Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 16


    కాని రోజులు గడిచినా నన్ను వదల్లేదు. నా దగ్గర డబ్బులు లాక్కునేవారు. ఎదురుతిరిగితే కొట్టేవారు. నా భోజనంలో కూర, వగైరాలు అన్నీ లాగేసుకునేవారు. నన్ను ఒట్టి అన్నం తినమనేవారు.

 

    రాత్రుళ్ళు కళ్ళలోకి నిద్ర కూరుకువస్తోన్నా ఒంటిగంటదాకా నిద్రపోకుండా ఎదురుగా నిల్చోమనేవాళ్ళు. నాకు చలిగాలి పడదు. గజగజ వణికే చలిలో చొక్కా లేకుండా తిరగమనేవాళ్ళు. ఎదురుతిరిగితే కొట్టారు. చాలాసార్లు కొట్టారు.

 

    ఈ చిత్రహింసలు భరించలేక అక్కడ్నుంచి పారిపోయి వచ్చేశాను. ఇంక అక్కడికి వెళ్ళను. ఇక్కడే వేరే ఏదయినా స్కూల్లోచేరి, చదువుకుంటాను. చదువుమీద నీకున్న గౌరవం నాకు తెలుసు. కాని ఏం చెయ్యను? నన్ను క్షమిస్తావని ఆశిస్తూ...

                                                                                             నీ తమ్ముడు
                                                                                               సుధాకర్.

 

    మాధవికి కడుపులో దేవినట్లయింది. కళ్ళలో నీళ్ళు తిరగబోతూంటే కష్టంమీద నిగ్రహించుకుంది. అంతలోనే ఆమె మనస్సును కఠినత్వమావరించుకుంది. ఆనాడు... కల్యాణి జాకెట్ గుండీలు ఊడి, చీరె కుచ్చిళ్ళు సడలి ఓ పరాయి పురుషుడి ముందు క్రింద పడిపోయిన దృశ్యం మనోరథంలో మెదిలింది. ఇతన్నా తను జాలితల్చడం? ఈ కఠినాత్ముడ్నా?

 

    "మీ వరకూ వచ్చిందని బాధపడుతున్నారా?"

 

    ఏదో ఆలోచిస్తున్న వాడల్లా తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. అందులోని భావాలు అతనికర్థమయ్యాయి.

 

    "ఈ ఉత్తరం రాకముందే నేను పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాను. ఆ పశ్చాత్తాపంలోనే నీ స్నేహంకోసం తహతహలాడాను."

 

    "ఆహా!" అంది మాధవి.

 

    "అవును మాధవీ. నన్ను నమ్ము. ఐయామ్ రియల్లీ వెరీ సారీ. వెరీ వెర్రీ సారీ."

 

    అతని మాటల్లో నిజాయితీ వుండవచ్చు. అతని మనస్సులో వేదన వుండవచ్చు. కాని... ఆమెకతనిమీద జాలి కలగలేదు.


                                   * * *


    ఆ సాయంత్రం ఫోన్ వచ్చింది. కాని ఆమె ఫోను దగ్గరకు వెళ్ళలేదు.

 

    మర్నాడు రాజా ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని ఎంతో తారాట్లాడాడు. ఆమె ఫ్రెండ్స్ మధ్యవుండి అవకాశం ఇవ్వలేదు.

 

    ఆ రాత్రి నిద్రపోయే ముందు కల్యాణి అంది మాధవితో. "నీకు తెలుసా? రాజా మంచి క్రికెట్ ప్లేయరు. బ్యాటింగ్ సూపర్బట."

 

    ఆమెకి ఈ విషయం ఎవరుచెప్పారా అని మాధవికి ఆశ్చర్యం కలగలేదుగానీ తనని అంత అవమానంపాలు చేసిన మనిషి గురించి పొగుడ్తూ మాట్లాడటం విడ్డూరమనిపించింది.

 

    ఎంత తేలిగ్గా మరిచిపోయింది కల్యాణి!

 

    మనస్సు ఎంత విచిత్రమైంది!

 

    ఆ మర్నాడు లంచ్ అవర్ లో రాజా "మాధవీ!" అంటూ ప్రక్కన ఎవరెవరో ఉన్నా లెక్కచెయ్యకుండా దగ్గరకు రాబోతున్నాడు. ఇంతలో ఆమెకు దూరంగా దివాకర్ కనిపించాడు.

 

    "హేయ్! దివా" అంటూ అతని దగ్గరకు వెళ్ళింది పరిగెత్తినట్లు.

 

    ఆ పిలుపుకు దివాకర్ శరీరం పులకరించింది.

 

    "ఏమన్నారు?" అన్నాడు పరవశంగా.

 

    "దివా!"

 

    "హౌ లక్కీ అయాం? చెప్పండి. కొండల్ని పిండి చేసేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్ని రాలగొట్టేస్తాను."

 

    "అంత అనవసరంగానీ- రేపు ఆదివారం జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో రాజాని చిత్తుగా ఓడించాలి."

 

    "చిత్తుగా ఓడించటంకాదు. చిత్తు చేసేస్తాను."

 

    "మీరు పెద్ద ఫాస్ట్ బౌలరన్నారుగా. ఎవరి తర్వాత...?"

 

    "కపిల్ దేవ్ తర్వాత."

 

    "ఆ కపిల్ దేవ్ మీ ముందు పనికిరాడన్నట్లు విజృంభించాలి. రాజాకి రన్స్ ఇవ్వకూడదు."

 

    "రన్సా? నా బౌలింగ్ లో వాడు కొట్టటమా? బౌన్సర్స్ వేస్తా. భీమర్స్ వేస్తా. వాడితల చిట్ల కొట్టేస్తా."

 

    "గుడ్! ఆ పట్టుదలమీదే వుండండి. వస్తా" అంటూ మాధవి క్లోక్ రూంవైపు వెళ్ళిపోయింది.

 

    శనివారం వచ్చింది.

 

    అతి కష్టంమీద రాజా ఆ సాయంత్రం మాధవిని పట్టుకోగలిగాడు.

 

    "మాధవీ! ప్లీజ్! రెండు నిమిషాలు నీతో మాట్లాడాలి."

 

    ఆమె ఒక్కక్షణం ఆలోచించింది. "పదండి" అంది. ఇద్దరూ నడుస్తూ హెర్యులిన్ విగ్రహం దాటి ఏకాంతంగావున్న ప్రదేశంలోకి వచ్చారు.

 

    "మాధవీ!"

 

    ఈసారి మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. కళ్ళలో చలాకీతనంపోయి దిగులు. ముఖంలో అలసట. ఖంగ్ మని మ్రోగే కంఠంలో కొంచెం దైన్యం.

 

    "మాధవీ! ఎందుకు నన్ను ఎవాయిడ్ చేస్తున్నావు?"

 

    "అదే ప్రశ్న నేనూ అడిగితే... ఎందుకు నా వెంటబడుతున్నావు?"

 

    "ఎందుకంటే... ఎందుకంటే... నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి."

 

    "మైగాడ్?" మాధవి షాక్ అయిపోయింది.

 

    "అవును మాధవీ. ఐ... ఐ... ఐ... లవ్ యూ."

 

    ఆమె షాక్ నుంచి తేరుకుంది. "బట్... బట్... ఐయామ్ నాట్..."

 

    "ప్లీజ్! డోన్ట్ సే నో. ఈ నాలుగయిదురోజులూ నేనుభవించిన ఎగనీ నీకు తెలీదు."

 

    మాధవి గబగబ ఆలోచిస్తోంది. ఆమెలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేలుకుంటోంది. అతన్ని ఏడిపించాలి. ఈ కాలేజి హీరోని, అమ్మాయి కాల్చుకుతిన్న ఈ కఠినాత్ముడిని బాగా ఏడిపించాలి. ఈ అవకాశం వృధాగా పోనివ్వకూడదు.

 

    "ఆల్ రైట్. నో అనను. ఎస్ అంటాను- ఎప్పుడంటే నేను పెట్టబోయే మూడు పరీక్షల్లో నువ్వు నెగ్గినప్పుడు..."

 

    "మూడు కాదు. ముప్పయి పరీక్షలయినా అవలీలగా గెల్చిపారేస్తాను. ఏమిటవి?" అన్నాడు రాజా ఆత్రంగా.

 

    "ముప్పయి అక్కర్లేదు. మూడు చాలు. ఈ మూడిట్లో ఏ ఒక్కటిపోయినా నువ్వు నన్ను పోగొట్టుకున్నట్లే."

 

    "అలాగే" అన్నాడు రాజా ఛాలెంజిని స్వీకరిస్తున్నట్లు.

 Previous Page Next Page