అర్జునుడికి ఊర్వశి పెట్టిన శాపం నుండి అందరూ తెలుసుకోవాల్సిందేమిటంటే..!
అర్జునుడికి ఊర్వశి పెట్టిన శాపం నుండి అందరూ తెలుసుకోవాల్సిందేమిటంటే..!
మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్జునుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మార్గం చూపిన వాడు కృష్ణుడు అయితే మార్గాన్ని అర్థం చేసుకుని నడిచినవాడు అర్జునుడు. అంత గొప్ప అర్జునుడికి కూడా ఊర్వశి చేతిలో శాపం తప్పలేదు. అయినా సరే ఆ శాపాన్ని వరంగా మార్చుకోవడం అర్జునుడి గొప్పతనం, ఆయన తెలివి తేటలు, ధైర్య సాహసాలకు నిదర్శనం. అసలు అర్జునుడికి ఊర్వశి ఎందుకు శాపం పెట్టింది? దీని వెనుక కథ ఏంటి? దీన్నుండి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి?
మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు వారి ఆజ్ఞాత వాసాన్ని భంగం చేయాలని దుర్యోధనుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే పాండవులు చాకచక్యంగానూ, తమ తెలివి తేటలతోనూ తమ అజ్ఞాతవాసాన్ని పూర్తీ చేస్తారు. ఇలా వనవాసం, అజ్ఞాతవాసం పూర్తైనా సరే దుర్యోధనుడు పాండవులకు హస్తినాపుర రాజ్యాన్ని కానీ, రాజ్యంలో భాగాన్ని కానీ ఇవ్వడానికి ఒప్పుకోడు. దీంతో పాండవులు తమ బలాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ధర్మరాజు అర్జునుడితో ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుని దగ్గర ఆయుధాలు సంపాదించమని చెబుతాడు. దీంతో అర్జునుడు శివపార్వతుల గూర్చి తపస్సు చేసి వారి నుండి ఇంద్రలోకానికి వెళ్లే అర్హత పొందుతాడు.
ఇంద్రలోకంలో అర్జునుడు ఆయుధాలు సంపాదించడం పూర్తయ్యాక అక్కడి నుండి వెనుదిరుగుతాడు. అయితే ఇంద్రుడు అర్జునుడితో నువ్వు ఆయుధాలు సంపాదించడం, వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నావు కానీ నృత్యం నేర్చుకోలేదు. కాబట్టి నృత్యం కూడా నేర్చుకో అని చెబుతాడు. ఇంద్రుడి మాటకు సరేనని అర్జునుడు నృత్యంలో నైపుణ్యం సంపాదించడానికి ఇంద్రలోకంలో ఉండే అప్సరసల నృత్యాన్ని నిశితంగా పరిశీలించడం మొదలుపెడతాడు. అయితే ఇంద్రలోకంలో ఉన్న అప్సరసలలో ఊర్వశి అర్జునుడిని గమనించి, అతను తన మీద ఇష్టంతో అలా గమనిస్తున్నాడేమో అనుకుంటుంది. తనను వివాహం చేసుకోమని అర్జునుడిని అడుగుతుంది. కానీ అర్జునుడు మాత్రం.. ఇంద్రుడు నాకు తండ్రి లాంటివాడు. ఆయన స్నేహితురాలివైన నువ్వు నాకు తల్లితో సమానం. నాకు మీ మీద అలాంటి ఉద్దేశ్యం లేదని చెబుతాడు. దీంతో ఊర్వశికి కోవం వస్తుంది. అర్జునుడు తన రూపాన్ని, తనలో ఉన్న పౌరుషాన్ని, తన ప్రతిభను చూసి గర్వపడుతున్నాడని అనుకుని, ఇవన్నీ మర్చిపోయి నువ్వు నపుంసకుడుగా మారిపోతావని శపిస్తుంది.
ఇలా అర్జునుడు ఊర్వశి చేతిలో శపించబడ్డాడు. కానీ అర్జునుడు ఈ శాపాన్ని కూడా వరంలా మార్చుకున్నాడు. తనకు ఊర్వశి శాపం ఇచ్చిన విషయం ఇంద్రుడితో చెబుతాడు. ఇంద్రుడు ఈ శాపాన్ని పూర్తీగా తొలగించలేమని, కానీ నీ జీవితంలో నువ్వు అనుకున్న సమయంలో ఒక సంవత్సరం పాటూ నపుంసకుడిగా మారగలవని చెబుతాడు. అలా అర్జునుడు విరాట రాజు కుమార్తె ఉత్తరకు నృత్యం, సంగీతం నేర్పిస్తూ భృహన్నలగా కొన్నాళ్లు నపుంసకుడిగా మారతాడు. దీన్ని బట్టి అర్థం అయ్యేది ఏంటంటే.. మనిషికి శాపంలా అనిపించే విషయాలను కూడా జీవితంలో వరంగానూ, తమ జీవితానికి ఉపయోగపడే విధంగానూ మార్చుకోవచ్చు.
*రూపశ్రీ.