Home » Punya Kshetralu » అగ్ని లింగేశ్వరుడు అరుణాచలుడు


 

అగ్ని లింగేశ్వరుడు అరుణాచలుడు

 


                                                                                                           
తమిళనాడులోని తిరువణ్ణామలై రకరకాలుగా ప్రసిధ్ధి చెందింది.  ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్షపెట్టినది ఇక్కడేనంటారు.  సృష్టిలోని పంచ భూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల ఆగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశాడు.  అందులో ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్ని లింగమని అందుకే ఆలయంలో వేడిగా వుంటుందని అంటారు.

 

గిరి, ఆలయ ఆవిర్భావం, పురాణ గాధలు

ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్ని స్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారిరువురికీ చెప్పిన కధ మీకు తెలుసుగదా.  అది ఇక్కడే జరిగిందంటారు.  తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది.  అదే అణ్ణామలై.  శివుడికి వున్న అనేక నామాల్లో అణ్ణాల్ అనే పేరుకూడా ఒకటి.  అణ్ణాల్ అంటే అగ్ని, ప్రకాశం వగైరా అర్ధాలున్నాయి.  మలై అంటే పర్వతం.  ఈ రెండూకలిసి అణ్ణాల్ మలై, కాలక్రమైణా అణ్ణామలై అయింది.  తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవసూచకం.  సాక్షాత్తూ శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవచిహ్నం తిరు ముందు చేరి తిరువణ్ణామలైగా ప్రసిధ్ధిపొందింది.

 

 

శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరివల్లాకాదని, పర్వత పాదంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మిచవలసినదిగా బ్రహ్మ, విష్ణులు దేవ శిల్పి మయుణ్ణి కోరారు.  మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్య తీర్ధాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి.  ఇది అప్పటి సంగతి.  తర్వాత ఇన్ని యుగాలలో  ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం వున్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది.

 

తెలుగువారు అరుణాచలంగా పిలిచే ఈ తిరువణ్ణామలై పేరు తలిస్తేనే ముక్తిని చేకూరుస్తుందంటారు.  ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రధ్ధతో స్వామిని పూజిస్తే పూజించినవారు మాత్రమేకాక వారి తర్వాత ఇరవై ఒక్క తరాలవారుకూడా ముక్తిని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది. ఈ స్ధలాన్ని వశిష్టుడు, వ్యాసుడు, అగస్త్యుడు మొదలగు మహర్షులేకాక మరెందరో ప్రసిధ్ధులు, యోగులు, స్వామిని దర్శించి పూజించారు.  అనేక కవిపుంగవులు స్వామి మహిమలగురించి స్తుతిగానాలు చేశారు.

 

 

అర్ధనారీశ్వర రూపం ఈ క్షేత్రంలోనే ఉద్భవించిందని భక్తుల విశ్వాసం.  అరుణాచలం అర్ధనారీశ్వరరూపమంటారు.  ఆ కధ సంక్షిప్తంగా .. ఒకసారి పార్వతీదేవి సరదాగా ఒక్కక్షణం శివుని కన్నులు మూసిందట.  అంతే ప్రపంచమంతా గాఢాంధకారం నిండిపోయి అల్లకల్లోలమయింది.  పరమ శివుడు తన మూడో నేత్రం తెరిచి ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడు.  తను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా పార్వతీదేవి కంచికి వెళ్ళి పరమశివునిగురించి తపస్సుచేసింది.  ప్రసన్నుడైన పరమశివుడు పార్వతీదేవిని తిరువణ్ణామలై వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యమని చెప్పాడు.  అరుణాచలం చేరుకున్న పార్వతీదేవి గౌతమ మహర్షి సూచనల ప్రకారం గిరి ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి ఆరాధించింది.  ప్రసన్నుడైన శివుడు పార్వతీదేవికి తన శరీరంలో సగం స్ధానమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు.

 

 

ఆలయ విశేషాలు

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి.  దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా,  అనేక ఆలయాల నిర్మాణానికి కారకులయిన చోళ రాజుల శ్రధ్ధా భక్తులే కావచ్చు. తిరువణ్ణామలైలోని అణ్ణామలయ్యార్ (శివుడు) ఆలయం 24 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది.  నాలుగు వైపులా నాలుగు ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు, శిల్ప, నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనది.  ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి.  ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి.

 

ఈ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజ గోపురమంటారు.  ఇదే ప్రధాన ద్వారము.   నేలమట్టంమీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి, దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి.  ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని నిర్మించారు.  బయటి ప్రాకారానికి వున్న మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు.  ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి.  70 అడుగుల ఎత్తులో వున్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు వున్నాయి.

 

 

ఆలయానికి సంబంధించిన మొదటి, రెండవ ప్రాకారాలు అతి పురాతనమైనవి.  మూడవ ప్రాకారం కులోత్తుంగ చోళరాజు నిర్మింపచేసినట్లు కిలిగోపురంలో శిలా శాసనం ద్వారా తెలుస్తుంది.  4, 5, 6 ప్రాకారాలు, వేయి స్తంభాల మండపం, పెద్ద నంది, శివ గంగ తటాకం 16వ శతాబ్దానికి చెందినవి.  ఈ వివరాలను తెలిపే అనేక శాసనాలు ఆలయంలో వున్నాయి.  ఆలయం వెలుపల ప్రాకారం గ్రానైట్ రాతితో 30అడుగుల ఎత్తుగా ఎంతో వెడల్పుగా దృఢంగా నిర్మింపబడింది.

 

కృత యుగంలో ఆవిర్భవించిన ఈ ఆలయ మొదటి రూపకర్త దేవ శిల్పి మయుడు.  తర్వాత కాలంలో అనేకమంది అనేకసార్లు ఆలయ అభివృధ్దిలో పాలుపంచుకున్నారు.  వారిలో చోళ, పాండ్య, పల్లవ, హొయసల, విజయనగరరాజులు, స్ధానిక ప్రభువులేకాక భక్తులు కూడా స్వామి ఆలయాన్ని అనేక విధాల అభివృధ్ధి చేయటానికి తోడ్పడటమేకాక స్వామికి అనేక ఆభరణాలు, స్వామి సేవకు అనేక కానుకలు ఇచ్చినట్లు ఆలయంలో వున్న అనేక శిలాశాసనాలవల్ల తెలుస్తోంది. రాజగోపురం సమీపంలో కంబత్ ఇల్లయనార్ సన్నిధి (సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం) చాలా ప్రసిధ్ధమైనది.  భక్తి భావ భరితమైన ‘తిరుప్పుగళ’ అనే కావ్యాన్ని రచించిన అరుణగిరినాధుని శ్రధ్ధాసక్తులకు పరవశుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు అరుణగిరినాధునికి ఇక్కడ దర్శనమిచ్చాడు.  ఈ సందర్భంగా స్వామి చూపిన కరుణకి తార్కాణంగా ఈ విషయం చెబుతారు…. ఎంతకాలమైనా స్వామి అనుగ్రహం  కలుగకపోవటంతో నిరాశకు గురైన అరుణగిరినాధుడు వల్లాల మహారాజు గోపురం పైనుంచి క్రింద పడిపోతున్న తరుణంలో సుబ్రహ్మణ్యస్వామి అతడిని తన చేతుల్లోకి తీసుకుని రక్షించి అతని ప్రాణాలు కాపాడటమేకాక అతనికి వల్లీ దేవసేనలతో సహా దర్శనమిచ్చాడు.

 

 

కవి అరుణగిరినాధుని గురించి ఇంకొక కధకూడా వుంది.  దేవరాయ ప్రభువు స్వర్గంలో వున్న పారిజాత పుష్పాన్ని పొందాలని కాంక్షిస్తాడు.  ఆయనకి సహాయపడటానికి అరుణగిరినాధుడు తన భౌతిక కాయాన్ని విడిచి ఒక చిలుక రూపం ధరించి ఆ పుష్పంకోసం వెళ్తాడు.  ఈ విషయం తెలుసుకున్న అతడి శత్రువు సంబంధన్ అరుణగిరినాధుడు మరణించాడని అక్కడివారిని నమ్మించి, అతని శరీరాన్ని దహనం చేయిస్తాడు.  కొంతకాలం తర్వాత అక్కడికి తిరిగివచ్చిన అరుణగిరినాధుడు జరిగిన సంగతి తెలుసుకుని చిలుక రూపంలోనే ఒక గోపురంలో నివాసమేర్పరుచుకుని మనోహరమైన రీతిలో ‘కందర్ అనుభూతి’  అనే గీత మాలికను గానం చేస్తాడు.  అతడు చిలుక రూపంలో నివసించిన గోపురం తర్వాత కిలి గోపురంగా పేరుగాంచింది.  ఆ గోపురంలో ఒక అందమైన చిలుక శిల్పాకృతి ఆ కధకు సాక్ష్యంగా నేటికీ సందర్శించవచ్చు. ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కనిపిస్తుంది.  ఇక్కడ స్వామి అరుణగిరినాధార్ భక్తికి మెచ్చి, ఆయన విన్నపంతో, స్తంభంమీద రాజుకు దర్శనమిస్తాడు.  అందుకే దీనిని కంబతు అయ్యనార్ సన్నిధి అంటారు.  ఈ స్వామే అరుణగిరినాధార్ని రక్షించిందికూడా.

 

ఈ ఆలయంనుంచి కొంచెం లోపలకి వెళ్తే సంబంద వినాయగర్ ఆలయం కనిపిస్తుంది.  ఇక్కడ వినాయకుడు ఎఱుపు రంగుతో పెద్ద ఆకారంతో, సుఖాశీనుడై దర్శనమిస్తాడు. ఒక పురాణ కధ ఆదారంగా పూర్వం వినాయకుడు ఒక రాక్షసుణ్ణి చంపి అతని రక్తాన్ని తన శరీరానికి రాసుకోవటంద్వారా తన దుష్ట శిక్షణా శక్తిని ప్రదర్శించాడనీ, అందుకే ఇక్కడ స్వామిని అరుణ వర్ణంలో  అలంకరిస్తారని చెబుతారు.  క్రీ.శ. 1340 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వీర వల్లభదేవ రాజుకు సంబంధించిన శిలా శాసనం ప్రకారం అణ్ణామలయ్యార్ భక్తుడయిన సంబంధార్ ఈ వినాయక మందిరాన్ని నిర్మింపజేశాడుగనుక దీనికి సంబంద వినాయగర్ మందిరం అనే పేరు వచ్చిందని తెలుస్తోంది.

 

ఆవరణలో కుడివైపువున్న పాతాళ లింగం ఎంతో ప్రసిధ్ధిగాంచింది.  ఈ లింగం వున్న గుహలో రమణ మహర్షి తిరువణ్ణామలైవచ్చిన కొత్తల్లో అనేక సంవత్సరాలు చీమలు, పురుగులు కుట్టి శరీరంనుంచి రక్తం ధారలుగా కారుతున్నా చలించకుండా ధ్యానంలో వుండిపోయారుట.  ప్రస్తుతం మనం దర్శించటానికి ఆ గుహని శుభ్రంగా పెట్టారుగనుక మీరు నిర్భయంగా దర్శనం చేసుకోవచ్చు.  అక్కడే రమణుని చిత్రపటాలుకూడా దర్శనీయం.

 

ఆలయ సమీపంలోని రమణ మహర్షి ఆశ్రమం చూడవలసిన ప్రదేశాలలో ఒకటి.  అతి ప్రశాంత వాతావరణంలోవున్న ఈ ఆశ్రమంలోని విశేషాలన్నీ దర్శించిన తర్వాత వెనుక వున్న కొండపైకి ఎక్కితే అక్కడ రమణ మహర్షి కొంతకాలం తపస్సు చేసుకున్న ప్రదేశంలో కొంతసేపు ప్రశాంతంగా గడపవచ్చు.  అంతేకాదు.  అక్కడనుంచి తిరువణ్ణామలై ఆలయ సుందర దృశ్యాన్ని చూడవచ్చు.

 

ఇక్కడి అమ్మవారు ఉన్నాములై అమ్మన్ లేక అబితకుచాంబిక స్వామి ఆలయం పక్కనే ప్రత్యేక ఆలయంలో వుంటారు.  మూడు అడుగుల ఎత్తయిన అమ్మ విగ్రహం చిరునవ్వులు చిలికిస్తూ భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లుంటుంది.  గర్భగుడి వెలుపల వున్న మండపం సుందరమైన స్తంభాలతో అష్ట లక్ష్ముల ప్రతిమలు నెలకొని వున్నందున దీనిని అష్టలక్ష్మి మండపం అనికూడా అంటారు.  ఇక్కడ ఆలయం నమూనా ఒక గాజు పెట్టెలో భద్రపరచబడి వుంటుంది.

 

కార్తీక దీపం

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు.  అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది . ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15) 10 రోజులపాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.  కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది.  పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.  అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. (తమిళ టి.వి. ఛానల్స్ లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.) 

 

ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్రలో వేయి కిలోల స్వఛ్ఛమైన నేతిని పోసి, 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన వత్తి వేసి వెలిగిస్తారు.  ఈ జ్యోతి ఏడు అడుగుల ఎత్తు ఎగసి, ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కి.మీ.ల వరకూ కనబడుతుంది.

 

గిరి ప్రదక్షిణ

ఇక్కడ గిరి ప్రదక్షిణ  విశేషం.  అరుణాచలం అర్ధనారీశ్వర రూపమని దానికి ప్రదక్షిణ చేస్తే శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్లేనని భక్తుల విశ్వాసం.  14 కి.మీ.ల దూరం వుండే ఈ ప్రదక్షిణ మార్గమంతా విశాలమైన తారు రోడ్డు, ఇరు ప్రక్కలా ఎత్తయిన వృక్షాలతో సుందరంగా వుంటుంది.  దోవలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది శివాలయాలు, దుర్గాదేవి, ఆంజనేయస్వామి, ఆది అణ్ణామలై వగైరా అనేక ఆలయాలేగాక, సుప్రసిధ్ధ రమణ మహర్షి, శేషాద్రి మహర్షివంటివార్ల ఆశ్రమాలుకూడా దర్శనీయాలు.  ఆది అణ్ణామలైలో శివలింగ ప్రతిష్ట బ్రహ్మదేవుడు చేశాడంటారు.  ఇక్కడ అమ్మవారు అణ్ణములై అమ్మాళ్.  ఇది కూడా పెద్ద ఆలయం.

 

ఏ నెలైనా పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ.  రాత్రిగల పౌర్ణమిరోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరిప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశంలేదు.  అంత విశాలమైన మార్గంలోకూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తికాదు. భక్తులు ఎంత భక్తి శ్రధ్ధలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తారంటే పాదరక్షలు వేసుకోరు.  రోడ్డుకి ఎడమవైపే నడుస్తారు.  ఇప్పటికీ అనేకమంది సిధ్ధపురుషులూ, యోగి పుంగవులూ అదృశ్యరూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారని రోడ్డుకి కుడివైపు వెళ్తే వారికడ్డవుతామని వారి నమ్మకం. ఎన్నో అద్భుతమైన విశేషాలుగల ఈ ఆలయాన్ని దర్శించినవారందరూ తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు. మార్గము  ఇంత అద్భుతమైన ఈ ఆలయం విల్లుపురం – కాట్పాడి రైలు మార్గంలో, చెన్నైకి సుమారు 230 కి.మీ. ల దూరంలో వుంది.

 

రవాణా సౌకర్యం 

కాట్పాడి, చెన్నై మొదలగు తమిళనాడులోని అనేక ప్రదేశాలనుంచేగాక చిత్తూరు, తిరుపతి నుంచికూడా బస్సులున్నాయి.
గుర్తుంచుకోండి ఆలయం దగ్గర పూలు అమ్ముతారు.  శివ పార్వతులకుగాక మిగతా దేవుళ్ళ గుళ్ళల్లో ఇస్తే, మీరెంత చిన్న మాల ఇచ్చినా వాళ్ళు దేవుడికి అలంకరిస్తారు. ప్రతి ఆలయం ముందు  కొంచెం ఎత్తుగా లోహ మూకుడు వుంటుంది.  అక్కడివారు దానిలో కర్పూరం వేసి వెలిగిస్తారు.  మీరు తీసుకెళ్ళటం మర్చిపోయినా అక్కడ అమ్ముతారు.  కొని వినియోగించవచ్చు. అమ్మవారి ఆలయంలో దీపారాధన చెయ్యవచ్చు.  కావలసిన సరంజామా అక్కడే అమ్ముతారు.  మీరు తీసుకెళ్ళినా ఉపయోగించవచ్చు.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.