Previous Page
చెంగల్వ పూదండ పేజి 25


    "మీలాంటివాళ్ళు ఇంత ప్రొద్దున్నే మా యింటికి వచ్చేరంటే-" చేతులు నులుముకుంటూ నసిగేడు. కుర్చీలో వెనక్కి వాలి కూర్చొంటూ అన్నాను.

    "...............లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు."

    అతడి నిద్రమత్తు వదిలిపోయింది. ముందుకు వంగి "ఏమిటీ?" అన్నాడు విస్మయంతో. ఆ విషయం మరి మాట్లాడకుండా "ఈ రోజు తారీకెంత?" అన్నాను.

    "లక్ష్మీనారాయణ.."

    "నా ప్రశ్నకి సమాధానం అది కాదు" నా గొంతు కటువుగా అతడి మాటల్ని మధ్యలో కట్ చేసింది.

    "ప........పధ్నాలుగు".

    "రాత్రి పన్నెండు దాటింది? నిన్నటి తారీఖుగాదు నేను అడుగుతోంది-"

    అతడు ఏవీఁ అర్థం అర్థంకానట్టూ "పదిహేనూ" అన్నాడు.

    కుర్చీలోంచి లేచి పచార్లుచేస్తూ అడిగేను. "నెల?"

    "మార్చి - కానీ యిదంతా మీరెందుకు అడుగుతున్నారు?"

    కిటికీ దగ్గర ఆగి, తలుపు మూసేను.

    "చెప్పమంటారా?"

    "నాకేవీఁ అర్థం కావటంలేదు."

    "మీకు జ్ఞాపకశక్తి ఎక్కువ అనుకుంటాను" అతడ మొహమాటంగా చూసేడు. వచ్చి కుర్చీలో కూర్చొన్నాను.

    "మర్చి పదిహేనుకి మీ జీవితంలో ఏవీఁ ఇంపార్టెన్సు లేకపోవచ్చు. కానీ నాకుంది. ఏమిటి అని అడిగేడు.

    "సరీగ్గా పన్నెండు సంవత్సరాలక్రితం మార్చి పదిహేనో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి పోలీస్ వేన్ ఎక్కుతూ ఒక యువకుడు రెండు ప్రతిజ్ఞలు చేసేడు. ఒక ఆత్మహత్య, ఒక  హత్య జరిగేలా చూస్తానని...."కళ్ళప్పగించి అతడు నావేపే చూడసాగేడు. గడియారం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. చప్పున ఏదో అర్ధమయినట్టూ అడుగు వెనక్కి వేసి "అంటే-అంటే" అన్నాడు.

    కుర్చీలో వెనక్కివాలి, కాళ్ళు రెండూ ముందు టేబిలుమీద పెట్టి, జేబులోంచి రివాల్వర్ తీసి బల్లమీద పడేసి తాపీగా, "నేనే బాబాయ్ - నేనే" అన్నాను.

    అతడు సన్నగా వణుకుతున్నాడు. నుదుటిమీద చెమట ధారలుగా పారుతోంది. కళ్ళు భయంతో కుంచించుకుపోయేయి. ఉన్నట్టుండి స్పృహలోకి వచ్చినవాడిలా చటుక్కున బయటకు పరుగెత్తేడు. కాల్తో కుర్చీని ముందుకు తోసేను. అది అడ్డుపడి వుండ చుట్టుకుని ముందుకు పడ్డాడు. మరి లేవకుండా అలాగే నా కాళ్ళు పట్టుకొని, "నన్ను చంపకు-నన్ను చంపకు" అని రోదించసాగేడు.

    నేను నిశ్చలంగా నిలబడి, కాళ్ళముందు పడివున్న అతడ్ని చూస్తూ "నేను నిర్దోషిని నన్ను రక్షించండి అని ఆ రోజు నీ కాళ్ళముందు పడినేను యిలానే ఏడ్చేను బాబాయ్" అన్నాను.

    "వద్దు నన్ను చంపకు..... నీకేం కావాలంటే అది యిస్తాను" కాళ్ళు వదలకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

    నవ్వి, "ఏం ఇస్తావు బాబాయ్?" అన్నాను.

    చువ్వలా లేచేడు. ప్రాణ భయంతో అతడిలో శక్తిని మూలమూలల్నుంచీ వంట్లోకి తోస్తూంది లోపలిగదిలోకి పరుగెత్తేడు. వెనుకే వెళ్ళేను. దిండుక్రింద నుంచి తాళం చెవులు తీసుకొని ఇనప్పెట్టె తెరిచేడు- నోట్లకట్టలు వరుసగా  పేర్చివున్నాయి. రెండు చేతుల్తోనూ అందినన్ని తీసుకొని నా కాళ్ళముందు కుప్పగా పోసేడు. లోపల అరనుంచి ఓ పెట్టెతీసి నా చేతుల్లో పెట్టేడు.

    "తీసుకో - అంతా తీసుకో" పిచ్చిగా అంటున్నాడు. చేతిలో వున్న పెట్టెను బయటకు గిరవాటు వేసేను. రివాల్వర్ ట్రిగ్గర్ చుట్టూ చూపుడు వేలు బిగించి, "నేను ప్రేమించిన స్త్రీ చచ్చిపోయింది. నా తల్లి అప్రతిష్ట మిగిల్చి వెళ్ళిపోయింది. ఇంకెందుకు నాకీ డబ్బు?" అన్నాను.

    అతడు చప్పున తలెత్తి చూసి, "నీ తల్లి నువ్వనుకొన్నట్టు-" అని యేదో చెప్పబోయి ఆపేడు. నా దవడ కండరం ఆవేశంతో బిగుసుకుంది. "ఆఁ...........నేననుకొన్నట్టూ?" అన్నాను.

    "....... ......."

    దగ్గరకెళ్ళి పిడికిలి బిగించి కొట్టి, "చెప్పు" అన్నాను.

    "నన్ను చంపనంటే చెప్తాను" అన్నాడు.

    "నిన్ను చిత్రహింసపెట్టి అయినా తెల్సుకుంటాను-" కోపంతోను, ఆవేశంతోనూ నా పెదవులు వణుకుతున్నాయి.

    "చెపితే నన్ను చంపేస్తావు. నేను చెప్పను" అన్నాడు. అతడిలో చావుధైర్యం కనబడ్తోంది. అతడివైపు తీక్షణంగా చూసేను. గోడకి ఒక మూలగా వణుకుతూ నిలబడ్డాడు. ఇతడి  నుంచి విషయం రాబట్టటం కష్టం.

    రివాల్వర్ జేబులో పెట్టుకొని "చంపన్లే చెప్పు-" అన్నాను కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకుంటూ.

    వణుకుతున్న చేతిని ముందుకు చాచి- "ప్రమాణం చెయ్యి" అన్నాడు.

    "మూర్ఖుడా! నిన్ను చంపాలనుకుంటే ఈ ప్రమాణాలు నన్ను ఆపవు......నా తల్లి మీద అపవాదు నిజంకాదని తెలిస్తే - ఆ సంతోషకరమైన వార్త చెప్పినందుకు, ఇంత అన్యాయం చేసినా, నిన్ను క్షమిస్తాను. చెప్పు" అన్నాను.

    "నీ తల్లి లేచిపోలేదు-" చెప్పాడు.

    తేలికగా వూపిరి పీల్చుకున్నాను. అప్పటివరకూ అస్పష్టంగా వున్న నా బాధ పోయింది.

    "మరి ఈ అపవాదు మాటేమిటి?"

    "నువ్వు జైలుకి వెళ్ళేక నీ తల్లి నా దగ్గిరే వుంది కొన్ని రోజులు."

    "అది నాకు తెలుసు."

    "ఒకరోజు..ఒకరోజు ఇంట్లో యెవ్వరూ లేరు. అప్పుడు..."మాటలు పూర్తి చెయ్యలేదు. అతడి మెడని రెండుచేతుల్తోనూ పట్టుకొని విసురుగా గాలిలోకి అతడి శరీరాన్ని లేపేను.

    "అప్పుడు... అప్పుడు ఏమయింది?"

    చేతులమధ్య గిజగిజ కొట్టుకుంటున్నాడు. "గదిలోకి పరుగెత్తి తలుపులు బంధించుకొంది. తలుపులు బ్రద్ధలుకొట్టి నేను వేళ్ళేసరికి దూలానికి చీరె బిగించుకొని..... ఆత్మహత్య చేసుకొంది. భయంవేసి దర్జీవాడితో లేచిపోయిందని...."

    మెడ వదిలేసేను. అతడి శరీరం నేలమీద పడేలోపులోనే విసురుగా కాల్తో కొట్టాను. బంతిలా అతడి శరీరం వెళ్ళి గోడకి కొట్టుకుంది. రక్తం వచ్చేలా అతడి భుజాన్ని గుచ్చిపట్టుకొని లేపుతూ "లే-లేచి, నీ మాటలు నిజం అని నిరూపించు" అన్నాను.

    ఇద్దరం పెరట్లోకి వచ్చాం. తెల్లవారుతోంది. అతడు పారతీసుకుని త్రవ్వటం ప్రారంభించాడు. అరగంట గడిచేసరికి అవశేషాలు బయట పడ్డాయి. శీలాన్ని రక్షించుకోవటం కోసం అపఖ్యాతిని మోసుకొని వెళ్ళి పోయిన నా తల్లి అస్థిపంజరాన్ని అప్యాయంగా స్పృశించి గుండెల్లో దుఃఖాన్ని కనురెప్పలమధ్య దాచుకొని లేచాను. ఒకపక్క రొప్పుతూ నిలబడి వున్నాడు బాబాయ్.

    "చేతులెత్తి నమస్కరించవలసిన వయసులో వున్న నా తల్లిని నీ కామదాహానికి బలిచేశావ్ బాబాయ్. ఈ పనికి నిన్ను చిత్రవధ చెయ్యాలి. కాని నీ కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం వదిలేస్తున్నాను. ఇకనన్నా నీతిగా బ్రతుకు" వెనుదిరగ బోయేను.

    ఇంతలో వెనుక ఏదో చప్పుడు అయింది. నా మనసు కీడును శంకించింది. చప్పున పక్కకి వంగేను. అప్పటికే కొద్దిగా ఆలస్యం అయింది. అతను పారతో కొట్టిన దెబ్బ తలపక్కగా దూసుకుని భుజాన్ని గాయం చేసింది. రక్తంతో భుజం తడిసి భగ్గున మండింది.

    తన గురి తప్పటంతో అతడు వణుకుతున్నాడు. కాండ్రించి మొహంమీద ఉమ్మేను. అతడు తుడుచుకోలేదు. చేతులెత్తి దణ్నం పెట్టాడు.

    "నీచుడా, పాముకన్నా మనిషికే విషం ఎక్కువని నిరూపించావ్. అనుభావించు" అంటూ రివాల్వర్ మడమతో తలమీద కొట్టాను. వంగి రెండు గూడల్నీ జాయింట్లనుంచి తప్పించేను. చేతులు అరటిబోదెల్లా వేలాడుతున్నాయి. అతడు తీసిన గోతిలోకి కాల్తో తోసేను. నాలుగైదు గంటల వరకూ అతడికి స్పృహ రాదు.

    సూర్యుడు కొద్ది కొద్దిగా  పైకి వస్తున్నాడు.

    దూరంగా కాకులు అరుస్తున్నాయి.

    మనసంతా వాసిలేటింగ్ గా వుంది.

    ఎందుకో తెలీదు.... ఏదో నిర్లిప్తత.

    అతడ్ని చంపి, ఆ తృప్తితో మళ్ళీ పన్నెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళిపోదామనుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలి?

    పెరట్లోంచి లోపలికి వచ్చేను. ఇల్లు శ్మశానంలా బావురుమంటోంది. బయటికి వస్తుంటే నేను గదిలోంచి విసిరేసిన పెట్టె కాలికి తగిలింది. నాకు బహుమతిగా బాబాయి యిస్తానన్న పెట్టె తెరిచేను.

    అప్పుడు చూసేను.

    నిజంగా- -

    ఎన్నెన్నో బాధామయ జీవితాల దర్పణాలు.

    వెండి మట్ణెలు...బంగారు సూత్రాలు.....గాజులు.....చెవులు కమ్మలు సర్పాల్లా...

    నా దేశపు సగటు మనిషి చెక్కిట నిల్చిన కన్నీటి బిందువుల్లా.

    వస్తువుల క్రింద దస్తావేజులు.....

    జీవిత సమరంలో ఓడిపోయి, రక్తంతో సంతకంచేసి, రత్న గర్భంలోకి రైతుబిడ్డ కుదవబెట్టిన జీవితాలు- అంధకార బంధురమైన జాతకాలు.

    ఆ పేపర్ల మధ్య ప్రోనోట్లు....

    అమాయకమైన కూలీల నోటిముందు కూడు లాక్కొనే  వికృతమైన వేలిముద్రలు.....

    నా భార్య కావల్సిన అమ్మాయికి అన్యాయం చేసిన వాడిమీద పగతీర్చుకున్నాను. నా తల్లిని మోసం చేసిన వ్యక్తి రక్తం కళ్ళజూసేను. కానీ ఒక్క చుక్క రక్తం నేల చిందకుండా ఎంతమంది స్త్రీల మంగళ సూత్రాలనో అపహరిస్తున్న బాబాయిలూ పుడమితల్లి అందిస్తున్న సంపదని పటిష్టమైన మార్గాల ద్వారా గౌరవంగా కొల్లగొడుతున్న లక్ష్మీనారాయణ్ లూ.....

    నా ఆర్తి ఏ గుండెల్ని సృజించగలదు?

    ఠాకూర్ మాటలు జ్ఞాపకం వచ్చేయి.

    "నీ ధ్యేయం వ్యక్తిగతం బేటా....నాది సాంఘికం- నీ పరిధి ఇంకా విశాలం కావాలి. నీ దృక్పథం విస్తృతమవ్వాలి."

    అప్పుడు అర్థం కాలేదు ఆ పాఠం.

    ఠాకూర్ నేర్పిన పాఠాల్లో నా కర్ధంకాని పాఠం అదొక్కటే.

    దానికి నా అనుభవాన్ని అన్వయించుకొంటే ఇప్పుడు బోధపడింది. నన్ను కన్నతల్లికి అన్యాయం చేసిన ఒక్కరూ, నన్ను కన్న పుడమితల్లికి అన్యాయం చేసే వేలవేలమందిగా మారకుండా ఏం చెయ్యాలో.

    బయటకొచ్చేను.

    తూర్పు కొండల మధ్యనుంచి సూర్యుడు బైటకొస్తున్నాడు. వర్షంలో తడిసిన ప్రకృతి తలారపోసుకొంటున్నట్టు వుంది.

    దూరంగా కొండ స్థిరంగా నిలబడి వుంది-

    ఠాకూర్ లా!

    కొండచుట్టూ అడవి-

    అతని మెడలో పూదండలా!

    నేనూ ఓ పూవునై.....

    భుజం మండుతోంది. తడుపుకున్నాను.

    ఎర్రటి పూలు.....

    నా రక్తంలా!

                                                       (శుభం)

 Previous Page