మీలో మంచి గుణాలేటంటే మీరు ఎప్పుడు స్పృహలోనే వుంటారు. పార్టీలో బాగా డ్రింక్ చేసినా, అందరితో కలిసి నవ్వుతూ తుళ్లుతూవున్నా మీరు మాత్రం చుట్టూ వున్న విషయాలని గమనిస్తూ ఒక అనాలసిస్ నిరంతరం చేసుకుంటూ వుంటారు.
మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు. పట్టుదల గల వ్యక్తులు కూడా. మీమీద మీకు కంట్రోల్ ఎక్కువ. భయం తక్కువ.
సాధారణంగా మీరు ఆరోగ్యవంతులై వుంటారు.
ఏ విషయాన్నైనా నాన్చకుండా తొందరగా పూర్తిచేసే వ్యక్తులైవుంటారు.
మీతో వాదించటం చాలా కష్టం. మీరు నమ్మిన పాయింట్ ని చాలా స్పష్టంగా అవతలవాళ్లని కన్విన్స్ చేయటానికి ఉపయోగిస్తారు.
అయితే పూర్తిగా పొంగిపోకండి. మీలో కొన్ని అభిలషణీయం కాని లక్షణాలు కూడా వున్నాయి. మీరు కాస్త ఇరిటేటింగ్ పెర్సనాలిటీ మీ మనసులో వున్న భావాలని చెప్పవలసి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా అవతలవాళ్లు బాధపడతారు అనికూడా ఆలోచించకుండా చెబుతారు. మీరు ఒక విషయం పట్ల ఒక నిర్ణయానికొస్తే ఆరు నూరైనా దాన్ని మార్చుకోటానికి ఇష్టపడపు.
మీరు చాలా 'ఎగ్రిసివ్' నెమ్మది, అవతలి వాళ్లతో మంచి అనిపించుకోవడం లాంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు. మీరు బైటకి పటాటోపంగా కనబడినా మనసులో మాత్రం చిన్న చిన్న విషయాలకి కూడా భయపడుతూ వుంటారు. బైటకి కన్పించక పోయినా సరే అంతర్గతంగా మీరు చాలా సెన్సిటివ్. కాబట్టి చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని అర్దం చేసుకోలేరు.
కలాన్ని ఒత్తి వ్రాస్తే వాళ్లని మొట్టమొదటిసారి చూసినప్పుడు, అవతలి వాళ్లు తమ రహస్యాలని తెలుసుకోడానికి వారు కృతనిశ్చయులై వున్నారని భ్రమపడతారుగానీ, రెండోసారి చూసినప్పుడు వీరు గమనించక పోవటాన్ని గ్రహిస్తారు.
పై విశ్లేషణలో కలాన్ని తేలికగా వ్రాసేవాళ్లు గురించి చెపుతూ వాళ్లు చాలా జాగరూకతలో వుంటారని చెప్పటం జరిగింది కలాన్ని ఒత్తివ్రాసేవాళ్లు దానికి వ్యతిరేకం. బహుశా, 'ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను ఎదుర్కోగలనులే' అనే నిర్లక్ష్యం దీనికి కారణమై వుంటుంది.
మీరు పొరపాటున చనిపోయి యమలోకానికి వెళ్తే,యమ ధర్మరాజుకూడా మీయొక్క వాదనని అడ్డుకోలేక చెవులు మూసుకుంటాడు. మీరు నమ్మిన దాని గురించి అంత గొప్పగా మీరు వాదించగలరు. అలాగని చెప్పి ఎదుటివారి బలహీనతలు కనుక్కొని వార్ని ఇబ్బందిలో పడేసే రకం కాదు.
తాము నమ్మిన సిద్దాంతాన్ని అవతల వాళ్లు ఒప్పుకొనే విధంగా కన్వీనియంట్ గా వాదనలను సమకూర్చుకుంటారు.మీరుమీ విశ్లేషణా పటిమ,హేతుబద్దమైన ఆలోచనా శక్తి అవతలవారికి దిగ్బ్రమ కలిగిస్తూంటాయి. ఎంత మాట్లాడినా ఎంత ప్రశ్నించి విసిగించినా , చివరికి మీరిచ్చే విశ్లేషణ చూసి 'ఆహా'అని ఆశ్చర్యపోక తప్పదు అవతలివాళ్లు.
కేవలం కుతూహలంతో విశ్లేషించటం తప్ప మీకు అవతలవాళ్లపట్ల ఏవిధమైన అభిప్రాయం వుండదు. నమ్మిన సిద్దాంతం కరక్టా కాదా అనితెలుసు కోవటమే మీ నిరంతర జీవితాశయం. మీరు అవతల వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించరు అని ముందే చెప్పటం జరిగింది.
న్యాయమూర్తులున్నారనుకోండి. వారు కళ్లకెదురుగా వున్నసత్యాలను సాక్ష్యాలను ఆధారం చేసుకొని న్యాయ నిర్ణయం చేస్తారు. ఈ టైప్ వ్యక్తులు కూడా అంతే. తమకెంతవరకూ కావాలో అంతవరకే ఆలోచిస్తారు. మీరు మీ భార్యను ఇంటి బైటికి తోసిలోపల తలుపు వేసుకున్నారనుకోండి.ఈ కేసుకోర్టుకి వెళ్తే మీది తప్పని మందలించి జరిమానా వేస్తారు, ఈ రకం చేతి వ్రాతగల వ్యక్తులు మీభార్య మీకు అసలిష్టంలేని ఎర్రరంగు చీర కట్టుకోవడం వల్ల మీరు రెచ్చిపోయి అలా చేసారనే మీబలహీనత పట్లవాళ్లు జాలి చూపరు.(పై ఉదాహరణ కేవలం నవ్వుకోవటానికి వ్రాసినదిమాత్రమే)
ఇలాగ పెన్నుబాగా ఒత్తి వ్రాసేవాళ్లని చాలామంది వ్యక్తులు స్నేహ పాత్రులుగా చేసుకోవాలని భావిస్తారు. కానీ వీళ్ళు మాత్రం అవతలవాళ్లని ఏ మాత్రం గుర్తించరు. ఒక స్థాయికి చేరి తమ అంతస్తులో వున్న వాళ్లని మాత్రమే వీరు గుర్తిస్తారు.