నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను. ఆయన కాదనరు. ఆయనకు ఇప్పటికే నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది. నాకంటే నువ్వే ఎక్కువయ్యావు. ఆయన ప్రాణదాతవు కదా నువ్వు అంది నవ్వుతూ.
సరే నీ ఇష్టం అన్నాడు.
ఇక రా నిద్రపోదాం అంది తన పక్కనే మంచంపై చోటు చూపిస్తూ.
మొహమాటపడుతూ మెల్లగా విజిత పక్కన చేరాడు వినీల్.
ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా జరిగి గువ్వా గోరింకల్లా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడి పడుకున్నారు. అంత ఏ సి చల్లదనంలోనూ వెచ్చగా అనిపించింది ఇద్దరికీ.
ఇద్దరూ ఒక్కటయ్యారు.
వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి.
వినీల్ ని పెళ్లి చేసుకునేందుకు విజితకు మార్గం సుగమమయ్యింది. థాంక్ గాడ్ అనుకుంది మనసులో.
నాలుగు గంటలకు మెలకువ వచ్చింది విజితకి.
అయ్యో విజ్జీ సారీ. నేను అలా చెయ్యాలని చెయ్యలేదు అని కలవరిస్తున్నాడు వినీల్.
అతన్ని కొంచెం కదిపింది. కలవరింత ఆగింది. బాగా డిస్టర్బ్ అయ్యినట్లున్నాడు.
పెళ్ళయ్యేంతవరకు నిద్ర కూడా సరిగా పోయేట్లులేడు నీల్ అనుకుంది.
జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్లు నీల్ అన్నాడు. మరి ఆయన ఒప్పుకుంటాడా తమ పెళ్ళికి.
డాడీ ని కూడా ఒప్పించాలి కదా.
అబ్బో చాలా సమస్యలున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారింది విజిత.
ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరు దరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి.
****
అలసిన ఆ ఇద్దరికీ మంచి నిద్ర పట్టింది.
రోజులాగే ఐదుకల్లా మెలకువ వచ్చింది వినీల్ కి.
పక్క మీంచి లేద్దామంటే మీద గట్టిగా చెయ్యేసి పడుకోనుంది విజిత.
మొదటిసారి ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినీల్ కి.
విజితని తన పక్కన అంత దగ్గరలో చూడటం. అసలు ఇంత అందమైన సుగుణాల రాశి ఇలా తనతో...అది కలో నిజమో అతనకి అర్ధంకావడం లేదు. కల కాకుంటే బాగుణ్ణు అనుకున్నాడు.
చప్పుడుకు తను నిద్రలేస్తుందేమో అని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు.
ఇంకా దగ్గరగా హత్తుకుని పడుకుంది విజిత అతను ఎక్కడికి పారిపోకుండా.
అమ్మలూ ! క్రింద జిమ్ కెళ్ళొస్తానురా ప్లీజ్ అన్నాడు. డోర్ లాక్ చేసుకుని వెళతానులే. నువ్వు నిద్రపో అన్నాడు.
అయితే ఒక ముద్దిచ్చి వెళ్ళు అంది.
తన గులాబీ బుగ్గపై ఆంటీ అంటనట్లు ఓ ముద్దు పెట్టి లేచాడు.
అంత నిద్ర మత్తులోనూ నవ్వొచ్చింది విజితకి.
క్రిందకు వెళ్లి కలియ తిరిగాడు.
జిమ్ కనిపించింది.
జిమ్ లో ఓ అరగంట వ్యాయాయం చేసి స్విమ్మింగ్ పూల్ లో ఓ అరగంట స్విమ్ చేసి అక్కడే ఓ కుర్చీలో రిలాక్స్ అయ్యాడు.
ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఒక మారు నెమరువేసుకున్నాడు.
పది గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్, సాయంత్రం రిటర్న్ ఫ్లైట్ ఆరుగంటలకు.
సో ఇప్పుడు రాజుగారి తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి.
అక్క కి ఫోన్ చేసి మధ్యాన్నం వాళ్ళింటికి వెళ్ళాలి. అటునుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లొచ్చు.
రిసెప్షన్ లో ఒక పాడ్, పెన్ తీసుకుని కూర్చున్నాడు.
రాజు గారు లేచుంటారా అని ఆలోచిస్తూ వెంకటరాజుగారికి ఫోన్ చేసాడు.
ఆయన నిద్ర లేచున్నాడు.
ముందుగా ఆయన హెల్త్ గురించి అడిగాడు.
బాగానే ఉంది నీల్. ఫీలింగ్ మచ్ బెటర్. విజిత ఇప్పుడే నాతో మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. నిన్ను స్పెషల్ అడ్వైసర్ గా పత్రికా విలేఖరుల సమావేశంలో పరిచయం చేస్తానంది. నేను నో ప్రాబ్లెమ్ అని చెప్పాను. నీకు చాలా థాంక్స్ నీల్. చాలా భారం నీమీద మోపాను అని అన్నాడు.
వెల్కమ్ సర్. అదేం లేదు అన్నాడు వినీల్.
ఆయన వద్ద నుంచి విజి ఇండస్ట్రీస్ గురించి చాలా వివరాలు సేకరించాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పేందుకు.
ఆయన ఓపికగా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకుని అన్నీ విషయాలు చెప్పాడు. ఆడియో విసువల్ చాలా బాగుందని మరీ మరీ మెచ్చుకున్నాడు.
ఆయనతో మాట్లాడిన తరువాత వినీల్ తన అక్క శశిరేఖ కు ఫోన్ చేసాడు.
ఆమె ముంబై లోనే ఉంటుంది.
తను యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉంది.
వినీల్ బావగారు రోహిత్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో పని చేస్తున్నాడు. ముంబై ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్ కు ఇంఛార్జిగా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. అతను ఎప్పుడూ విదేశాల క్యాంప్స్ లో ఉంటాడు. బాగా బిజీ.
వినీల్ అన్న శేఖర్, యశ్వంత్, రోహిత్ ముగ్గురూ సివిల్ సర్వీస్ బాచ్ మేట్స్.
అన్నయ్య కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్ తో వివాహమయ్యింది.
ఫోన్లో అక్కకు చెప్పాడు ముంబై లో ఉన్నట్లు.
ఆవిడ బాగా కోప్పడింది, ఇంటికిరాకుండా హోటల్ లో ఏంటిరా అని.
మధ్యాన్నం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతానులే అని చెప్పాడు.
భోజనానికి రమ్మంది.
అక్క చేతి వంట తిని చాలా రోజులయ్యింది. సరే అన్నాడు వెంటనే.
వినీల్ కి అమ్మకంటే అక్కదగ్గరే చనువు ఎక్కువ. చాలా కబుర్లు షేర్ చేసుకునేవాడు అక్కతో.
టైం చూసుకున్నాడు ఏడున్నర. ముఖ్య ఫోన్ సంభాషణలు అయ్యాయి. ఇక రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని లిఫ్ట్ ఎక్కాడు.
బెల్ కొట్టగానే రూమ్ తలుపు తీసింది విజిత తన పెద్ద జడను ముడి చుట్టుకుని క్లిప్ పెట్టుకుంటూ.
ఆ అందాలు చూస్తే మళ్ళీ మూడ్ మారుతుంది తనకు అనుకుని కొంచెం తల క్రిందకు వాల్చాడు వినీల్.
బాగానే చూడొచ్చు అంది విజిత అతని గడ్డం పైకెత్తి అతని మొహంలోకి చూసి నవ్వుతూ.
మీ వ్యాయామాలు, పనులూ పూర్తయ్యాయా బుజ్జీ అంది.
ఎస్ విజ్జి. మీ డాడీ తో మాట్లాడాను. నువ్ కాల్ చేసినట్లు చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మా అక్క శశిరేఖ ఇక్కడే ఉంటుంది. అక్కకి ఫోన్ చేసాను. ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే రూమ్ వెకేట్ చేసి అక్క దగ్గరికెళదాం. లంచ్ వాళ్లింట్లోనే అన్నాడు.
ఓహ్ చాలా షెడ్యూల్ ఉందన్నమాట ఇవాళ అయ్యగారికి. నేను నీతో ప్రైవేట్ గా టైం స్పెండ్ చేద్దామనుకున్నా. అయితే కుదరదన్నమాట అంది నిరాశగా మొహం పెడుతూ విజిత.
హైదరాబాద్ లో మనం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చుగా విజ్జీ. అక్కడ బోలెడంత టైం మనకు అన్నాడు నవ్వుతూ. మా అక్కని పరిచయం చేస్తే నువ్వు వదిలిపెట్టవు.
ఓకే ఓకే కలుద్దాం. కాకుంటే నువ్వు నాకు ప్రామిస్ చెయ్యాలి. హైదరాబాద్ వెళ్ళగానే నీ సాఫ్ట్వేర్ లో తలదూర్చకుండా నాకు రోజూ కొంత సమయం కేటాయించాలి అంది.
సరే బుజ్జీ అన్నాడు.
కెటిల్ లో ఉన్న కాఫీ కప్పులో పోసి వినీల్ కి ఇచ్చింది.
నీకు అన్నాడు.
హాఫ్ తాగి ఇవ్వు అంది.
అబ్బా ఎంగిలి అన్నాడు.
ఫరవాలేదు నాకు ఇష్టమే అంది. పెళ్లి చేసుకుంటావుగా నన్ను అంది వినీల్ మొహం లోకి చూస్తూ.
నాదేం లేదు. నువ్వే చేసుకోవాలి నన్ను. మీరు రాణిగారు కదా.
యు ఆర్ మై ఫస్ట్ క్రష్ ప్రిన్స్ బేబీ అంది అతని బుగ్గలు పట్టుకుని లాగుతూ.
తన రూముకెళ్ళి స్నానం చేసి డ్రెస్ అప్ అయ్యి వస్తానన్నాడు.