అప్పటివరకు యధాలాపంగా వింటున్న జానీ నిటారుగా అయ్యాడు. బిల్హణుడు మాత్రం మామూలుగా చెప్పుకుపోతున్నాడు.
"రామ సుబ్బారావ్ చీటింగ్ కేసు క్రింద ఆమెని అరెస్ట్ చేయించాడు. ఉచ్చులు బలంగా బిగుసుకున్నట్టున్నాయి. అంతా పకడ్బందీ చేసారు. మేజిస్ట్రేటు దొరకని సమయంలో అరెస్ట్ చేయడం, కత్తితో బెదిరించిందన్న నెపం మీద చేతికి సంకెళ్ళు వేయటం...... రాత్రంతా జైల్లో వుంచటం కోసం వేసిన ఎత్తు అనుకుంటాను".
జాని లేచి, "పద....బిల్లూ" అన్నాడు. "మనం ఆమెని బయటకు తీసుకురావాలి. రాత్రంతా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో వుండటం ప్రమాదకరం"
బిల్హణుడి వాక్ప్రవాహం ఆగింది. "ఏమిటీ?" అన్నాడు అర్ధం కానట్టు.
"ఆమెని మనం బయటకు తీసుకురావాలి"
"ఆమె వున్నది పుట్టింట్లో కాదు, పిలవగానే బయటకు రావటానికి! చాలా పెద్ద ఎత్తు వేసి ఆమెని లోపల పడేసారు. ఆ ఇనస్పెక్టర్ అంత సులభంగా వదులుతాడనుకోను".
"వాడి తల్లో జేజమ్మ అయినా వదలక తప్పదు".
జానీలో ఇంతకు ముందు వున్న అలసట పోయింది. అప్పటివరకూ మామూలుగా వున్న ఆ కళ్ళలో ఇప్పుడు కార్యదీక్షత కనపడుతూంది. రివాల్వర్ తీసి లోపల పెట్టుకున్నాడు. కోటు వేసుకున్నాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కార్లో బయల్దేరాక బిల్హణుడు కానీవైపు సాలోచనగా చూస్తూ "ఈ బట్టలిప్పిన అమ్మాయెవరో నిన్ను బాగా ఇంప్రెస్ చేసినట్టుందే" అన్నాడు.
సాధారణంగా ఎప్పుడూ నవ్వని జానీ పెదాలమీద చిరునవ్వు కదలాడింది. "ఆ అమ్మాయి చాలా తెలివైంది బిల్లూ. పోతే ఈ అండర్ వరల్డ్ గురించి ఏమీ తెలీదు.....పిచ్చిపిల్ల! ప్రతిదీ ముక్కుసూటిగా చేసెయ్యవచ్చనే నమ్మకంలో వుంది. అనవసరంగా ఆ వసంత్ దాదాకి వ్యతిరేకంగా వ్యాసం వ్రాసింది. అఫ్ కోర్స్ ఆ తెలివికి తగ్గట్టు కాస్త పొగరు కూడా వుందనుకో"
"పొగరూ, తెలివీ వున్నాయో లేదో కానీ, చూడకుండానే ఒకటుందని మాత్రం వూహించగాలను".
"ఏమిటి"
"అందం"
జానీ మళ్ళీ నవ్వేడు. "లేదు బిల్లూ. అంతా గొప్ప అందం కాదు కానీ నాకు మాత్రం ఆమెని చూస్తే..... ఒకే ఒక మాటలో చెప్పాలంటే- జాలి - అవును జాలేస్తుంది. తన శక్తికి మించి పెద్ద పర్వత్వాన్ని ఎదుర్కొంటూంది ఆమె. ఇప్పటికైనా దాన్ని గుర్తించి వెనక్కి తగ్గుతే బావుణ్ణు".
"ఎక్కడికి వెళ్తున్నాము మనమిప్పుడు?"
"పోలీస్ స్టేషన్ కి"
"మామూలు పద్ధతులద్వారా ఆమెని బయటకు తీసుకురావటం కష్టం. ఆ కటమల్ (నల్లి) గాడు.....అదే ఆ స్టేషన్ ఇనస్పెక్టర్...... సలీం శంకర్ జేబులో మనిషి, అంత సులభంగా అరెస్ట్ చేసిన దాన్ని వదిలిపెట్టడు".
"మరెలా?- ఈ టైమ్ లో మేజిస్ట్రేట్ కూడా దొరకడే".
"న్యాయబద్ధంగా లాభం లేదు. ఆ మార్గాలన్నీ ఆ కంపెనీ వాళ్ళే ఈ పాటికి ప్రయత్నించి లాభం లేక వూరుకొని వుంటారు. ఆ -ఆగు. ఇంకో పెద్ద నల్లి వుంది. మనం దానికి చాలా రక్తం పోసాం. ఆ విధంగా ట్రై చేద్దాం".
బిల్హణుడిలో వున్న గొప్పదనం అదే. దేన్ని ఎక్కడ ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. ఎక్కడెక్కడ లింకులు సరిగ్గా వున్నాయో, ఇనుముని ఎంత వేడి చేసాక కొట్టాలో కరెక్టుగా వూహిస్తాడు.
వాళ్ళు వెంటనే పోలీసు స్టేషన్ కి వెళ్లలేదు. పెద్ద నల్లి దగ్గరకు వెళ్ళి వత్తిడి తీసుకొచ్చారు.
ఫోన్లమీద అరగంట సేపు వాగ్వివాదాలు జరిగాయి.
కుదరదు సాబ్- అరెస్ట్ చేసేము సాబ్- రేపు మేజిస్ట్రేట్ దగ్గిరకు తీసుకెళ్ళాలి సాబ్- ఆ ఇక్కడే లాకప్ లో వుంది! లేడీ కానిస్టేబుల్ పెట్టాము- అబ్బే ఎలా సాబ్ మీరే చెప్పండి. వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి అడిగారు- కాదన్నాం- ఇంత జరిగాక ఇప్పుడెలా-
లాటి మామూలు సంభాషణ జరిగాక ఇనస్పెక్టర్ నసుగుతూ అసలు విషయానికి వచ్చాడు.
"సలీంశంకర్ చెప్పాడు సాబ్. అసలతడే దీని వెనుక వున్నది. ఇంకో గంటా రెండు గంటల్లో చూడడానికి ఇక్కడికి వస్తాడు-"
పెద్దనల్లి జానీ వైపు తిరిగి, "ఎలా? ఏం చేద్దాం?" అని అడిగాడు.
"ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ అమ్మాయి మాత్రం రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో వుండటానికి వీల్లేదు" నిష్కర్షగా చెప్పాడు జానీ! మరో పది నిముషాలు ఫోన్లో సంభాషణ జరిగింది. చివరికి అతి కష్టం మీద అవతలి ఇనస్పెక్టరు వప్పుకున్నాడు- స్వంత పూచీకత్తు మీద (న్యాయబద్ధంగా కాదు) మరుసటి రోజు ప్రొద్దున్నే తెచ్చి అప్పచెప్పే అపద్ధతిలో ఆమెని వదిలిపెట్టటానికి!
ఇద్దరూ పోలీస్ స్టేషన్ కి బయల్దేరారు.
జానీ ఇనస్పెక్టర్ కి షేక్ హాండిచ్చి - దాంతో పాటు విదేశీ లైటర్ చాలా ఖరీదైనది అందించాడు. మూడోకంటికి తెలియకుండా అది చేతులు మారింది.
"జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రికార్డుల ప్రకారం ఆమె లోపల వున్నట్టే! ఏదైనా జరిగితే నా వుద్యోగం పోతుంది. దానికన్నా ముఖ్యంగా సలీం....." అంటూ నసిగాడు.
'అవన్నీ మేం చూసుకుంటాం' అంటూ లాకప్ వైపు నడిచాడు జానీ. బిల్హణుడు అతడిని అనిసరించాడు. కటకటాల వెనుక కూర్చున్న అనూషని చూడగానే బిల్హణుడి పెదాలమీద 'ఓహ్' అన్న శబ్దం వెలువడింది. "నువ్వన్నది నిజమే జానీ! అందం కాదు ముఖ్యం, గ్రేస్......ఎంత గ్రేస్ ఫుల్ గా వుందో చూడు".
అనూష తలెత్తి వాళ్ళని చూసింది. అర్థరాత్రి కావస్తూవుండగానే అంత అకస్మాత్తుగా అక్కడ జానీని చూడగానే ఆమెలో ఒక ఆత్మీయతాభావంతో కూడిన రిలీఫ్ కనపడింది. ఆశ్చర్యమూ, ఆనందమూ ఒక్కసారిగా పెనవేసుకున్నాయి. కానీ అది క్షణం సేపే. తరువాత మామూలుగా అయిపోయింది.
"నన్ను అరెస్ట్ చేసినట్టు నీకప్పుడే ఎలా తెలిసింది?"
"అవన్నీ బయకెళ్ళక మాట్లాడుకుందాం, పద".
అనూష కళ్ళలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. "అంటే..... నేను బయటకు వచ్చేయొచ్చా".
"అవును. అలా ఏర్పాటు చేసాను".
"ఎలా?"
అప్పటివరకూ అక్కడే వున్న ఇనస్పెక్టరు ఏదో పని వున్నట్టు అక్కణ్ణుంచి తప్పుకున్నాడు.
జానీ విసుగ్గా "అంతా ఇప్పుడే చెప్పాలా ఏమిటి? ఇక్కడ ఎక్కువ సేపు వుండడం మంచిది కాదు. పద" అన్నాడు.
"ఏం చేసావో నాకు చెప్పాలి" అంది "నీకు ఇక్కణ్ణుంచి తొందరగా వెళ్ళే ఉద్దేశ్యం వున్నట్టయితే వెళ్ళిపో! కానీ ఇంత అర్థరాత్రి నీకు మేజిస్ట్రేటు ఎలా దొరికాడు? బెయిల ఎలా లభించింది? ఇవన్నీ తెలుసుకోకుండా నేనెలా బయటకి రాను? అది మరో న్యాయధిక్కారణ నేరం అవదూ?"
ఇక లాభం లేదన్నట్టు జానీ అంతా చెప్పాడు. వివరంగా అతడు చెపుతున్నంత సేపూ ఆమె విన్నది. అతడు పూర్తిచెయ్యగానే తలెత్తింది. ఆమె మొహంలో అదోలాటి స్థిరమైన భావం కదలాడింది.
"సో..... మొత్తంమీద ఈ మెజిస్ట్రేట్లు, లాయర్లు, చివరికి మా చైర్మెన్- ఎవరూ సాధించలేని పనిని నువ్వు సాధించావన్నమాట!! ఓకే రౌడీ, ఒక నరరూప రాక్షసుడు ఒక పోలీస్ అధికారిని కొనేసి, తప్పుడు కేసు బనాయిస్తాడు. మరొకరు మరింత వత్తిడి తీసుకొస్తే మళ్ళీ వదిలి పెట్టేస్తాడు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం వీళ్ళ రికార్డుల్లో అనూష అనే ఆమె ఈ ఇనస్పెక్టర్ కి ఈ రోజు దొరకలేదు. రేపు దొరుకుతుంది! పాతకేసు రికార్డు చింపి వేసి రేపు మరొకటి కొత్తది వ్రాస్తారు. రేపు బెయిలు వెంటనే దొరుకుతుంది. అంతేనా".
"అంతే. ఇదంతా చెయ్యటానికి ఈ రాత్రికి రాత్రి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ముఖ్యంగా ఇదంతా వసంత్ దాదాకి తెలియకుండా జరిగేటట్టు చెయ్యటానికి"
"సిగ్గువేయడం లేదూ....." అరిచింది ఆమె. ఆ మాట అంటూంటే ఆమె గొంతు కీచుమంది "..... నాకు మాత్రం ఈ దేశంలో..... ఇలాటి వ్యవస్థ సాగే కాలంలో పుట్టినందుకు సిగ్గుగా వుంది. ఒక న్యాయాధికారీ, ఒక పోలీసూ- వీళ్ళు కాదు దీన్ని పాలిస్తున్నది. వసంత్ దాదా శాసిస్తున్నాడు దీన్ని! అతడి కన్నా గొప్పవాళ్ళు మీరు! ఏ మేజిస్ట్రేటూ చెయ్యలేని పనిని మీరు క్షణాల్లో సాధించగలిగారు. ఇంత మంచి 'స్నేహితులు' వున్నందుకు ఆహా అనుకుని పొంగిపోనా? అలా పొంగిపోయి మీతోపాటు నేనూ కలిసిపోనా? కానీ ఆ మాటకొస్తే నేను వసంత దాదాతో కలవటమే మంచిదేమో! ఆగు జానీ. నన్ను చెప్పనీ, నువ్వు మాట్లాడకు. నేనీ క్షణం ఈ పోలీస్ స్టేషన్ లాకప్ లో వున్నానంటే- నాకు దాని వెనుక ఒక ఆత్మ సంతృప్తి వుంది. ఒక అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఈ స్థితి కొచ్చాను- అన్న తృప్తివున్నది...... నేను నీ సహాయమే తీసుకోగలగిన పక్షంలో, ముందే చెప్పినట్టు- ఆ సహాయాన్ని వసంత్ దాదా నుంచే ఆశిస్తే- చేయి సాచి భిక్షమడిగితే- అసలు ఈ కేసే లేకుండా చేసుకోవచ్చుగా. కానీ నేను సాచి భిక్షమడిగితే- అసలు ఈ కేసే లేకుండా చేసుకోవచ్చుగా. కానీ నేను అడగను. ఎందుకంటే ఇదో యుద్ధం!!! యుద్ధం చెయ్యి జానీ! నువ్వు చెయ్యగలవు. ఇప్పటివరకూ నీకూ, ఈ దేశపు సామాన్య పౌరుడికీ తేడాలేకుండా బ్రతికావు. 'నేనూ, నా దగ్గిరవాళ్ళూ బ్రతికి బావుంటే చాలు' అన్న భావంతో బ్రతుకుతూ వచ్చావు. ఇంతకన్నా పెద్ద బాధ్యత నీమీద వుంది! నువ్వు దాన్ని నాకన్నా బాగా నిర్వహించగలవు. ఈ రాత్రి ఆ భావం నీలో పెరగటానికి ఇదే మొదటి రాత్రి అవనీ! నన్నీ రాత్రి ఈ జైల్లోనే నేను వుండి- భారత దేశపు సగటు పౌరుడికి అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ వుంటాను. నీ నెత్తుటి కూడుకి ఆశపడే ఇన స్పెక్టరు దయాదాక్షిణ్యాల మీద నేను బయటకు రాను! రాలేను!!! నన్ను క్షమించు. ఇంత కష్టపడి నా కోసం నువ్వు వచ్చినందుకు నా కృతజ్ఞతలు. కానీ నాకన్నా బలహీనులు, ఏమీ చేయలేని వారు, పలుకుబడి అసలు లేనివాళ్ళు ఇంకా ఈ దేశంలో చాలామంది వున్నారు. వారి ప్రతినిధిగా నన్నీ జైల్లో గడపనీ. నీకు చేతనైతే మా అందరి తరపునా నువ్వు ఆ దాదాని ఎదుర్కో. అప్పుడు నేను నవ్వుతూ ఈ జైల్లోంచి బయటకు వస్తాను-" అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
జానీ ఏదో అనబోయి, ఆగి, బిల్హణుడివైపు చూసాడు.
అమ్మాయిల్ని అందమైన బొమ్మలకన్నా ఎక్కువగా చూడటం అలవాటు లేని అతడు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిని ఆ క్షణమే మొదటిసారి చూస్తున్నట్టు నిర్విణ్ణుడై వుండిపోయాడు.
జానీ అతడి భుజంమీద చెయ్యి వేశాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. తరువాత మౌనంగా బయటకు వచ్చేశారు.
14
విష్ణుశర్మ వీధి మొదట్లో నిలబడి తన ఇంటివైపే చూస్తూన్నాడు. అతడు చాలా సేపటినుంచి అక్కడే వున్నాడు. అతడి ఇల్లు తాళం వేసి వుంది. తన పిల్లలు ఎక్కడికి వెళ్ళారో అతడికి అర్థం కాలేదు.
మృత్యువు కొసఅంచు వరకూ వచ్చి ఆగి, అవకాశం కోసం ఎదురుచూస్తూ వుందని అతడికి తెలుసు. అతడు రైల్వేస్టేషన్ బయటకు రాగానే ఆ కారుని గమనించాడు. ఒక కారే కాదు. రెండు మోటారు సైకిళ్ళు, కారు.
వసంత్ దాదా ఆధీనంలో వుండగా వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని బట్టి మాఫియా గుర్తు ఏమిటో అతడికి తెలుసు..... నెంబర్ ప్లేటు కుడిపక్క చిన్న ఎర్రటి పువ్వు ముద్ర! అదే గుర్తు.