అక్షతలు ఎందుకు వేస్తారు...
అక్షతలు ఎందుకు వేస్తారు?
తలంబ్రాలు లేని పెళ్లిని ఊహించలేము, అక్షతలు లేని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా భావించలేము. ఇంట్లో పూజ చేసుకున్నా, రాములవారి కళ్యాణానికి వెళ్లినా... చేతిలో అక్షతలు లేకపోతే మనసులో ఏదో చింత. ఇంతకీ ఆ అక్షతలకి ఎందుకంత ప్రాముఖ్యత!
అక్షతలు అంటే ! - క్షతం అంటే గాయపడటం, విరిగిపోవడం అన్న అర్థం వస్తుంది. కాబట్టి క్రతువులలో వినియోగించే నిండైన బియ్యాన్ని అక్షతలు అంటారు. ఇప్పుడంటే జీవితాలలో సుఖం ఎక్కువైపోయి అన్నం విలువ తెలియడం లేదు. కానీ ఆహారం లేని జీవితాన్ని ఊహించుకోలేం కదా! ధాన్యం కేవలం ఆ ఆహారానికి మాత్రమే కాదు, జీవితంలోని సమృద్ధికి కూడా సూచనగా భావిస్తుంటారు పెద్దలు. అందుకనే మంచికైనా, చెడుకైనా విరగని బియ్యపు గింజలని (అక్షతలు) వినియోగిస్తుంటారు.
పూజలో – భగవంతుని పూజించే సమయంలో అక్షతలను వినియోగించడం పరిపాటి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. పూజలో ఏ ద్రవ్యం లేకపోయినా కూడా ఆ స్థానంలో అక్షతలను ఉపయోగించవచ్చు. అలా ఎలాంటి లోటూ లేకుండా పూజ సాగిపోయేందుకు అక్షతలు తోడ్పడతాయి. ఇక పూజ పూర్తయిన తరువాత ఆ ఫలాన్ని నలుగురికీ అందించేందుకు కూడా పూజాక్షతలను అందించడం పరిపాటి.
ఆశీర్వచనంలో – పిల్లలు సుఖసంతోషాలతో జీవించాలని, పెద్దలు తల మీద అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇలా బ్రహ్మరంథ్రం మీద అక్షతలు చల్లడం వల్ల, వారిలోని సానుకూల తరంగాలు మనకి చేరతాయని చెబుతారు. ఒకరి నుంచి ఒకరికి ఇలా ‘శక్తిపాతం’ ద్వారా అనుగ్రహం లభించేందుకు అక్షతలు తోడ్పడతాయి.
తలంబ్రాలు – పెళ్లిలో వధూవరులు ఒకరి తల మీద మరొకరు పసుపు కలిపిన బియ్యాన్ని పోసుకోవడం చూసేదే. విరగని బియ్యంలాగా తమ జీవితాలు కూడా అక్షతంగా సాగిపోవాలని ఇందులో ఓ సూచన కనిపిస్తుంది. అంతేకాదు! ఒకరిమీద ఒకరు తలంబ్రాలు పోసుకునే చర్యతో వారిరువురి మధ్యా ఒక అయస్కాంత చర్య ఏర్పడుతుందనీ... అది వారు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి తోడ్పడుతుందనీ చెబుతారు. అదేమో కానీ తలంబ్రాలు పోసుకునే క్రతువుతో ఇద్దరిమధ్యా చనువు ఏర్పడటం మాత్రం అందరూ గమనించేదే!
ఏ రంగు బియ్యం? – పసుపు హిందువులకు శుభసూచకం, పైగా క్రమిసంహారక శక్తి కలిగిన ద్రవ్యం. అందుకే శుభకార్యాలలో పసుపుతో చేసిన అక్షతలను మాత్రమే ఉపయోగించాలి. తెల్లటి బియ్యాన్ని అక్షతలుగా అశుభకార్యాలలోనూ, ఎరుపురంగు బియ్యాన్ని అక్షతలుగా అమ్మవారి పూజలోనూ వాడటం ఆనవాయితీ.
పసుపు కలిపిన బియ్యం వెనుక మరో మర్మం కూడా కనిపిస్తుంది. మనఃకారకుడైన చంద్రునికి బియ్యం ప్రీతి కలిగిస్తాయి అని చెబుతారు. అందుకే జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలకు పరిహారంగా బియ్యాన్ని దానం చేయమంటారు. ఇక పసుపు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. గురుడు అదృష్టం, కీర్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం... వంటి సకల శుభాలకూ కారకుడు. అంటే అక్షతలు ఇటు చంద్రునికీ, అటు గురునికీ కూడా ప్రీతి కలగచేసి సకల శుభాలనూ అందిస్తాయన్నమాట.
- నిర్జర.