Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 2

 

అంకిత భావంతో ..........

    ఆవేశంతో పిడికిలి బిగించిన యువశక్తి దిద్దిన రక్తతిలకాలు, మంగళ హరతు లిచ్చిన ఆడపడుచుల అవ్యాజానురాగాలు, ఆశీర్వదించవచ్చిన పెద్దల మందహాసాలు - గత తొమ్మిది నెలలుగా నిత్యం నాకు ఎదురైన దృశ్యాలివి. ఈనాడు మీతో మాట్లాడుతోంటే అవన్నీ నా కనుల ముందర కదలాడుతూ ఆనందబాష్పాలు కురిసిపిస్తున్నాయి.
    చరిత్ర ఎరుగని రీతిలో నాపై మీరు వర్షించిన అభిమానం, ఆదరం వెలకట్టలేనివి. మీరు చేకూర్చిన విజయం మరపురానిది, మరువలేనిది. నన్ను ఇంతగా కావాలను కుంటున్న మీ అందరికీ మీవాణ్ణిగా మరోసారి నిండు హృదయంతో నమస్సులందజేస్తున్నాను.
    మనకు మహోజ్వల చరిత్ర ఉంది. జగద్విఖ్యాతిగాంచిన జాతి మనది జీవనదుల గలగలలతో , పచ్చని పంట పొలాలతో ఫ్యాక్టరీల ఘంటారావంతో, దేశానికే తలమానికం కావలసిన 'తెలుగునాడు' ఈనాడు ఇలా మసకేసి పోయిందంటే అక్షర క్రమంలో ప్రధమ స్థానంలో వున్న ఈ రాష్ట్రం అభివృద్ధి లో ఎక్కడో వెనుకబడి వుందంటే ఆవేదనతో హృదయం కృంగిపోయింది. ఎంత పిచ్చివాళ్ళను చేశారు తెలుగువాళ్ళను! ఎంత వెర్రి వాళ్ళను చేశారు మనజాతిని!
    ఇవన్నీ నన్ను కదిలించాయి. ఇన్నాళ్ళు నన్ను ఇంతగా అభిమానించి ఈ స్థాయికి తెచ్చిన ఈ జాతి రుణం తీర్చుకోవాలన్న ఆకాంక్ష ప్రబలంగా కలిగింది. ఆవేశం పొంగింది. అందుకే కదిలివచ్చాను. మీకు తెలుసునేనిది వరకే చెప్పాను. ఇకనుంచి ఈ జీవితం మీదే అని. అవును. నిజంగా ఇక యిది మీదే. మీ అపూర్వ ఆదరణే నేనీ నిర్ణయాన్ని తీసుకునేట్లు చేసింది. ప్రజాసేవే పరమావధిగా, సమాజ శ్రేయస్సు సర్వస్వంగా శేషజీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను.
    
    ఇది మనసా ....వాచా ....కర్మణా చెబుతున్న మాట. 'తెలుగుదేశం ప్రభుత్వం నిజామున ప్రజాప్రభుత్వంగా నిలిచిపోవాలన్నది నా ఆశయం' ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి వారి సాంఘిక ఆర్ధిక సమస్యలను పరిష్కరించి కొత్త జీవితాన్ని వారికి అందించి, వారి కుటుంబ జీవనంలో చిరుదీపాలు వెలిగించాలని నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతోనే 'తెలుగుదేశం' ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
    ప్రాచ్యభాషలలో మధురాతి మధురమైనదని పేరుగన్న మన తెలుగు భాషను నిత్యనూతనంగా తీర్చి దిద్దుతుంది. నవ్యతకు నాంది పలుకుతూ శోభిల్లే తెలుగు సంస్కృతికి కొంగొత్త రూపు రేఖలు దిద్ది మనజాతి ప్రాభవాన్ని , పోగొట్టుకున్న కీర్తి ప్రతిష్టలను పునప్రతిష్టింపజేస్తుంది. తెలుగును అన్ని స్థాయిలలో అధికార భాషనూ చేసి గౌరవిస్తుంది. 
    దుర్భరంగా వున్న ప్రజాజీవితాన్ని మార్చాలంటే మాటలలో అయ్యేది కాదని మనందరికీ తెలుసు. మౌలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులకు చికిత్స చేయావలసి ఉంది. గత జల సేతుబంధనం అనవసరం. కాని గతాన్ని గుర్తుంచేసుకుంటే తప్ప భవిష్యత్తుకు రూపుదిద్దలెం. గాయపడిన గుండెకు సరైన శస్త్ర చికిత్స జరిగితేనే గాని అది మాములుగా పని చేయలేదు. అందుకే కుళ్ళిపోయిన ఈ వ్యవస్థ మీద, అదుపు తప్పినా ఈ లంచ గొండితనం మీద , అంతులేని దోపిడీ విధానం మీద తెలుగుదేశం ప్రభుత్వం రాజీలేని పోరాటం సాగిస్తుంది. వీటన్నింటిని అదుపులో పెడుతుంది. ప్రజల ఆశలు తీరుస్తుంది. స్వచ్చమైన పరిపాలనను ప్రజలకు అందించి అవినీతిని నిర్మూలించి అక్రమాలను అరికట్టి మీకిచ్చిన మాటను నిలబెట్టు కుంటుంది.
    ఎందరో అన్నార్తులు, బాధలతో బక్కచిక్కిన మూగజీవులు మగ్గి మగ్గి కన్నీరు కూడా వెలికి రాక ఇంకిపోయిన కష్టజీవులు, ఇందరి శ్రమను ఏ కొద్ది ,మందో దోచుకుంటూ, అనుభవిస్తూ, ఆనందాల కేరింతలతో, భోగాల కలవరింతలతో సమాజ శ్రేయస్సుకు ద్రోహం చేయడం న్యాయ సమ్మతం కాదు. అందరికీ చెందవలసిన అవకాశాలను ఏ కొద్ది మందో భుక్తం చేసుకోవడం, జాతి శ్రేయస్సుకు మంచి లక్షణం కాదు. అందుకే 35 ఏళ్ళ స్వాతంత్యం 35 సంవత్సరాల స్వతంత్ర పరిపాలన కూడా దేశంలోని పేదరికాన్ని తుడిచి పెట్టలేక పోగా నిరుపేదరికాన్ని నిర్ధాక్షిణ్యంగా సాటి మానవుల నెత్తిన రుద్దాయంటే సంపన్న సమాజం ఏ విధంగా మానవతా విలువలు కోల్పోయిందో ఆలోచిస్తే అర్ధమవుతుంది. 

జాతి పతనంలో స్వార్ధం పెరిగింది. మంచితనం, మంచిమాట, మంచిపని చేయని పని ఈనాడు డబ్బుతో ఎన్ని పనులు చేయడానికి, చెలామణి చేసుకోవడానికి పూర్తి అవకాశం లభించింది. అందుకే ఈనాటి ప్రభుత్వ వ్యవస్థ సామాన్య మానవుడి జీవితాన్ని బాగుపరచలేని అసహాయస్థితిలో నిలువు గుడ్లతో నిలబడిపోయింది. పేద ప్రజలను ఉద్దరించలేని , న్యాయాన్ని ధర్మాన్ని సముద్ధరించలేని అసమర్ధపు ప్రభుత్వంపై తెలుగు జాతిలో రేగిన విప్లవమే తెలుగుదేశ మహోద్యమం . తెలుగువారి గుండెలలో రగిలిన ఉద్వేగమే ఈ మహోద్యమం. అదే తెలుగు గడ్డ మీద సుడిజుట్టుకు వీచిన మహా ప్రభంజనం.
    సంక్రాంతి పర్వదినాలలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం ఇంతటి అఖండ విజయం సాధించిందంటే అది మా తెలుగింటి ఆడపడుచుల నిండు ఆశీస్సులు, అభిమానం ఎంతగా పొంగిపొర్లాయో నాకు తెలుసు. అక్క చెల్లెళ్ళు ఇచ్చిన మంగళ హరతులే భవిష్యత్తుకు శుభదీపికలై నాయి. వారి నివాళులే ఈనాటి విజయానికి వెలుగు బాటలైనాయి. ఆ అనురాగపు జల్లులు తెలుగుదేశం పార్టీకి శుభ సందేశాలు అయ్యాయి. వారందరికీ నా శుభాశీస్సులు . తెలుగు గడ్డపై రేగిన ఈ మహోద్యమంలో ఈ ప్రభంజనంలో పాలుపంచుకుని భాగస్వాములైన యువశక్తికి నా శుభాభినందనలు. అన్నగా అభిమానించి, దివ్వెపట్టి, ముందుకు నడిపించిన హరిజన గిరిజన బడుగు వర్గాల అపేక్ష, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనివి, మరువరానివి. పసిపాపలు దేవుని ప్రతిరూపాలన్నారు. బాలవాక్కు బ్రహ్మ వాక్కు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కేరింతలు కొట్టుతూ ఎదురొచ్చి అమితోత్సాహంతో స్వాగతం చెప్పిన బాలలందరికీ నా నిండు దీవెనలు.
    ఈనాడు ప్రజాసేవకుడిగా జీవితాన్ని ధన్యం చేసుకోదలచిన నేను తెలుగుజాతికి అకింతమైనానని, ఇదే ధ్యేయంతో , లక్ష్యంతో ముఖ్యమంత్రిగా పదవిస్వీకారం చేశానని నా ప్రియసోదరీ సోదరులందరికీ , పూజ్యులందరికీ తెలియజేస్తున్నాను.
    గమ్యాన్ని చేరడానికి, నీ అందరి ఆశీస్సులు, సహకారం అర్ధిస్తున్నాను. బడుగు, బలహీన వర్గాల సముద్దరణ, అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణ, రైతు కూలీల సంక్షేమం, కార్మికుల సౌభాగ్యం తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యాలు. ఈ ఆశయాల సాధన కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం, ఆడపడుచుల సమస్యల పరిష్కారం కోసం వారిపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం కోసం తెలుగుదేశం ప్రణాళిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చడం కోసం, చేసిన బాసలను నిలుపుకోవడం కోసం ఈ క్షణం నుంచీ అవిరళ కృషి జరుగుతుంది. అన్ని రంగాలలో అన్ని విధాలా జాతి సంక్షేమం సాధించేవరకు విశ్రమించడం జరుగదని వాగ్దానం చేస్తున్నాను. ఆలయానికి వెలుగునిచ్చే కర్పూర కళిక తన ధ్యేయంతో తాను కరిగిపోయే విధంగా నేను స్వజాతి కార్యక్రమంలో ధన్యుడను కావాలని మన్హ పూర్వకంగా కోరుకుంటున్నాను.
    నాలో విశ్వాసముంచి , నమ్మకముంచి నన్ను గెలిపించి, తెలుగుదేశానికి జీవం పోసిన తెలుగువారందరినీ, మరో మాటలో చెప్పాలంటే తెలుగునాట వున్న ఆరుకోట్ల ప్రజానీకాన్ని ఈ బరువైన భాధ్యతా నిర్వహణలో నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని అభ్యర్ధిస్తున్నాను. యువతరం ఉరకలెత్తి ముందుకు దూకుతూ నా మార్గాన్ని సుగమం చేయాలని, ఆడపడుచు అందరూ నిండు మనస్సుతో నా కృషి ఫలించడానికి ఆశీస్సులు పూలజల్లులుగా కురిపించాలని అర్ధిస్తున్నాను.
    తెలుగుజాతికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో ప్రజాసేవ, సమాజ సంక్షేమం సాధించడంలో అధికారులు, ఉద్యోగులూ, తమ బాధ్యతను తాము నిర్వహిస్తూ అవినీతిని నిర్మూలించి స్వచ్చమైన పరిపాలనా నిర్వహణకు కృషి సల్పాలని, ఆదర్శవంతమైన ప్రజా సేవలో పునీతులు కావాలని అహర్నిశలు అండదండలందిస్తూ ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మన రాష్ట్ర సర్వముఖాభివృద్దికి, సర్వజన సంక్షేమానికి పాటుపడాలని నా తరపున నా మంత్రివర్గం తరపున, తెలుగుదేశం శాసనసభ్యుల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నిండు హృదయంతో అభ్యర్ధిస్తున్నాను.

    1983 జనవరి 9 న ఆకాశవాణి / దూరదర్శన్ ల నుండి ప్రసారితం.

 

 

 Previous Page Next Page