లక్ష్యసాధనకి ద్వితీయవిఘ్నమా!
లక్ష్యసాధనకి ద్వితీయవిఘ్నమా!
ఏదైనా పనిని మొదలుపెట్టగానే `ద్వితీయ విఘ్నం ' రాకుండా చూసుకోమంటూ పెద్దలు ఓ హెచ్చరికను చేస్తారు. `ఆ అంతా చాదస్తం` అనుకుంటామే కానీ, తరిచి చూస్తే ద్వితీయ విఘ్నం కలుగకూడదన్న ఆచారం వెనుక లక్ష్యాన్ని చేరుకునేందుకు కావల్సిన కిటుకే ఉంది. అదెలాగంటే.....
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
అంటాడు ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి సుభాషితాలకు అనువాదంలో. అధములు చేయాలనుకునే పనిలో ఉన్నవీ లేనివీ ఆటంకాలను ఊహించుకుని, అసలు పనిని మొదలుపెట్టరు. ఇక మధ్యములు పని మొదలుపెట్టినప్పటికీ, ఏ చిన్న ఆటంకం వచ్చినా దానిని అక్కడితో వదిలేస్తారు. కానీ ధీరులు అలా కాదు! ఎన్ని ఆటంకాలు ఎదురైనా, విధిని దాటుకుని మరీ పనిని సాధించి తీరుతారు. అలాగే మనమూ తప్పదనో, బాధ్యతను నిర్వర్తించేందుకో ఏదన్నా మంచి పనిని మొదలుపెడతాము. కానీ రెండో రోజే బద్ధకించి దానిని అటకెక్కించేస్తాము. కానీ ఎలాగో ఒకలాగ రెండోరోజు కూడా దానిని కొనసాగిస్తే...
అదే అలవాటుగా మారుతుంది. `sow an act and you reap and action` అన్నాడు ఎమర్సన్ అనే ఇంగ్లీషు పెద్దాయన. అందుకే మనలో పట్టుదల ఏర్పడి, పని తేలికపడేందుకు... ద్వితీయ విఘ్నం వద్దు. రెండో రోజు కూడా పనిని సాగించండి అంటారు! ఇంతకీ ఆ అధములు, మధ్యములు, ధీరులు వేర్వేరుగా ఉండరు. ఆ మూడు లక్షణాలూ మనలోనే ఉంటాయి. వాటిలో దేనిని ఎంచుకోవాలన్నదే... విజయానికీ పరాజయానికీ ఉన్న తేడా!
- నిర్జర