Next Page 
ది బ్లడ్ పేజి 1


                               ది బ్లడ్

                                                  __చందు హర్షవర్ధన్


    "జాతి మతాలవి ఎన్నున్నా-దేవదేవుడసలొక్కడెగ !
    ఖండ ఖండాల భూమున్నా-అఖండ భావన ఒక్కటెగా !
    జాతులు నేతలు వేరైనా-మానవ నైజం ఒక్కటెగా !
    మగువ, మగవాడు ఎవరైనా-మానవతే మరి మిన్నగద !
    సంస్కృతి నాగరికత లెన్నో-సంస్కారంలో ఏకత్వం !
    శాంతి త్యాగాల సంకేతం-విశ్వ మానవుని సందేశం !"

            చందు 'వసంతగీతం' నుంచి

        ***********

    ఠంగ్.............
            ఠంగ్.............
        ఠంగ్.............
                ....................

    విజయోత్సవ భేరిలా గడియారపు పెండ్యులమ్ పన్నెండు గంటలు కొట్టింది.

    కాలచక్రపు హోరుకు అది జోరు.

    1947 ఆగష్టు 14 అర్దరాత్రి దాటి 15వ తేదీ తొలి సెకనులోకి గెంతింది గడియారపు ముల్లు. లోలకం సంగీతాన్ని లయిస్తున్నది.       

    స్వేచ్చ ! స్వేచ్చ !

    స్వాతంత్ర్యం ! స్వాతంత్ర్యం !

    దేశమాత దాశ్య శృంఖలాలు తెగిపోయిన వేళ...

    భూనభోంతరాళాలు నిర్ఘాతపాత జయన్నినాదాలు ధ్వనించినపుడు...

    ఢిల్లీ ఎఱ్ఱకోట మీది బ్రిటిష్ యూనియన్ జాక్ అవనతమై భారత జాతీయ త్రివర్ణ పతాక నింగికెగసి రెపరెప లాడింది.

    మన దేశానికి అర్దరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది.

    కాని... కాని...

    నేలతల్లి గుండెను దేశ విభజన అనే పిడిబాకు రెండుగా చీల్చివైచింది.

    నిన్న మొన్నటి భూమీపుత్రులే నేడు బద్ధవిరోధులైపోయారు.

    సౌహార్ద్రం, సౌజన్యం, సౌభ్రాతృత్వం సజల నయనాలయాయి.

    మానవత మరణించింది. మమతానురాగాలు మటుమాయమయాయి.

    మతతత్వ మహమ్మారి విజృంభించింది. విద్వేషం విషం చిమ్మింది.

    మారణహోమం నిత్యనైమిత్తికమై రావణకాష్ఠ మయింది.

    మతాల పేర ఎందరెందరో అమాయకులు కలహాగ్నికి సమిధలయ్యారు. వంశాలకు వంశాలే నామరూపాలు లేకుండా నాశనమైపోయాయి. కుటుంబ కదంబాల కుదుళ్ళు కూకటి వ్రేళ్ళతో పెళ్ళగిల్లాయి.

    క్షణం క్షణం ప్రాణభీతితో మానవ వలసలు నిత్యకృత్యమయాయి. ఆస్తిపాస్తులు బుగ్గిపాలయాయి. అంతస్తులు తారుమారయాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలుగా... 

    అది అంతటితో ఆగలేదు. జాతిపిత ప్రాణాలనుసయితం బలిగొంది.

    "ఈశ్వర అల్లా తేరే నామ్" మరి మూగవోయింది.

    చరిత్ర దానంతట అదే పునరావృతం అవుతుంది. అది చారిత్రక సత్యం. కాలమే చరిత్రకు సాక్షి.

    భారత-పాకిస్తాన్ దేశాల  సరిహద్దు ప్రాంతం. యుద్ధ వాతావరణం కమ్ముకున్న ప్రాంతం...జీవితమే బుద్బుదప్రాయ మయిన ప్రాంతం. బుగ్గి మిగిలిన చోటు.

    ఏ క్షణాన ఏమి జరుగుతుందో, ఏ భయానక ముప్పు ముంచుకు వస్తుందో ఊహకు కూడా అందని హింసాత్మక కాలాగ్ని...

    ఒకవైపున హిందూ మతోన్మాదులు, మరొకవైపున ఇస్లామ మత ఛాందసులు...

    అయిపోయింది... రెచ్చిపోయారు. జనం రెచ్చగొట్టుకుంటున్నారు. పరస్పర హననకాండ. దహనకాండ. కీచకపర్వం...

    మతం మత్తుమందు. మత్తు తలకెక్కిన మనిషి మరి మరీచుడే...

    ఆపై... ఇక... మానవతకు చరమగీతం. చరిత్రకు చరమాంకం...

    అలనాడు__బ్రిటీష్ వారి తుపాకులను, వాటి తూటాలను సయితం లెక్కచేయక స్వాతంత్ర్య పోరాటంలో వీరోచితంగా ఎదురు నిలిచిన ధీరోదాత్త దశలో__హిందువు, ముస్లిమ్, శిక్ఖు అనే తేడాలు లేనేలేవు. మనుషులలో తారతమ్యాలు అసలే లేవు.

    అందరూ ఏకోదరులుగా ఎందరో అయి ఏకత్రాటిన నడుం బిగించి పాలకులపై తిరగబడి బ్రిటీష్ వారిని పారదోలారు. చరితార్దులయారు. అదీ చరిత్ర !   

    నాడు భిన్నతలో ఏకత. నేడు ఏకతలో భిన్నత...

Next Page