లక్ష్మి తలెత్తలేదు. కనీసం విష్ చేసే ఓపిక కూడా లేనట్టు అచేతనంగా వుండిపోయింది. ఆ గదిలో నిశ్శబ్దం ఎంత భయంకరంగా వుందంటే, ఇప్పుడు ఎయిర్ కండిషనర్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది!
విష్ణు, కాళ్ళు రెండూ టేబిల్ క్రిందున్న చెక్కమీద ఆన్చి "సిప్' చేస్తున్నాడు. లక్ష్మికి తనక్కడికి ఎందుకొచ్చిందో, ఎం సాధించాలని వచ్చిందో తెలియలేదు. పునరాలోచించుకుంటే తను ఎంత నిరర్థకమైన పనిచేసిందో అర్థమైంది. అక్కడనుంచి లేచి వెళ్ళిపోదామనుకుంటుండగా సుచరిత జనాంతికగా, "నేను బయట సిటౌట్ లో కూర్చుంటాను" అని ముందుగదిలోకి వెళ్ళింది.
"ఇదిగో ఇది తీసుకువెళ్ళు" అంటూ విష్ణు లేచి గాస్లుతో బయటికి నడిచి ఆమెకు దాన్ని అందించి లోపలికి వచ్చాడు. వస్తూ వస్తూ పార్టిషన్ తలుపు దగ్గిరగా వేసాడు.
"ఊ....ఇప్పుడు చెప్పు"
ఆమె మాట్లాడలేదు. అతనే అన్నాడు. "ఇంకెవరైనా ఈ పరిస్థితిలో వుంటే ఏం చేసేవారో తెలుసా? చెంప బ్రద్దలు కొట్టేవారు. పై అంతస్థు మీద నుంచి క్రిందకు తోసేసేవారు!! ఏమిటి? .....నామీద పత్తేదారు పని చేయటానికీ, నేను ఎక్కడికి వెళ్తున్నానో కనుక్కోవటానికీ నావెనుకే ఫాలో అయ్యావా? నేనీక్షణం నీ ఒళ్ళు చీరెయ్యకుండా వున్నానంటే కేవలం నామంచితనమే కారణం! అది తెలుసా నీకు?"
ఆమె తలవంచుకుని తన చేతి గోర్లవంక చూస్తూ కూర్చుంది. అతడు చేసిన తప్పుకు తను అతన్ని నిలదీయాలో, తనని అతడు దండిస్తున్నాడో తెలియని అయోమయంలో పడిందామె. సుచరిత గదిలో వున్నప్పుడు అతడిలో కనిపించని 'కామ్ నెస్' ఇప్పుడు లేదు. అతడి మొహం జేవురించి వుంది. మనిషి చాలా విసుగ్గా, కోపంగా వున్నాడు. అది ఒక హొటల్ రూమ్ కాబట్టీ,బయట ఒక అమ్మాయి కూర్చుని వుంది కాబట్టీ , అక్కడో సీన్ క్రియేట్ చేయకుండా వుండటం కోసం అతికష్టంమీద తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నట్టు వున్నాడు. అందులో చిత్రమేమీ లేదు. చిత్రం ఎక్కడుందంటే....
అదంతా తన మంచితనంగా అతను ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు. ఆమెని డిఫెన్స్ లో పడేసేడు. అదీ వింత! లక్ష్మి దాన్ని అర్థం చేసుకున్నదా? తన చిన్నతప్పుని అంతకు పెద్దది చేసి నీడలో అతని పెద్ద తప్పుని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇది అర్థంకానంత పెద్ద విషయమేమీ కాదు. వాదించి గెలవొచ్చు. కానీ అలా వాదించాలంటే ఇద్దరూ సమ వుజ్జీలయిన న్యాయవాదులై వుండాలి! ఒకరు 'ఆధారపడే' బలహీనత వున్న ;స్త్రీ' అయివుండకూడదు. వాదించి, గెలిచి.....విడిపోవాలి. స్వంత కాళ్ళమీద నిలబడే శక్తి సమకూర్చుకోవాలి.....
"వెళ్ళు" అన్నాడు అతడు. ఆమె కదల్లేదు. కదలక పోవటానికి కారణం కాళ్ళల్లో శక్తి లేకపోవటం! అతడు కుర్చీలోంచి లేచి దగ్గరగా వచ్చాడు.".....ఇంకెప్పుడూ ఇలాటి పనులు చేయకు. మిగతా విషయాలు ఇంటికొచ్చి మాట్లాడతాను. క్రింద లాంజ్ లోనే ఏదో ఒక వెహికల్ దొరక్కపోదు. జాగ్రత్తగా వెళ్ళు....."
ఆమె లేచింది. తలవంచుకుని బయటకు నడిచింది. ముందుగదిలో కూర్చుని వున్న సుచరిత ఆమెని చూసి లేచి నిలబడింది. విష్ణు లోపలే వుండిపోయాడు. లక్ష్మి సుచరితవైపు చూడలేదు. తలవొంచుకుని బయటకు నడిచింది.
విశాలమైన వంటరి వరండా! లిప్ట్ కుర్రాడు 'గ్రౌండ్ ఫ్లోర్ మాడమ్' అన్నాడు. ఆమె నిశ్శబ్దంగా లిప్ట్ బయటకు నడిచింది. ఆటోకోసం గానీ రిక్షాకోసం గానీ చూడలేదు.
నడవటం ప్రారంభించింది!
ఏ వాహనం ఎక్కినా ఇల్లెక్కడో చెప్పాలంటే మా....ట్లా....డా.....లి! గుండెల నిశ్శబ్దాన్ని చెదర్చాలి. అది ఇష్టం లేనట్టు ఆమె మౌనంతో పాటూ పయనించింది.
ఇంటికి చేరుకునేసరికి తొమ్మిది దాటింది. అప్పటివరకూ వున్న ఓపిక ఇల్లు చేరుకోగానే పోయింది. నిస్సత్తువుగా హాల్లోనే కూర్చుండిపోయింది. ఆమెకు దుఃఖం రాలేదు. రెండు బొటన వేళ్ళతో మెదడుని నొక్కి పట్టిన భావన. మనసుని నల్లటి గుడ్డలో పెట్టి పిండుతున్నట్టు.....స్థబ్దత!
అలాగే కూర్చుని వుండిపోయింది. ఆమె పక్కనుంచి పిల్లి ఒకటి లోపలికి వెళ్ళి వంటింట్లో పాలగిన్నెని పడేసింది. ఆమె లేవలేదు. ఫస్ట్ షో వదిలారో సెకెండ్ షో వదిలారో తెలీదు. ఎంత టైమైందో తెలీదు కానీ అదే వీధిలో సినిమా హాల్లోంచి జనం బయటకు వస్తున్నారు. పావుగంటలో ఆ కలకలం కూడా సద్దుమణిగింది. దూరంగా ఎవడో కుర్రాడు సైకిల్ మీద వెళ్తూ గట్టిగా పాడుతున్నాడు. "......రా మాధవా......జాగేలరా"
కల్యాణిరాగం. దానికీ బీతోవెన్ కి దగ్గిర సంబంధం వున్నదేమో! బీతో వెన్ గుర్తొచ్చేసరికి ఆమె ఇక ఆగలేకపోయింది. ఒక సంఘటన ద్వారా మనసు గాఢంగా దెబ్బతిన్నప్పుడు, మరొకరిని ఆశ్రయించి సాంత్వనం పొందడం సహజం.
ఆమె చేతివేళ్ళు అప్రయత్నంగా డయల్ చేసాయి. అట్నుంచి ప్రహసిత్ "........హల్లో" అన్నాడు.
"నేనండీ...." ఆమె చెప్పబోతూ ఆగిపోయింది.
భర్త అన్నట్టు డిటెక్టివ్ పనిచేసి అతడిని రెడ్ హండెడ్ గా పట్టుకోవటమే ఒక అనాలోచితమైన చర్య అయితే, ఇప్పుడీ అర్థరాత్రి ఇలా ఇంకొకరికి ఫోన్ చేయటం....
ఆమె చెయ్యి వణికింది. ఈ లోపులో అవతల్నుంచి.....నేను నీ శ్వాసనే గుర్తుపట్టగలను అన్నట్టుగా "లక్ష్మీ....హల్లో.....లక్ష్మీ" అంటున్నాడు ప్రహసిత్. ఆమె నెమ్మదిగా రిసీవర్ పెట్టేసింది.
సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కమలం ముడుచుకుపోతున్నట్టు నెమ్మదిగా చుట్టూవున్న నాలుగు గోడలూ ముడుచుకుపోయి తనని కప్పేస్తున్న అనుభూతి. గర్భస్థ శిశువు చుట్టూ పేరుకున్న నిశ్శబ్దం తన చుట్టూ పేరుకుపోయినట్టు అలా ఎంతసేపు కూర్చుండిపోయిందో గుర్తులేదు.
బయట కాలింగ్ బెల్ మ్రోగింది. ఆమె వులిక్కిపడింది. ఆమె ఎంత డిఫెన్సివ్ గా వుందంటే తను చేసిన పనికి భర్త మూడ్ పాడయి తిరిగి వచ్చే సేడేమో, తనని ఎంత తిడతాడో అని భయపడింది. అయితే వచ్చింది ప్రహసిత్. అంత అర్థరాత్రి తన ఇంటిగుమ్మం ముందు ప్ర.....హ.....సి....త్!!
ఆమెని చూడగానే అప్పటివరకు టెన్షన్ తో వున్న అతడి మోహంలో రిలాక్సేషన్ కనపడింది. "హమ్మయ్య. మీరు క్షేమంగానే వున్నారు కదా...." అన్నాడు. ఆమె మాత్రం అతడి రాకని వూహించకపోవటంతో బిత్తరపోయి చూస్తోంది.
"....అలా ఫోన్ పెట్టేసరికి ఎవరైనా దొంగలు ప్రవేశించారేమో, మీరు ప్రమాదంలో వున్నారేమో అనుకున్నాను. వందకిలోమీటర్ల స్పీడ్ లో వచ్చాను."
అంత చలిలో అతడి నుదుటిమీద చెమటే ఆ విషయం చెపుతోంది!
"ఎందుకింత రాత్రి ఫోన్ చేసారు?"
ఆమె సమాధానం చెప్పలేదు. అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది. అతడు లోపలికి వచ్చాడు. "ఆయన లేరా?"
అతడిని లోపలికి పిల్చి కూర్చోపెట్టాలో అక్కడనుంచి అలాగే పంపించాలో తెలియని అయోమయంలో వున్న లక్ష్మి, ఆ మాటలకి కూడా సమాధానం చెప్పలేదు. అతడు ఆమె డోలాయమాన పరిస్థితిని వేరే విధంగా అర్థం చేసుకుని "ఏమైంది లక్ష్మి? ఎనీథింగ్ రాంగ్?" అని అడిగాడు. అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది.
ఒక్కసారిగా ఆమె ఇలా దుఃఖించటం ప్రారంభించేసరికి అతడు కంగారు పడ్డాడు "ఏమైంది? ప్లీజ్ చెప్పండి. మీవారు బాగానే వున్నారు కదా. ఆరోగ్యం సరిగానే వుందిగా. ఆఫీసులో ఏదైనా ప్రోబ్లెమ్ వచ్చిందా? మీరలా ఏడవకండి. చెప్పండి. దేన్నయినా పరిష్కరించవచ్చు. నేనుండగా ఏమీ కాదు. అసలు విషయం చెప్పండి...." అనునయంగా అన్నాడు.
ఆమె కొద్దిసేపటికి తేరుకుంది. కన్నీళ్ళు తుడుచుకుంటూ "ఏమీలేదు" అంది. ఆమె పరిస్థితి అర్థమైనట్టు అతడు కూడా కొంచెంసేపు మౌనంగా వుండిపోయాడు. తరువాత కదుల్తూ, "మీకు ఒంటరిగా వుండటం భయమైతే ఎవరయినా పని అమ్మాయిని పంపుతాను" అన్నాడు. అవసరం లేనట్టు ఆమె తల అడ్డంగా వూపింది.
"వెళ్ళొస్తాను" అంటూ అతడు గుమ్మంవైపు కదిలాడు. తను అప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదనీ, అంత దూరం నుంచి వచ్చిన వాడిని కనీసం పలకరించలేదనీ కూడా ఆమెకు గుర్తొచ్చి "ప్రహసిత్" అంది.
అతడు ఆగాడు. ఆ తరువాత ఏమి మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. "మీరు.....ఆ సాహితీ సభలో..... గాయంవల్ల టెన్నీస్ కి పనికిరారని. పేపర్ల....సారీ ...నేనూ....."మాటకీ మాటకీ సంబంధంలేకుండా ఆమె మాట్లాడుతూండగా అతడు దగ్గిరకొచ్చాడు. చాలా దగ్గరికి....
"ఇందుకు బాధపడుతున్నారా మీరు?" అన్నాడు స్వాంతనగా. అది గుర్తొచ్చి అర్థరాత్రి ఆమె రోదిస్తోంది అనుకున్నాడు. "చూడండి....నేనారోజు మినిస్టర్ ని ఎదుర్కున్నానంటే అది కేవలం నాకోసం! నా ఆవేశం అణుచుకోలక అతన్నికొట్టాను. దాని ఫలితం ఇది. దీని గురించి మీరేమీ బాధపడకండి. అసలు నాగురించి మీరేమీ ఆలోచించకండి. నేనిక మీరేమీ బాధపడకండి. అసలు నాగురించి మీరేమీ ఆలోచించకండి. నేనిక మిమ్మల్ని కలుసుకోకూడదనే అనుకున్నాను. ఈ ఫోన్ కాల్ నన్ను అయోమయంలో పడేసింది. ఐ యామ్ సారీ!' అని తిరిగి వెనుదిరిగి, గుమ్మం దగ్గిర ఆగి మళ్ళీ అన్నాడు. "నేనెంత తప్పుచేసానో మీకుటుంబాన్నీ కలత పెట్టాను. నాగురించి పూర్తిగా మర్చిపోండి" అని ఆమె జవాబు ఆశించకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
తను జీవితంలో ఇక ఎవర్నీ ప్రేమించ(లే)నని గానీ, తన ప్రేమ గురించిగానీ అతడొక్కమాట మాట్లాడలేదు. అలా మాట్లాడితే, భవిష్యత్తులో ఆమె దాని గురించి ఆలోచిస్తూ తన భర్తకీ, తన సంసారానికీ న్యాయం చేకూర్చలేదేమో అన్న భావం అతడిని ఆ విధంగా మాట్లాడకుండా చేసింది.
తనెలా పోయినా ఫర్వాలేదు....తన స్నేహితురాలు సుఖంగా వుండాలన్నది అతడి అభిప్రాయం. అతడి అభిప్రాయం ఎంత వరకు నిజామావుతుందో కాలమే నిర్ణయించాలి!
4
తన క్లినిక్ లో ప్రహసిత్ బిజీగా వున్నాడు.
అతడిప్పుడు ఒక ప్రేమ విఫలమైనావాడులా లేడు. వృత్తిమీద ఏకాగ్రత నిలిపే డాక్టర్ లావున్నాడు. జీవితం ఎప్పుడూ ఒకేచోట ఆగిపోదని అతని నమ్మకం. దేశానికి ఒకరకంగా బాధే. అయితే ఆ డిప్రషన్ రాకుండా అతడు మానసికంగా జాగ్రత్త పడ్డాడు. మెడికల్ జర్నల్స్ చదివాడు. ఎప్పుడో మర్చిపోయిన మెడిసిన్ ని తిరిగి గుర్తు తెచ్చుకున్నాడు. అహొరాత్రులు కష్టపడ్డాడు.
నెలరోజుల్లో క్లినిక్ తెరిచాడు.
అంతకు ముందే పేరున్నవాడు, పేపర్లలో పేరుపడినవాడు అవటం వలన మొదటినెలలోనే ప్రాక్టీస్ పుంజుకుంది. పేషెంట్స్ రావటం ప్రారంభించారు.
పన్నెండయ్యేసరికి పేషెంట్స్ అందర్నీ చూడటం అయిపోయింది. తను కూడా వెళ్ళిపోదామనుకుంటూ వుండగా 'మే ఐ కమిన్' అని ద్వారం దగ్గర వినిపించింది. తలెత్తి చూస్తే మధూహ.
అతడి మొహం విప్పారింది. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే అతడికి ఆత్మీయమ్గా అనిపిస్తుంది. అంత చిన్న వయసులో జీవితం పట్ల అంత కన్సర్న్ వుండటం అరుదు. అలా అని ఆ అమ్మాయి సీరియస్ గా కూడా వుండదు. ఎప్పుడూ రిలాక్స్ డ్ గా వుంటుంది.
'మీతో ఒక పనివుండి వచ్చాను. ఒక డాక్టర్ గా" అంది చిరునవ్వుతో. ప్రహసిత్ కూడా నవ్వేడు. "నేను కొత్తగా ప్రాక్టీసు పెట్టాను. ఫీజు ఇచ్చుకోవాల్సి వుంటుంది.
"ట్రీట్ మెంట్ కోసం రాలేదు. చిన్న అనుమాన నివృత్తికోసం వచ్చాను."