మరోగంట గడిచాక విశ్వనాథం వచ్చాడు. విష్ చేసి ఎదుటి కుర్చీలో కూర్చుంటూ "మా పోలీసు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడా మేడమ్?" అని అడిగాడు. అనుదీప్ తన గదికి వచ్చి వెళ్ళటం గురించి చెప్పింది.
విశ్వనాథం కోపంగా "ఇడియెట్స్... ఈ పోలీసుల్నిద్దర్నీ ఇప్పుడే సస్పెండ్ చేస్తాను" అన్నాడు కమీషనర్ లెవల్లో.
"నీ మొహం" అని మనసులో అనుకొని, "వద్దులెండి. పాపం వాళ్ళేం చేస్తారు? రోజూ అనుదీప్ నన్ను కలుసుకుంటూనే వుంటాడు. ఈ రోజు కాకపోయినా రేపయినా దొరక్కపోడు" అంది.
"ఎందుకమ్మా- మా కమీషనర్ గారు నిన్ను అంత అర్జెంటుగా రమ్మన్నాడు?"
ఆమె చెప్పింది. విశ్వనాథం కళ్ళు మెరిశాయి.
"ఈ విషయంలో నీకే సాయం కావలసినా నాకు చెప్పు" అన్నాడు.
'ఈ మిషమీద ధర్మారావు ప్రాపకం మరింత సంపాదిద్దామనుకుంటున్నాడు' అనుకుంది మనసులో. కానీ అతని అవసరం మరో అయిదు నిముషాల్లో వచ్చింది.
చక్రధర్ మళ్ళీ లోపలికి పిలిచాడు.
"విద్యా! రేపు నా పుట్టినరోజు. సాయంత్రం టీకి రావాలి" అని అడిగాడు అభ్యర్థిస్తున్నట్టు. ఆమెకి సంతోషమూ, భయమూ ఒకేసారి కలిగాయి. ఇంత తొందరగా అతని ఇంటికి వెళ్ళే అవకాశం లభిస్తుందనుకోలేదు. మరోవైపు ఈరోజు తన ప్రవర్తనతో అతడేమన్నా అడ్వాంటేజి తీసుకుంటాడేమో అని భయం.
ఆమెకేం చెయ్యాలో తోచలేదు.
"ఇంకెవర్నీ పిలవలేదు. నిన్నొక్కదాన్నే -ఈ కొత్త సంవత్సరం నీతో గడపాలని ఆశ. కాదనకు".
అవసరం వచ్చినప్పుడల్లా పుట్టినరోజు వస్తుందని, అవసరం వున్నవాళ్ళనే పిలుస్తాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె ఆలోచిస్తున్నది అదికాదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం అనాలోచితమేనని.
"రేపు సాయంత్రం అయిదింటికి - వస్తావుగా".
వస్తానన్నట్టు తలూపి ఆమె బయటికి వచ్చేసింది. గుండెవేగంగా కొట్టుకుంటూంది.
ఇంకా తన సీటు దగ్గరే కూర్చుని వున్న యస్సైని చూడగానే ఆమెకి ఓ ఆలోచన వచ్చింది. మరుసటిరోజు చక్రధర్ తనని టీకి పిలవటం గురించి చెప్పి - "నాకు భయంగా వుంది. ఒక్కదాన్నే వెళ్ళలేను. మీరుకూడా రావాలి" అంది.
"నేను వస్తే అతడు పూర్తిగా బెదిరిపోతాడేమో" అన్నాడు విశ్వనాథం.
"లోపలికి అవసరంలేదు. ప్రతి పదినిముషాలకీ నేను బయట కొచ్చి మీకు కనబడుతూ వుంటాను మీరు వీధిలో దూరంగా వుండండి.... నేను కొంచెం సేపటివరకూ రాకపోతే ప్రమాదంలో చిక్కుకున్నానన్నమాట. అదే గుర్తు...."
"నీకూ పోలీసుల లక్షణాలు వచ్చేశాయమ్మాయ్."
విద్యాధరి నవ్వింది. "చక్రధర్ నాపట్ల ఏదయినా అసభ్యంగా ప్రవర్తించేటంత ధైర్యం చేస్తాడని నేననుకోను. కానీ నేను ఏ పనిమీద వచ్చానో పొరపాటున తెలిస్తే, ఆ కోపంతో హద్దులు మీరవచ్చు. అప్పుడే మీ అవసరం వుంటుంది."
విశ్వనాథం లేచి "అయితే రేపు సాయంత్రం కలుస్తాను" అని. వెళ్ళబోతూ ఆగి, "ఈ విషయాలన్నీ కమీషనర్ గారికి చెప్పు. ఆయనకి కూడా తెలియటం మంచిది."
ఆమె తలూపింది. అతను వెళ్ళిపోయాడు.
పని పూర్తవకుండా కమీషనర్ కి ఈ విషయాలన్నీ చెప్పటం ఆమె కిష్టంలేదు. తనకో పని అప్పచెప్పాడాయన. ఆ రహస్య పత్రాలు ఎక్కడున్నాయో వెతికి పట్టుకున్నాకే ఆయనను కలవటం మంచిది. ఈ విషయాన్ని కమీషనర్ కి చెప్పమని విశ్వనాథం ఎందుకు కోరుతున్నాడో ఆమెకి తెలుసు. అనుదీప్ బారినుండి తనను రక్షించేపని ఒక్కటే కాకుండా చక్రధర్ విషయంలో కూడా సాయపడుతున్నానని తెలియజేసి పై అధికారి మెప్పుదల మరింత పొందాలని విశ్వనాథం ఉద్దేశ్యం.
తమ ఇన్వెస్టిమెంటు కంపెనీలో లక్ష రూపాయలకన్నా ఎక్కువ పొదుపు చేసినవారి లిస్టు ఆమె ఒక ఫోటోస్టాట్ కాపీ రహస్యంగా తీసి వుంచుకుంది. మరుసటిరోజు సాయంత్రం చక్రధర్ ఇంటికి బయలుదేరింది.
చక్రధర్ ఆమెని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు. ముందే అనుకున్న ప్రకారం విశ్వనాథం వీధి చివర నిలబడ్డాడు.
బయట గాలి బలంగా వీస్తూంది. రోడ్డు మధ్యలో సుడిగాలి గుండ్రంగా పైకి లేస్తూంది.
* * *
చక్రధర్ తోపాటు సిగ్మా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ మరో డైరెక్టర్ అయిన సంపత్, తన గదిలో విసుగ్గా పచార్లు చేస్తున్నాడు. కంపెనీ వ్యవహారాలు బాగాలేవని అతడికి తెలుసు.
అలా అవుతుందని, కంపెనీ ప్రారంభించబోయేముందే వాళ్ళిద్దరూ అనుకున్నారు.
అయిదు సంవత్సరాలపాటు, ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగించారు. మొదటి విడత డిపాజిటర్లకి డబ్బు చెల్లించవలసిన సమయం ఆసన్నమైంది.
అక్కడే సంపత్ కి చక్రధర్ కి గొడవ వచ్చింది.
వచ్చినంతవరకూ చాలు - డిపాజిటర్ల దగ్గిరున్న రసీదులకీ తమకీ ఏ సంబంధమూ లేదని చెబ్దాం అంటాడు సంపత్. కాదు - ఇప్పుడు డబ్బు ఇచ్చేసి మరికొంతకాలం కొనసాగిద్దాం అంటాడు చక్రధర్.
ఈ విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు.
తమ వ్యవహారాలన్నీ పోలీసులకి తెలిశాయనీ, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారనీ అతడికి తెలుసు.
చక్రధర్ కన్నా సంపత్ తెలివైనవాడు. కంపెనీ మూతబడ్డ తరువాత కోర్టులో - వచ్చిన డబ్బంతా ఎక్కడ పెట్టారో, ఆ డబ్బు ఎలా నష్టాల రూపంలో పోయిందో చెప్తేగాని శిక్షపడకుండా తప్పించుకోవటం కష్టం. అందుకు సరిపడ్డ ప్లాను వేశాడు.
కానీ మధ్యలో చక్రధర్ దొంగరసీదు పుస్తకాలు మొదలు పెట్టాడు. ఇదెప్పటికయినా రిస్కు అని సంపత్ కి తెలుసు. కానీ చక్రధర్ వినలేదు. నాలుగు నెలల్లో పది లక్షలు లాభం వచ్చింది.
ఈ లోపులోనే పోలీసుల కన్ను దానిమీద పడింది.
సంపత్ చక్రధర్ ని మనసులో బాగా తిట్టుకున్నాడు. బంగారు బాతు కథ గుర్తొచ్చింది. ఇప్పుడు పట్టుబడితే చెరో పది సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష తప్పదు.
తనచుట్టూ వల బిగుసుకుంటున్నట్టు చక్రధర్ కూడా గమనించాడు. కాని ఏం చెయ్యాలి? ఇద్దరూ కలిసి చర్చించారు. చక్రధర్ తన తొందరపాటు వప్పుకున్నాడు. కానీ కేవలం ఒప్పుకోలు సమస్యని పరిష్కరించదు.
సంపత్ చిరాగ్గా తన గదిలో పచార్లుచేస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.
సరీగ్గా ఆ సమయంలో ఫోన్ మ్రోగింది.
రిసీవర్ ఎత్తి "హల్లో"
"మిస్టర్ సంపత్-"
"మాట్లాడుతున్నాను. ఎవరు?"
"నేను మీ శ్రేయోభిలాషిని. మీ సమస్యకి పరిష్కారం చెప్పటానికి ఫోన్ చేశాను."
"సమస్య ఏమిటి?" నొసలు చిట్లించి అడిగాడు.
"సిగ్మా ఇన్వెస్ట్ మెంట్స్."
"మిస్టర్ నువ్వేమి మాట్లాడుతున్నావో నాకు అర్థంకావటం లేదు-"
"మనం అనవసరమైన అమాయకకత్వాలు నటించి సమయం వృధా పర్చుకోనవసరంలేదు సంపత్. ఈ కష్టాలన్నింటి నుంచీ ఒక్కదెబ్బతో బయటపడే మార్గం నేను చెబుతాను. ఎంత యిస్తారు?"
"నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థంకావటం లేదు."
"పోలీసు డిపార్టుమెంట్ మీ చుట్టూ అల్లుతున్న ట్రాప్ లో ఇది ఒక భాగంగా అనుకుంటున్నారు మీరు. కానీ నా మాట వినటం వల్ల మీకేమీ నష్టం లేదు కదా-"
"నీకేం కావాలి?"
"లక్ష రూపాయలు యిస్తే మనిద్దరం కలిసి మీరు ఊబిలోంచి బయటపడే ప్లాన్ లో విజయం సాధించగలం."
"నువ్వెవరు?"
"మీరు దీనికి అంగీకరిస్తే నేను ఎలాగూ మిమ్మల్ని కలుసుకుంటాను. నా వివరాలన్నీ తెలుపుతాను. మిస్టర్ సంపత్! నేను బ్లాక్ మెయిలర్ ని కాదు. చీకట్లో వుండవలసిన అవసరం కూడా నాకు లేదు. వచ్చి కలుసుకుంటాను. నాకు కావల్సిందల్లా మీరు వప్పుకుంటారో లేదో చెప్పటమే-"
"నువ్వు చెప్పేదేమిటో... దానివల్ల నాకు ఏం లాభం ఉందో తెలియకుండా నేనేమీ హామీ ఇవ్వలేను!"
"పాతికవేలు అడ్వాన్సు, మిగతాది పని పూర్తయ్యాక."
"మిస్టర్, చెప్పానుగా - నీ మీద నాకేమిటి నమ్మకం?"
"నమ్మకం కలగటానికి ఒక ఉదాహరణ చెప్పనా?"
"చెప్పు".
"ప్రస్తుతం ఇదే సమయంలో నీ భాగస్వామి చక్రధర్ ఇంట్లో ఒకమ్మాయి, రహస్యపత్రాలకోసం వెతుకుతూంది. ఆ అమ్మాయి పోలీసుల తాలూకు మనిషి-"
సంపత్ అదిరిపడి "వ్హాట్" అని అరిచాడు.
"ఆ అమ్మాయి పేరు విద్యాధరి. చాలా? ఇంకా ఏమైనా వివరాలు కావాలా?"
"నేను వెంటనే నిన్ను కలుసుకోవాలి."
"గుడ్. పదినిముషాల్లో వచ్చెయ్. పాతికవేలు పట్టుకురా. నేను చెప్పేది నీకు నచ్చితే డబ్బు ఇద్దూగానీ. లేకపోతే విడిపోదాం" అంటూ తనెక్కడున్నాడో చెప్పాడు ఆ వ్యక్తి.
"చక్రధర్ కి ఈ విషయం ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను".
"ఆ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు వచ్చెయ్. ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్ళింది. అతనిని కబుర్లలోపెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఎంత లేదన్నా అరగంట పడుతుంది. దానికన్నా ముందు మనం కలుసుకోవాలి. నేను చెప్పేది విన్నాక మిగతాది నిర్ణయిద్దాం."
రెండు నిముషాల తరువాత సంపత్ కారు వేగంగా ఇంటి నుంచి బయటకొచ్చింది. అతడి పక్కనే పాతికవేలు కట్ట వుంది. ఈ కష్టాన్నుంచి బయటపడితే లక్ష ఒక లెఖ్ఖలోనిదికాదు. ఎలా బయటపడాలన్నదే అతని సమస్య.
ఇదంతా పోలీసుల ట్రాప్ ఏమో అన్న అనుమానం అతడికి లేకపోలేదు. కానీ ట్రాపే అయితే - ఆ విషయ తనకెందుకు చెపుతారు? ముఖ్యంగా...రహస్యపత్రాలు సంగతి!
అతడికి విద్యాధరి తెలుసు. ఆఫీసులో చాలాసార్లు చూశాడు ఆమెని. చూసిన వాడెవడూ అంత త్వరగా మర్చిపోడు.
చక్రధర్ స్త్రీ వ్యసనం గురించికూడా అతడికి తెలుసు. వాళ్ళిద్దరికీ గొడవ జరిగిన సంగతి అతడి వరకూ వచ్చింది. దాన్ని పోలీసులు ఈ విధంగా ఉపయోగించుకున్నారన్నమాట! చక్రధర్ మూర్ఖుడిలా ఆమెని తనింటికి ఆహ్వానించి వుంటాడు. ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా- "ఆఁ- దానికేముంది - ఏమవుతుందిలే" అన్నట్టు తీసుకోవటం అతని కలవాడు. అతడితోపాటూ తననీ ఇరికిస్తున్నాడు.
కారు మరో అయిదు నిమిషాలు ప్రయాణం చేసి, అగంతకుడు ఫోన్ లో చెప్పినచోట ఆగింది. కారు ఆగటం చూసి చాటునుండి ఆ వ్యక్తి బయటకొచ్చాడు పలకరింపుగా నవ్వేడు.
"నువ్వా?" అన్నాడు సంపత్ ఆశ్చర్యంతో. "ఫోన్ చేసింది నువ్వేనా?"
"కంగారుపడకు. నేనే-" అన్నాడు ఆ వ్యక్తి. "నన్ను చూశాకయినా నమ్మకం కుదిరిందా? ఇరుక్కుంటే ఇద్దరం ఇరుక్కుంటాం. నేనో ప్లాన్ చెపుతాను. అది పూర్తయ్యేవరకూ సాయపడతాను. చెప్పు లక్ష ఇస్తావా-"