Previous Page Next Page 
అదృష్టవంతుడు పేజి 9

                                 


                                          అదృష్టవంతుడు

                                                                             వసుంధర

 

                              
         
        
    టైము అయిదయ్యే సరికల్లా భాస్కర్ర్రావు లేచి కూర్చున్నాడు. రోజు అంతే! ఆ టైము కతడికి మేలకువొచ్చేస్తుంది.
   భాస్కర్రావు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు. అతడి కింద నలబై మంది గుమాస్తాలు పని చేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యం లోని వివిధ సంస్థల్లో -- ప్రజల కేమైనా అసౌకర్యం కలిగితే భాస్కరరావు ఆఫీసులో తెలియబర్చుకో వచ్చు. నలబై మంది గుమాస్తాలు తీసుకు వచ్చిన పిటిషన్ కాగితాలను పరిశీలించి నోట్సు తయారుచేసి ఫైలు చేసి భాస్కరరావు చూపిస్తాడు. భాస్కర్రావు వాటిని ఆయా మంత్రుల కార్యాలయాలకు పంపుతాడు. భాస్కర్రావు నుంచి తరచు ఫిర్యాదులు వినడం ఏ మంత్రికి యిష్టముండదు. ఆ ఫిర్యాదుల్లో మంత్రుల కిబ్బంది కలిగించే విశేషాలు కూడా ఎన్నో ఉంటాయి.
    అందుకే భాస్కర్రావు ఆఫీసులో నిద్ర అలవాటు చేసుకున్నాడు. రోజూ ఉదయం సాయంత్రం కలిపి కనీసం నాలుగు గంటలైనా నిద్రపోతాడు . ఈ కారణంగా ఇంట్లో నిద్ర పట్టదతనికి. నిద్ర పట్టక పొతే బాధ లేదతనికి. అతడి భార్య రాధకు విపరీతమైన నిద్ర. రాత్రి తోమ్మిదయ్యే సరికి ఆమెకు కళ్ళు మూతలు పడిపోతాయి. ఆ తర్వాత ఉదయం ఏడింటికి దాకా ఆమె కళ్ళు తెరవదు.  మనిషి కదలదు. పొరపాటున బాస్కరరావామెను కదిపాడో - మెలకువ వున్నప్పుడు కూడా ఆమెను తాకే అర్హత కోల్పోతాడు.
    రాధ అందమైనది. మనసు మంచిదే కాని మాట దురుసు. మనిషి దుడుకు. భాస్కర్రావు మొహమాటస్టుడు కావడం వల్ల ఆమె అతణ్ణి కొంగున ముడేసుకోగాలిగింది. ఇంట్లో అన్నింటికి ఆమె మాటే సాగాలి. అందుకామెకో అదనపు అర్హత కూడా ఉంది. రాధ కూడా సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగి, ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంధాలన్నీ వంతుల వారీగా చదివి ఆధునిక జీవితానికి పనికివచ్చే విశేషాలను వాటి నుండి సేకరించాలామె. హిందీ, ఇంగ్లీషు భాషలలో వ్యాసాలు వ్రాయగల శక్తి ఉన్న వారికే ఆ ఉద్యోగం. రాధ తెలిగే కాక అ రెండు భాషలల్లోనూ ప్రావీణ్యం సంపాదించు కున్నందు వల్లనే -- ఉద్యోగమామెకు వచ్చింది. ఉద్యోగాన్ని బట్టి ఆమె ఆఫీసులో తెగ చదవాలి. అందువల్ల ఇంటి కొచ్చే సరికి ఆమె బాగా అలసటగా ఫీలవుతుంది.
    ఆరోజు భాస్కర్రావాఫీసులో అతడి గదికి సున్నం వేసే కార్యక్రమముంది. అందువల్ల అతడు గుమస్తాలతో పాటు హాల్లోనే తనూ కూర్చోవాలి. అది భాస్కర్రావు కిష్టం లేదు. తను ఆఫీసరు నన్న అహం అతడికి లేదు. నిద్ర పోకుండా అతడుండలేడు. తన క్రింది ఉద్యోగుల మధ్య నిద్ర పోవడం అతడి కిష్టం లేదు. అందువల్ల ఆరోజు సెలవు పెట్టాలని అతడను కొన్నాడు. అందుకే నిన్న సాయంత్రం రాధకు చెప్పాడు. మరునాడు సెలవు పెడదామని . రాధ ససేమిరా అంది.
    "సెలవులిలా వృధా చేసుకోకూడదు. అవసరమైనప్పుడే ఉపయోగించు కోవాలి-" అంటూ భర్త కామె పెద్ద ఉపన్యాసం కూడా యిచ్చింది.
    భాస్కర్రావు నిరుత్సాహపది ఆరోజు తనూ పెందరా;ళే పడుకుని ఆలస్యంగా నిద్ర లేవాలను కున్నాడు. రాధ మాములుగా తొమ్మిదింటికే పడుకుంది. పడుకోగానే శవం లా మారిపోయింది. ఎంత ప్రయత్నించినా భాస్కర్రావు కో పట్టాన నిద్ర రాలేదు. మాములుగా పదకొండే అయింది పడుకునే సరికి. ఆలస్యంగా లేద్దామను కున్నాడు కానీ మళ్ళీ యిప్పుడు అయిదింటికి మెలకువొచ్చేసింది.
    రాద ఇంకా వళ్ళు తెలియకుండా నిద్రపోతోంది.
    భాస్కర్రావు కాలకృత్యాలు నెరవేర్చు కున్నాడు. స్నానం కూడా అయ్యేసరికి టైము ఆరయింది.
    పాలవాడు కాలింగ్ బెల్ కొట్టాడు. భాస్కర్రావు గిన్నె తీసుకుని వెళ్ళి పాలు పోయించుకున్నాడు. తలుపు వేసుకోబోతుండగా --"అంకుల్ " అన్న గొంతు వినబడింది.
    అప్పుడు చూసాడు భాస్కర్రావు , పాలవాడి వెనుక నుంచి గోపి ముందుకు వచ్చాడు. అప్రయత్నంగా భాస్కర్రావు ఎదురింటి వైపు చూశాడు.
    అక్కడ సీత వుంది. ఆమె భాస్కర్రావు వంక చూసి మనోహరంగా నవ్వింది. సీత చాలా అందంగా వుంటుంది కానీ యింకా చాలా అందంగా నవ్వుతుంది. ఆమె నవ్వుకు భాస్కర్రావు చిత్తే పోతాడు.
    సీత గోపి అక్క, బియ్యే ఫైనలియర్లో ఉంది. ఆమెకు పుస్తకాల పిచ్చి. రోజూ ఆఫీసు నుండి వచ్చేటప్పుడు రాధను పలకరిస్తుంది సీత. ఆ విషయం ఈ విషయం అడిగినట్లడిగి రాధ దగ్గర ఏం పుస్తకాలున్నాయో తెలుసుకుంటుంది. కానీ రాధనేమీ అడగదు. పుస్తకాలివ్వనని రాధ నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అందుకని మర్నాడుదయం గోపీని పంపి తను గుమ్మంలో నిలబడుతుంది. ఆ సమయానికి రాధ నిద్రలేవదన్న విషయం అందరికీ తెలిసిన రహస్యం రహస్య మెందుకంటే రాధ ముందేవ్వరూ ఆ నిజాన్ని తెలియనట్లే నటిస్తారు.
    రాధలో ఏదో హుందా తన ముంది. అంతా ఆమెకు భయపడతారు. అంతా ఆమెను గౌరవిస్తారు.
    "ఏమిట్రా " అన్నాడు భాస్కర్రావు గోపీ వంక తిరిగి.
    "మీ దగ్గర ఆశాదీపం నవలుందిటగా---- మా అక్కక్కావాలిట. చదివి సాయంత్రాని కల్లా యిచ్చేస్తానంది....' అన్నాడు గోపి.
    భాస్కర్రావు ఇంటింటా స్వంత గ్రంధాలయంలో మెంబరు. అది కాక చాలా పత్రికలు కొంటాడు. అటు పైన రాధ రోజూ ఆఫీసు నుండి వచ్చేటప్పుడు - స్నేహితుల నడిగి కానీ - పుస్తకాల షాపు నుంచి కానీ అద్దెకు గాని పుస్తకాలు తెస్తుంది.
     'చూస్తానుండు.....  అని భాస్కర్రావు లోపలకు వెళ్ళాడు.
    బీరువాలో పుస్తక ముంది. సీతకు పుస్తకాలిస్తే రాధ దెబ్బలాడు తుందని అతడికి తెలుసు. అతడికి మొహమాటం.
    నవల తీసి గోపీ కిచ్చి గుమ్మం దాకా వెళ్ళాడతడు.
    సీత అతడి వంక కృతజ్ఞత నిండిన చూపులతో చూసింది.
    ఆమె వెళ్ళి పోయాక భాస్కర్రావు తలుపులు వేసుకున్నాడు. టైము ఎడయ్యే వరకూ అతడు శ్రద్దగా పేపరు చదివాడు. పేపరు తో పాటు పత్రికలేవీ రాకపోవడం వల్ల అతడు పేపర్లో మైనర్ డిటెయిల్స్ కూడా వదలకుండా చదివాడు.
    ఏడింటికి అలారం మ్రోగింది రాధ లేచింది.
    అలారానికి బదులు భాస్కర్రావె రాధను లేపచ్చు. కానీ అందులో చాలా యిబ్బందులున్నాయి. సరిగ్గా ఏడింటికి లేపితే "ఇంకా మత్తుగా ఉందండీ - మరీ అంత ఎడంటే ఏడుకే లేపాలా?" అంటుంది రాధ. ఆలస్యంగా లేపితే "ఇంత ఆలస్యంగా లేపారు ---ఇద్దరం ఆఫీసు కెళ్ళాలి గదా - ఇంటి పనులెలాగౌతాయి?" అని చిరాకు పడుతుంది. పెందరాళే నిద్ర లేపే ప్రసక్తి లేదు.
    "మీకు నిద్రరాదు. నేను నిద్ర పొతే చూడలేరు.' అని తరచుగా భార్య అనే మాటలు భరించలేక - "నేను నిన్ను నిద్ర లేపను, నీకెప్పుడు లేవాలనుంటే అప్పుడు అలారం పెట్టుకునిలే" అనేశాడు భాస్కర్రావు.
    ఇప్పుడు భాస్కర్రావు తినే తిట్లన్నీ - అలారం టైం పీసు పడుతోంది.
    రాధ లేచి కాలకృత్యాలు తీర్చుకుని వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ కలిపి తెచ్చింది. భార్యాభర్తలిద్దరూ కాఫీలు తాగారు. తర్వాత భాస్కర్రావు సాయం చేస్తుండగా ఆమె వంట చేసింది.
    భోజనాలు చేయబోయే ముందు - ఇద్దరూ నువ్వు శ్రమ పడ్డావంటే నువ్వు శ్రమ పడ్డావని పరస్పరం అభినందించుకున్నారు. భోజానలై పోయాయి.
    "వంట చాలా బాగుంది -" అన్నాడు భాస్కరరావు.
    "మీరు సాయం చేయకపోతే - ఇంత బాగుండదు " అంది రాధ.
    తర్వాత ఇద్దరూ ఆఫీసుకు రెడీ కాబోయారు. భాస్కర్రావు తన బ్రేఫ్ కేస్ సర్దు కుంటుండగా - "ఏమండీ ?"అనే పొలికేక విని కంగారుగా పరుగున వెళ్ళాడు. రాధకు కరెంటు షాకేమైనా కొట్టిందేమోనని అతడు భయపడ్డాడు.
    రాధ పుస్తకాల బీరువా ముందుంది.
    "ఇందులో ఆశాదీపం నవల కనపడ్డం లేదు-" అందామె.
    భాస్కర్ర్రావు గుండెల్లో రాయి పడింది- "ఏం?" అన్నాడు.
    "అది నా స్నేహితురాలిది. ఈ రోజు రిటర్న్ చేస్తానని మాటిచ్చాను...."
    "ఫరవాలేదు - సారీ చెప్పు?"
    'ఆమె పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుందండీ " అంది రాధ.
    "దాందేముంది !ఆ అద్దె మనమే యిచ్చుకుందాం...."
    'అది కాదండీ . ఆ పుస్తకం పోయిందేమో నని అనుమానంగా వుంది...."
    "పొతే - కొనిద్దాంలే ...."
    "మీరు  కానీ ఎవరికైనా యిచ్చారా?" అంది రాధ విషయానికి వస్తూ.
    "నేనవరికిస్తాను ?"
    "ఇంకెవ్వరు -- ఆ సీతకి?"
    రాధ ఆమాట అన్న తీరుబట్టి - నిజం చెప్పడం లోని ప్రమాదం భాస్కరరావు కి అర్ధమై పోయింది. "నేనెందుకు కిస్తాను ?"
    భర్త తన కబద్దం చెప్పడని రాధ నమ్మకం. "కాస్త వెతికి పెట్టండీ - అవతల ఆఫీసు టైమైపోతోంది...." అంది.
    వెతకడం వల్ల ప్రయోజనముండదని తెలిసిన వాడు కాబట్టి - "ఎందుకు, ఇప్పుడు వెతకడం ? నీ స్నేహితురాలి కేదో సమాధానం చెప్పెద్దూ" అన్నాడు భాస్కర్రావు.
    "పోనీ - ఇంట్లోంచి ఇంకేదైనా పుస్తకం పత్రిక తీద్దామంటే అన్నీ చదివేసినవే ?" అంది రాధ.
    "ఈ వేళ పేపరు వాడు  కూడా పత్రిక లేమీ ఇవ్వలేదు....' అంటూ అందించాడు భాస్కర్రావు.
    'అసలిక్కడ పెట్టిన పుస్తకం ఎలా మాయమయిందంటారు ?" అంది రాధ అనుమానంగా.
    భాస్కర్రావో క్షణం అలోచించి - "పొద్దున్న బాగా తీరుబడి అనిపించి - బీరువా సర్దానులే ?" అన్నాడు.
    "మీకెప్పుడు ఇలాంటి అయిడియాలే వస్తాయి నా ప్రాణాలు  తీయడానికి....." అంది రాధ విసుగ్గా.
    "సారీ రాధ!"
    "మీరు సారీ చెబితే మాత్రం నేనిప్పుడాఫీసు కేలా వెళ్ళేది?" అంది రాధ దిగులుగా.
    "ప్రతి చిన్న విషయానికి అలా దిగులు పడకూడదు రాదా! అందరూ మనిద్దర్నీ అదృష్టవంతులని చెప్పుకుంటారు...."
    రాధ ఒక్క క్షణం అలోచించి, 'అన్నట్లు మీరీ రోజు సెలవు పెడతానన్నారు కదూ. నన్నూ సెలవు పెట్టమన్నారు కదా.....ఒకే ....మీ కోసం సెలవు పెట్టేస్తాను.... అంది.
    "కానీ - సెలవు అవసరమున్నప్పుడే పెట్టుకోవడం మంచిదని నువ్వే అన్నావు గదా?" అన్నాడు భాస్కర్రావు.
    "అన్నాను కానీ చేతిలో నవల్లెకుండా ఆఫీసు కెళ్ళి ఏం చేయను ?" అంది రాధ.
    'అంటే?" అన్నాడు భాస్కర్రావు.
    "అబ్బే - ఏం లేదు - మీకర్ధం కాదులెండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సెలవు దొరికే మనం నిజంగా అదృష్టవాంతులం కదా?" అంది రాధ మాటమరుస్తూ.
    బాస్కరరావు తన నిద్ర గురించి భార్యకు చెప్పుకోలేనట్లే - ఆఫీసులో నవల చదవడం మినహాయించి తను వేరే పని చేయదని ఆమె కూడా భర్తకు చెప్పుకోలేదు.
    తాము నియమించిన ఉద్యోగుల నుంచి  తాము కోరే పని ఏదో తెలియని ప్రభుత్వ కార్యాలయాలు దేశంలో ఎన్నో వున్నాయి. అటు వంటి దేశంలోని ప్రజల అదృష్టం గురించి వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆప్రజల్లో కొందరైన ఆ కార్యాలయోద్యోగులు మాత్రం తప్పక అదృష్టవంతులు.

                                           *** 

 Previous Page Next Page