ఆమె ప్రశ్నలే కాని, అతని నుంచి జవాబులు లేవు ! అతనంతే మరి !
`సింధులో భయం ప్రవేశించింది. గుండె గుభేల్ గుభేల్ మంటున్నది. ఏదో విద్యుత్ షాక్ తగిలినట్టు లోలోపల మౌనం. వణుకు ప్రారంభమయింది. వెన్ను జలధరింపు...నరాల కదలిక__
అతని మౌనం ఆమెను మరింత భయకంపితం చేస్తున్నది. ఆ చూపు...
అతను వయసులో వున్నాడు. అపరిచితుడు. తను ఒంటరి. తన మీద అత్యాచారం చేయడానికి వచ్చాడా...?! ఇప్పుడేమిటి చేయడం. ఆమెకు ఏమీ పాలుపోవడంలేదు. ఖంగారు ఖంగారు...దైన్యందయనీయంగా ఆమెను చుట్టుముడుతున్నా, లేని ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. శరీరం, మనసు అతలాకుతల మవుతున్నాయి. అంతా అలజడి, అల్లకల్లోలం...
ఆ ఉద్విగ్నత మరి కొంతసేపు కొనసాగితే ఏమైయ్యేదో కాని, అప్పటివరకు గంభీరంగా నిలచి చూస్తున్న అతను చిరు నవ్వు నవ్వాడు. అతని కనులలో మెరుపు !
దీనితో, వాతావరణం తేలికయింది. పైగా, అతను హాయిగా నవ్వాడు. తీయగా చూసాడు !
దీర్ఘంగా నిశ్వసించింది సింధు, ఆమెలో ఇప్పుడు వివేకం మేల్కొంటున్నది.
తనను తను తెలుసుకుంటున్నది. తన పరిస్థితిని అర్ధం చేసుకుంటున్నది.
అతను లోనికి వచ్చాడే కాని, తలుపులు మూయలేదు, లోనగడియ వేయలేదు...!
అసలు అతనెవరో. ఎందుకు వచ్చినట్టో. తెలుసుకొనకనే, తను ఏదేదో ఊహించుకుని క్రిందుమీదులయింది ! అపోహ ఎంత తొందరగా బయటపడుతుంది !
"నన్ను కాస్త కూర్చోనిస్తావా !" మార్దవంగా అడిగాడతను. మర్యాదగా చూశాడు.
అప్రయత్నంగానే తల ఊపింది సింధు. ఆమె సిగ్గుపడింది !
"థాంక్స్! నీ పేరేమిటమ్మా?" అతను కూర్చుంటూ అడిగాడు.
"సింధు!" ఠక్కున సమాధానం చెప్పింది. చూపు మరల్చుకుంటూ కదలింది.
"నా పేరు ఆనంద్. "జగజ్యోతి" పత్రిక రిపోర్టరును." పరిచయము చేసుకున్నాడు.
ఆశ్చర్యంగా చూసింది సింధు. 'పత్రికలవారికి తమతో పనేమిటి...?'
"నీకు గుండె జబ్బు అని పేపర్లలో చదివాను..." అతనే అన్నాడు మరల. అంటూనే ఆమెను సానుభూతిగా చూశాడు. సాకల్యంగా చూశాడు.
సింధు మాట్టాడలేదు. ఆమె అతనినే మార్చిమార్చి చూస్తున్నది.
"ఆపరేషన్ చేయిస్తాను. వెంటనే బయలుదేరు" ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు.
కలవరపడింది సింధు. ఇప్పుడతనిని పూర్తిగా అనుమానించింది.
'ఇదేమిటి- ముక్కూ ముఖం తెలియని వ్యక్తి హఠాత్తుగా వచ్చి, నీ గుండె జబ్బు నయం చేయిస్తాను, ఆపరేషన్ చేయిస్తాను, తనతో వచ్చెయ్ మంటాడేమిటి? పిచ్చివాడు కాదు గదా...?' బేలగా బెదురుతూ చూసింది సింధు. మరల భయం...
'క్షణం క్రితమే అక్క బయటకు వెళ్ళింది. ఆమెను అటు వెళ్ళనిచ్చి ఈయన ఇటు వచ్చాడా? ఏమిటి ఈయన ఉద్దేశం...?' ఆలోచిస్తున్నది సింధు. ఆందోళన పడుతున్నది.
"మా చెల్లి సింధు గుండె జబ్బుతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది, వైద్యం చేయించడానికి మాకు తగు ఆర్ధిక స్తోమత లేదు. ఎవరైనా ఉదారులు దయదలచి ఆదుకోండి అంటూ మీ అక్క ధీరజ పత్రికాప్రకటన చేసింది. అది చూసి, ఇక్కడకు వచ్చాను. సరిగ్గా ఇప్పుడే 'మానవ సేవా సంస్థ' ఆధ్వర్యాన స్టేట్స్ నుంచి గుండె జబ్బులకు శస్త్ర చికిత్సా నిపుణుల బృందంవారు మన నగరానికి వచ్చారు. ఇది నీకు యాదృచ్చికంగా కలిసి వచ్చిన అదృష్టం. ఆ స్పెషలిస్ట్ సర్జన్లు ఇవ్వాళ, రేపు మాత్రమే మన నగరంలో వుంటారు. ఇప్పుడు నాతో వచ్చి నువ్వు టెస్ట్ లు చేయించుకుంటే, ఆపరేషన్ అవసరం అనిపిస్తే, రేపు మీ అక్కతో కలిసి వచ్చి ఆపరేషన్ చేయించుకుని, మిత్తువ మహమ్మారి నుంచి బ్రతికి బయటపడుదువు గాని. ఏమంటావు? కేవలం జీవకారుణ్యం దృష్ట్యా, సాటి మానవునిగా నీకు ఈ సహాయం చేద్దామని, నిన్ను తోడు తీసుకువెళ్ళి వాళ్ళకు చూపుదామనీ వచ్చాను. ఏమంటావు? కాదంటే, వెళ్ళిపోతాను. నీ ఇష్టం...ఎవరి దురదృష్టాన్ని ఎవరు మాత్రం బాగు చేయగలరు!" అంటూ అతను సానునయంగా, బుజ్జగిస్తూ చెప్పాడు.
జీవితం అంటే ఎవరికి చేదు గనుక! జీవితం మీద ఆశ చిగురించింది సింధుకు. గుండె వేగంగా కొట్టుకుంది. సంభ్రమాశ్చర్యాలతో తలమున్కలయింది. తను బ్రతకవచ్చా...? తన జబ్బు నయమైపోతుందా...!