హాజో అసోం
హాజో, అసోం
హాజో అసోం రాష్ట్రంలోని కామరూప జిల్లాలో వున్నది. గౌహతినుంచి 38 కి.మీ. లు దూరంలో వున్న ఈ ప్రాంతానికి ఆటోలు, బస్సులు, టాక్సీలు లభిస్తాయి. మేము వెళ్ళేటప్పటికి స్కూల్ టైమయింది. స్కూల్ పిల్లల యూనిఫాం లో ఎక్కువ తెలుపు రంగు కనబడింది. అమ్మాయిలకి లంగా, ఓణీ, ఓణీ తెలుపు, బార్డర్ ఆకుపచ్చ, వైలెట్, మెరూన్, ఇలా వేరు వేరు రంగులు వున్నాయి. బహుశా వేరు వేరు స్కూళ్ళవాళ్ళనుకుంటా. ఒక స్కూలు ఆడపిల్లలయితే చీరెలు కట్టుకున్నారు. ఇప్పటినుంచీ వీళ్ళకి చీరెలా అనిపించింది. పురాతన కాలంనుంచి హాజో ప్రముఖ తీర్ధస్ధలం. ఈ క్షేత్రం హిందూ, ముస్లిం, బౌధ్ధమతాలకు పవిత్ర స్ధలంగా ప్రసిధ్ధికెక్కింది. పౌరాణికంగానేకాక చారిత్రకంగా కూడా ప్రసిధ్ధికెక్కిన ఈ స్ధలంలో పూర్వం అనేక మహిమాన్విత ఆలయాలు, పుణ్య తీర్ధాలు వుండేవని తెలుస్తోంది.
ఇక్కడ పంచ తీర్ధాలుగా ప్రసిధ్ధిచెందిన ఆలయాలను అపునర్భవ అనే తటాకంలో స్నానం చేసి, ఒక క్రమ పధ్ధితి లో అంటే మొదట గణేశ్, కేదార్, కమలేశ్వర్, కామేశ్వర్, హయగ్రీవ మాధవ మందిరాలను దర్శిస్తే తిరిగి ఎటువంటి జన్మ వుండదని నమ్మకం. ప్రస్తుతం అపునర్భవలాంటి ప్రఖ్యాత తీర్ధాలు చాలామటుకు చెప్పుకునేందుకే మిగిలినా కొన్ని నేటికీ కనువిందు చేస్తున్నాయి. హాజోలో వున్న హయగ్రీవ మాధవ మందిరం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హయగ్రీవ మాధవ మందిరం మా కారు ఒక స్వఛ్ఛమైన తటాకం ముందు ఆగింది. దీని పేరు మాధబ్ పుఖురి. ఇందులో తాబేళ్ళు, చేపలు చాలా పెద్దగా వుంటాయిట. ఇదివరకు చెరువులో చేపలకు మరమరాలు వేస్తే అవి వాటిని తింటుంటే చూడటానికి సరదాగా వుండేది.
మరమరాలు తినీ తినీ వాటికీ మొహం మొత్తిందేమో బిస్కెట్స్ కి అలవాటు పడుతున్నాయి. మేము బిస్కెట్స్ వేసినా ఏ ఒక్కటీ బయటికి రాలేదు. మా చేతిలో బిస్కెట్ పేకెట్ చూసి ఒక మేక మాత్రం ఆ పేకెట్ ఖాళీ అయ్యేదాకా మమ్మల్ని వదలలేదు. తటాకానికి ఎదురుగా కొండపైకి వెళ్ళే మెట్లు. ఆ కొండపేరు మణికూట పర్వతం. ఆలయం చేరుకోవాలంటే దాదాపు వంద మెట్లు ఎక్కాలి. మెట్లు చిన్నగానే వుంటాయి. పేరునిబట్టి ఇది విష్ణ్వాలయంగా మనమనుకున్నా పూర్వం ఇది బౌధ్ధాలయమని, గౌతమ బుధ్ధుడు ఇక్కడే నిర్యాణం చెందాడనీ బౌధ్ధుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి హిందువులేకాక బౌధ్ధులు కూడా అధిక సంఖ్యలో వస్తారు.
ఆలయ నిర్మాణం:-
మెట్లు ఎక్కుతున్నప్పుడు అలసి పోకుండా వుండటానికి చుట్టూ వున్న సుందర దృశ్యాలు చూడండి. మెట్లు చూశారా రాతితో ఏర్పాటు చేసినవి. ముందు నిర్మింపబడ్డ ఆలయం శిధిలంకాగా, ఈ ఆలయం క్రీ.శ. 1583 లో రాజా రఘుదేవనారాయన్ చే నిర్మించబడింది. కొందరు చరిత్రకారులు పాల వంశ రాజులు 6వ శతాబ్దంలో దీన్ని నిర్మించారంటారు. ఇది రాతి కట్టడం. మెట్లెక్కాక వున్న ముఖద్వారాన్ని దాటి లోపలకి వెళ్తే గుండ్రని ఆకారంలో ఆలయం కనిపిస్తుంది. ముందున్న హాలు దాటి లోపలకి వెళ్తే అంతరాలయం, దాని తర్వాత గర్భ గుడి. గర్భ గుడిలో అఖండ దీపాల వెలుతురు తప్ప వేరే వెలుతురు అంత వుండదు. గర్భాలయం మధ్యలో వున్న వేదిక మధ్యలో మాధవుడు, పక్కనే హయగ్రీవ సాలిగ్రామం, ఎడమవైపు ద్వితీయ మాధవ్ (పూరీ జగన్నాధ్ అంశ), తర్వాత విష్ణువు వాహనమైన గరుక్మంతుడు, కుడివైపు గోవింద మాధవ్, వాసుదేవుడు. గర్భ గుడిలో ఐదు అఖండ దీపాలు పెద్దవీ, చిన్నవీ వున్నాయి. ఆ దీపాలు 6000 సంవత్సరాలపైనుంచీ నిరంతరం వెలుగుతున్నాయిట.
ఇక్కడ మాధవుణ్ణి అర్చించటానికి రకరకాల పుష్ప, తులసీ, ధాన్య మాలలు వాడతారు. జాల్ మాల అందులో ప్రత్యేకమైనది. దీనిని తయారు చేయటానికి నిర్దేశించబడినవారు, ఉద్దేశించబడిన నియమాలు పాటించి, అరటి చెట్టునుంచి తీసిన నారతో తులసి దళాలను కలిపి ప్రత్యేక పధ్ధతిలో తయారు చేస్తారు. ఈ మాలను ఉదయం, సాయం సమయాలలో స్వామికి స్నానం చేయించేటప్పుడు వాడతారు. ఆలయం వెలుపల గోడలమీద ఏనుగుల వరస అన్నీ పక్క పక్కనే నుంచున్నట్లు ముందు భాగం మాత్రం కనబడుతుంది. బయట గోడల మీద డిజైన్లు కూడా వెదురు అల్లికలాంటివే. బహుశా అక్కడి వెదురు పరిశ్రమని ప్రతి బింబిస్తూ వాటిని చెక్కి వుంటారు. శిల్పకళ మాత్రం దక్షిణాదిన వున్నట్లు వుండదు.ఆలయ ప్రదక్షిణ మార్గంలో లక్ష్మీ నారాయణ మందిరం వుంది. ఇంకా అక్కడే కేదారేశ్వర్, కమలేశ్వర్, కామేశ్వర్, గణేష్ ఆలయాలు వున్నాయిట. మేము ఆలయం వెనుక వున్న లక్ష్మీ నారాయణ మందిరం, కేదార్ మందిర్ మాత్రం చూశాం. ప్రదక్షిణ మార్గంలోనే డోల్ మందిర్ వున్నది. హోలీ రోజు ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం వుంచి హోలీ ఆడతారుట.
క్షేత్ర పురాణం:-
ఇక్కడి హయగ్రీవుడి గురించి రకరకాల కధనాలు ప్రచారంలో వున్నాయి. అవి యోగినీ తంత్ర కధనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందిట కామరూపంలోని మణికూట పర్వతంమీద మహా విష్ణువుని ఎవరు స్ధాపించారు అని. అప్పుడు శంకరుడు చెప్పిన వివరాలు…. మహారాజు ఇంద్రద్యుమ్నుడు విష్ణు భక్తుడు. ఆయన లోక హితార్ధం విష్ణువుని ప్రతిష్టించి, ఒక యజ్ఞం చెయ్యతలపెట్టాడు. ఆయన విష్ణు విగ్రహం కోసం అన్వేషణ మొదలుపెట్టాడుకానీ ఆయనకి సర్వలక్షణ సమన్వితుడైన విష్ణు విగ్రహం దొరకలేదు. అదే చింతతో నిద్రపోయిన రాజుకు మహావిష్ణువు కలలో కనబడి మర్నాడు ఉదయం సముద్ర తటంలో ఒక పెద్ద వృక్షం కనబడుతుందని, రాజుని ఒక్కణ్ణే గొడ్డలి తీసుకు వెళ్ళి ఆ వృక్షాన్ని 7 భాగాలుగా చేసి వాటితో తన ప్రతి రూపాలను తయారుచేసి వివిధ ప్రదేశాలలో దేవతలు, మనుష్యులు, అసురులు అర్చించేందుకు వీలుగా ప్రతిష్టించమన్నాడు. వృక్షం మొదలుతో తయారు చేసిన విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించమని, అది భవిష్యత్ లో గొప్ప పుణ్యక్షేత్రమవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు.
మరునాడు ఉదయం మేల్కాంచిన రాజు స్వప్నంలో విష్ణుమూర్తి ఆదేశానుసారం గొడ్డలి తీసుకుని వెళ్ళి, సముద్రతీరాన ఆయన చెప్పినట్లే పడివున్న వృక్షాన్ని చూసి ఏడు ఖండాలుగా చేశాడు. అందులో మూల భాగంతో విగ్రహం తయారు చేయించి ఒరిస్సాలో ప్రతిష్టించాడు. అదే జగన్నాధుడు బలరాముడు, సుభద్రలతో కొలువుతీరిన నేటి పూరీ క్షేత్రం. స్ధల పురాణం ప్రకారం వృక్షం పైభాగంతో తయారుచేయబడిన విగ్రహం కాశ్మీరులో ఆదిత్య పేరుతో ప్రతిష్టించబడింది. ఒక ఖండంతో శుక్రాచార్యుడు శోణాదిత్యుడు పేరుతో భగవంతుని మూర్తిని స్ధాపించాడు. తర్వాత దీనిని దేవగురువు బృహస్పతి శిలా రూపంగా మార్పుచేశాడు. వరుణ దేవుడు ఒక భాగంతో తయారైన మూర్తిని కామరూప దేశంలో మణికూట పర్వతంపై ప్రతిష్టించాడు. అదే హాజోలోని శ్రీ హయగ్రీవ మాధవుడు. మిగిలిన భాగాన్ని కుబేరుడు ప్రస్తుతం లఖిమ్పుర్ అనే ప్రదేశంలో నందీశుడనే పేరుతో భగవంతుణ్ణి ప్రతిష్టించాడు. ఈయన్నే మత్స్యాక్ష మాధవుడనికూడా అంటారు.
మత్స్య పురాణం ప్రకారం విష్ణువు హయగ్రీవావతారం కూడా మత్స్యావతారంలాంటిదేనంటారు. విష్ణువు హయగ్రీవుని రూపంలో వేద, వేదాంగాలను తిరిగి వ్రాశాడని దేవీ పురాణం, స్కంద పురాణాలలోకూడా పేర్కొనవబడింది. కాళికా పురాణం ప్రకారం విష్ణువు మణికూట పర్వతం మీద జ్వరాసురుడనే జ్వర రాక్షసుణ్ణి చంపి, ప్రజల రక్షణ కోసం అక్కడ వున్నాడు. విష్ణు మూర్తి రోగాల రూపంలో వచ్చే పీడలని నివారించటానికి అక్కడ పుణ్యస్నానం చేశాడంటారు. ఇంకొక కధ ప్రకారం విష్ణు ఇక్కడ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి చంపి హయగ్రీవ మాధవుడయ్యాడంటారు. ఏ కధనం ఎలా వున్నా అందరూ హయగ్రీవుణ్ణి జ్ఞాన ప్రదాతగా, తెలివి తేటలకు అధిపతిగా ఆరాధిస్తారు. ఆయన ఆకారం మనష్య శరీరం, గుఱ్ఱం ముఖంతో వుంటుంది. స్వఛ్ఛమైన తెలుపు రంగు, తెల్లని దుస్తులు ధరించి, తెల్లని పద్మంమీద కూర్చునుంటాడు. అంతేకాదు .. అగస్త్య మహర్షి ప్రార్ధనమీద హయగ్రీవుడు అగస్త్యుడికి పరమ పవిత్రమైన లలితా సహస్రనామాన్ని, లలితా త్రిశతిని బోధించాడు.
శ్రావణ పౌర్ణమినాడు ఆయన అవతారం ధరించిన రోజుగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు.ఇది బౌధ్ధులకు కూడా చాలా పవిత్ర స్ధలం. బుధ్ధుడు హయగ్రీవ మాధవ ఆలయంలో చెట్టుకింద నిర్యాణం చెందాడని వారు భావిస్తారు. ఇక్కడి విగ్రహాలకు వారి దేవతల పేర్లను అన్వయించి ఆరాధిస్తారు. టిబెట్ నుంచీ భూటాన్ నుంచీ అదిక సంఖ్యలో బౌధ్ధ మతస్తులు చలికాలంలో ఇక్కడికి మహాముని బుధ్ధుణ్ణి ఆరాధించటానికి వస్తారు.
దర్శన సమయాలు:-
ఉదయం 6 గం. లనుంచీ రాత్రి 8 గం. ల దాకా.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)