శ్రీరాముడు పుట్టిన నక్షత్రం ఏది? ఈ నక్షత్రంలో పుట్టిన ఇతరులు ఎలా ఉంటారంటే.

 

 శ్రీరాముడు పుట్టిన నక్షత్రం ఏది? ఈ నక్షత్రంలో పుట్టిన ఇతరులు ఎలా ఉంటారంటే..!
 

త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు, అయోధ్య రాజు దశరథుని పెద్ద కుమారుడు.  లక్ష్మణుడు, భరతుడు,  శత్రుఘ్నుల సోదరుడు. శ్రీరాముని తల్లి కౌసల్య. రాముడు మిథిలా రాజు జనకుని కుమార్తె సీతను వివాహం చేసుకున్నాడు. శ్రీరాముని జన్మ సమయం, శుభ సమయం, నక్షత్రం,  రాశి గురించి  రామాయణంలో పూర్తీ సమాచారం ఉంది. సనాతన ధర్మాన్ని నమ్మేవారు దేవుడి మీద ఎంతో భక్తి కలిగి ఉంటారు. పలువిధాలుగా ఆ భక్తిని వ్యక్తం చేస్తుంటారు.  ఇక  శ్రీరాముడిని పురుషులలో ఉత్తముడు అంటే 'మర్యాద పురుషోత్తముడు' అని అంటారు. ఆయన గుణాల వల్ల నేటికీ  రాముడిలాంటి కొడుకు, భర్త, అన్న కావాలి అని అంటూ ఉంటారు.   శ్రీరాముడు పుట్టిన నక్షత్రం ఏది? ఈ నక్షత్రంలో పుట్టిన ఇతరులు ఎలా ఉంటారు తెలుసుకుంటే..

పునర్వసు..

శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు.  చైత్రమాసంలోని శుక్లపక్షం తొమ్మిదవరోజున కర్కాటక రాశిలో పునర్వసు నక్షతాన శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈయన జన్మదినాన్ని శ్రీరామనవమి అని అంటారు. 27నక్షత్రాల జాబితాలో పునర్వసు నక్షత్రం 7వది. దీనికి అధిపతి గురువు.

జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది..

పునర్వసు నక్షత్రం జ్యోతిషశాస్త్రంలో చాలా  పవిత్రమైనదిగా చెబుతారు. ఈ రాశిలో పుట్టిన వారికి భగవంతునిపై అపారమైన నమ్మకం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పెద్ద హృదయం గలవారు.  ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే  అనుకూల స్వభావం కలిగి ఉంటారని నమ్ముతారు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. అదే విధంగా  తెలివితేటలు,  నైపుణ్యం, మాట చతురత కలిగిన వారు. ఈ రాశి వారు అధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. అందుకే వీరిలో శ్రీరాముడి  గుణాలు  కొద్దో గొప్పో కనిపిస్తుంటాయట.

                                     *నిశ్శబ్ద.