దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి
దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి
దీపావళి పండుగ అంటే దీపోత్సవం. ఈ రోజున ప్రతి ఇల్లు, వీధి, దేవాలయం దీపాలతో కళకళలాడుతూ ఉంటుంది. నిజానికి ఇది ఐదు రోజుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటినుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది.
- ఆశ్వయుజ బహుళ త్రయోదశి - ధన త్రయోదశి (మనం చెప్పుకున్నాం)
- ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి (ఇదీ చెప్పుకున్నాం)
- ఆశ్వయుజ అమావాస్య - దీపావళి
- కార్తీక శుద్ధ పాడ్యమి - గోవర్థన పూజ
- కార్తీక శుద్ధ విదియ - భగినీ హస్తభోజనం
ఈ ఐదు పండుగలు కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు. ఉత్తర భారతదేశంలో ఈ ఐదు పండుగలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, భగినీ హస్తభోజనం పండుగలను జరుపుకుంటారు.
- అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఈ పండుగను ‘జగద్ధాత్రి పూజ’గా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున ‘కలిపూజ’ను ఎంతో వైభవంగా జరుపుతారు.
- ఒరిస్సా రాష్ట్రంలో ఈ పండుగను ‘కుమార పూర్ణిమ’గా కృష్ణ త్రయోదశి నాడు ప్రారంభించి దీపావళి వరకూ దీపోత్సవాలతో, ఆటపాటలతో జరుపుకుంటారు.
- తమిళనాడులో దీపావళిని ఉదయయమే జరుపుకుంటారు.
- కర్నాటక రాష్ట్రంలో మొదటి మూడు రోజులు దీపావళి పండుగను జరుపుకుంటారు.
- రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పండుగను ‘ధన్ తెరాన్’గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున స్త్రీలు తమ నగలను నదిలో కడుగుతారు. స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. అన్ని రకాల వంటలూ పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.
- గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో రకరకాల పిండివంటలతో ‘లక్ష్మీపూజ’గా జరుపుకుంటారు. ఈ రోజునే కొత్త పద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు.
ఆశ్వయుజమాసం అంటేనే విజయమాసం. ఈ మాసారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. అధర్మంమీద .. ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసం ఇది. ఈ మాసంలోని తొలి పది రోజులూ జగజ్జనని వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయశంఖారావం చేస్తే...మాసాంతంలో చతుర్దశినాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారంచేసి విజయదుందుభి మ్రోగిస్తాడు. లోకకంటకులైన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలూ ఆనంద దీపాలు వెలిగించిన రోజు ఇది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. ఎందుకంటే..
- రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతాసమేతుడై.. ఈ ‘దీపావళి’ నాడే అయోధ్యకు తిరిగి వచ్చాడు.ఈ సందర్భంగా అయోధ్యానగర ప్రజలందరూ దీపాల వరుసలతో శ్రీరామునకు స్వాగతం పలికి.., సంతోషంతో బాణాసంచా కాల్చారు.
- పంచపాండవులు అఙ్ఞాతవాసం ముగించి హస్తినకు వచ్చినదీ ఈ ‘దీపావళి’ రోజునే.
- వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినదీ ఈ ‘దీపావళి’ రోజునే. బలిచక్రవర్తి ఏడాదికి ఒక్కసారి., అంటే ఈ ‘దీపావళి’ రోజున భూమిమీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటాడని కేరళరాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళీయులు ఈ ‘దీపావళి’ పండుగను ‘బలి అమావాస్య’గా జరుపుకుంటారు.
- షట్చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే పట్టాభిషిక్తుడయ్యాడు.
- తొలి తెలుగురాజైన శాలివాహనుడు.., ఈ దీపావళి రోజునే విక్రమార్కుని ఓడించిఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే ‘దీపావళి’ అంటేనే ఇంత ఆకర్షణ., ఆనందము., ఇంత సంతోషమూను. ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలేగానీ., ఇల్లు, ఒళ్లు కాల్చుకుని ఏడుస్తూ జరుపుకోకూడదు. కనుక బాణాసంచా కాల్చే విషయంలో పెద్దలు పిల్లల విషయంలో శ్రధ్ధ వహిస్తారనీ., ఈ పండుగను ఆనందమయంగా మలచుకుంటారనీ ఆశిస్తూ అందరికీ ‘దీపావళి శుభాకాంక్షలు’ తెలియజేస్తోంది ‘తెలుగు వన్’.
-యం.వి.యస్.సుబ్రహ్మణ్యం
లక్ష్మీదేవి స్తోత్రాలు (ఆడియో)
దీప ప్రజ్వలనం - విశేషాలు...
ధన త్రయోదశి - శ్రీ మహాలక్ష్మి జన్మదినం ....
నరకచతుర్దశి భామావిజయం ....
దీపం ఉన్న ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది
లక్ష్మి పూజ - విధానం