శివరాత్రి ప్రత్యేకత ఏమిటి?

 

శివరాత్రి ప్రత్యేకత ఏమిటి?

శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు! సరదాగా కాలక్షేపం చేసే సమయమూకాదు. మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన. అందుకే మిగతా పండుగల్లాగా ఈ రోజు పిండివంటలు ఉండవు సరికదా… శరీరాన్ని నిరాహారంగా ఉంచే ఉపవాసం చేస్తారు. వినోదాల బదులు జాగరణతో కాలం గడుపుతారు. ఇంతకీ ఈ శివరాత్రి ప్రత్యేకత ఏమిటి?

కొన్ని వేల సంవత్సరాల నుంచే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు మన దేశ చరిత్రలో కనిపిస్తాయి. దీని వెనుక రకరకాల పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది… శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడనే ఐతిహ్యం. బ్రహ్మవిష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగినప్పుడు, శివుడు ఒక లింగరూపంలో ఏర్పడ్డాడట. తన ఆద్యంతాలను ఎవరైతే కనుగొంటారో వాళ్లే, గొప్ప అని చెప్పాడట. సహజంగానే ఈ సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోయారు.
 
పోలికలు, పరిమితులకు అతీతమైన దైవత్వం గురించి లోకానికి చాటిచెప్పడమే లింగోద్భవం ఉద్దేశంగా చెబుతారు. ఈ గాథలో మరో ఆధ్యాత్మిక కోణమూ ఉంది. కొంతమంది పరమాత్మను నిరాకారునిగానూ, మరికొందరు సాకార రూపంలోనూ ద్యానిస్తుంటారు. అనంతమైన లింగరూపంలో ఉద్భవించిన శివుడు తాను సర్వవ్యాపినని తేల్చిచెప్పాడు. ఈ విశ్వంలో ఆది, అంతం లేదు కాబట్టి… అందులో ప్రతి చోటూ ముఖ్యభాగం (centre of universe) గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దైవం అనే భావన కూడా అంతే. ఎలా అనుకుంటే అలాగే! ఎక్కడ చూడదల్చుకుంటే అక్కడే!

శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళను ఈ లింగోద్భవకాలంగా భావించి ఆ సమయంలో విశేష అభిషేకాలు చేస్తుంటారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అన్నది మరో గాథ. శివుడు పురుషుడు, పార్వతి ప్రకృతికి ప్రతీక. యోగశాస్త్రంలో ఇడ, పింగళి అన్నా చైనీయులు ఇన్‌, యాంగ్‌ అన్నా… ప్రాణి, జీవం రెండూ కలిసి ఉన్నప్పుడే సృష్టి ముందుకు నడుస్తుంది. శివపార్వతులు, అర్ధనారీశ్వర రూపంలో కనిపించడం వెనుక తత్వం ఇదే.

శివరాత్రి పండుగ యావత్తు మనఃప్రధానంగా సాగుతుంది. బాహ్యమైన ఖర్చులు, ఆడంబరాలతో పనిలేదు. విభూదే అలంకారం, బిల్వపత్రాల అర్చన, నీటితో అభిషేకం. ఇంతకంటే సులభమైన క్రతువు ఉంటుందా! అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని ఒడిసిపట్టుకుందాం. ఉపవాసం, జాగరణ, అభిషేకాలతో ఆ భక్తసులభుని అనుగ్రహాన్ని పొందుదాం!

శివరాత్రి రోజు ఏం చేయాలి?

అనగనగా ఓ వేటగాడు. అడవిగుండా ప్రయాణిస్తూ దారితప్పిపోయాడు. రోజంతా తిండి లేక కడుపు నకనకలాడిపోతోంది. ఆ రాత్రి తలదాచుకునే చోటు లేక, ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఓ పక్క ఆకలి, మరోపక్క క్రూరమృగ్రాల భయం. ఏం చేయాలో తోచక తన చుట్టూ ఉన్న ఆకులు తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు. అలా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు. మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్లేసరికి, భార్య ఆందోళనతో ఎదురు వచ్చింది. తన భర్తకి ఏమయ్యిందా అనే ఆతృతతో తను కూడా నిద్రపోలేదు.

ఆశ్చర్యం. వాళ్లిద్దరూ చనిపోయిన తర్వాత శివసన్నిధికి చేరుకున్నారు. కారణం! ఆ వేటగాడు జాగరణ చేసింది శివరాత్రి రోజున. తను తెంపి కింద పడేసినవి బిల్వ పత్రాలు. ఆ చెట్టు కింద ఉన్నది సాక్షాత్తు శివలింగం. ఇలాంటి ఐతిహ్యాలు వినడానికి కాస్త అతిశయోక్తిగా తోచవచ్చు. కానీ భగవంతుడు తల్చుకుంటే మన కర్మఫలం అంతా కూడా గడ్డిపోచలా దగ్ధం అయిపోతుంది. సాక్షాత్తు రమణమహర్షి వంటి పెద్దలు చెప్పిన మాటే ఇది. కొంత పూర్వజన్మ సుకృతమూ తోడై ఉండవచ్చు. ఈ కథను చెప్పుకోవడానికి కారణం… శివరాత్రి రోజు మనసుని పరమేశ్వరుని మీద లగ్నం చేసి, పెద్దలు సూచించిన పద్ధతులను పాటిస్తే ఎవరైనా ఆయన అనుగ్రహాన్ని పొందగలరని గుర్తుచేసుకోవడమే!

మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాసం ఉండమని సూచన. ఆరోగ్యపరమైన సమస్యలు లేనివారు ఈ విధిని ఆచరించవచ్చు. ఆకలిని తట్టుకోలేనివారు పండ్లు, పాలతో (ఉడికించని పదార్థాలు) ఉపవాసం చేయవచ్చు. త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలుపెట్టి, శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసాన్ని కొనసాగిస్తూ, రాత్రివేళ జాగరణ ఉండాలి.
 
జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ, కాలక్షేపం కాకుండా… శివధ్యానం, శివనామస్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దలు సూచన. ఆ రాత్రివేళ ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోని లింగోద్భవ సమయంలో శివుని అభిషేకించాలి. శివుని త్రిశూలాన్ని పోలి ఉండే అరుదైన బిల్వపత్రాలతో ఆయన్ను పూజించాలి. బిల్వపత్రాలు ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని మనుగడ సాగిస్తాయని చెబుతారు. పైగా తులసి తర్వాత బహుశ ఆ స్థాయి ఔషధ విలువలు ఉన్న పత్రం ఇది. అంతేకాదు! చీకటిలో ఉండే శివాలయాల్లో ఎలాంటి సూక్ష్మక్రిములూ దరిచేరకుండా చేయగల యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉన్న పత్రం ఇది.
 
శివరాత్రి జాగరణ తర్వాత మర్నాడు ఉదయం వేళ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపవాసాన్ని విరమించుకోవాలి. మొత్తానికి ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన… ఈ అయిదింటితో ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి.

- నిర్జర.