోజుల క్రితం మళ్ళీ అలాటి సంఘటనే జరిగింది. జైలు గోడలు బ్రద్ధలయినయ్. ఏమీ తెలియని ఒక ఇన్ స్పెక్టర్ సస్పెండు అయ్యాడు. దీనికి కారణం కూడా మీరే. అయితే మీరు ఈసారి కూడా మామూలుగానే తప్పించుకున్నారు" అని ఆగి, తిరిగి చెప్పసాగింది.

 

    "కానీ క్రితం ఇన్ స్పెక్టర్ కీ ఈ ఇన్ స్పెక్టర్ కి తేడా వుంది శివరామయ్యగారూ.... క్రితం ఇన్ స్పెక్టర్ పాపం దౌర్భాగ్యుడు. వెనుక ఎవరూ లేరు. కానీ విజయ్ వెనుక మేమున్నాం. మేము అంటే... మ్చ్... ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పోన్లెండి. ఇంతకీ మాకు కావల్సిందల్లా మీరు వెళ్ళి తప్పు వప్పుకోవటం. అనవసరంగా సస్పెండయిన విజయ్ కి బదులు అసలు మహిషి సస్పెండవటం".

 

    శివరామయ్య హఠాత్తుగా కుర్చీలోంచి లేచాడు. తను ఇంతవరకూ ఎక్కడ చూశానా అనుకుంటున్నాడు యింతసేపూ... గుర్తొచ్చింది. క్యారేజ్ తెచ్చిన అమ్మాయి ఈవిడ. గట్టిగా అరుస్తూ "నిన్ను అరెస్ట్ చేయిస్తాను.... అరెస్ట్ చేయిస్తాను...." అన్నాడు.

 

    వాణి తాపీగా ప్లాస్టిక్ బ్యాగ్ లోంచి ఒక ప్లాస్టిక్ పాకెట్ తీసి బల్లమీద పెట్టింది.

 

    "ఏమిటిది" అని అడిగాడు అనుమానంగా.

 

    "చెవి. మీ మనవరాలిది".

 

    శివరామయ్య కీచుమని "ఒసేయ్" అని అరుస్తూ లోపలికి పరిగెత్తబోయాడు. ఆమె కుర్చీలోంచి లేవకుండానే తాపీగా-

 

    "మీరు ఆలస్యం చేస్తే మీకే నష్టం. ప్రతి అయిదు నిముషాలకి మావాళ్ళని ఒక్కొక్కటి పంపమని చెప్పాను" అన్నది.

 

    "దారుణం చిన్న పిల్లని చిత్రహింస పెడుతున్న నేరానికి నిన్న అరెస్టు చేయిస్తాను".

 

    "చిన్న పిల్లా- చిన్న పిల్లేమిటి?"

 

    "అదే నా మనవరాలు"

 

    "మనవరాలా? మీకు మనవరాలుందా ఏమిటి?"

 

    "నువ్విప్పుడు అన్నమాట ఆ చెవి"

 

    "చెవా! చెవేమిటి?"

 

    "ఆ పాకెట్టు"

 

    "పాకెట్టా? పాకెట్టేమిటి?"

 Previous Page Next Page