శివలింగం ఎన్ని రకాలు.. అవేంటో తెలుసా!
శివలింగం ఎన్ని రకాలు? అవేంటో తెలుసా?
పురాణాలలోనూ, హిందూ మతంలోనూ, భారతదేశంలోని దేవాలయాల పరంగానూ పరమేశ్వరుడికి మిగిలిన దేవుళ్ల కంటే ఎక్కువ చరిత్ర కనిపిస్తుంది. శివుడిని చాలా వరకు లింగాకారంలో పూజిస్తారు. భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పరమేశ్వరుడికి సంబంధించి శివాలయాలలో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉంటాయి. అయితే శివలింగాలు ఎన్ని రకాలు? అవి ఏంటి? వాటిని ఎలా విభజించారు? తెలుసుకుంటే..
శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో మూడు రకాల శివ లింగాలు ఉన్నట్టు ప్రస్తావించబడ్డాయి. ఇవి శివలింగం ఎత్తు ఆధారంగా విభజించారట.
శివలింగాల రకాలు..
శివలింగాల పరిమాణాన్ని బట్టి ఉత్తమం, మధ్యం, అధం అని విభజించారు. వీటిలో ఉత్తమ శివలింగానికి కింద బలిపీఠం నిర్మించబడి ఉంటుంది.
బలిపీఠం నుండి నాలుగు వేళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న శివలింగం మధ్యస్థ లింగంగా, మధ్యస్థ నాణ్యతగా పరిగణించబడుతుంది.
మధ్యస్థ లింగం కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని అధమ లింగం అని అంటారు.
శివలింగం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అండాకారంలో ఉండే శివలింగం ఒకటి. పాదరసంతో చేసిన శివలింగం ఒకటి. ఇవి మాత్రమే కాకుండా శివలింగాలు ఆరు రకాలు ఉంటాయి.
దేవతలు స్థాపించిన శివలింగాలను దేవలింగాలు అంటారు.
రావణుడు ఒక శివలింగం స్థాపించాడు దీన్ని అసుర లింగం అంటారు. ఇలా రాక్షసులు స్థాపించిన లింగాలను అసుర లింగాలు అంటారు.
ప్రాచీనకాలంలో అగస్త్య ముని లాంటి మునులు ప్రతిష్టించిన లింగాలను అర్షలింగాలు అంటారు.
పురాణకాలంలో ప్రజలు స్థాపించిన లింగాలను పురాణలింగాలు అని అంటారు.
మానవులు నేటి కాలంలో స్థాపిస్తున్న లింగాలను మానవ లింగాలు అని అంటున్నారు.
ఏ మానవుడు, ఇతరులు ఎవరూ స్థాపించకుండా పరమేశ్వరుడు స్వయంగా తనకు తానే లింగంగా వేలసిన శివలింగాలను స్వయంభూ లింగాలు అని అంటారు.
*రూపశ్రీ.