జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి
జపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో పూజల సమయంలో... శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలుంటాయి. ఇంతకూ జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దాని వెనక కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకవ్యక్తి ఒకరోజులో అంటే 24 గంటల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటాడట. అంటే 12 గంటల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు 10800 సార్లు చేయడం కష్టం కాబట్టి... చివరి రెండు సున్నాలను తీసేసి 108 ను నిర్ధారించారని చెబుతారు. 108 వెనక మరో కథ ప్రచారంలో ఉంది. మొత్తం 12 రాశులున్నాయి. ఈరాశులతో తొమ్మిది గ్రహాలున్నాయి. రాశుల సంఖ్యను గ్రహాలతో గుణిస్తే వచ్చేది 108. అందుకే జపమాలలో 108 పూసలను నిర్థారించారట. ఈ 108 పూసలు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయట. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలుంటాయని భావిస్తారు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 పాదాలవుతాయి. జపమాలలోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చదవాలని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి కరుణ ఉంటుందని అంటారు. దానికి అనుగుణంగా 108 పూసలను నిర్ధారించారని ప్రచారంలో ఉంది.